Friday, 30 May 2014

కొండంత మంపు!

కొండంత మంపు!

Published at: 31-05-2014 04:52 AM
కొండరెడ్లకు జల'గండం'!
వేగంగా అంతరించిపోతున్న జాతి
ఇప్పుడు పోలవరంలోకి మునక
పూర్తిగా మునగనున్న కొండ అవాసాలు
ప్రాజె క్టు పూర్తయితే.. బతుకు ఛిద్రమే
సీమాంధ్ర, తెలంగాణ ఉద్యమాలకు సమానంగా ఊగిన భూమి. సమైక్య, విభజన హోరులో ఊయలలూగిన నేల. అటూ ఇటూ జరిగిన ఆత్మహత్యలకు కన్నీరు కార్చి..నిరాహార, నిరసన దీక్షలకు జైకొట్టిన ప్రాంతం. ఇప్పుడా ఉద్యమాలన్నీ చల్లబడ్డాయి. ఈ గోదావరి ఒడ్డు ప్రాంతాన్ని ఎవరికి వారు వదిలేసి పంపకాల వేటలో పడ్డారు. ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీలోని అమాయక ఆదివాసీలను 'వేట'గా చేసుకొని వాటాలు సరిచేసుకుంటుకొన్నారు. పోలవరం కోసం ఒకరు.. హైదరాబాద్ కోసం మరొకరు.. పట్టుబట్టిమరీ ఈ ప్రాంతాన్ని 'ముంపు'లోకి తోస్తున్నారు. మందు సరిపడితే రోగం కుదురుతుంది. లేదంటే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. కానీ, 'విభజన-పోలవరం' వ్యవహారంలో ప్రయోజనం సీమాంధ్ర, తెలంగాణలకు గాక, దాని సైడ్ ఎఫెక్ట్‌ని మాత్రం భద్రాచలం వాసులు అనుభవించాల్సి వస్తున్నది. ఉద్యమ సమయంలో ఖమ్మం జిల్లాను తెలంగాణ పటంలో చూపించిన నేతలు.. ఇప్పుడు దాన్ని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పటానికి బదలాయించేస్తున్నారు.
భద్రాచలం, మే 30 : ప్రకృతి ఆశీర్వదించిన పుత్రులు వాళ్లు. కొండలూ కోనలూ వారిని కంటికి రెప్పలా చూసుకుంటాయి. గలగలపారే సెలయేర్లను చూసి నడక నేర్చుకున్నారు. ఆకాశంలో రెక్కలు విప్పే పక్షుల్లా స్వేచ్ఛా జీవనం చేస్తూ.. అటవీ సంపదని చంటిబిడ్డలా కాపాడుకుంటున్నారు. అలాంటిది.. ఇప్పుడు వారికీ, ఆ వన సీమలకూ 'ముంపు' వచ్చింది. ఒకసారి అభివృద్ధి పేరుతో, మరోసారి అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో వీరిని కొండ దించేందుకు ప్రయత్నాలు జరగాయి. చెట్టేక్కిన బేతాళుడిని చెట్టు నుంచి విడిపించలేని విక్రమార్కుడిలా..కొండ దిగిన వీరికి అండని ఇవ్వడంలో ప్రతిసారీ అధికారులు విఫలమయ్యారు. ఇప్పుడు ఏకంగా 'ముంచేస్తున్నారు'.
కొండరెడ్లు..ఓ ఆదిమ తెగ. అంతేకాదు..అత్యంత వేగంగా అంతరించిపోతున్న జాతుల్లో వీరూ ఒకరు. కొండలే వీరి జీవన క్షేత్రం. ఈ కారణంగానే ఈ తెగకు కొండరెడ్లనే పేరు వచ్చింది. కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం, వేలేరుపాడు మండలాల్లోని 66 గ్రామాల్లో మొత్తం పదివేలమంది కొండరెడ్ల జనాభా ఉంది. ఇప్పుడీ ప్రాంతమంతా పోలవరం కింద మునిగిపోనుంది. వీరి జీవన శైలికి తగినట్టే భాష,ఆహార్యం కూడా వేరు. పురుషులు గోచీతో నడుముకు చాకత్తి ధరిస్తారు. విల్లంబులు వారి శరీరంలో భాగంలా కలిసిపోతాయి. కొండరెడ్లు సంప్రదాయప్రియులు, పర్యావరణ ప్రియులు. సహజ జల సంపద పుష్కలంగా ఉన్నా.. నీటిని ఎంతమాత్రం వృథాపరచరు. గొంతు తడుపుకోడానికి, పంటలు పండించడానికే వాటిని వినియోగిస్తారు. వీరు బాహ్య