Friday 24 July 2015

ప్రేమలో వైఫల్యం..నపుంసకత్వం.. వల్లే రైతు ఆత్మహత్యలు

ప్రేమలో వైఫల్యం..నపుంసకత్వం.. వల్లే రైతు ఆత్మహత్యలు
  • మన రైతులు భగ్న ప్రేమికులు
  • కేంద్ర వ్యవసాయ మంత్రి 
  • రాధామోహన్‌ వివాదాస్పద వ్యాఖ్య
  • సభకు లిఖితపూర్వక స్పష్టీకరణ
న్యూఢిల్లీ, జూలై 24: మన రైతులు భగ్న ప్రేమికులట. ప్రేమలో విఫలమయ్యే వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారట! దేశవ్యాప్తంగా జరుగుతున్న వేలాది రైతు ఆత్మహత్యలకు భగ్న ప్రేమలు కూడా ఒక కారణమట! ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసింది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌ సింగ్‌! రైతు ఆత్మహత్యలపై అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో ఆయన లిఖితపూర్వక జవాబు ఇచ్చారు. అందులో ఆత్మహత్యలకు పలు కారణాలను ప్రస్తావించారు. పెరిగిపోయిన అప్పులు.. పంటలు దెబ్బతినడం.. కరువు.. సామాజిక, ఆర్థిక, వ్యక్తిగత కారణాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా, ఆత్మహత్యలకు సాధారణ కారణాలు అంటూ జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఇచ్చిన నివేదికను ఆయన చదివారు. అందులో భాగంగానే, ప్రేమలో విఫలం కావడం, నపుంసకత్వం, గర్భవతులు కాలేకపోవడం తదితరాలను ప్రస్తావించారు. ఇవి కూడా రైతు ఆత్మహత్యలకు కారణమని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు దారుణమని విమర్శించారు. ‘రైతుల ఇళ్లకు వెళ్లాల్సిందిగా మీ మంత్రులను ఆదేశించండి. అక్కడ ఏం జరుగుతోందో కళ్లారా చూడమని చెప్పండి’ అని ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీ సూచించారు. మంత్రి రాధా మోహన్‌ సింగ్‌ క్షమాపణ చెప్పాలని ఎస్పీ నేత నరేశ్‌ అగర్వాల్‌ డిమాండ్‌ చేశారు. ఆత్మహత్యలకు మంత్రి చెప్పిన కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయని, క్షేత్రస్థాయి పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నమని సీపీఎం నేత సీతారాం ఏచూరి తప్పుబట్టారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది కాలంలో నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయిన రైతు ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయని చెప్పారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని మంత్రి జవాబు స్పష్టం చేస్తోందని సీపీఐ నేత డి.రాజా విమర్శించారు. మంత్రి వ్యాఖ్యలు రైతులను అవమానించడమేనని, పార్లమెంటును తప్పుదోవ పట్టించిన మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రతిపాదిస్తామని జేడీయూ నేత కేసీ త్యాగి స్పష్టం చేశారు. అయితే, ప్రతిపక్షాల నుంచి విమర్శలు తీవ్రం కావడంతో మంత్రి రాధామోహన్‌సింగ్‌ వివాదాన్ని కాస్త సర్దుమణచడానికి ప్రయత్నించారు. ఎన్సీఆర్బీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే జవాబు ఇచ్చామని తెలిపారు.

No comments:

Post a Comment