Wednesday 22 July 2015

రాజధానిలో ఉద్యోగులకు అపార్ట్‌మెంట్లు..

అద్భుత అమరావతి.. రాజధానిలో ఉద్యోగులకు అపార్ట్‌మెంట్లు.. రాజమండ్రిలో ఏపీ కేబినెట్ భేటీ, చర్చ

  • ఆసక్తి చూపుతున్న సింగపూర్‌, జపాన్‌
  • ఏడాదిలో రెవెన్యూ శాఖ ప్రక్షాళన
  • ఏపీలోనూ క్రమబద్ధీకరణకు అవకాశం
  • 80 గజాల్లోపు ఉంటే ఉచితం
  • పుష్కర తొక్కిసలాటపై ఆసక్తికర చర్చ
హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఆసియా ఖండానికే తలమానికంగా నిలిచేలా అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మించాలని రాష్ట్ర కేబినెట్‌ తీర్మానించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ్‌సలో ఏపీ కేబినెట్‌ సమావేశమైంది.ఈ సమావేశంలో పలు అంశాలపై 4 గంటలపాటు చర్చించారు. పుష్కరాల తొలిరోజు తొక్కిసలాటలో మృతిచెందిన వారికి సంతాపం ప్రకటించారు. ఇప్పుడు రాజమండ్రిలో పెట్టినట్లే మున్ముందు రాష్ట్రంలో ఇతర చోట్ల కూడా మంత్రివర్గ సమావేశాలు ఉంటాయని చంద్రబాబు చెప్పారు. నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంలో పాలు పంచుకోవడానికి సింగపూర్‌, జపాన్‌ దేశాలు ఆసక్తిగా ఉన్నాయని, దీనివల్ల రాజధాని నిర్మాణానికి నిధుల సమస్య ఉండకపోవచ్చునని కేబినెట్‌ సమావేశంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేబినెట్‌ సమావేశంలో సింగపూర్‌ ప్రభుత్వం తాజాగా సమర్పించిన సీడ్‌ క్యాపిటల్‌ ప్రణాళికపై చర్చ జరిగింది. ప్రణాళిక బాగుందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. తదుపరి కార్యాచరణ గురించి కూడా చర్చ వచ్చింది. ‘‘ప్రభుత్వానికి...ప్రభుత్వానికి మధ్య ఒప్పందం పేరుతో మనం సింగపూర్‌, జపాన్‌ ప్రభుత్వాలతో నేరుగా ఒప్పందం కుదుర్చుకొని రాజధాని నిర్మాణం వాటికి అప్పగించవచ్చు. కానీ పారదర్శకంగా ఉండాలన్న అభిప్రాయంతో స్విస్‌ చాలెంజ్‌ విధానంలో అమరావతి అభివృద్ధి భాగస్వామిని ఎంపిక చేయాలని నిర్ణయించాం. భాగస్వాములుగా సింగపూర్‌, జపాన్‌ ఎంపికైతే మనకు హాయిగా ఉంటుంది. వాళ్ల వద్ద నిధులున్నాయి. అంతర్జాతీయ అనుభవం ఉంది. సాంకేతిక పరిజ్ఞానం