Friday, 8 July 2016

దేవినేని కంటే హరీష్ ప్రజంటేషన్‌కే మార్కులంట..

ప్రాజెక్టుల వివాదంలో దేవినేని కంటే హరీష్ ప్రజంటేషన్‌కే మార్కులంట..
08-07-2016 08:42:10



ఢిల్లీలో ఏపీ కంటే తెలంగాణ నేతలు అడ్వాన్స్ గా ఉన్నారా? రాష్ట్రానికి సంబంధించిన రాయబారాలను తెలంగాణ నేతలు నడిపినంత వేగంగా ఏపీ నేతలు చక్కబెట్టలేకపోతున్నారా? హస్తినలో తెలంగాణ నేతలకు ఉన్న అడ్వాంటేజ్ ఏమిటి? ఏ విషయంలో తెలంగాణ నేతలతో తాము పోటీ పడలేకపోతున్నామని ఏపీ నేతలు మధనపడుతున్నారు? వీటి కధనమేమిటో చూద్దాం.

ఆంధ్రప్రదేశ్‌ నేతలకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెట్టడంలో తమ కంటే తెలంగాణ నేతలు ఫాస్ట్ గా ఉన్నారని వారు భావిస్తున్నారు. ఒక పని కోసం తాము పది సార్లు తిరిగినా కానిది, తెలంగాణ నేతలు రెండు సార్లు తిరిగితే అయిపోతున్నదట..! అలా కావడం పట్ల వారేమీ ఈర్ష్య చెందడం లేదట! కాకపోతే తమ పని కావడం లేదన్న బాధ మాత్రం ఉందట...! ఇంతకీ ఈ సమస్యకు మూలం ఏమిటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం... భాష! ఆశ్చర్య పోకండి. అవును...ఆంధ్రప్రదేశ్‌ నేతలు ఢిల్లీలో లాంగ్వేజ్ ప్రాబ్లం ఎదుర్కొంటున్నారట. ఈ విషయాన్ని ఏపీ తెలుగుదేశం పార్టీ నేతలే చెబుతున్నారు. ఢిల్లీలో తమకు మహా చిక్కొచ్చి పడిందంటున్నారు వారు. చంద్రబాబు కేబినెట్ మంత్రులు, టీడీపీ ఎంపీలలో చాలా మందికి హిందీ రాదు. వచ్చిన వారికి అరకొరనే. ఢిల్లీలో తమ రాష్ట్రానికి రావాల్సిన అంశాల పై అక్కడ అధికారులకు సరైన ప్రజెంటేషన్ ఇవ్వలేకపోతున్నారట వారు. వచ్చీ రాని భాషలో చేసే కమ్యూనికేషన్ ఢిల్లీ అధికారులను ఆకట్టుకోలేకపోతోందని ఓ సీనియర్ నేత వాపోయారు. ఈ విషయంలో తెలంగాణ నేతలు అడ్వాన్స్ గా ఉన్నారని సదరు నేత చెప్పుకొచ్చారు.

           దీనికి కొన్ని ఉదాహరణలు సైతం వివరించారు. ఏపీకి చట్ట ప్రకారం రావాల్సిన చాలా ప్రాజెక్టులు, నిధుల విషయంలో ఒకటికి పది సార్లు తిరుగుతున్నా ఆశించిన స్థాయిలో ఫలితం దక్కడం లేదట. ఉదాహరణకు... రాష్ట్రం ఏర్పడి రెండేళ్లయినా ఇంత వరకు లోటు తీర్చ లేదని చెబుతున్నారు. చంద్రబాబు ఇరవై సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా తిప్పి కొడితే మూడు వేల కోట్లకు మించి రాలేదని గుర్తు చేస్తున్నారు. పోలవరం విషయంలో సేమ్ టు సేమ్ అంటున్నారు. రాజధాని నిధుల విషయంలోను సంతృప్తికర స్థాయిలో అందలేదనే చెబుతున్నారు. రైల్వే జోన్ గురించి చెప్పనక్కర లేదు. ఇవన్నీ చట్టంలో ఉన్న అంశాలే. అయినా, పెద్దగా ఫలితం లేని పరిస్థితి అంటున్నారు వారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే... ఆ మధ్య నీతి అయోగ్ సభ్యులు తెలంగాణలో పర్యటించారు. మిషన్ కాకతీయ పథకాన్ని పరిశీలించారు. దీని కోసం మూడు వేల కోట్లు ఇవ్వాల్సిందిగా నీతి అయోగ్ ను తెలంగాణ సర్కారు కోరిందట. అడిగిందే తడవుగా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా కేంద్రానికి నీతి అయోగ్ రికమండ్ చేసిందట. వెనకబడిన జిల్లాల కోసం మరో నాలుగు వందల కోట్లు ఇచ్చారట. మరో నాలుగు వందల కోట్లు ఇవ్వాల్సిందిగా తెలంగాణ సర్కారు కోరిందట. దానికి సానుకూలంగా స్పందించినట్టు చెబుతున్నారు.
 
                ఇక సాగునీటి ప్రాజెక్టుల వివాదం విషయంలో ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు ఇటీవల ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఉమ్మడి సమావేశాలు జరిగాయి. అందులో హరీష్ రావు ఇచ్చినంత చక్కటి ప్రజెంటేషన్, ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా ఇవ్వలేక పోయారట! అదే మంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అంటున్నారు. ఢిల్లీలో పెద్ద స్థాయి అధికారుల్లో మెజారిటీ హిందీ వారే కావడం తమకు ఇబ్బందిగా ఉందని ఏపీ నేతలు వాపోతున్నారు. మెజారిటీ తెలంగాణ నేతలకు హిందీ భాష పై పట్టుంది. వారు ఏ అధికారి వద్దకు వెళ్లినా తాము చెప్పదలచుకుంది సూటిగా, స్పష్టంగా చెబుతున్నారట. ఏపీ నేతల పరిస్థితి దీనికి రివర్స్. దీంతో తెలంగాణ నేతలతో ఢిల్లీ అధికారులు కనెక్ట్ అవుతున్నారు. ఏపీ వాళ్లను కొంత మేర పరాయి వారిగా చూస్తున్నారట. దీనిపై ఓ సీనియర్ నేత ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఈ సమస్య లేదని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు చెప్పి, తమ ముఖ్య నేతలకు హిందీ క్లాసులు పెట్టిస్తే బాగుంటుందని సదరు నేత అభిప్రాయపడ్డారు. మరి ఈ ప్రతిపాదనకు చంద్రబాబు ఏమంటారో!

No comments:

Post a Comment