పుడమి ఒడిలోకి.. జనపుత్రుడు
11-06-2016 00:10:36
- మహ్మద్ అలీ అంత్యక్రియలు పూర్తి
- తుది వీడ్కోలుకు పోటెత్తిన జనం
లూయిస్‌విల్లే (అమెరికా): బాక్సింగ్ గ్రేట్, విశ్వవిఖ్యాత మహ్మద్ అలీకి అభిమానులు తుది వీడ్కోలు పలికారు. ఆటలో పరాక్రమం చూపి, జాతి వివక్షపై అలుపెరుగని పోరాటం చేసి జనపుత్రుడిగా ఎదిగిన అలీ.. పుడమి తల్లి ఒడికి చేరుకున్నాడు. పార్కిన్సన్ వ్యాధితో గతవారం తుది శ్వాస విడిచిన దిగ్గజ బాక్సర్ అంత్యక్రియలు శుక్రవారం ముగిశాయి. తమ ఆరాధ్య బాక్సర్‌ను కడసారి చూసేందుకు జనం పోటెత్తారు. అలీ ముందుగానే కోరుకున్నట్టు అతని మరణానంతర కార్యక్రమాలను కుటుంబ సభ్యులు నిర్వహించారు. ముందుగా అతను జన్మించిన నగరంలోని వీధుల గుండా అంతిమ యాత్ర నిర్వహించారు. ఎరుపు రంగు పేటికలో అలీ పార్థీవ దేహాన్ని.. దిగ్గజ బాక్సర్లు మైక్ టైసన్, లెనాక్స్ లూయిస్, నటుడు విల్ స్మిత అంతిమయాత్ర వాహనంలో ఉంచారు. మొత్తం 17 వాహనాలతో సాగిన ఈ యాత్రలో అలీ తొమ్మిది మంది పిల్లలు, భార్య, ఇద్దరు మాజీ భార్యలు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అలీ జన్మించిన స్థలం, తొలిరోజుల్లో బాక్సింగ్ ప్రాక్టీస్ చేసిన జిమ్, అతని పేరుపై ఉన్న మ్యూజియం మీదుగా యాత్ర సాగింది. 19 మైళ్ల దారి పొడవునా.. అభిమానులు పూల వర్షం కురిపించారు. ‘అలీ... అలీ’ అంటూ దిగ్గజ వీరుడికి వీడ్కో లు పలికారు. కేవ్ హిల్ స్మశాన వాటికలో కుటుంబ సభ్యులు... అంతిమ సంస్కారాలు నిర్వహించారు ‘అలీ’ పేరుతో సూచిక ఏర్పాటు చేశారు. అనంతరం జరిగిన సంస్మరణ సభలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సహా 15000 మంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment