Tuesday 14 July 2015

పుష్కర విషాదం: ఏం జరిగింది? ఎలా జరిగింది?

పుష్కర విషాదం: ఏం జరిగింది? ఎలా జరిగింది?

మంగళవారం ఉదయం 6.21 గంటలకు పుష్కర సంరంభం ఆరంభం! తొలి ఘడియల్లోనే స్నానం చేయాలనే ఉద్దేశంతో సోమవారం రాత్రి నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఘాట్‌ వద్ద వేచి చూశారు.
  • రాజమండ్రిలో పుష్కరఘాట్‌తోపాటు కోటిలింగాల రేవులోనూ భక్తులకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. కానీ... ‘గోదావరి రైల్వేస్టేషన్‌’కు సమీపంలో ఉండటం, ‘పుష్కర ఘాట్‌’ అనే పేరు, గోదావరి హారతికి ఇదే వేదిక కావడంతో అత్యధికుల్లో ‘ఈ ఘాట్‌లోనే స్నానం చేయాలి’ అనే మానసిక భావన బలపడింది.
  • సోమవారం రాత్రి నుంచి గోదావరి రైల్వే స్టేషన్‌లో ఆగిన ప్రతి రైలు నుంచీ పెద్దసంఖ్యలో పుష్కర భక్తులు దిగారు. వీరిలో అత్యధికుల అడుగులు ‘పుష్కర ఘాట్‌’వైపే పడ్డాయి. దేశంలోనే అతిపెద్దదైన 1.6 కిలోమీటర్ల పొడవునా నిర్మించిన కోటిలింగాల ఘాట్‌ను జనం పట్టించుకోలేదు.
  • మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా పుష్కర ఘాట్‌కు వచ్చారు. 6.26కి పుష్కర స్నానం చేశారు. 7.23 గంటల వరకు తీర్థ విధులు నిర్వహించి వెనుదిరిగారు.
  • అదే సమయంలో సీఎం బస్‌లో ఉండగా ఒకామె తన పిల్లల కోసం కనిపించడం లేదని ఏడుస్తుండగా గమనించి తిరిగి బస్‌లోంచి దిగి వచ్చారు. ఆమెను ఓదార్చి, వివరాలు తెలుసుకుని పోలీసులపై ఆగ్రహంచి వారిని ఆచూకీ తెలుసుకోమని చెప్పి వెళ్లారు.
  • పుష్కర ఘాట్‌ ఒకటే అయినప్పటికీ మూడు రేవుల సమాహారం. ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యఘాట్‌లో తీర్థ విధులు నిర్వహించారు. ఆ సమయంలోనూ మిగిలిన రెండు రేవులు ఇటు చిత్రాంగి గెస్ట్‌హౌస్‌ వైపు, అటు హారతి రేవుల్లో సాధారణ భక్తులు వేలాది మంది స్నానం చేస్తూనే ఉన్నారు. సీఎం చంద్రబాబు ఉన్న రేవులో మాత్రం క్యూలైన్లను నిలిపివేశారు. అయితే పక్కనున్న ప్రధాన గేటు మూసి ఉంది. ఆ గేటును తీసిన కొద్ది క్షణాలకే ఈ ప్రమాదం జరిగింది.
  • కోటగుమ్మం, వేణుగోపాల స్వామి ఆలయం, గోకవరం బస్టాండ్‌ వైపుల నుంచి ఘాట్‌కు జనం వస్తూనే ఉన్నారు. 40 వేలనుంచి 50 వేల మంది వరకున్న భక్తుల సంఖ్య...నిమిషాల్లోనే లక్షకుపైగా పెరిగింది.
  • చంద్రబాబు తీర్థ విధులు ముగించుకుని వెళ్లిన తర్వాత...అప్పటిదాకా మూసిన రెండో రేవు గేటూ తెరిచారు. వేలాదిగా గుమికూడిన భక్తులు ఒక్కసారిగా స్నానం చేసేందుకు కదిలారు. రహదారిలో ఏర్పాటు చేసిన బారికేడ్లు మరీ ఇరుకుగా ఉండటంతో తొక్కిసలాట మొదలైంది.
  • ఒకవైపు పుష్కర ఘాట్‌లోకి వెళ్లాలనుకుంటున్న జనం... మరోవైపు అప్పటికే పుష్కర ఘాట్‌లో స్నానం చేసి బయటికి రావాలనుకుంటున్న వారు కొందరు! రద్దీలో ఉక్కిరి బిక్కిరి అవుతూ... ‘స్నానం లేకున్నా ఫర్వాలేదు’ అంటూ వెనుతిరిగిన వారు మరికొందరు! దీంతో... తొక్కిసలాట మరింత పెరిగింది. ముందు నుంచి వెనుక నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో మహిళలు, పిల్లలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు.
  • సుమారు 20 నుంచి 25 నిమిషాలపాటు అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితి. రద్దీలో చిక్కుకున్న భక్తులకు ఊపిరి ఆడలేదు. సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసులు, అధికారులు, ఇతర సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దే సరికే... పెను విషాదం చోటు చేసుకుంది.

No comments:

Post a Comment