Wednesday, 28 May 2014

మొదటిసారి గెలవని పార్టీకి మరుగడ ప్రశ్నార్థకమే!

మొదటిసారి గెలవని పార్టీకి మరుగడ ప్రశ్నార్థకమే!

Published at: 28-05-2014 05:37 AM
హైదరాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): మంగళవారం ఇక్కడ మొదలైన మహానాడు సమావేశాల్లో తొలి రోజు ప్రసంగంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షు డు చంద్రబాబు నాయుడు పంచ్ డైలాగులతో సభికులను ఆకట్టుకొన్నారు. మచ్చుకు కొన్ని...
- పార్టీ పెట్టిన తర్వాత మొదటి ఎన్నికల్లో అధికారంలోకి రాలేని పార్టీ మనుగడ సాధించలేదు. ప్రజారాజ్యం, ఆప్ పార్టీలే దీనికి ఉదాహరణ. మిగిలిన పార్టీల గతి కూడా ఇంతే.
- పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడమే కాకుండా సుస్థిర పాలన ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావుకే దక్కింది. ఆయనను కాపీ కొట్టాలని ప్రయత్నించి చాలా మంది చరిత్రలో కలిసిపోయారు. ప్రజల కోసం కాకుండా స్వార్ధంతో పెడితే ఇదే గతి.
- 1984లో ఎన్టీఆర్‌ను అక్రమంగా పదవీచ్యుతుడిని చేయడం మొదలుకొని ఇటీవలి రాష్ట్ర విభజన వరకూ కాంగ్రెస్ పార్టీ టీడీపీపై అనేక కుట్రలు చేస్తూనే వచ్చింది. కుట్రలు పన్నిన పార్టీ భూస్థాపితం అయింది. మనకేమీ కాలేదు.
- ఎన్టీ రామారావుతో...టీడీపీతో పెట్టుకొన్న నాటి నుంచే కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది. జాతీయ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయి ఈసారి ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా సాధించలేని దుర్గతికి దిగజారింది. ఇక ఆ పార్టీ మనుగడ సాధించడం కల్ల.
- గోదావరి నదిపై నిర్మిస్తున్న బాబ్లీ తదితర అక్రమ ప్రాజెక్టులు ఆపకపోతే ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందని మేం పోరాడాం. అవి కేవలం మంచినీటి సరఫరాకు ఉద్దేశించిన చిన్న చిన్న ప్రాజెక్టులని టీఆర్ఎస్ పార్టీ అప్పట్లో మహారాష్ట్రను వెనకేసుకొని వచ్చిం ది. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఆ ప్రాజెక్టులపై మహారాష్ట్రతో పోరాడగలుగుతుంది?
- ఇంకా ఇంతవరకూ రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి కాలేదు. ప్రభుత్వ ఏర్పాటు జరగలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన కాంగ్రెస్ నేతలు సిగ్గు లేకుండా హామీల అమలు గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడు మాట్లాడాలో తెలియని స్థితిలో వారు పడిపోయారు.
- కాంగ్రెస్ హయాంలో ఎర్ర చందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. అడవులకు అడవులే ఖాళీ చేసి చివరకు వెంకటేశ్వర స్వామి చుట్టూ ఉన్న అటవీ సంపదను కూడా దోచుకొని పోయారు. వెంకన్నకు కోపం వచ్చి కన్ను తెరిచారు. అందుకే కాంగ్రెస్ భూస్థాపితం అయ్యి టీడీపీ గెలిచింది.
- రాష్ట్ర విభజన చేసిన తీరు సీమాంధ్ర ప్రజల మనసులను తీవ్రంగా గాయపర్చింది. అక్కడ ఆవేశం హద్దులు దాటకూడదని నేను బాధ్యత తీసుకొ న్నాను. హైదరాబాద్‌కు ధీటైన నగరాలు ఒకటి కాదు...మూడు నాలుగు నిర్మిస్తానని భరోసా ఇచ్చాను. వెన్ను తట్టి నడిపించాను. దానివల్ల అభద్రత పోయి ఆశ వచ్చింది. ఆ ఆశను చిగురింపచేసిన ఘనత టీడీపీదే.
- ఎంత మంది నాయకులు పోయినా...ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాకు కొండంత అండగా నిలిచిన ఘనత కార్యకర్తలదే. వారు నాకు కుడి భుజం మాదిరిగా నిలబడ్డారు. శక్తిని ఇచ్చారు. ఇవాళ కొండంత భారాన్ని నేను ఎత్తుకొని నిలబడటానికి వారు ఇచ్చిన స్ఫూర్తే కారణం.
- హైదరాబాద్ వంటి రాజధాని నగరం నిర్మించాలంటే రూ. నాలుగైదు లక్షల కోట్లు కావాలి. సీమాంధ్ర రాష్ట్రానికి ఆదాయం లేదు. జీతాలు చెల్లించా లి. వడ్డీలు కట్టాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. రాజధాని కట్టాలి. ఇవన్నీ చేయడానికి ఆ రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందన్న ఆలోచన కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా విభజన చేసింది. అప్పులు జనాభా ప్రాతిపదికన పంచి ఆదాయం మాత్రం ఏ ప్రాంతంలో వచ్చేది అక్కడే ఉంచేశారు.
- నేను పెద్ద రాష్ట్రానికి తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను. చిన్న రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉందని కొందరు నన్ను అడిగారు. రాష్ట్రం చిన్నదైనా పెద్దదైనా వారి ఇబ్బందులు తీర్చాలి. నన్ను ఆదరించిన ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారి కోసం నిలబడడం నా బాధ్యత. నేను ఢిల్లీ వెళ్తే అక్కడివారు నన్ను గౌరవించడానికి ఇక్కడి ప్రజలు కారణం. వారి రుణం తీర్చుకోకుండా ఎలా ఉండగలను?

No comments:

Post a Comment