Wednesday, 28 May 2014

పోలవరంపై ఆర్డినెన్స్

పోలవరంపై ఆర్డినెన్స్

Published at: 29-05-2014 03:20 AM
మంగళవారమే మోదీ కేబినెట్ ఆమోదం.. మరుసటి రోజు రాష్ట్రపతి సంతకం
ఆ 7 మండలాలూ సీమాంధ్రకే
కొన్ని గ్రామాలకు మినహాయింపు
భద్రాచలం పట్టణం తెలంగాణలోనే
ఆర్డినెన్స్‌పై బాబుకు గుర్తు చేసిన జైరాం
వెంటనే రంగంలోకి అశోక్ గజపతి
ప్రణబ్ వద్దకు వెళ్లిన వెంకయ్య
న్యూఢిల్లీ, మే 28 : పోలవరంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న ఏడు ముంపు ప్రభావిత మండలాలను... సీమాంధ్రలో కలుపుతూ ఆర్డినెన్స్ వెలువడింది. యూపీఏ ప్రభుత్వపు 'చివరి' రోజుల్లో నిలిచిపోయిన ఆర్డినెన్స్... ప్రధానిగా నరేంద్ర మోదీ అధికార పగ్గాలు చేపట్టిన మూడో రోజునే జారీ అయ్యింది. ఏడు మండలాల్లోని కొన్ని రెవెన్యూ గ్రామాలు మినహా మిగిలిన గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేస్తూ రాష్టపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం మధ్యాహ్నం ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 3కు సవరణ చేశారు. నిర్వాసితులకు సహాయ, పునరావాస కార్యక్రమాలు సాఫీగా సాగేందుకు, పరిపాలనా సౌలభ్యం కోసం ఏడు మండలాలను సీమాంధ్రలో కలపాలని విభజన సమయంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పునర్వ్యవస్థీకరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ దీనిపై హామీ ఇచ్చారు. అయితే... మరికొన్ని రోజుల్లో దిగిపోతున్న ప్రభుత్వం ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకోవడం తగదంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ ఆర్డినెన్స్‌పై ఆమోద ముద్ర వేసేందుకు నిరాకరించారు. జూన్ 2న రాష్ట్ర విభజన అమలులోకి వస్తున్న నేపథ్యంలో... నరేంద్ర మోదీ సర్కార్ దీనిపై సత్వరం నిర్ణయం తీసుకుంది.
నిజానికి... ఈ విషయంపై మాజీ మంత్రి జైరాం రమేశ్ ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే సీఎం చంద్రబాబును అప్రమత్తం చేసినట్లు తెలిసింది. పోలవరంపై జూన్ 2లోపు ఆర్డినెన్స్ జారీ చేయకపోతే రాష్ట్ర విభజన తర్వాత సమస్యలు ఏర్పడతాయని ఇటీవల ఢిల్లీలో చంద్రబాబును కలిసి తెలిపారు. దీనిపై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడాల్సిందిగా పౌరవిమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావులను చంద్రబాబు ఆదేశించారు. వారు రాజ్‌నాథ్‌ను కలిసి వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాల్సిన అవసరాన్ని వివరించారు. మరోవైపు సీమాంధ్ర ప్రయోజనాలకోసం రాజ్యసభలో గట్టిగా పట్టుపట్టిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పోలవరంపై ఆర్డినెన్స్ జారీ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. రాజ్‌నాథ్‌తో మాట్లాడారు. ఆర్డినెన్స్ జారీకి సమయం సరిపోదంటూ హోంశాఖ అదనపు కార్యదర్శి, తెలంగాణకు కాబోయే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తదితరులు పేర్కొన్నప్పటికీ... వెంకయ్య తన పట్టు వీడలేదు. చివరకు ఈ ఆర్డినెన్స్‌ను మంగళవారం కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకొచ్చారు. కేబినెట్ సమావేశంలో వెంకయ్యే చొరవ తీసుకుని పోలవరం పూర్వాపరాలను, రాజ్యసభలో జరిగిన చర్చను, మన్మోహన్ చేసిన ప్రకటనను గుర్తు చేశారు. ఆర్డినెన్స్‌పై కేబినెట్ ఆమోదముద్ర