Saturday 14 May 2016

కేంద్రంపై కాక

కేంద్రంపై కాక
15-05-2016 03:07:34

  • బీజేపీ మాట మార్చడంపై మంత్రులు, పార్టీల ఫైర్‌
  • సీఎం హోదా అడగలేదనడంపై మంత్రి యనమల మండిపాటు
  • అదంతా విష ప్రచారమని ధ్వజం.. ప్రధానికి సీఎం రాసిన లేఖలు విడుదల
  • రెండేళ్లలో ఇచ్చింది రూ.6,400 కోట్లే
  • 1.43 లక్షల కోట్ల ప్రాజెక్టులు ప్రైవేటువి
  • కేంద్ర పన్నుల్లో వాటా తగ్గింది: యనమల
  • హోదాపై రాజీపడేది లేదు: మంత్రి పల్లె
  • హోదా హక్కు.. బిచ్చం కాదు: సీపీఐ
  • బీజేపీ, టీడీపీ దాగుడుమూతలు: కాంగ్రెస్‌
  • హోదా ఇచ్చే పరిస్థితి లేదు: బీజేపీ
‘‘విభజన హామీల్లో భాగంగా గత రెండేళ్లలో రాష్ట్రానికి వచ్చినవి రూ.6,400 కోట్లు మాత్రమే. కొన్ని విషయాల్లో మిగతా రాష్ట్రాల కంటే మనకు తక్కువ నిధులే వచ్చాయి. కేంద్ర నిధులను దుర్వినియోగం చేయడం లేదు. వాటిపై శ్వేతపత్రం అక్కర్లేదు.’’ 
- యనమల 

హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పి.. ఇప్పుడు 14వ ఆర్థిక సంఘం అంగీకరించలేదని అనడంపై టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. హోదా ఇవ్వాల్సిందేనని రాష్ట్ర మంత్రులతో పాటు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు సైతం గట్టిగా డిమాండ్‌ చేస్తుండగా.. ప్రతిపక్షాలు ఇటు బీజేపీని, అటు టీడీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు హోదా కోరడం లేదన్న విమర్శలను ఆర్థిక మంత్రి యనమల గట్టిగా తిప్పికొట్టారు. కేంద్రానికి రాసిన ప్రతి లేఖలోనూ హోదా అంశాన్ని ఆయన గుర్తు చేస్తూనే వచ్చారని స్పష్టం చేశారు. లేఖ ప్రతులనూ విడుదల చేశారు. అదే సమయంలో రాష్ట్రానికి రావాల్సినన్ని నిధులు రావడం లేదంటూ లెక్కలను ఏకరవు పెట్టారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని ఆదివారం విజయవాడ రానున్నారు. ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగుతారు. అటునుంచి అటే మరో విమానంలో విజయవాడ చేరుకుంటారు. రాగానే తన మొదటి సమావేశం ప్రత్యేక హోదాపై నిర్వహిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో ప్రధానికి అందజేయాల్సిన లేఖ, ఆయనతో చర్చించాల్సిన అంశాలను ఈ సందర్భంగా విశ్లేషిస్తారు. ఈ నెల 17న ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం భేటీ కానున్న సంగతి తెలిసిందే. కరువుపై చర్చ తర్వాత రాషా్ట్రనికి ప్రత్యేక హోదా, విభజన చట్టం ప్రకారం రాషా్ట్రనికి రావాల్సిన నిధులు, సంస్ధలు తదితర అంశాలపై ప్రధానితో మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించారు.

No comments:

Post a Comment