Friday, 30 May 2014

పెద్దలు' తారుమారు!

పెద్దలు' తారుమారు!

Published at: 31-05-2014 04:33 AM
కేకే ఆంధ్రకు.. కేవీపీ తెలంగాణకు!..
సీఎం రమేశ్ తెలంగాణకు
దేవేందర్ ఆంధ్రక.. రాజ్యసభ లాటరీ విచిత్రాలు
నేదురుమల్లి సీటు ఆంధ్ర కోటాకే..
ఈసారి టీడీపీ ఖాతాలో మరొకటి
రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ నేత కేకే ఆంధ్రప్రదేశ్ నుంచి పదవీ విరమణ చేస్తారు! సీమాంధ్రకు చెందిన కేవీపీ తన రాజ్యసభ సభ్యత్వానికి తెలంగాణ నుంచి పదవీ విరమణ చేస్తారు! పార్లమెంటులో సమైక్యాంధ్ర ఉద్యమం చేసిన సీఎం రమేశ్ తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తారు! తెలంగాణ బిడ్డను అని చెప్పుకొన్న రేణుకా చౌదరి సీమాంధ్రకు ప్రాతినిధ్యం వహిస్తారు! రాజ్యసభ లాటరీలో విచిత్రాలివి!
ఆంధ్రప్రదేశ్...
నేదురుమల్లి, జైరాం రమేశ్, చిరంజీవి, సుజనా చౌదరి, రేణుకా చౌదరి, దేవేందర్‌గౌడ్, ఎంఏ ఖాన్, కేకే, టి.సుబ్బిరామిరెడ్డి, జేడీ శీలం, తోట సీతారామలక్ష్మి
తెలంగాణ...
కేవీపీ రామచంద్రరావు, సీఎం రమేశ్, గరికపాటి మోహనరావు, వి.హనుమంతరావు, రాపోలు ఆనంద్ భాస్కర్, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, గుండు సుధారాణి
న్యూఢిల్లీ, మే 30 : ఊహించినట్లే.. రాజ్యసభ లాటరీలో నేతలు తారుమారు అయ్యారు! రాజ్యసభలో రాష్ట్రానికి చెందిన సభ్యుల్లో ఎవరు ఏ రాష్ట్రం నుంచి పదవీ విరమణ చేస్తారో తేలిపోయింది. తెలంగాణకు చెందిన కేకే, దేవేందర్ గౌడ్, ఎంఏ ఖాన్, రేణుకా చౌదరి ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేవీపీ రామచందర్ రావు, సీఎం రమేశ్ తెలంగాణ నుంచి పదవీ విరమణ చేస్తారని రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ శుక్రవారం లాటరీ ప్రక్రియ ద్వారా తేల్చేశారు. దాని ప్రకారం.. 11 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి; ఏడుగురు తెలంగాణ నుంచి పదవీ విరమణ చేయాలని అన్సారీ నిర్ణయించారు. దివంగత ఎంపీ నేదురుమల్లి జనార్దన రెడ్డితోపాటు జైరాం రమేశ్, చిరంజీవి, సుజనా చౌదరి, రేణుకా చౌదరి, దేవేందర్ గౌడ్, ఎంఏ ఖాన్, కే.కేశవరావు, టి. సుబ్బిరామిరెడ్డి, జేడీ శీలం, తోట సీతారామలక్ష్మి ఆంధ్రప్రదేశ్‌కు; సీఎం రమేశ్, గరికిపాటి మోహన్ రావు, కేవీపీ రామచందర్ రావు, వి.హనుమంతరావు, రాపోలు ఆనందభాస్కర్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, గుండు సుధారాణి తెలంగాణకు చెందుతారు. నేదురుమల్లి ఆంధ్రప్రదేశ్ కోటాకే వస్తారని కూడా తేలిపోవడంతో ఇప్పుడు ఈ సీటు టీడీపీకి దక్కడం ఖాయమైంది. నేదురుమల్లి స్థానానికి ఎన్నికల కమిషన్ ఇప్పటికే జూన్ 19న ఉప ఎన్నిక ప్రకటించిన విషయం తెలిసిందే.
నేదురుమల్లి పదవీ కాలం 2016 జూన్ 21 వరకు ఉన్న నేపథ్యంలో, ఆయన స్థానంలో ఎంపికయ్యే వ్యక్తి అప్పటి వరకు పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం రాజ్యసభలో రాష్ట్ర ఎంపీల బలం 18 కాగా.. నేదురుమల్లి మరణంతో అది కాస్తా 17కు పడిపోయింది. వీరిలో టీడీపీ బలం ఆరు కాగా జూన్ 21 తర్వాత ఇది ఏడుకు పెరుగుతుంది. ఇక, రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు ఏయే రాష్ట్రానికి చెందుతారనే విషయాన్ని నిర్ణయించే లాటరీ పద్ధతిని ఎంపీలు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అయినా.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్ర విభజన జరిగేలోపు ఎవరు ఏ రాష్ట్రం నుంచి పదవీ విరమణ చేస్తారో తేల్చాల్సి ఉండడంతో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ శుక్రవారం సాయంత్రం లాటరీ నిర్వహించారు. ఊహించిన విధంగానే కొందరు తెలంగాణ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, కొందరు ఆంధ్రప్రదేశ్ సభ్యులు తెలంగాణ రాష్ట్రం నుంచి పదవీ విర మణ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీని ప్రకారం.. తెలుగుదేశంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీఎం రమేశ్ తెలంగాణ నుంచి, తెలంగాణకు చెందిన దేవేందర్‌గౌడ్ ఆంధ్రప్రదేశ్ నుంచీ పదవీ విరమణ చేస్తారు. ఇక తెలుగుదేశంలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న గుండు సుధారాణి, గరికిపాటి మోహన రావు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుజనాచౌదరి తమ తమ రాష్ట్రాల నుంచే పదవీ విరమణ చేస్తారు.
కాగా, తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్రం కోసం పోరాడిన టీఆర్ఎస్ సభ్యుడు కె.కేశవరావు, తెలంగాణ బిడ్డగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి, అదే పార్టీకి చెందిన మరో ఎంపీ ఎంఏ ఖాన్ ఆంధ్రప్రదేశ్‌కు చెందుతారని, రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచందర్ రావు తెలంగాణకు చెందుతారని అన్సారీ లాటరీ ద్వారా నిర్ణయించారు. రాజ్యసభలో టీఆర్ఎస్‌కు కేకే ఏకైక సభ్యుడు కాగా ఆయన తన పార్టీ ఉనికిలో కూడా లేని ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. మిగిలిన వారిలో కాంగ్రెస్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ సభ్యులు చిరంజీవి, జైరాం రమేశ్, టి.సుబ్బిరామిరెడ్డి, జేడీ శీలం, తెలంగాణ సభ్యులు ఆనంద్ భాస్కర్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తమ తమ రాష్ట్రాలకే ప్రాతినిధ్యం వహిస్తారు. హమీద్ అన్సారీ లాటరీ నిర్వహిస్తున్నప్పుడు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రకాశ్ జవదేకర్, కే.కేశవరావు, సీఎం రమేశ్, సుబ్బిరామిరెడ్డి, ఎంఏ ఖాన్, సుజనా చౌదరి, గుండు సుధారాణి, గరికపాటి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
చట్ట సవరణ ద్వారా రాష్ట్రం మార్చుకోవచ్చు: జవదేకర్
ఎంపీలు తమ రాష్ట్రాలను పరస్పరం మార్చుకునే వీలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించే విషయం పరిశీలిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. కొంతమంది సభ్యులు తమ రాష్ట్రాలను పరస్పరం మార్చుకునేందుకు ఆసక్తి ప్రదర్శించారని, అందరి ఆకాంక్షలకు అనుగుణంగానే సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గతంలో బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయినప్పుడు కూడా ఇలాంటి సమస్య వచ్చిందని, అప్పట్లో చట్టంలో సవరణ చేశామని గుర్తు చేశారు. తమకు కేటాయించిన రాష్ట్రంతో నిమిత్తం లేకుండా తమ ప్రాంతాల్లో ఎంపీ లాడ్స్ నిధులు ఖర్చు పెట్టుకునేందుకు, నోడల్ జిల్లాను నిర్ణయించుకునేందుకు ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా వీలు కల్పించవచ్చునని చెప్పారు. కాగా తాను, దేవేందర్ గౌడ్ పరస్పరం తమ రాష్ట్రాలను మార్చుకుంటామని సీఎం రమేశ్ చెప్పారు.
ఉన్న ఒక్కడినీ సీమాంధ్రకా?
హైదరాబాద్, మే 30 : టీఆర్ఎస్‌కి ఉన్న ఒకే ఒక్క రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు లాటరీ ప్రక్రియలో సీమాంధ్రకు పోవడంతో టీఆర్ఎస్ వర్గాలు కంగుతిన్నాయి. ఇటీవల రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో తమకు సరిపోను ఎమ్మెల్యేల బలం లేకపోయినా టీఆర్ఎస్ నాయకత్వం కేకేను బరిలో నిలిపింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అదనపు అభ్యర్థిని పోటీకి దించకపోవటంతో ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో కేకే టీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉన్న ఒక్క సభ్యుడిని సీమాంధ్రకు కేటాయించటాన్ని టీఆర్ఎస్ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆయన రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి టీఆర్ఎస్ తరఫున ప్రాతినిధ్యం వహించాల్సి ఉండటం కొంత ఇబ్బందికరమని ఆవేదన చెందుతున్నాయి.

No comments:

Post a Comment