Tuesday 21 July 2015

టెక్నాలజీతో ప్రపంచస్థాయి రాజధాని

టెక్నాలజీతో ప్రపంచస్థాయి రాజధాని
ప్రపంచంలో మనోళ్లు ఎక్కడున్నా ప్రమోట్ చేస్తా

  • అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తాం
  • కాకినాడ, బందరు, విశాఖ పోర్టుల అభివృద్ధి
  • పారిశ్రామికవేత్తల సదస్సులో సీఎం చంద్రబాబు
  • వాళ్లు బిజినెస్‌ చేయాలనేదే టీడీపీ లక్ష్యమని వెల్లడి
  • అనంతలోఇండియన్‌ డిజైన్స్‌ ఎక్స్‌పోర్టే 33.5 కోట్ల పెట్టుబడి
  • 3200 మందికి ఉపాధి
రాజమండ్రి, జూలై 21: ‘‘మనకు రాజధాని కూడా లేదు. తీవ్ర సంక్షోభంలో ఉన్నాం. ఈ సంక్షోభాన్నే సవాలుగా తీసుకుని ముందుకు వెళ్దాం. ఆంధ్ర ప్రదేశ్‌ అగ్రరాష్ట్రం కావాలి. అలా జరగాలంటే సంపద పెరగాలి. ఇందుకు వనరులను ఉపయోగించుకోలి. విద్య, పరిశ్రమలు, వ్యవసాయం, పర్యావరణ పర్యాటకం, వస్తు తయారీ సంస్థలు అభివృద్ధి చెందాలి. అప్పుడే మనం ఉన్నత స్థాయికి ఎదుగుతాం. ఈ ప్రక్రియలో పారిశ్రామికవేత్తలంతా భాగస్వాములు కావాలి. వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. మంగళవారం రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన పాల్గొన్నారు. గోదావరి మహా పుష్కరాల సందర్భంగా పారిశ్రామిక వేత్తలు మహాసంకల్పం చేయాలని, నవ్యాంధ్రలో కొత్త పరిశ్రమలు పెట్టడానికి చిత్తశుద్ధితో ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు రుణపడి ఉంటానని తెలిపారు. రాజధాని నిర్మాణం తర్వాత వారికి బంగారు భవిష్యత్‌ చూపిస్తానని తాను గతంలోనే చెప్పానన్నారు. రాష్ట్రంలో నీటి వనరులు, ఖనిజ వనరులు బాగున్నాయని, వాటిని ఉపయోగించుకునేలా పరిశ్రమలు రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ‘‘పారిశ్రామికవేత్తలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాం. దరఖాస్తు పెట్టిన 21 రోజుల్లో క్లియరెన్స్‌ ఇస్తాం. పారిశ్రామికవేత్తలు కొత్తవారిని
ప్రోత్సహించాలి. ప్రపంచవ్యాప్తంగా మనవారు బిజినెస్‌ చేయాలనేదే టీడీపీ కోరిక. మనవాళ్లు ప్రపంచంలో ఎక్కడున్నా ప్రమోట్‌ చేస్తాం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘‘ఏపీ పారిశ్రామికవేత్తలు, ప్రజలు మంచివారు. రిస్క్‌ తీసుకునే తత్వం ఉంది. సౌకర్యాలు బాగుంటే ఆఫ్రికాలో కూడా వ్యవసాయం చేయగలుగుతారు’’ అని అన్నారు. రాష్ట్రంలో మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం వంటి పోర్టులను బాగా అభివృద్ధి చేస్తున్నామ న్నారు. రియల్‌ ఎస్టేట్‌ కూడా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఇకపై చేపల ఉత్పత్తితోపాటు ప్రాసెసింగ్‌ కూడా ఇక్కడే చేయాలని సూచించారు. ‘‘పామాయిల్‌ ఉంది. సుగంధ ద్రవ్యాలు 40 శాతం ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. అరకు, పాడేరులలో కాఫీ తోటలు ఉన్నాయి. గోదావరి జిల్లాలో కొబ్బరి విస్తారంగా సాగవుతుంది. అనంతపురంలో 20 రకాల పండ్ల తోటలు ఉన్నాయి’’ అంటూ రాష్ట్రంలోని ప్రత్యేకతలను చంద్రబాబు వివరించారు. గొర్రెల పెంపకం పెరగాలని, పోర్టు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఆటోమొబైల్‌, హార్డ్‌వేర్‌ రంగాలు అభివృద్ధి చెందాల్సి ఉందని అన్నారు. మత్స్య, హరిత విప్లవం కోసం తాను కృషి చేస్తున్నట్టు స్పష్టం చేశారు. డిజిటల్‌ ఇండియాలో భాగంగా వచ్చే ఏడాది మార్చిలోపు అన్ని గ్రామాలకు ఫైబర్‌ కనెక్టివిటీ సాధిస్తామని... ప్రతి ఇంటికి రూ.100కే 15 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన మేకింగ్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా పథకాలతో పారిశ్రామికరంగం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రాష్ట్రానికి దార్శనికత కలిగిన ముఖ్యమంత్రి, భౌతిక వనరులు, కష్టపడే మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని ఆయన అన్నారు. 2020 నాటికి రాష్ట్ర పారిశ్రామికరంగంలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు రావాలని, రూ.73 కోట్లు పరిశ్రమలకు రాయితీగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్ర పారిశ్రామిక మౌళిక వసతుల శాఖ కార్యదర్శి అజయ్‌జైన్‌ మాట్లాడుతూ... రాష్ట్రంలో గ్రానైట్‌, బాక్సైట్‌, లాటరేట్‌ బొగ్గు వంటి అపార ఖనిజాలు, మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం రూపొందించిన ఏడు మిషన్ల ద్వారా ఎన్నో అవకాశాలు, లభిస్తాయని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సాగరమాల ద్వారా కోస్టల్‌ కారిడార్‌ విస్తృతమవుతుందని, అధునాతన రోడ్డు సౌకర్యం ఏర్పడుతుందని చెప్పారు.
 
