Thursday, 9 June 2016

రసాభాసగా రాజధాని తరలింపు!

రసాభాసగా రాజధాని తరలింపు!

Sakshi | Updated: June 10, 2016 00:30 (IST)
రసాభాసగా రాజధాని తరలింపు!
సందర్భం

ఉద్యోగులు తరలి రాకముందే విజయవాడలో రెట్టింపు అయిన ఇంటి అద్దెలను నియంత్రించలేని ప్రభుత్వం ఉద్యోగులను విమర్శిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల పరిరక్షణ కోసమే ప్రభుత్వ నిర్ణయాలు మారుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరా వతికి రాష్ట్ర సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాల తర లింపు రసాభాసగా మారింది. ఆంతరంగికంగా పరిష్కరించుకో వలసిన సమస్య రోడ్లమీద రచ్చగా అయింది. జూన్ 27 లోపు ఆఫీసులు తరలిపోవల్సిందేనని ముఖ్యమంత్రి పత్రికల్లో పదేపదే ప్రకటించడం ఉద్యోగులపై చెడు అభిప్రాయం కలిగిస్తోంది. కార్యాలయాలు ఏర్పాటు చేస్తే వస్తామని ఉద్యోగులు చెబు తున్నా ముఖ్యమంత్రి మొండిగా వాదిస్తున్నారు.

 రాష్ట్రం విడిపోయి 2 సంవత్సరాలు పూర్తయింది. అమ రావతిని రాజధానిగా ప్రకటించి ఏడాది దాటింది. రాష్ట్ర కార్యాలయాల తరలింపు విషయంలో ప్రభుత్వ వైఖరి తొలి నుంచీ గందరగోళంగా ఉంది. ఉమ్మడి రాజధానిగా హైదరా బాద్‌ను పదేళ్ల కాలానికి ఉంచినప్పుడేమో అది చాలదని వాదించారు. విభజన తర్వాత హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయానికి కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి అనవసర హంగులు చేశారు. కొంతకాలం వరకు ఇక్కడే ఉంటారు కాబట్టి ఈ ఖర్చులు పెడుతున్నారని అందరూ భావించారు. ఫోన్ ట్యాపింగ్ తర్వాతే ప్రభుత్వం మూడ్ మారిపోయింది. హడావుడిగా తాత్కాలిక రాజధానికి కార్యాలయాలు తరలి స్తామని, మంగళగిరిలోని అమరావతి టౌన్‌షిప్‌లో భవ నాలు నిర్మిస్తామన్నారు.


దీనికి సుమారు 150 కోట్లు ఖర్చు అవుతుంది కాబట్టి వృథా అని తర్వాత విరమించుకున్నారు. గన్నవరం విమా నాశ్రయం వద్ద మేధా టవర్స్‌లోకి తరలిస్తామన్నారు. తర్వాత వెలగపూడిలో తాత్కాలిక సచివాలయానికి శంకు స్థాపన చేశారు. 6 బ్లాకులు జి+1 ఫ్లోర్స్‌ని 300 కోట్ల ఖర్చుతో చేపట్టారు. మార్కెట్‌లో నిర్మాణానికి చదరపు అడుగుకు రూ. 1,500 రేటు ఉంటే రూ. 3,300కి ఎల్-టి, షాపూర్‌జీ సంస్థలకు అప్పగించారు. ఆధునిక సాంకేతికత, తక్కువ సమయంలో నిర్మించడానికే ఇంత ఎక్కువ రేటు ఇచ్చామని సమర్థించారు. ఆ తర్వాత హెచ్‌ఓడీ కార్యాలయా లను కూడా ఆ భవనాల పైనే 2,3 ఫ్లోర్‌లుగా కడతామ న్నారు. దీనికి ఉద్యోగులు అంగీకరించారు. అయితే అక స్మాత్తుగా సీఎం తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. వెలగ పూడిలో నిర్మాణాన్ని జీ+1 కే పరిమితం చేస్తూ 2,3 ఫ్లోర్లకు పిలిచిన టెండర్లు రద్దు చేశారు. సచివాలయం మాత్రమే అక్కడ ఉంటుందని, హెచ్‌ఓడీ ఆఫీసులు విజయవాడ, గుంటూరుల్లో అద్దె భవనాల్లోకి జూన్ 27లోపు తరలించా లని ప్రకటించారు. దీనితో ఉద్యోగుల్లో ఆందోళన తలెత్తింది.