పొందారు. దీనిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. అయితే... ఈ విషయాలేవీ మీడియాకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బుధవారం ఉదయం వెంకయ్యనాయుడు రాష్ట్రపతిని స్వ యంగా కలుసుకుని... ఆర్డినెన్స్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనా లు ముడిపడి ఉన్నాయని, దానిపై సంతకం చేయాలని అభ్యర్థించారు. దీంతో బుధవారం మధ్యాహ్నం ప్రణబ్ ముఖర్జీ ఆర్డినెన్స్‌పై సంతకం చేశారు. ఈ పరిణామాలను రాజీవ్ శర్మ ఎప్పటికప్పుడు కేసీఆర్‌కు తెలియజేసినట్లు సమాచారం.
సీమాంధ్రలో కలిసే మండలాలివే..
పోలవరంపై ఆర్డినెన్స్ ద్వారా... కొన్ని గ్రామాలు మినహా కుకునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు, చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, భద్రాచలం మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేస్తారు. భద్రాచలం రెవెన్యూ గ్రామం తెలంగాణలోనే ఉంటుంది. అలాగే... భద్రాచలానికి దారితీసే జాతీయ రహదారి-221 మార్గంలో ఉన్న బూర్గంపాడు మండలంలోని పినపాక, మొరంపల్లిబంజరు, బూర్గపాడు, నగినేనిప్రోలు, కృష్ణసాగర్, టేకుల, సరపాక, ఇరివెండి, మొతెపట్టినగర్, నక్రిపేట, సోంపల్లి గ్రామాలు కూడా తెలంగాణలోనే ఉంటాయి. తొలు త రాష్ట్ర ప్రభుత్వ జీవో 111లో గుర్తించిన దాదాపు 130 ముంపు గ్రామాలను మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించాలనుకున్నారు. ఆ తర్వాత పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ముంపు గ్రామాలున్న మండలాలను కూడా చేర్చాలని నిర్ణయించారు.
ఆర్డినెన్స్ ఘనత మాదే
అప్పుడు కేసీఆర్ ఏమీ మాట్లాడలేదు: జైరాం
పోలవరంపై ఎన్డీయే ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసినప్పటికీ... ఆ ఘనత మాత్రం యూపీయే ప్రభుత్వానికే దక్కుతుందని కేంద్ర మాజీ మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాంరమేశ్ 'ఆంధ్రజ్యోతి'తో అన్నారు. ఆర్డినెన్స్ జారీ చేయాలని గత కేబినెట్ నిర్ణయం తీసుకుందని... అయితే దాన్ని కొత్త ప్రభుత్వానికే వదిలేయాలన్న రాష్ట్రపతి సూచన మేరకు పెండింగ్‌లో ఉందన్నారు. రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ ఇచ్చిన హామీ మేరకే ఈ ఆర్డినెన్స్ జారీ అయిందన్నారు. అప్పట్లో కేసీఆర్ దీనిపై ఏమీ మాట్లాడలేదని కూడా గుర్తు చేశారు. సహాయ పునరావాస కార్యక్రమాలు పూర్తయ్యాకే ప్రాజెక్టును చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లాలో దాదాపు 50వేల కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందని చెప్పారు. కేంద్రం సహాయ పునరావాస ప్యాకేజీని సమర్థవంతంగా పూర్తి చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సీమాంధ్రలో విలీనం కానున్న మండలాల వివరాలు(గణాంకాలు సుమారుగా)
వ.నెం. మండలం......... గ్రామాలు.......... గ్రామ పంచాయితీలు........... జనాభా............... విస్తీర్ణం (చ.కిమీ)
1. భద్రాచలం(పట్టణం మినహా) 117.... 21........... 35,000........... 350
2. కూనవరం 65 16 24,597 204
3. చింతూరు 108 15 36,763 955
4. వరరామచంద్రపురం 73 12 23,411 475
5. వేలూర్‌పాడు 65 10 21,474 415
6. కుక్కనూరు 59 12 25,759 271
7. బూర్గంపాడు 37 09 40,000 250
(12 గ్రామాలు మినహా)
మొత్తం 7 మండలాలు 524 95 2,07,004 2920

No comments:

Post a Comment