Wednesday 21 May 2014

విజయవాడ గుంటూరు మధ్య చకచకా క్యాంప్!

విజయవాడ గుంటూరు మధ్య చకచకా క్యాంప్!

Published at: 22-05-2014 04:02 AM
రెడీమేడ్ భవనాల కోసం కసరత్తు.. ఎల్ అండ్ టీతో సంప్రదింపులు?
తాత్కాలిక సచివాలయంగా ఏపీఎస్పీ బెటాలియన్!.. డీజీపీ సహా అధికార యంత్రాంగ మంతా అక్కడే?
(ఆంధ్రజ్యోతి - గుంటూరు) నాగార్జున వర్సిటీ ప్రాంగణంలో నవ్యాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి తాత్కాలిక క్యాంపు కార్యాలయం.. అక్కడికి ఏడు కిలోమీటర్ల దూరంలో మంగళగిరి సమీపంలోని ఏపీఎస్పీ బెటాలియన్‌లో తాత్కాలిక సచివాలయం.. ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ శరవేగంతో సాగిపోతున్నాయి. ఈ మేరకు విజయవాడ గుంటూరు మధ్యలో, నాగార్జున యూనివర్సిటీ పరిధిలో రెండు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ (రెడీమేడ్) భవనాలను కట్టాల్సిందిగా అధికార వర్గాలు ఎల్ అండ్ టీ సంస్థను కోరినట్టు సమాచారం. ఉమ్మడి రాజధానిగా నిర్ణయించిన హైదరాబాద్‌లో పదేళ్లపాటు కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ సీమాంధ్ర ప్రాంతంలోనే తాత్కాలిక భవనాలను ఏర్పాటు చేసుకుని పరిపాలన కొనసాగించాలని, తర్వాత నెమ్మదిగా గ్లోబల్ టెండర్లు పిలిచి సమర్థమైన సంస్థకు రాజధాని నిర్మాణం అప్పగించాలని ఎన్నికల ముందే టీడీపీ, వైసీపీ నేతలు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నట్టు సమాచారం. ఇక.. చంద్రబాబు తాత్కాలిక క్యాంప్ కార్యాలయ ఏర్పాటు నేపథ్యంలో వర్సిటీ పరిధిలో సందడి నెలకొంది. వారంలో వీలైనన్ని రోజులు ఇక్కడే ఉండి పరిపాలన కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంతో ఆయనకు అందుబాటులో ఉండేందుకు ఉన్నతాధికారులందరికీ కూడా మంగళగిరి సమీపంలోని ఏపీఎస్పీ బెటాలియన్‌లో తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం.
తన క్యాంప్ కార్యాలయం ఏర్పాటు మూలంగా వర్సిటీలో విద్యాబోధనకు ఎటువంటి అవరోధం ఉండకుండా చూడాలని చంద్రబాబు ఉన్నతాధికాలకు సూచించినట్లు తెలిసింది. దీంతో.. కేవలం సీఎం బస మాత్రమే అక్కడ ఉండేందుకు అక్కడ ఏర్పాట్లు చేయబోతున్నారు. మిగతా కార్యకలాపాలన్నిటినీ ఆయన ఏపీఎస్పీ బెటాలియన్‌లోనే నిర్వహిస్తారు. ఒకరకంగా చెప్పాలంటే.. ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణాన్ని తాత్కాలిక సెక్రటేరియేట్‌గా పరిగణలోకి తీసుకోనున్నారు. ఈ ఏర్పాట్లలో భాగంగా వర్సిటీ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు ఉన్నతాధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సీఎం బస చేసే వర్సిటీ ప్రాంగణం నుంచి ఏపీఎస్పీ బెటాలియన్ వరకూ.. సుమారు 7 కిలోమీటర్ల పరిధిలో ఈ భద్రతా వలయం ఉంటుంది. యూనివర్సిటీ పెదకాకాని మండలం నంబూరు గ్రామ పరిధిలో ఉంది. బెటాలియన్ ప్రాంగణం మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామం పరిధిలో ఉంది. ఈ రెండు ప్రదేశాలూ ప్రస్తుతం మంగళగిరి డీఎస్పీ పరిధిలో ఉన్నాయి. వర్సిటీ నుంచి బెటాలియన్‌కు వెళ్లే మార్గంలో కాజ, చినకాకాని, ఆత్మకూరు గ్రామాలు ఉన్నాయి. కాగా.. భద్రతా ఏర్పాట్ల ప్రక్రియంతా ప్రస్తుతానికి హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి అధికారుల పరిధిలో జరుగుతున్నది.
ఉన్నతాధికారులు రెండు రోజుల్లో దీనిపై ఒక అవగాహనకు వచ్చిన తరువాత జిల్లా స్థాయి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ నేరుగా జిల్లా స్థాయి అధికారులకు ఎటువంటి ఆదేశాలూ అందనప్పటికీ తమకు ఆదేశాలు అందేలోపు ఆ ప్రదేశాలపై ఒక అవగాహన ఉంటే మంచిదని భావిస్తూ అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి ఇప్పటికే ఏపీఎస్పీ బెటాలియన్‌కు వెళ్లి పరిశీలించి వచ్చారు. నిర్ణయం ఖాయమయ్యే పక్షంలో బెటాలియన్ ప్రాంగణం అధికారుల కొలువుకు అనుకూలమైన ప్రదేశమేననే భావనలో జిల్లా అధికారులు ఉన్నారు. మరోవైపు.. మంత్రులు కొలువుదీరేందుకు అవసరమైన తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటు పైనా అధికారులు దృష్టి సారించారు. నాగార్జున వర్సిటీకి సమీపంలోనే రెయిన్‌ట్రీ పార్క్ పేరుతో ఓ ్రపైవేటు కంపెనీ పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల భవనాలు నిర్మించింది. ప్రస్తుతానికి వీటిని అద్దెకు తీసుకొని తాత్కాలికంగా మంత్రుల కార్యాలయాలుగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

No comments:

Post a Comment