Tuesday 21 July 2015

ఏపీ రాజధాని& కో.. సింగపూర్, జపాన్ భాగస్వామ్యం

ఏపీ రాజధాని& కో.. సింగపూర్, జపాన్ భాగస్వామ్యం
సింగపూర్‌/జపాన్‌కు 50% వాటా.. ఏపీకి 25 శాతం

  •  స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ఏర్పాటు
  • భూములే ఏపీ పెట్టుబడులు
  •  భాగస్వామ్యానికి రెండు దేశాల అంగీకారం
  • 65 శాతం కొనుగోళ్లు జపాన్‌ కంపెనీల నుంచే!
  • లేదా... 4 నుంచి 5 శాతం వడ్డీ చెల్లింపు
  • జపాన్‌ విధించిన ప్రధాన షరతు ఇదే
హైదరాబాద్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి): భూసమీకరణ దాదాపుగా పూర్తయింది. బృహత్‌ ప్రణాళిక కూడా చేతికి అందింది. ఇక... నవ్యాంధ్ర రాజధానిపై ప్రభుత్వం తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. ముఖ్యంగా కొత్త రాజధాని నిర్మాణానికి నిధుల సమీకరణకు అనుసరించాల్సిన వ్యూహంపై అధికార వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఒక కంపెనీని త్వరలో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకూ ఉన్న సంకేతాలను బట్టి ఈ కంపెనీలో ఆంధ్రప్రదేశ్‌, సింగపూర్‌, జపాన్‌ ప్రభుత్వాలు భాగస్వాములుగా ఉంటాయి. ఈ ప్రతిపాదనకు సింగపూర్‌ ప్రభుత్వం గతంలోనే ఆమోదం తెలిపింది. జపాన్‌ కూడా దీనికి అంగీకరించింది. రాజధాని నిర్మాణ సంస్థలో భాగస్వామిగా చేరాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం కొంత కాలం క్రితం జపాన్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు జపాన్‌ పర్యటనకు వెళ్లినప్పుడు ఆ దేశ అధికార వర్గాలు అధికారికంగా తమ సమ్మతిని తెలిపాయి. చంద్రబాబు జపాన్‌ పర్యటనలో ఇది ఒక ముఖ్యమైన మలుపు. రాజధాని నిర్మాణం కోసం ఏర్పాటు చేసే కంపెనీలో ఈ మూడు ప్రభుత్వాలకు భాగస్వామ్యం ఉంటుంది. ఎవరి పెట్టుబడి ఎంత ఉంటుందన్నదానిపైనే వాటా కూడా అధారపడి ఉంటుంది. సింగపూర్‌, జపాన్‌లలో ఒక దేశానికి 50 శాతం ఉంటుందని చెబుతున్నారు. ఏపీకి 25 శాతం వాటా ఉంటుందనే ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కొద్ది రోజుల్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం నేరుగా ఈ కంపెనీలో నగదు రూపంలో పెట్టుబడి పెట్టకుండా... తన వాటాగా రాజధాని ప్రాంతంలోని భూములను చూపించనుంది. ఈ భూముల విలువను మదింపు చేసి దానిని ఏపీ వాటాగా నిర్ణయిస్తారు. మిగిలిన ప్రభుత్వాలు తమ వాటాగా నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. ఈ కంపెనీ ఏర్పాటు తర్వాత రాజధాని నిర్మాణానికి ఒక స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ఏర్పాటు చేస్తారు. దీని ఆధ్వర్యంలో నిర్మాణ కార్యక్రమం నడుస్తుంది. దీనికి సమాంతరంగా ‘అమరావతి’ అభివృద్ధి భాగస్వామి ఎంపిక జరుగుతుంది. ఈ భాగస్వామి కొన్ని సంస్ధల కన్సార్టియంగా ఉండే అవకాశం ఉంది. ఇందుకు సింగపూర్‌ ప్రభుత్వం తన తరపున మూడు సంస్థలను ఎంపిక చేసింది. ఈ కన్సార్టియంలో ఇవి భాగస్వాములుగా ఉండనున్నాయి. జపాన్‌ కూడా తన తరఫు సంస్థలను నామినేట్‌ చేసే అవకాశం ఉంది. గతంలో ఆసే్ట్రలియా ప్రభుత్వం కూడా రాజధాని నిర్మాణంలో భాగస్వామి కావడానికి ఆసక్తి చూపింది. ఆ ప్రభుత్వానికి కూడా దీనిపై ఒక లేఖ రాసే అంశాన్ని ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ముందుగా సింగపూర్‌, జపాన్‌ ప్రభుత్వాల ఆలోచన తెలుసుకొని తదుపరి ఆసే్ట్రలియాతో చర్చలు ఆరంభిస్తారు.
షరతులు వర్తిస్తాయి..
పెట్టుబడులకు సంబంధించి జపాన్‌ సూచనప్రాయంగా తన షరతులను రాష్ట్ర ప్రభుత్వానికి వెల్లడించినట్లు సమాచారం. తాను పెట్టుబడులు పెడుతున్న చోట జరిగే కొనుగోళ్లలో 65 శాతం వస్తు సామగ్రిని జపాన్‌ కంపెనీల నుంచి కొనుగోలు చేయాలన్నది ప్రధాన షరతు. మిగిలిన 35 శాతం కొనుగోళ్లను స్థానికంగా చేసుకోవచ్చు. ఇందుకు అంగీకరించకపోతే... జపాన్‌ పెట్టే పెట్టుబడులకు 4-5 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీ చెల్లింపులకంటే జపాన్‌ కంపెనీల నుంచి కొనుగోళ్లు చేయడమే ఆర్థికంగా మేలని కొందరు అధికారులు చెబుతున్నారు. జపాన్‌ సంస్థల ఉత్పత్తుల్లో నాణ్యత బాగుంటుందని, అందువల్ల కొనుగోళ్లలో ఇబ్బంది ఉండదన్నది వారి అభిప్రాయం. కొద్ది రోజుల్లో దీనిపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

No comments:

Post a Comment