Sunday 12 July 2015

ఏపీ కోసం ట్యాపింగ్‌ పరికరాలు!?

ఏపీ కోసం ట్యాపింగ్‌ పరికరాలు!?
‘తెలంగాణపై ప్రయోగానికే’నంటూ హల్‌చల్‌..
వికీ‘లీక్స్‌’తో కొత్త కలకలం (12-Jul-2015)

  • ప్రభాకర్‌ అనే వ్యక్తి నుంచి మెయిల్‌
  • ఖండించిన ఏపీ పోలీసులు, ప్రభుత్వం
హైదరాబాద్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఉన్న సమస్యలు చాలవన్నట్లు... తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం మొదలైంది. అది... వికీలీక్స్‌తో పుట్టుకొచ్చిన వివాదం! సాధారణంగా అయితే... ఇది ఒక జాతీయ, అంతర్జాతీయ అంశంగానే మిగిలిపోయేది. కానీ... ఓటుకు నోటు, ట్యాపింగ్‌పై ఢీ అంటే ఢీ అంటున్న తెలుగు రాష్ట్రాల మధ్య ‘రచ్చ’గా మారింది. జాతీయ భద్రతతో ముడిపడిన అంశం కాస్తా... ‘ప్రాంతీయ, రాజకీయ’ రంగు పులుముకుంది. యూపీఏ హయాంలో కేంద్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ కోసం అత్యాధునిక పరికరాల కొనుగోలుకోసం ప్రయత్నించాయంటూ వికీలీక్స్‌ సంబంధిత ఈ-మెయిల్‌లను బయటపెట్టింది. అంతే... ‘తెలంగాణ మీద ప్రయోగించేందుకే చంద్రబాబు సర్కారు ట్యాపింగ్‌ సాఫ్ట్‌వేర్‌ కొనుగోలుకు ప్రయత్నించింది’ అంటూ ఒకవైపు నుంచి ప్రచారం మొదలైంది. దీంతో... ఏపీ సర్కారు కూడా దీనిపై వివరణ ఇచ్చుకుంది. నిజానికి... కేంద్ర నిఘా సంస్థలతోపాటు అన్ని రాష్ట్రాల ఇంటెలిజెన్స్‌ బ్యూరోలు ట్యాపింగ్‌కు అవసరమైన పరికరాలను సమకూర్చుకుంటూనే ఉంటాయి. ఉగ్రవాదులు, నక్సలైట్లు, సంఘ విద్రోహ శక్తుల కదలికలను గుర్తించేందుకు ‘ట్యాపింగ్‌’ను ఉపయోగిస్తారు. తగిన అనుమతులతో, అధికారికంగా ట్యాప్‌ చేయడం చట్టబద్ధమే! రాజకీయ కక్ష సాధింపులకు, అవసరాలకు అనధికారికంగా ట్యాపింగ్‌కు పాల్పడటం మాత్రం తీవ్రమైన నేరం. దేశభద్రతకు సంబంధించి ఎంతో ముఖ్యమైన ట్యాపింగ్‌ వ్యవహారం... తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ రచ్చగా మారడంపై కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పుడు... ‘వికీలీక్స్‌’తో విషయం మరింత విషమిస్తుందని పేర్కొంటున్నాయి. ఉభయ రాష్ట్రాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘‘దేశ రక్షణ, ప్రజా భద్రతకు సంబంధించిన అంశాలను ఇలా ఎవరికి వారు తవ్వి తీస్తూ పోతే చాలా కష్టం! రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్‌ చేసేందుకే నిఘా వర్గాలు పరికరాలను సమకూర్చుకుంటాయనే ప్రచారం ప్రమాదకరం. ఇది అంతిమంగా సంఘ విద్రోహ శక్తులకే ఉపయోగపడుతుంది’’’’ అని ఓ అధికారి పేర్కొన్నారు.
 
