Friday, 10 June 2016

కళ్లెదుటే ప్రాజెక్టులు!

కళ్లెదుటే ప్రాజెక్టులు! 
11-06-2016 02:03:28

  • జల వనరుల వాస్తవ స్థితి గతులు తెలుసుకునే వీలు 
  • బెజవాడలో దూరదృశ్యవిలీన నీటి ప్రత్యేక ప్రాధికార కేంద్రం 
  • నేడు ప్రారంభించనున్న సీఎం 
హైదరాబాద్‌, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల స్థితి గతులు ఇకపై కళ్లెదుటే ప్రత్యక్షం కానున్నాయి. రాష్ట్ర రాజధాని అమరావతిలో కూర్చుని.. ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వలను సమీక్షించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏపీ అందిపుచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన దూరదృశ్యవిలీన నీటి యాజమాన్య ప్రాధికార కేంద్రాన్ని సీఎం చంద్రబాబు విజయవాడలో శనివారం ప్రారంభించనున్నారు. ఈ కేంద్రం నుంచి.. రాష్ట్రంలోని జల వనరులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు.. కీలకమైన ప్రాజెక్టులు సహా ఇతర ప్రాజెక్టుల పనితీరును పరిశీలించేందుకు సాధ్యమవుతుంది. అదేవిధంగా ఈ కేంద్రంలో కూర్చుని వివిధ ప్రాంతాల్లో జరిగే ప్రాజెక్టు పనులను, నీరు-చెట్టు పనులను, కాలువల స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడమే కాకుండా.. సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ కేంద్రం పనితీరు ఇలా ఉంటుంది. ప్రాజెక్టులపై సమీక్షను నిర్వహించే సమయంలో.. క్షేత్రస్థాయి ఇంజనీరింగ్‌ సిబ్బందితో నేరుగా స్థితిగతులను గురించి సమాచారం తెలుసుకునే వీలు కలుగుతుంది. ప్రాజెక్టుల నిర్మాణంలోను.. నీటి నిల్వలు, విడుదలకు సంబంధించి తగు ఆదేశాలు ఇచ్చేందుకు వెసులు బాటు ఉంటుంది. ముఖ్యమంత్రి, మంత్రి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వంటి వారు ప్రాజెక్టుల సందర్శన చేయడం వల్ల.. అధిక సమయం తీసుకుంటుంది. ప్రాజెక్టుల వద్ద పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు, కాంట్రాక్టు సంస్థలు, పనులు చేస్తున్న సిబ్బంది వాటిని నిలిపివేసే పరిస్థితి ఉంటుంది. కానీ.. ఈ ప్రాధికార సంస్థలో కూర్చుని సమీక్షిస్తే.. క్షేత్ర స్థాయి ఇంజనీరింగ్‌ సిబ్బంది వారి విధులను నిర్వహిస్తూనే పనులు ఎలా జరుగుతున్నాయో వివరించే ఆస్కారం ఉంది. 
జూ ఈ కేంద్రం నుంచి రాష్ట్రంలోని సమగ్ర జల వనరుల పరిస్థితిని తెలుసుకునే అవకాశముంది. 
  • భూగర్భ జలాల స్థితిగతులను కూడా తెలుసుకునే వీలుంది. 
  • గత ఏడాది, ప్రస్తుత భూగర్భ జలాల మట్టాలను సరిపోల్చుకునే అవకాశం ఉంటుంది. 
  • రాష్ట్ర వర్షపాతం వివరాలు తెలుసుకునే అవకాశముంది. ఏదైనా ప్రత్యేక సాగు నీటి ప్రాజెక్టుపై సమీక్ష జరిగినప్పుడు.. దాని సమాచారాన్ని క్షేత్ర స్థాయి అధికారుల ద్వారా నేరుగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. దీనివల్ల పని తీరును అంచనా వేసేందుకు వీలవుతుంది. 
  • ఇది ఒక విధంగా.. సీఎం కార్యాలయ స్థాయిలో సీఎం కోర్‌ డ్యాష్‌ బోర్డు పనిచేస్తున్నట్లుగానే.. జిల్లా స్థాయిలో జల వనరుల శాఖ కోర్‌ డ్యాష్‌ బోర్డుగా పనిచేస్తుంది. దీనివల్ల రియల్‌ టైమ్‌ డేటా అందుబాటులో ఉంటుంది. 
  • ప్రాజెక్టులకు సెన్సార్లను ఏర్పాటు చేయడంతో ఈ సాంకేతిక పరిజ్ఞనం అందుబాటులోకి వస్తుంది. లైవ్‌ యూ అనే కెమెరాను ఏర్పాటు చేయడం ద్వారా ప్రాజెక్టు పనులను ప్రత్యక్షంగా చూసే వీలు కలుగుతుంది. 

No comments:

Post a Comment