ప్రభుత్వం వద్దే ఉంచేస్తే 10 శాతం వడ్డీ
22-06-2016 01:51:33మాఫీ సొమ్ముపై రైతులకు కొత్త ఆఫర్
నేటి నుంచి రైతులకు సర్టిఫికెట్ల జారీ
హైదరాబాద్, జూన్ 21(ఆంధ్రజ్యోతి): రుణ మాఫీ పొందనున్న రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఆఫర్ ఇచ్చింది. రెండో విడత మాఫీ సొమ్మును ప్రభుత్వం వద్దే ఉంచేస్తే దానికి ఏడాదికి పది శాతం వడ్డీ ఇవ్వాలని నిర్ణయించింది. రుణ మాఫీకి అర్హులైన రైతులకు బుధవారం నుంచి రెండో విడత సర్టిఫికెట్లను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ఒంగోలులో లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. జన ్మభూమి కమిటీలు, ప్రజా ప్రతినిధుల ద్వారా ఒక వారంలో ఈ సర్టిఫికెట్లను రాష్ట్రవ్యాప్తంగా రైతులందరికీ పంపిణీ చేస్తారు. రాష్ట్రంలో మొత్తం 55 లక్షల రుణ ఖాతాలకు మాఫీ వర్తింపచేయాలని గతంలోనే నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.50వేల లోపు రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో... ఇరవై మూడున్నర లక్షల ఖాతాలకు ఒకేసారి పూర్తిగా రుణ ఉపశమనం కలిగింది. మిగిలిన ముప్పై ఒకటిన్నర లక్షల ఖాతాలకు ఇప్పుడు ఈ సర్టిఫికెట్లు అందచేస్తున్నారు. ఆ రైతుకు సంబంధించి ఇంకా ఎంత రుణం మాఫీ కావాల్సి ఉంది, ఇప్పుడు ఎంత అవుతోందన్నది దీనిపై ముద్రించారు. ఆ రైతు రుణం ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలు, ఆ రైతు ఆధార్ నెంబర్ కూడా దానిపై ముద్రించారు. ఈ సర్టిఫికెట్లను రైతులు ఆయా బ్యాంకులకు తీసుకెళ్లి అందచేస్తే అక్కడి అధికారులు ఆ వివరాలు నమోదు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ రైతు సాధికార సంస్థకు పంపిస్తారు. వివరాలు వచ్చిన రెండు మూడు రోజుల్లో సంబంధిత బ్యాంక్ శాఖకు ప్రభుత్వం ఆ డబ్బు పంపిస్తుంది. ఆ విషయాన్ని రైతులకు ఒక ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియచేస్తారు. దీనివల్ల రెండో విడత రుణ మాఫీ మొత్తం రైతు ఖాతాలో జమ అవుతుంది. రైతులు తమ సర్టిఫికెట్లను బ్యాంకులకు సమర్పించడానికి ప్రభుత్వం గడువేమీ పెట్టలేదు. రైతులు ఇప్పుడు ఇచ్చినా... తర్వాత ఇచ్చినా డబ్బు ఆ బ్యాంక్ శాఖకు విడుదల అవుతుంది. ఈ సర్టిఫికెట్లపై బ్యాంక్ అధికారులు ఒక ముద్ర వేసి తిరిగి ఇచ్చేస్తారు. మొత్తం అన్ని విడతల చెల్లింపులు పూర్తయ్యేవరకూ రైతులు ఆ సర్టిపికెట్లను తమ వద్దే ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎవరైనా రైతులు తమ సర్టిఫికెట్లను బ్యాంక్ అధికారులకు ఇవ్వకుండా తమ వద్దే ఉంచుకొంటే వారికి సంబంధించిన మొత్తం ఆ బ్యాంక్ శాఖకు విడుదల కాదు. దానికి బదులు ఆ మొత్తానికి ఏడాదికి పది శాతం వడ్డీని ఆ రైతుకు ప్రభుత్వం చెల్లిస్తుంది. వచ్చే ఏడాది రైతు తన సర్టిఫికెట్‌ను బ్యాంక్‌కు సమర్పిస్తే అప్పుడు ఈ రెండు విడతలూ కలిపి ప్రభుత్వం ఒకేసారి ఆ బ్యాంక్‌కు చెల్లిస్తుంది. ‘మేం బయట మార్కెట్‌లో 8 శాతం వడ్డీకి రుణాలు తెస్తున్నాం. రైతులకు మాత్రం పది శాతం చెల్లిస్తున్నాం. ఏ బ్యాంక్ కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పది శాతం వడ్డీ ఇవ్వడం లేదు. ఈ లెక్కన మేం మంచి వడ్డీ ఇస్తున్నట్లే. వడ్డీ పొందాలా లేక రెండో విడత మాఫీ చేయించుకోవాలా అన్నది పూర్తిగా రైతు ఇష్టం. ఇదొక ప్రత్యామ్నాయంగా మాత్రమే మేం చూపిస్తున్నాం’ అని రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు చెప్పారు. రైతు రుణ మాఫీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు మొత్తం రూ.24 వేల కోట్లు చెల్లించనుంది. ఇందులో మొదటి ఏడాది బ్యాంకులకు ఏడున్నర వేల కోట్లు చెల్లించారు. ఈ ఏడాది మూడున్నర వేల కోట్లు చెల్లిస్తున్నారు. మిగిలినవి మరో మూడు వాయిదాల్లో చెల్లించాల్సి ఉంది. రెండో విడత చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గత వారంలో రూ.1500 కోట్లు అప్పు తెచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
నేడు ఒంగోలుకు బాబు
ఒంగోలు, ఆంధ్రజ్యోతి: ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండోవిడత రైతు రుణ మాఫీకి సంబంధించిన రైతు ఉపశమన పత్రాల పంపిణీని ఒంగోలులో ఆయన ప్రారంభిస్తారు. ఇందుకోసం నగరంలోని మినీ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఒంగోలు చేరుకునే ముఖ్యమంత్రి.. పలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొని మూడు నుంచి ఐదు గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. రైతులకు రుణ ఉపశమన పత్రాలు అందజేయడంతో పాటు రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. పలు సబ్సిడీ పథకాలను అందజేస్తారు. కాగా ముఖ్యమంత్రి పర్యటనకు మంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా అధికార యంత్రాంగం, స్థానిక టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల జిల్లాకు చెందిన పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన నేపథ్యంలో సీఎం పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
No comments:
Post a Comment