అప్పుడు... ఇప్పుడు!
‘తెలంగాణపై ప్రయోగించేందుకే హ్యాకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు చేస్తున్నారు’ అనే ఆరోపణలను ఏపీ ఉన్నతాధికారులు ఖండిస్తున్నారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడే అత్యాధునికమైన ట్యాపింగ్‌ పరికరాలను సమకూర్చుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఈ పరికరాల్లో అత్యధికం తెలంగాణ పోలీసుల వద్దే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసు విభాగం కూడా ఆయా పరికరాలను సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వికీలీక్స్‌ పత్రాల ప్రకారం... ఏపీ సర్కారు ఈ దిశగానే సంబంధిత కంపెనీలతో సంప్రదింపులు జరిపి ఉండాలి. ఇలా నేరుగా పోలీసులు కంపెనీలను సంప్రదించినట్లుగా మెయిల్స్‌ ఏవీ లేవు. ‘ఏపీ పోలీసుల కోసం’ అంటూ ప్రభాకర్‌ కాసు అనే వ్యక్తి మెయిల్స్‌ పంపించారు. రాష్ట్ర విభజనకు ముందు... 2014 ఫిబ్రవరి 14, మార్చి 7న వెళ్లిన రెండు ఈ-మెయిల్స్‌ ప్రకారం... హ్యాకింగ్‌ టీమ్‌ డాట్‌ కామ్‌కు మరికొందరు వ్యక్తులకు మధ్య మెయిల్‌ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తరఫున ఇంటెలిజెన్స్‌ అధికారులు ఎంఎం భగవత్‌, బి. సుమతి, కె. నారాయణరెడ్డి, పి. రవీంద్రప్రసాద్‌ ఈ పరికరాల కోసం దుబాయికి వస్తున్నారంటూ సమాచారం పంపించారు. గత నెల 12, 17 తేదీల్లోనూ అదే కంపెనీకి కొన్ని ఈ-మెయిల్స్‌ వెళ్లాయి. తన క్లయింట్‌ (ఏపీ పోలీస్‌ ఇంటెలిజెన్స్‌) మొబైల్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ పరికరాలను కొనుగోలు చేయాలనుకుంటోందన్నది దీని సారాంశం. 25 నుంచి 50 మొబైల్‌ లైసెన్స్‌లకు ఎంత ఖర్చవుతుందో చెప్పాలని ప్రభాకర్‌ కాసు అనే కన్సల్టెంట్‌ పేరుతో మెయిల్స్‌ వెళ్లాయి. దీనికి 1నుంచి 1.2మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు ఖర్చు కావచ్చని హ్యాకింగ్‌ టీమ్‌ డాట్‌ కామ్‌ నుంచి మ్యాగ్లీయెట్టా పేరుతో సమాధానం వచ్చింది. వెరసి... ఏపీ సర్కారు కూడా తెలంగాణను టార్గెట్‌ చేసుకునే ట్యాపింగ్‌ పరికరాల కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టినట్లు హల్‌చల్‌ మొదలైంది. ఆ తర్వాత రకరకాల వార్తలు వెలువడ్డాయి.

ఏమీ జరగలేదు: ఏపీ పోలీస్‌
‘‘ఈ-మెయిళ్లలో ఇటాలియన్‌ సప్లయర్‌కు, ఇండియన్‌ ఏజెంట్‌ ప్రభాకర్‌ రెడ్డికి మధ్య సంభాషణలు జరిగినట్లుంది. ఈ అంశానికి సంబంధించి నవ్యాంధ్ర పోలీసులు సదరు కాసు ప్రభాకర్‌ను ఎప్పుడూ సంప్రదించలేదు’’ అని ఏపీ పోలీసు వర్గాలు తెలిపాయి. నిజానికి... రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన నిఘా వర్గాలకు విక్రయదారులు కొత్త సాఫ్ట్‌వేర్‌, టెక్నాలజీపై ఒక ప్రజెంటేషన్‌ ఇచ్చారని పేర్కొన్నాయి. ఈ ఏడాది మార్చిలో తెలంగాణ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగానికే ఆర్టస్‌ కన్సల్టింగ్‌ సంస్థకు చెందిన కాసు ప్రభాకర్‌ ఒక ప్రజెంటేషన్‌ ఇచ్చార ని వివరించాయి. మరోవైపు... ఇరు రాష్ట్రాలకు చెందిన ఎస్‌ఐబీ, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగాలకు తెలంగాణ ఎస్‌ఐబీ కార్యాలయంలో ఇటీవల పలు సమస్యల పరిష్కారంపై ప్రదర్శన ఇచ్చారని పేర్కొన్నాయి. మొబైల్‌ ఇంటర్‌సెప్షన్‌కు సంబంధించిన ప్రెజంటేషన్‌ మాత్రం లేదని తెలిపాయి.