వెలగపూడిలో నిర్మిస్తున్న భవనాల్లో జూన్ 27లోపు అన్ని వసతులు సమకూరటం కష్టమని, కనుక పూర్తయితేనే వెళతామని ఉద్యోగులు అంటున్నారు. పైగా అక్కడ ఉండ టానికి నివాస గృహాలు లేవు. ఉండవల్లి, మంగళగిరి, తాడే పల్లి, విజయవాడ, గుంటూరుల నుంచి వెలగపూడికి సరైన రోడ్డు వసతే లేదు. వాస్తవ పరిస్థితులు మాట్లాడుతున్న ఉద్యోగులపై ముఖ్యమంత్రి నిరంకుశంగా వ్యవహరిస్తు న్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రభుత్వ భవనాల్లో ఉంటున్న హెచ్‌ఓడీ ఆఫీసులను విజయ వాడ/గుంటూరు ల్లోని ప్రైవేట్ భవనాల్లోకి తరలిస్తే అద్దె కోసం కోట్లాది రూపాయలు వ్యయం అవుతుంది. ప్రజలపై ఇంత భారం ఎందుకు మోపాలి. పదే పదే నిర్ణయాలు ఎందుకు మార్చు కుంటున్నారన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. పైగా ప్రభుత్వ ఆఫీసుల కోసం చూస్తున్న అద్దె భవనాలు అనుకూ లంగా లేవు. ఎందుకూ పనికిరాని భవంతులకు కూడా చద రపు అడుగుకు రూ. 20-30 అద్దె అడుగుతున్నారు. బిల్డిం గుల్లో వసతుల కల్పనకు లక్షలాది రూపాయలు అడ్వా న్సులు అడుగుతున్నారు. వసతుల కల్పనకు 2-3 నెలల సమయం కోరుతున్నారు. మూడేళ్ల కాలానికి అద్దె అగ్రి మెంటు అడుగుతున్నారు. ఇన్ని షరతులు ఒప్పుకుని, అద్దె కొంపలకు హడావుడిగా కార్యాలయాలు తరలించడం ఎందుకు అనే ప్రశ్నకు ప్రభుత్వమే సమాధానం ఇవ్వాలి.


పైగా 120 హెచ్‌ఓడీ ఆఫీసులను ఎక్కడెక్కడో ఏర్పాటు చేస్తే గందరగోళం ఏర్పడుతుంది. ప్రజలకు అసౌకర్యం కూడా. హైదరాబాద్ నుంచి విజయవాడకు, తర్వాత వెలగ పూడికి రెండు పర్యాయాలు ఆఫీసులు మార్చడం ఎంతో శ్రమ, ఖర్చుతో కూడుకున్నది. మూడేళ్లపాటు అద్దెకొంపల్లో హెచ్‌ఓడీ ఆఫీసులు ఉంటే అమరావతి ఏవిధంగా అభివృద్ధి అవుతుంది. అక్కడ భూములిచ్చిన వారి నోట్లో మట్టికొట్టి నట్లు అవుతుంది. రాజధానిలోని సచివాలయానికి వెళ్లడా నికి హెచ్‌ఓడీ అధికార్లకు రోజూ గంటల సమయం వృథా అవుతుంది.
 తమ పిల్లల స్థానికత విషయమై ఉద్యోగులు లేవనెత్తిన సందేహాలను పరిష్కరించకుండా వారిపై బెదిరింపులకు పాల్పడుతోంది. ప్రశ్నిస్తున్న వారిపై రాష్ట్రాభిమానం లేదని, ప్రజలకు సేవ చేసే చిత్తశుద్ధి లేదని నిందలు వేస్తున్నారు. ఉద్యోగులు తరలి రాకముందే విజయవాడలో రెట్టింపు అయిన ఇంటి అద్దెలను నియంత్రించలేని ప్రభుత్వం ఉద్యో గులను విమర్శిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయో జనాల పరిరక్షణ కోసమే ప్రభుత్వ నిర్ణయాలు మారుతు న్నాయి. ప్రజల పేరు చెప్పి, పరిపాలన వంకతో తన మద్ద తుదారులకు లాభాలను చేకూర్చడానికి కార్యాలయాల తరలింపును ప్రభుత్వం హడావుడిగా చేపట్టింది.


 చదరపు అడుగుకు రూ. 10 ఉన్న అద్దెలను రూ. 20 నుంచి 30 వరకు చెల్లించడానికి ప్రభుత్వం అనుమతిం చింది. దీనివల్ల భవన యజమానులకే లాభం. ప్రజల వద్దకు పాలన పేరుతో ప్రతిదాన్ని వ్యాపారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. అద్దె కొంపల్లోకి వచ్చి ప్రభుత్వ నిధులను రియల్ ఎస్టేట్ వాళ్లకు అప్పజెప్పడాన్ని ఉద్యోగులు ప్రశ్నిం చాలి. స్వంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేయాలి. వెలగ పూడిలోనే అన్ని ప్రభుత్వ భవనాలూ నిర్మించాలని కోరాలి. ఈ విషయంలో ప్రభుత్వానికి వంతపాడుతున్న ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగుల ఆగ్రహాన్ని చవి చూస్తారు. రాజధానికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు కూడా పెద్ద కుంభకోణంగా మారడమే అసలు విషాదం.
 
- జి. హనుమంతరావు
 వ్యాసకర్త అధ్యక్షులు, ఎంప్లాయీస్ కో-ఆర్డినేషన్ కమిటీ, ఉద్యోగక్రాంతి  మొబైల్ : 94902 34250   

No comments:

Post a Comment