Monday 9 November 2015

సరికొత్త సమీక‘రణం’

సరికొత్త సమీక‘రణం’ 
Updated :10-11-2015 02:07:22
ఒక్కటవుతున్న బీజేపీ వ్యతిరేకులు.. బిహార్‌ ఉత్సాహంతో పెరిగిన దూకుడు
న్యూఢిల్లీ, నవంబరు 9: బిహార్‌ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో గణనీయమైన మార్పులు తేనున్నాయా?ఈ ఎన్నికల ఫలితా లు కొన్ని రాజకీయ పార్టీల పునరేకీకరణకు బీజం వేయనున్నాయా? బిహార్‌ ఎన్నికల ఫార్ములాను ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయనున్నాయా? జాతీయ స్థాయిలో మోదీకి ప్రత్యామ్నాయంగా నితీశ్‌ను తెరమీదకి తీసుకురానున్నారా? వంటి ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీయేతర పార్టీలకు బిహార్‌ ఫలితాలు కొత్త ఊపిరిలూదినట్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. బిహార్‌లో బీజేపీ ఓటమిపాలవడంలో ప్రధాన భూమిక పోషించిన జేడీ(యూ), ఆర్జేడీ ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చక్రం తిప్పేందుకు సన్నద్ధమ వుతున్నాయి తాము తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆప్‌ వంటి పార్టీలతో కలిసి పనిచేస్తామని జేడీ(యూ) నేత కేసీ త్యాగి ప్రకటించారు. పలు అంశాలపై ఈ మూడు పార్టీల ఆలోచనలు ఒకేలా ఉన్నాయని చెప్పారు. బీజేపీ వ్యతిరేకపోరాటంలో తాము మరింత సమన్వయంతో పనిచేస్తామన్నారు. మరో వైపు... దేశవ్యాప్తంగా పర్యటించి మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టనున్నట్లు ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రకటించారు. బిహార్‌ బాధ్యతలను నితీశకుమార్‌ చూసుకొంటారని, తాను జాతీయస్థాయి రాజకీయాలపై దృష్టి సారిస్తానన్నారు. కాగా లాలూకు మద్దతునిస్తామని కాంగ్రెస్‌ నేత అజయ్‌ సింగ్‌ ప్రకటించడం విశేషం. ఎన్డీయే పాలనలో దేశంలో ఎవ్వరూ క్షేమంగా లేరని, బీజేపీ శక్తులు దేశంలో అందరినీ భయబ్రాంతులకు గురి చేశాయని విమర్శించారు. దూకుడు మీదున్న జేడీ(యూ) మధ్యప్రదేశ్‌లో జరగనున్న ఉప ఎన్నికలోనూ సత్తా చాటాలని భావిస్తోంది.

కర్ణాటకలోనూ మారుతున్న సమీకరణాలు
జేడీయూ, ఆర్‌జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన లౌకిక కూటమి బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో అనూహ్యరీతిలో విజయం సాధించిన నేపథ్యంలో 2018 శాసనసభ ఎన్నికల నాటికి రాష్ట్రంలో మహాలౌకిక కూటమిని ఏర్పాటు చేసుకునే దిశగా మాజీ ప్రధాని దేవెగౌడ సన్నాహాలు ప్రారంభించారు. కన్నడ నాట లౌకిక కూటమి ఇప్పటికిప్పుడే ఏర్పాటు కాకపోయినా ఆ దిశగా ప్రయత్నాలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కన్నడ నాట లౌకిక కూటమి బిహార్‌తో పోల్చితే కాస్త భిన్నంగా ఉండవచ్చునని, కూటమిలో సెక్యులర్‌ జనతాదళ్‌ (జేడీఎస్‌), యునైటెడ్‌ జనతాదళ్‌, జనతాపార్టీ, సమాజవాది పార్టీ, సీపీఐ, సీపీఎంలకు చోటు దక్కే అవకాశం ఉందని వినిపిస్తోంది. కూటమి ఏర్పాటుకు ముందు ఆయన సమాజవాది పార్టీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌తోనూ, ఆర్‌జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌తోనూ, జేడీయూ నేతలు శరద్‌యాదవ్‌, నితీశకుమార్‌, వామపక్షాల నేతలతోనూ దేవెగౌడ విస్తృత మంతనాలు జరిపే అవకాశం ఉంది. కాగా... బిహార్‌ ఎన్నికల ఫలితాలు బీజేపీకి చెంపపెట్టులాంటివని పలు పార్టీలు వ్యాఖ్యానించాయి. బీజేపీ అనుసరిస్తున్న విభజిత రాజకీయాలకు బిహార్‌ ఫలితాలు చెంపపెట్టులాంటివని ఉత్తరప్రదేశ ముఖ్యమంత్రి అఖిలేశ యాదవ్‌ వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలు ఆ పార్టీకి ఓ గుణపాఠం నేర్పాయన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమితషా ఇప్పటికైనా గర్వం తగ్గించుకోవాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ హితవు పలికింది. బిహార్‌ ఎన్నిల ఫలితాలను ఓ గుణపాఠంగా తీసుకోవాలని సూచించింది. ఎక్కువ మాటలు.. తక్కువ పనులు చేసే ఏ రాజకీయ పార్టీకైనా బిహార్‌లో వచ్చిన ఫలితాలే అన్ని చోట్లా పునరావృతమవుతాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment