ఏపీ నూతన రాజధానిలో పట్టపగలు అరాచకం
09-05-2016 19:02:14
విజయవాడ: బెజవాడలో రౌడీ గ్యాంగ్ రెచ్చిపోయింది. మామూళ్లు ఇవ్వలేదన్న కారణంతో ఓ కార్మికుడిపై కర్రలతో దాడి చేసింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై చెలరేగిపోయింది. అల్లరి మూకల దుశ్చర్య సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో వారి దురాగతం వెలుగుచూసింది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా విజయవాడలో మాత్రం రౌడీ గ్యాంగ్‌ల అరాచకాలు తగ్గడం లేదు.
వివరాల్లోకెళితే.. విజయవాడలోని మొగలిరాజపురం కొండపై బుల్లబ్బాయి అనే ముఠా కార్మికుడు ఇంటి మరమ్మత్తుకోసం ఇసుక తెప్పించుకున్నాడు. అతని ఇంటీ సమీపంలో ఇసుకను కుప్పగా పోశాడు అయితే ఆ ప్రాంతంలో ఇసుకపోస్తే తమకు మామూళ్లు ఇవ్వాలని సురేష్ అనే రౌడీ బెదిరించాడు. దీనికి బుల్లబ్బాయి నిరాకరించడంతో సురేష్ మరికొందరు రౌడీలను పిలిపించి బుల్లబ్బాయిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. అడ్డుకోబోయిన స్థానికులపైనా రౌడీ మూకలు దాడికి తెగబడ్డారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజీతో దర్యాప్తు చేస్తున్నారు.
సురేష్ అనే రౌడీ కొందరు రౌడీలను వెంటబెట్టుకుని నిత్యం అరాచకాలకు పాల్పడేవాడని స్థానికులు చెబుతున్నారు. రౌడీ గ్యాంగ్ చెప్పినట్లు చేయకపోతే దాడులు చేస్తారంటూ గ్రామస్థులు మీడియా ముందు వాపోతున్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారని..ఇక్కడ భయం భయంగా బ్రతుకుతున్నామని వారు చెబుతున్నారు.
స్థానిక మహిళలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. సాయంత్రం అయితే చాలు వారి ఆగడాలు మాటల్లో చెప్పలేమంటున్నారు. గంజాయి, మందుతాగి ఆడాళ్లు కొంగు పట్టుకుని లాగుతున్నారని మహిళలు చెబుతున్నారు. ఒక వేళ ఆ మహిళలు ఇంట్లో వారికి చెప్పారంటే అంతే ఇక వీధులంబడి తిప్పి కొడతారని వారు చెబుతున్నారు. మమ్మల్ని ఈ రౌడీ మూకల బాధలనుంచి తప్పించాలంటూ ప్రభుత్వానికి విన్నవించారు.
చాలా ఏళ్ల నుంచి ఇదే ఇబ్బంది ఎదుర్కొంటున్నామని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మాత్రం అరెస్ట్ చేస్తామని మాటల్లో చెబుతారు తప్ప చేతల్లో మాత్రం ఏం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రౌడీ మూకలు విజయవాడ పేరును అప్రతిష్టపాలు చేస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లరి మూకల ఆటలు కట్టించాలని పోలీసులకు విన్నవించారు.
No comments:
Post a Comment