Monday 9 November 2015

నేనూ సీమ బిడ్డనే!

నేనూ సీమ బిడ్డనే! 
Updated :10-11-2015 00:14:41
  • అభివృద్ధిని అడ్డుకుంటే ఊర్కోను.. ఉనికి కోసమే ‘ఉద్యమం’
  • ప్రాజెక్టుల పూర్తి, నా బాధ్యత.. పరిశ్రమల అడ్డగింత నా వద్ద కుదరదు
  • సీమ అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. కాంగ్రెస్‌, వైసీపీలపై బాబు ధ్వజం
  • కర్నూలులో ఎడ్యుకేషనల్‌ హబ్‌.. వచ్చే ఏడాది ఉర్దూ డీఎస్సీ
  • ఇమామ్‌లకు గౌరవ వేతనం.. కర్నూలు ఉర్దూ వర్సిటీకి శంకుస్థాపన
కర్నూలు/కడప, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘‘నేనూ రాయలసీమ బిడ్డనే. నా చివరి రక్తపుబొట్టు ఉన్నంతవరకూ రాయలసీమకు అన్యాయం జరక్కుండా చూస్తా. అభివృద్ధికి అడ్డుపడితే... బుల్లెట్‌లా దూసుకెళతా!’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. రాయలసీమను సమాంతరంగా అభివృద్ధి చేస్తానని, సీమ ప్రాజెక్టులను పూర్తి చేయడం తమ బాధ్యత అని ప్రకటించారు. ‘‘రాయలసీమలోని ప్రతి ఎకరాకు సాగునీరిచ్చి సీమను సస్యశ్యామలం చేయడంతోపాటు హార్టికల్చర్‌ హబ్‌గా మారుస్తాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధానిని కోల్పోయిన కర్నూలు జిల్లాకు పూర్వ వైభవం తెస్తానని హామీ ఇచ్చారు. సోమవారం చంద్రబాబు కర్నూలు, కడప జిల్లాల్లో పర్యటించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గోరుకల్లు, గండికోట ప్రాజెక్టులను పరిశీలించారు. ఓర్వకల్లు, ముద్దనూరులో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. కాంగ్రెస్‌, వైసీపీలపై విరుచుకుపడ్డారు. ‘‘మీరు అధికారంలో లేకపోతే సీమకు అన్యాయం చేసినట్టేనా? నా దగ్గర మీ పప్పులుడకవు.
 
             సీమకు మీరేం చేశారో చెబితే... నేనేం చేశానో వివరించడానికి సిద్ధంగా ఉన్నా’’ అన్నారు. తాను చేస్తున్న అభివృద్ధిని అభినందించాల్సిందిపోయి ఆక్షేపిస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలను అడ్డుకోవడం, బ్లాక్‌మెయిల్‌ చేయడం వంటివి తనవద్ద కుదరవన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటే... బుల్లెట్‌లాగా దూసుకెళ్తానన్నారు. కొందరు స్వార్థపరులు రాయలసీమ ఉద్యమం ద్వారా ఉనికిని చాటుకోడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ‘‘ఒకాయన ఒక పార్టీలో ఉంటూ రాజీనామా చేసి సీమ ఉద్యమం చేస్తానంటున్నారు. ఉద్యమాల పేరుతో దగా చేసేందుకు అన్ని పార్టీలను మారిన నేత వస్తున్నారు. రాజకీయ నిరుద్యోగులే ఉద్యమాల పేరుతో మోసం చేయడానికి వస్తున్నారు’’ అని అన్నారు. గతంలో కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి అవినీతి జూదమాడారని, ప్రత్యేక చట్టం ద్వారా అవినీతిసొమ్మును రికవరీ చేస్తామని సీఎం ప్రకటించారు. తొలుత ఎన్టీఆర్‌ హయాంలో, తర్వాత తన హయాంలోనే రాయలసీమ అభివృద్ధితోపాటు తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయన్నారు. ‘‘పట్టిసీమ ద్వారా సీమకు నీరిచ్చేందుకు ప్రయత్నిస్తుంటే.... మీ జిల్లా నాయకుడు (జగన్‌) తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళ్లి మీ ప్రాంత నీటిని సీమకు తీసుకెళ్తున్నారని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అమరావతి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు’’ అంటూ జగన్‌ పేరెత్తకుండానే మండిపడ్డారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే ప్రారంభమయ్యాయని, వాటన్నింటినీ పూర్తి చేస్తామని తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి కారకులుగా చెప్పుకోవాల్సిన వారిలో నాడు ఎన్టీఆర్‌ అని, నేడు తానేనని చంద్రబాబు తెలిపారు. గత పాలకులు ఏం చేశారో తాను చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు.
 