పరిశ్రమలకు భవిష్యత్‌ గమ్యస్థానం
వివిధ ముఖ్య పరిశ్రమలకు, పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్‌ గమ్యస్థానంగా మారుతుందని ప్రముఖ పారిశ్రామికవేత్తలు అన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగానికి మంచి భవిష్యత్‌ ఉందని, ఇప్పటికే విస్తరించిన వాటికి శాసీ్త్రయత కల్పించగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయని జెన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నారాయణ తెలిపారు. పెట్రోకెమికల్‌ రంగానికి సంబంధించి విశాఖ నుంచి కాకినాడకు కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు హెచ్‌పీసీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జి.శ్రీగణేష్‌ చెప్పారు. ఈ రంగంలో శక్తి వనరులతో పాటు వివిధ రకాల ఉత్పత్తులను చేపట్టవచ్చన్నారు. శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి శ్రీసిటీలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ఓడలు, వాటి అభివృద్ధి గురించి వివరించారు. కృష్ణపట్నం నౌకాశ్రయం అభివృద్ధిలో ప్రభుత్వం తమకు అనేక రాయితీలు ఇచ్చిందని, అందువల్లే అభివృద్ధి చేయగలిగామని పోర్టు సీఈవో అనిల్‌ చెప్పారు. ఇసుజి మోటార్స్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌.వకబియాషి మాట్లాడుతూ... ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల కంపెనీలు బాగా నిలదొక్కుకోగలుగుతాయని, వచ్చే ఏడాది ఏపీలో తమ కార్ల కంపెనీని నెలకొల్పుతున్నామన్నారు. సింగిల్‌ డెస్క్‌ పాలసీ పారిశ్రామికవేత్తలకు నూతన ఉత్సాహాన్ని కల్గించిందని రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంఘ అధ్యక్షులు కె.సుబ్బారావు చెప్పారు. ముఖ్యమంత్రి వివిధ పరిశ్రమలకు రూ.25వేల కోట్ల రాయితీని మంజూరు చేయడమే కాకుండా వెంటనే విడుదల చేయడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏవీకే రెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల రాష్ట్రంలో సుమారు 10వేలకు పైగా పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయని వాటి భవిష్యత్‌పై భరోసా కలిగించాలని, సహకారం అందించాలని కోరారు. అంతే కాకుండా ప్రభుత్వమే రెండు మూడు చిన్నతరహా పరిశ్రమలు స్థాపిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన 25 మంది పారిశ్రామికవేత్తలతో సీఎం విందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేపీఆర్‌ గ్రూపు సంస్ధల ఎండీ కర్రి వెంకట ముకుందరెడ్డి, ఈడీ కొవ్వూరి రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు.

No comments:

Post a Comment