ప్రపంచంతో అస్సలు కలవరు. తాము కొండ దిగి మైదానంలోకి అడుగుపెట్టడం చాలా అరుదుగా జరుగుతుంది. వీరి ప్రధాన జీవనాధారం వ్యవసాయం. వరి, జొన్న, సజ్జ పండిస్తారు. ఇప్పుడు వీరిలో ఎక్కువమంది అటవీ ఉత్పత్తుల సేకరిస్తూనో, కూలీలుగానో జీవిస్తున్నారు. అటవీ జంతువులను వేటాడటం, మద్యపానం చేయడం వీరికి ఇష్టమైన వ్యాపకాలు. నిజానికి, వీరిని కిందికి దించడానికి గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. అవి కొంతవరకు ఫలించాయి కూడా. అయితే, హామీలంత ఘనంగా పనులు లేకపోవడంతో వీరిలో చాలామంది తిరగి కొండెక్కేశారు. ఇది వారిలో మైదానాల పట్ల ప్రతికూల భావనని కలిగించింది. ఈ నేపథ్యంలో కూనవరం, చింతూరు మండలాల్లోని 14 గ్రామాలకు చెందిన కొండరెడ్లు.. గుట్ట దిగడమే లేదు. రోగాలు,రొష్టులు వస్తే ఆకు పసరు వైద్యం చేసుకొంటున్నారు తప్ప మైదాన ప్రాంత సాయం ఆశించడం లేదు. నాగరికులను నమ్మేది లేదని కొండరెడ్ల నాయకులు తేల్చిచెబుతున్నారు. "గతంలో అభివృద్ధి చేస్తామని కొండల మీద నుంచి కిందకు దించారు. కానీ, మాటలంత తియ్యగా పనులు లేవు'' అని వారు ఆరోపిస్తున్నారు.
ముంపు ఇలా..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం సాధారణ రోజుల్లోనే 43 అడుగులు ఉంటుంది. అది మొదటి ప్రమాద హెచ్చరిక. 365 రోజులూ ఈ ప్రాంతంలో ఇదే నీటిమట్టం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఇది మరింతగా పెరిగి తుది ప్రమాద హెచ్చరిక 53 అడుగులు చేరితే, కొండలు, గుట్టల చుట్టూ పెద్దఎత్తున నీరు చేరుతుంది. చుట్టూ నీరు.. మధ్యలో కొండరెడ్ల ఆవాసాలతో చిన్నసైజు ద్వీపకల్పాన్ని ఈ ప్రాంతాన్ని తలపిస్తుంది.
మరోసారీ..
ఏజెన్సీ ప్రాంత గిరిజనుల సంక్షేమానికి ఏర్పాటు చేసిన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) కార్యకలాపాలు 29 మండలాలతో పాటు రెండు మాడా మండలాల్లో విస్తరించింది. ఇందులో గ్రామాలు 904. కాగా, టీఎస్పీ (గిరిజన ఉప ప్రణాళిక) పరిధిలో 12,175 చదరపు కిలోమీటర్ల భూభాగముంది. ఇక మాడా (మోడిఫైడ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) మండలాలు మూడు కాగా, గ్రామాలు: 14. పీటీజీ (ప్రిలిమినరీ ట్రైబల్ గ్రూప్) మండలాలు ఆరు ఉండగా, గ్రామాలు 66 ఉన్నాయి. కాగా, వరసగా నాలుగో సారి ఈ సంస్థ స్థానచలనానికి గురవుతున్నట్టు సమాచారం. తొలుత ఖమ్మం కేంద్రంగా పనిచేసిన ఈ సంస్థని, తరువాత పాల్వాంచకు, అక్కడ నుంచి భద్రాచలానికి మా ర్చారు. ప్రస్తుతం పోలవరం ముంపు ప్రాంతాల్లోనే ప్రధానంగా పనిచేస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ ముంపు ప్రాంతాలతో పాటు.. ఐటీడీఏ కూడా సీమాంధ్ర ప్రాం తానికి తరతిపోతుందని సమాచారం.
ఖమ్మం జిల్లాలో గిరిజన జనాభా : 6.83 లక్షలు
గిరిజన ఉప ప్రణాళిక ప్రాంతంలో : 5.61 లక్షలు
కోయ : 3.14 లక్షలు
కొండరెడ్లు : 0.10
బంజారాలు : 3.29
ఎరకలు : 0.20
యానాది : 0.007
ఇతరులు : 0.003

No comments:

Post a Comment