ఉంది. స్విస్‌ చాలెంజ్‌ ప్రక్రియలో పాల్గొనాలని మనం ఆ రెండు దేశాలకూ విజ్ఞప్తి చేద్దాం. వారితోపాటు ఇందులో పాల్గొనడానికి ఇతరులకు కూడా అవకాశం ఉంది. ఆ రెండు దేశాలకు మించిన మంచి ప్రతిపాదనతో మరెవరైనా వస్తే వారికైనా అవకాశం ఇద్దాం. మనకు మంచి రాజధాని త్వరితంగా నిర్మాణం కావాలి’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన అభిప్రాయానికి మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నామని, స్విస్‌ చాలెంజ్‌ విధానంలో ఎంపికైతే ఈ సంస్థలో 50 శాతం వాటా తీసుకోవడానికి సింగపూర్‌ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. తాము ఎంతపెట్టుబడి పెట్టాలో.. దానిని ఎలా రాబట్టుకోవాలో కూడా సింగపూర్‌ సంస్థలు వాణిజ్యపరమైన అంచనాలు కూడా తయారు చేసుకొన్నాయని, తాము పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోవడానికి రాజధాని ప్రాంతంలో మూడు వేల ఎకరాలు ఇస్తే దానిని వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తామని ఆ సంస్థలు ప్రాథమిక చర్చల్లో సంకేతాలు ఇచ్చాయని కూడా ఆయన చెప్పారు. వినోదపరమైన సంస్థలు, పర్యాటక కేంద్రాల ఏర్పాటుకు జపాన్‌ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెడితే అవి సురక్షితంగా ఉండటంతోపాటు అవి తమకు తిరిగి వస్తాయన్న నమ్మకం వారిలో కలిగించగలిగామని ఆయన వివరించారు. 2018 సంవత్సరం నాటికి కొత్త రాజధానిలో పరిపాలనా భవనాల నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని, దానివల్ల రాజధానికి ఒక రూపు వస్తుందని ఆయన వివరించారు. రాజధానిలో ఉద్యోగుల గృహ నిర్మాణంపై కూడా చాలా ఆలోచనలు చేస్తున్నామని, ఎల్‌ ఐసీ నుంచి కేంద్రం ద్వారా రుణం తీసుకొని ఉద్యోగుల కోసం 30 వేల అపార్ట్‌మెంట్లు నిర్మించాలని యోచిస్తున్నామని ఆయన తెలిపారు.ప్రధాని మోదీ సూచన మేరకు పాత సోవియట్‌ రష్యా పరిధిలోని తజకిస్తాన్‌, కజకిస్తాన్‌ దేశాలు కొత్తగా నిర్మిస్తున్న వాటి రాజధానుల పరిశీలనకు ముందు అధికారుల బృందాన్ని పంపి ఆ తర్వాత అవసరం అనుకొంటే తాను...మంత్రులు కలిసి చూసి వస్తామని చంద్రబాబు తెలిపారు.
 
ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై
హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ప్రభుత్వ కార్యాలయాలు తరలించడంపై దృష్టి పెట్టి మంత్రులు పనిచేయాలని, దశలవారీగా తరలింపు చేపట్టాలని కేబినెట్‌ సమావేశం సందర్భంగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. హైకోర్టు విభజనపై కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ‘‘విభజన చట్టంలో దీనిపై పూర్తి స్పష్టత ఉంది. కొత్త రాజధానిలో హైకోర్టు భవన నిర్మాణం జరిగిన తర్వాతే ప్రస్తుతం ఉన్న ఉమ్మడి హైకోర్టు విభజన జరిగి కొత్త హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌కు తరలుతుంది. అప్పటిదాకా ప్రస్తుతం ఉన్న ఏర్పాటే కొనసాగుతుంది’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
 
ఏడాదిలో రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన
పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇవ్వకుండా తిప్పించుకొంటూ వేధిస్తున్నారన్న కారణంతో ఇటీవల ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడటంపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఈ పరిస్థితిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ కార్యాలయాల నుంచి ప్రజలు మొత్తం 61 రకాల సర్టిఫికెట్లు పొందాల్సి వస్తోందని ఆయన ఆ జాబితాను మంత్రులకు చదివి వినిపించారు. ‘‘ఈ పరిస్థితి నుంచి ప్రజలను తప్పించాలి. ఏ సర్టిఫికెట్‌ కోసం ప్రజలు రెవెన్యూకార్యాలయం గడప తొక్కాల్సిన అవసరం లేకుండా చేయాలి. భూ వివరాలను పూర్తిగా వెబ్‌ లాండ్‌ వెబ్‌సైట్లో నమోదు చేసి ఎవరైనా నేరుగా దాని నుంచి వివరాలు పొందగలిగే పరిస్థితి తేవాలి. దీని కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం కనీసం ఒక ఏడాదిపాటు క్రమం తప్పకుండా సమావేశమై ఈ వ్యవస్థను పూర్తిగా క్షాళన చేయాలి’ అని ఆయన ఆదేశించారు. ఇటీవల ఇసుక ర్యాంప్‌ నుంచి ఇసుక తరలింపుపై ఎమ్మార్వో వనజాక్షి, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావు మధ్య నెలకొన్న వివాదంపై కూడా చర్చ జరిగింది. ‘ఈ సంఘటనపై రెవెన్యూ అధికారులు వెంటనే ఆందోళన కూడా ప్రకటించారు. నేను జపాన్‌ నుంచి వచ్చిన తర్వాత విచారణ చేయిస్తే తప్పు ఎమ్మార్వోదేనని తేలింది. ఆమె పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దులోకి వెళ్లి వాహనాలు ఆపారు. అది ఆమె పరిధి కాదు. టీడీపీ ఎమ్మెల్యేది కూడా తప్పే. ఆయన ఆ సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లకుండా ఉండాల్సింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌ దీనిపై సరిగా స్పందించకపోవడంతో వివాదం పెద్దదైంది. ఆ జిల్లా మంత్రి ఉమా మహేశ్వరరావు కూడా మౌనం వహించారు’ అని చంద్రబాబు ఆక్షేపించారు.
 
సమ్మె విరమిస్తేనే డిమాండ్లు పరిష్కారం
ప్రస్తుతం జరుగుతున్న మునిసిపల్‌ కార్మికుల సమ్మెపై కఠిన వైఖరి అనుసరించాలని నిర్ణయించారు. ‘‘వాళ్లు ముందు విధుల్లో చేరితే వారి డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించడానికి నేను సిద్ధం. ఉద్యోగులకు నేను చాలా చేశాను. అయినా సమ్మెకు దిగడం ఏమిటి? మీరు వాళ్లతో మాట్లాడి ముందు విధుల్లో చేరమని చెప్పండి’’ అని మంత్రులకు సూచించారు. విశాఖ, విజయవాడల్లో 101 పద్దు కింద కిందకు మునిసిపల్‌ సిబ్బందిని చేరిస్తే వారి సమస్య తీరుతుందని ఒక మంత్రి చెప్పినప్పుడు దానికేమీ ఇబ్బంది లేదని, కాని ముందు సమ్మె విరమించాలన్నారు.
 
తొక్కిసలాటలో విద్రోహ చర్యపై చర్చ
రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో విద్రోహ చర్య అంశం మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ‘‘పుష్కరాలు మొదలు కావడానికి ముందు రాజమండ్రి మాజీ ఎంపీ హర్షకుమార్‌ అక్కడ వేరేవారి సమస్యలపై దీక్ష చేశారు. ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి నిరసనగా ఆయన అనుచరులు పుష్కరాల ప్రారంభ సమయంలో కరెంటు తీగలు తెగిపడ్డాయని, షాక్‌ కొడుతోందని ప్రజలను భయబ్రాంతులను చేశారని, దాని వల్లే తొక్కిసలాట జరిగిందని మాకు బయటి నుంచి సమాచారం వస్తోంది. దీనిపై విచారణ జరపాలి’’’ అని మంత్రులు అచ్చెన్నాయుడు, పీతల సుజాత కోరారు. ఇది కొత్త కోణమని, దీనిని కూడా న్యాయ విచారణ పరిధిలోకి చేరుద్దామని చంద్రబాబు అన్నారు. తొలి రోజు తాను పుష్కరాల్లో పూజ ముగించి బయటకు వస్తున్నప్పుడు ఒక మహిళ తనను ఆపి కరెంటు తీగలు తెగి పడ్డాయని అంటున్నారని చెప్పారని చంద్రబాబు గుర్తు చేసుకొన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో భవనాల క్రమబద్ధీకరణ పథకం ప్రవేశపెట్టడానికి మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

No comments:

Post a Comment