కేరాఫ్‌ బేగంపేట
సంఘ విద్రోశ శక్తుల కదలికలపై కన్నేసేందుకు రాష్ట్ర, జాతీయస్థాయి నిఘా విభాగాలు ట్యాపింగ్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతిక పరికరాలను సమకూర్చుకుంటూ ఉంటాయి. ఎంపిక చేసిన కొన్ని ఫోన్‌ నెంబర్లకు వచ్చి పోయే కాల్స్‌ను రికార్డ్‌ చేయడం సర్వ సాధారణం. ఈమధ్యనే మరో కొత్తప్రక్రియ కూడా అందుబాటులోకి వచ్చింది. ట్రాకింగ్‌లో ఉన్న ఫోన్ల సంభాషణల్లో ఎంపిక చేసిన కొన్ని పదాలు వినిపిస్తే చాలు... మొత్తం సంభాషణ ఆటోమేటిక్‌గా రికార్డు అవుతుంది. హైదరాబాద్‌ బేగంపేటలోని ప్రత్యేక ఇంటెలిజెన్స్‌ విభాగం ఇదే పనిలో ఉంటుంది. సంఘ విద్రోహ శక్తులు సైతం ఎప్పటికప్పుడు ఎత్తుకు పైఎత్తులు వేస్తూనే ఉంటాయి. అందువల్లే, నిఘా విభాగాలు ఎప్పటికప్పుడు సరికొత్త, అత్యాధునిక పరికరాలను సమకూర్చుకోవడంపై దృష్టి సారిస్తుంటాయి. ఇందులో భాగంగానే ఇంటెలిజెన్స్‌ అధికారులు ప్రపంచవ్యాప్తంగా నేరపరిశోధనకు వినియోగించే ఆధునిక పరికరాలు ఎక్కడున్నా సమకూర్చుకుంటూ ఉంటారు. ఈ ప్రక్రియను ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ రచ్చకు దారి తీయడంపై పోలీసు అధికారులు ఆందోళన చెందుతున్నారు.

తప్పుడు వార్తలు: యనమల
‘‘ఫోన్ల హ్యాకింగ్‌పై కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన పత్రికలు, చానళ్లలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం! ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించడానికి కొన్ని పార్టీలు, వాటికి తొత్తులుగా ఉన్న టీవీ చానళ్లు కుట్రలకు పాల్పడుతున్నాయి’’ అని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము బయటపెడుతున్న ఈ-మెయిల్స్‌కు ఎటువంటి సాధికారత లేదని వికీలీక్స్‌ స్పష్టంగా పేర్కొన్నా... ఆ విషయాన్ని మరుగు పరచడం ఆ చానళ్ల దుర్నీతికి నిదర్శనమని విమర్శించారు. రాజకీయ పార్టీలే పత్రికలు, చానళ్లను స్థాపించి... అసత్య ప్రచారాలే అజెండాగా చేసుకుని... ఇలాంటి నిందాపూర్వక ప్రచారం చేయడం శోచనీయమన్నారు. ఆకాశం మీద ఉమ్మాలని చూస్తే అది వారి ముఖంపైనే పడుతుందని, వారి కుట్ర రాజకీయాలను తెలుగు ప్రజలు తిప్పికొడతారని యనమల పేర్కొన్నారు.

No comments:

Post a Comment