Thursday, 9 June 2016

మిషన్ కాకతీయ, భగీరథకు 24,200 కోట్లు

మిషన్ కాకతీయ, భగీరథకు 24,200 కోట్లు

Sakshi | Updated: June 10, 2016 07:41 (IST)
మిషన్ కాకతీయ, భగీరథకు 24,200 కోట్లువీడియోకి క్లిక్ చేయండి
  •  ఆర్థిక సాయం అందించాలని కేంద్రానికి నీతి ఆయోగ్ సిఫార్సు
  •  భగీరథకు రూ.19,200 కోట్లు, కాకతీయకు రూ.5,000 కోట్లు..
  •  వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.450 కోట్లు ఇవ్వండి
  •    ఈ ప్రాజెక్టులతో ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి
  •      చెరువుల పునరుద్ధరణతో సాగు విస్తీర్ణం, భూగర్భ జలాల పెంపు
  •      కరువును అధిగమించొచ్చు.. ఇంటింటికీ తాగునీరు మంచి నిర్ణయం
  •      ఈ పథకాలకు ఆర్థిక సాయం అందించడం సహేతుకమని సూచన
  •      ఫలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు
  •      త్వరలోనే కేంద్రం ఆర్థిక సాయం ప్రకటించే అవకాశం
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పట్టు వదలకుండా చేసిన ప్రయత్నం ఫలించనుంది. కొత్త రాష్ట్రంలో అమలవుతున్న బృహత్తర పథకాలకు రూ.24,200 కోట్లు ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేసేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి రూ.19,200 కోట్లు, చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయకు రూ.5,000 కోట్లు ఇవ్వాలని సూచించింది. వీటితోపాటు రాష్ట్రంలోని తొమ్మిది వెనుకబడిన జిల్లాలకు గత ఏడాది తరహాలో రూ.450 కోట్ల సాయం అందించాలని ప్రతిపాదించింది. అంతేకాదు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో ఎన్నో ప్రయోజనాలున్నాయని, వాటికి ఆర్థిక సాయం అందించడం సహేతుకమని స్పష్టం చేసింది. నీతి ఆయోగ్ సిఫార్సుల నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందే అవకాశముందని.. సిఫార్సు చేసిన స్థాయిలో కాకపోయినా ఒక మోస్తరుగానైనా నిధులు రావొచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 
రెండేళ్లుగా విజ్ఞప్తులు..
భారీ వ్యయ అంచనాతో చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రానికి రాష్ట్రం రెండేళ్లుగా విజ్ఞప్తులు చేస్తోంది. కొత్త రాష్ట్రం కావడంతో ప్రత్యేక అభివృద్ధి (స్పెషల్ డెవలప్‌మెంట్) ప్యాకేజీ కింద ఈ సాయం చేయాలని కోరింది. 2015-19 సంవత్సరాలకు రూ.30,571 కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని ఈ ఏడాది ఫిబ్రవరి 11న సీఎం కేసీఆర్  ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఢిల్లీకి వెళ్లినప్పుడూ సీఎం ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా రాష్ట్రానికి వచ్చిన సందర్భం లోనూ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 12న రాష్ట్రానికి వచ్చిన నీతి ఆయోగ్ బృందం... మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలపై ప్రత్యేకంగా ఉన్నతాధికారులతో సమీక్షిం చింది.

ఆ బృందానికి రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెం టేషన్ ద్వారా ఈ పథకాల పురోగతిని వివరించింది. మిషన్ కాకతీయ ద్వారా ఐదేళ్లలో రూ.20 వేల కోట్లతో 46,351 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా ఎంచుకున్నామని... రూ.5,000 కోట్లు ఆర్థిక సాయం అందించాలని కోరింది. ఇక రూ.42 వేల కోట్ల అంచనాతో చేపట్టిన మిషన్ భగీరథతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ మంచి నీటిని అందించే ప్రణాళికను పంచాయతీరాజ్ విభాగం విశ్లేషించింది. ఈ పథకానికి రూ.19 వేల కోట్ల సాయం కోరింది. ఈ విజ్ఞప్తులను పరిశీలించిన నీతి ఆయోగ్ బృందం తెలంగాణకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది.
 సాయం అందించాల్సిందే..: మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు ఆర్థిక సాయం అందించాల్సిన అవసరముందని, ఇది సహేతుకమైన కారణమని నీతి ఆయోగ్ తమ సిఫార్సులో ప్రస్తావించింది. చెరువుల పునరుద్ధరణతో సాగు విస్తీర్ణం, భూగర్భ జలమట్టాలు పెరుగుతాయని.. వేసవి, కరువు పరిస్థితుల్లో నీటి ఎద్దడిని అధిగమించే వీలుందని ప్రస్తావించింది. రాష్ట్రంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు తలపెట్టిన మిషన్ భగీరథకు నిధులివ్వడం సహేతుకమని, ఈ వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖకు సూచించింది. అయితే కేంద్రం నీతి ఆయోగ్ సూచించినన్ని నిధులు ఇవ్వకపోయినా.. కొంతమేరకైనా సాయం విడుదల చేసే అవకాశాలు మెరుగుపడ్డాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
 వెనుకబడిన జిల్లాలకు..
రాష్ట్రంలోని 9 వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి గత ఏడాది కేంద్రం ప్రత్యేక సహాయం (స్పెషల్ అసిస్టెన్స్ గ్రాంట్) కింద రూ.450 కోట్లు ఇచ్చింది. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని ఒక్కో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున కేటాయించింది. ఈ జిల్లాలకు 2016-17 ఆర్థిక సంవత్సరానికి కూడా నిధులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్‌లకు లేఖ రాసింది. ఆ ప్రతిపాదనలను పరిశీలించిన నీతి ఆయోగ్ ఈసారి కూడా నిధులు ఇవ్వాల్సిన అవసరముందని ఆర్థిక శాఖకు సిఫార్సు చేసింది. తొలి ఏడాది వన్‌టైం అసిస్టెన్స్‌గా ఈ గ్రాంటును విడుదల చేసినా.. నీతి ఆయోగ్ సిఫార్సుతో ఈ ఏడాది కూడా ఈ నిధుల మంజూరుకు మార్గం సుగమమైంది.

No comments:

Post a Comment