Tuesday 17 May 2016

CBN Delhi Press Meet - Sakshi

హోదాతో ఏం వస్తుంది?

Sakshi | Updated: May 18, 2016 01:11 (IST)
హోదాతో ఏం వస్తుంది?
- హోదా ఇచ్చి నిధులు ఇవ్వకపోతే ఏం లాభం?
- ప్రధానితో భేటీ అనంతరం సీఎం చంద్రబాబు


సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చినా ఒరిగేదేమీ లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చేశారు. హోదా ఇచ్చి నిధులు ఇవ్వకపోతే ఏం లాభమంటూ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా పొందిన ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని ప్రశ్నించారు. ఇంతకు ముందు ఎలా ఉన్నాయో ఇప్పుడూ అలాగే ఉన్నాయన్నారు. ప్రత్యేకహోదా మీద ఇంత వరకు ఆర్ధికమంత్రిగానీ, ప్రధానిగానీ ఏమీ చెప్పలేదన్నారు. అసలు హోదా ఇచ్చామని చెప్పి.. ఏమీ ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. హోదాపై కేంద్రాన్ని నిలదీసేందుకే చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారని టీడీపీ వర్గాలు జోరుగా ప్రచారం చేసినా.. ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.

ముఖ్యమంత్రి మాటలను బట్టి చూస్తే ప్రత్యేక హోదాపై ప్రధాని వద్ద ఆయనేమీ పట్టుబట్టలేదని స్పష్టమవుతోంది. మంగళవారం మధ్యాహ్నం ఇక్కడ ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కరువు, నీటి ఎద్దడిపై ముఖ్యమంత్రితో కలిసి సమీక్షించారు. ఈ సమీక్ష అనంతరం చంద్రబాబు ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కరువుపై జరిగిన సమీక్ష వివరాలను వెల్లడిస్తూ రాష్ట్ర విభజన అంశాలపై విడిగా కలిసి ఒక వినతిపత్రం ఇచ్చినట్టు తెలిపారు. ఇంకా ఆయనేమన్నారంటే...
 
ఆనాడు మోదీ కూడా మాట ఇచ్చారు..
కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా విభజించింది. ఇది చిన్న విషయం కాదు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. ఈ రోజు సీఎంగా అన్ని వివరాలు ఉన్నాయి కాబట్టి చెప్పగలుగుతున్నా. చేసిన తప్పు కారణంగా కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. ఆందోళనల ఫలితంగా స్పెషల్ స్టేటస్ పెట్టారు. బీజేపీ ఐదేళ్లు సరిపోదు పదేళ్లు ఇస్తామంది. విభజన చట్టంలోని హామీలు, ప్రత్యేక హోదా, పొరుగు రాష్ట్రాలతో పోటీపడే సామర్థ్యం వచ్చే వరకు చేయూత ఇవ్వడం.. ఈ మూడు అంశాలు అడిగాం. ఆనాడు అన్యాయం జరిగింది. మోదీ న్యాయం చేస్తారని పొత్తు పెట్టుకున్నాం. ఆయన కూడా తిరుపతిలో మాట ఇచ్చారు. ప్రధానంగా ఆర్థిక లోటు. 14వ ఆర్థిక సంఘం వచ్చేలోగా ఇవ్వాల్సిన రెవెన్యూ లోటు తొలి ఏడాదికి సంబంధించి ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు ఏటా రూ.నాలుగైదు వేల కోట్లు ఇవ్వాలి.

అన్ని అంశాలూ లెటర్‌లో పెట్టా...
ఇక రాజధానికి ఆర్థిక సాయం చేయాలి. ఒక ఆర్థికపరమైన రాజధానిగా ఎదగాలి. అప్పటివరకు కేంద్రం సాయం చేయాలి. అలాగే జాతీయస్థాయి విద్యాసంస్థలకు నిధులు ఇవ్వాలి. విశాఖ రైల్వే జోన్, కడప స్టీలు ప్లాంటు, దుగరాజపట్నం నౌకాశ్రయం తదితర మౌలిక వసతులు ఏర్పాటుచేయాలి. అలాగే విభజన చట్టంలోని షెడ్యూలు 9, 10 సంస్థలకు సంబంధించి పెండింగ్ అంశాలను పరిష్కరించాలి. ఉన్నత విద్యామండలికి సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది. జనాభా ప్రాతిపదికన ఆస్తులు పంచుకోవాలంది. ఒకవేళ రెండు రాష్ట్రాలు సామరస్యకంగా సమస్యను పరిష్కరించుకోలేని పక్షంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని చెప్పింది. అందువల్ల ఈ తీర్పును అనుసరించి అన్ని సంస్థల విషయంలో సమస్య పరిష్కరించుకోవాల్సి ఉంది.

ఇక ప్రాజెక్టుల విషయంలో రివర్ బోర్డులు, అపెక్స్ కౌన్సిల్ ద్వారా పరిష్కరించుకోవాలని విభజన చట్టం చెప్పింది. దీనిపై కేంద్రం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని చెప్పాం. సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉన్నాకే ప్రాజెక్టులు ఏర్పాటుచేసుకోవాలి తప్ప ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రంతో గొడవపడే పరిస్థితి ఉండరాదు. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లాను. ఈ అంశాలన్నీ పరిష్కారం కాలేదు. వీటన్నింటినీ లెటర్‌లో పెట్టాను. ప్రధాన మంత్రి కూడా ఈ విషయాలను పరిశీలిస్తానన్నారు. ప్రత్యేక హోదా ఇస్తే తప్ప ఈ రాష్ట్రం కోలుకోదని చెప్పాను. ఆరోజు పార్లమెంటులో ప్రకటన చేసినప్పుడు బీజేపీ కూడా అడిగింది. దానిని నిలబెట్టుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉంది. ఆర్థిక మంత్రిని కూడా కలిశాం. దీనిపై మరింత లోతుగా వివరించాం.. త్వరలోనే పరిష్కరిస్తామని ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు..’ అని చంద్రబాబు వివరించారు.

కరువు ప్రణాళికల ప్రజెంటేషన్
అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, రాధామోహన్‌సింగ్, జితేంద్రసింగ్, కేంద్ర ఉన్నతాధికారులు, రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమీక్షలో తక్షణ, శాశ్వత పరిష్కార చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కరువును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం రూపొందించిన స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.  ప్రధాన మంత్రి ఈ విధానాలను అభినందిస్తూ పంటల బీమా విషయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు రాష్ట్రంతో సంప్రదింపులు జరిపేలా ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నీతిఆయోగ్‌ను కోరారు.

1 comment:

  1. Really glad to read... this is very informative post. Keep on updating the post.Telugu gossips in Hyderabad

    ReplyDelete