కర్నూలుకు వరాలు...
తొలుత కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో ఉర్దూ యూనివర్సిటీకి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ముస్లింల సంక్షేమం కోసం పాటుపడిన అబ్దుల్‌హక్‌ పేరుతో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. విద్యపరంగా కర్నూలు జిల్లాను అభివృద్ధి చెస్తామని, 900 ఎకరాల్లో ఎడ్యుకేషన్‌ హబ్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అమరావతిలో, విశాఖతోపాటు రాయలసీమలోని కర్నూలులో ఎడ్యుకేషన్‌ హబ్‌ ఉంటుందని... పక్కనే విమానాశ్రయం కూడా వస్తుందని చెప్పారు. తాను సీఎం అయిన తరువాత తొలి స్వాతంత్య్ర వేడుకలను కర్నూలులో నిర్వహించినప్పుడు చేసిన వాగ్దానాల్లో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు ముఖ్యమైందన్నారు. 125 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ వర్సిటీకి ముందస్తుగా రూ.20 కోట్ల నిధులు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల స్టడీ సర్కిళ్ల మాదిరే కర్నూలులో ముస్లింలకు స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేస్తామని సీఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. వచ్చే సంవత్సరంలో ఉర్దూ డీఎస్సీని నిర్వహిస్తామని, ఉర్దూ మీడియం వారికి నేరుగా పదో తరగతి చదివే సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. ఆ మేరకు విద్యాశాఖమంత్రికి ఆదేశాలిచ్చామని తెలిపారు. కర్నూలుకు పూర్వ వైభవం తెచ్చేందుకు అవసరమైతే జిల్లాకు 20 సార్లు వస్తానని చెప్పారు. ‘‘హైదరాబాద్‌, బెంగళూరు, అమరావతి నగరాల మధ్యన కర్నూలు ఉంది. ప్రపంచంలోని పెట్టుబడిదారులు కర్నూలు వైపు చూస్తున్నారు. వారి రాకతో జిల్లాకు రూ.40వేల కోట్ల పెట్టుబడులు, 30వేలకు పైగా ఉద్యోగాలు వస్తాయి. ప్రస్తుతం కర్నూలు నుంచి బెంగళూరు మూడు నాలుగు గంటల్లో వెళుతున్నారు. అమరావతికి కూడా నాలుగు గంటల్లో చేరుకునేలా ఆరు, ఎనిమిది లేన్ల రహదారులను నిర్మిస్తాం’’ అని చంద్రబాబు ప్రకటించారు. కర్నూలు జిల్లాకు ఇచ్చిన హామీల్లో ఇంకా పెండింగ్‌లో ఉన్న... నంద్యాల్లో సీడ్‌ క్యాపిటల్‌, డోన్‌లో మైనింగ్‌ కళాశాల, టూరిజం సర్క్యూట్‌, ఆలూరులో జింకల పార్కు, కర్నూలు పెద్దాసుపత్రిని సూపర్‌ స్పెషాలిటీ స్థాయికి మార్పు, స్మార్ట్‌ సిటీగా కర్నూలు వంటివి వీలైనంత త్వరగా అమలు చేస్తామన్నారు. జిల్లాలో పేద ముస్లింల వివాహాల కోసం 171 మందికి రూ.85,50,000, ముస్లిం మహిళా సంఘాలకు రూ.8 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ నెల నుంచి ఇమామ్‌లకు రూ.5వేలు, మౌజుమ్‌లకు రూ.3 వేల ప్రకారం గౌరవవేతనం అందిస్తామన్నారు. ఓర్వకల్లులో షాదీఖానా నిర్మిస్తామని, కర్నూలులో హజ్‌హౌజ్‌ను పూర్తిచేసి జిల్లాలోని 28వేల ఎకరాల హజ్‌ ఆస్తులను కాపాడతామన్నారు. గోరుకల్లు పెండింగ్‌ రిజర్వాయర్‌ పనులను వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించామని, 2016 జూన్‌ నాటికి రిజర్వాయర్‌లో 12.5 టీఎంసీల నీటిని నిల్వ చేయడం తథ్యమని సీఎం ప్రకటించారు.
 
               గతేడాది రాష్ట్రంలో ఎండిపోయిన పంటల విలువ రూ.690 కోట్లని చంద్రబాబు చెప్పారు. ఈ మొత్తంలో 50% వెచ్చించి వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు చేతికి వచ్చేందుకు అవసరమైన ఒకతడి, రెండు తడులు రెయిన్‌గన్‌, మొబైల్‌ స్ర్పింక్లర్ల వ్యవస్థను అమలు చేయనున్నట్టు వెల్లడించారు. అనంతరం పాణ్యం నియోజకవర్గంలోని గోరుకల్లు ప్రాజెక్టు పనులను సీఎం పరిశీలించారు. ప్రాజెక్టు పనులకు అదనంగా మరో రూ. 30 కోట్లు కేటాయించారు. కర్నూలు పర్యటన ముగించుకుని అక్కడి నుంచి సీఎం కడప జిల్లా గండికోట రిజర్వాయరుకు వెళ్లారు. ముద్దనూరులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. సముద్రంలోకి పోతున్న నీటిని నదుల అనుసంధానం ద్వారా తీసుకురాగలిగితే కడప జిల్లాకు 80 లేదా 90 టీఎంసీలు, అనంతపురానికి 30 నుంచి 40 టీఎంసీలు, కర్నూలుకు 70 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోడానికి వీలవుతుందన్నారు.
 
రోడ్డు మార్గంలో...
ఓర్వకల్లు నుంచి చంద్రబాబు హెలికాప్టర్‌లో ముద్దనూరుకు వెళ్లాల్సి ఉంది. కానీ... వాతావరణ అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గంలో వెళ్లారు. దీంతో అక్కడ సమావేశం 5 గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి, దేవినేని ఉమా, రావెల కిశోర్‌బాబు, శాసనమండలి చైర్మన్‌ చక్రపాణి,ఎంపీ సీఎం రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment