Friday, 10 June 2016

90 వేల కోట్లిచ్చాం

90 వేల కోట్లిచ్చాం 
11-06-2016 00:29:24

తెలంగాణకిచ్చిన ప్రతి పైసాకూ నా దగ్గర లెక్క ఉంది
  • కానీ.. ఈ నిధులు పల్లెలకు చేరడం లేదు
  • కుటుంబ పార్టీలతో అభివృద్ధి జరగదు
  • తెలంగాణ ప్రగతి మోదీతోనే సాధ్యం
  • ఒవైసీకి జవాబిచ్చే దమ్ము కేసీఆర్‌కుందా?
  • నల్లగొండలో ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కరిస్తాం
  • సూర్యాపేట సభలో అమిత్ షా ఉద్ఘాటన
  • రాష్ట్రంలో సంక్షోభంలో సంక్షేమం
  • సెప్టెంబర్‌ 17ను అధికారికంగా
  • నిర్వహించకపోతే ఆందోళన: లక్ష్మణ్‌
కాంగ్రెస్ లాగే టీఆర్‌ఎస్‌ కూడా కుటుంబ పార్టీ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధ్వజమెత్తారు. కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాటిని పల్లెలకు చేరవేయడం లేదని ఆరోపించారు. తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌ కావాలని ఆకాంక్షించిన ఆయన.. మోదీ నాయకత్వంలోనే అది సాధ్యమని స్పష్టం చేశారు. సూర్యాపేటలో వికాస్‌పర్వ్‌ సభలో ఆయన పాల్గొన్నారు 

నల్లగొండ, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): ‘‘గత రెండేళ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.90 వేల కోట్లకుపైగా నిధులను విడుదల చేసింది. రూ.90 వేల కోట్లకు సంబంధించిన ప్రతి పైసాకు నా దగ్గర లెక్క ఉంది. కానీ, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిధులు పల్లెలకు చేరడంలేదు’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌వన్‌ కావాలని ఆశిస్తున్నానని, తెలంగాణ సమగ్రాభివృద్ధి నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో తప్ప మరెవ్వరితోనూ సాధ్యం కాదని స్పష్టం చేశారు. కుటుంబ పార్టీలు, అంతర్గత ప్రజాస్వామ్యం లేని పార్టీలతో అభివృద్ధి జరగదన్నారు. అభివృద్ధి పథంలో భారత్‌ (వికాస్‌ పర్వ్‌) పేరిట రాష్ట్ర బీజేపీ నే తలు నల్లగొండ జిల్లా సూర్యాపేటలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ‘‘తెలంగాణలోని ప్రతి గ్రామంలోనూ 24 గంటల విద్యుత్తు అందుతోందా? ప్రతి గ్రామానికీ రహదారులు నిర్మించారా? ఆస్పత్రులు ఉన్నాయా? ప్రతి చేనుకూ నీరు అందుతోందా? యువతకు ఉద్యోగాలు లభిస్తున్నాయా? బీజేపీ అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ ఈ పనులన్నీ జరుగుతున్నాయి’’ అని వివరించారు.
 
రూ.36 వేల కోట్లు ఆదా చేశాం 
గత రెండేళ్లలో ప్రజా సమస్యల పరిష్కారంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విజయవంతమైందని అమిత షా చెప్పారు. ‘‘రెండేళ్లలో బీజేపీ సర్కారు ఏమి చేసిందని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. మొట్టమొదట దేశానికి మాట్లాడే ప్రధానిని ఇచ్చింది. అవినీతి, కుంభకోణం అనే మాటలు లేకుండా చేసింది. కేవలం రెండేళ్లలోనే వివిధ పథకాల కింద పక్కదారి పడుతున్న రూ.36 వేల కోట్లను ఆదా చేసింది. యూపీఏ ప్రభుత్వం తన హయాంలో అవినీతి, కుంభకోణాల రూపంలో రూ.12 లక్షల కోట్లను కొల్లగొట్టింది. ఇప్పుడు కుంభకోణాలు లేని దేశంగా భారతను మార్చాం’ అని వివరించారు.
 
రాహుల్‌ బాబాకు మార్పు అర్థం కావడం లేదు 
ఇటాలియన్‌ కళ్లద్దాలు పెట్టుకున్న రాహుల్‌ బాబాకు మార్పు అర్థంకావడం లేదని, అవి తీసి చూస్తే వాస్తవాలు తెలుస్తాయని అమిత షా ఎద్దేవా చేశారు. ‘‘సరిహద్దు రక్షణకు బీజేపీ ఏమి చేసిందని రాహుల్‌ బాబా ప్రశ్నిస్తున్నారు. గతంలో పాక్‌ కాల్పులు ప్రారంభించి.. కొనసాగించి.. ముగించడం దాని వంతుగానే ఉండేది. కానీ, ఇప్పుడు పాక్‌ కాల్పులు ప్రారంభిస్తే ముగింపు భారత సైన్యం నిర్ణయిస్తుంది. పాక్‌ తుపాకీ గుండును వదిలితే భారత్‌ భారీ గోళాలను పేలుస్తూ పాక్‌ సైన్యాన్ని బెంబేలెత్తిస్తోంది’’ అని తెలిపారు. అభివృద్ధిలో చైనాను సైతం వెనక్కి నెట్టిన విషయాన్ని తెలుసుకోవాలన్నారు. 

ఫ్లోరైడ్‌ సమస్యను పరిష్కరిస్తాం 
21వ శతాబ్దంలోనూ నల్లగొండ యువకులు ఫ్లోరైడ్‌తో బాధపడడం చూస్తుంటే హృదయం పగిలిపోతోందని అమిత్‌షా ఆవేదన వ్యక్తం చేశారు. 35 ఏళ్ల యువకులకు కూడా తెల్ల వెంట్రుకలు, ముసలితనం రావడం బాధాకరమని, మోదీ నాయకత్వంలో ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని అన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి అక్షరజ్ఞానం, సంస్కృతీ వికాసం, బంగారు తెలంగాణ నిర్మాణం బీజేపీకి మాత్రమే సాధ్యమని, బీజేపీని బలపరచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఒవైసీ మతమౌఢ్యానికి జవాబు చెప్పే ధైర్యం సీఎం కేసీఆర్‌కు ఉందా? ప్రశ్నించారు. వాళ్లను ప్రశ్నించే ధైర్యం కేవలం బీజేపీకే ఉందన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని, కుటుంబ పార్టీలతో అభివృద్ధి సాధ్యంకాదని, కాంగ్రెస్‌ పార్టీ కూడా కుటుంబ పాలనతోనే దేశాన్ని నాశనం చేసిందని అన్నారు.

No comments:

Post a Comment