Thursday 27 October 2016

ట్రైబ్యునల్‌ తీర్పు నష్టదాయకమే

ట్రైబ్యునల్‌ తీర్పు నష్టదాయకమే
28-10-2016 01:10:13
 న్యాయపోరే శరణ్యం: సలహా కమిటీ
హైదరాబాద్‌, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): బ్రిజేష్ కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు తెలంగాణ ప్రయోజనాలకు నష్టదాయకమని అంతరాష్ట్ర జలవనరుల శాఖ సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) అంచనాకు వచ్చింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లడమే మార్గమని అభిప్రాయపడింది. దీనిపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ట్రైబ్యునల్‌ తీర్పుపై టీఏసీ గురువారం జలసౌధలో సమావేశమైంది. అంతరాష్ట్ర జల వనరుల విభాగం సీఈ నరసింహరావు ఆధ్వర్యంలో జరిగిన భేటీలో టీఏసీ సభ్యులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. ఎగువరాష్ర్టాల్లో లేని విధంగా తెలంగాణ, ఏపీలను మాత్రమే ప్రాజెక్టుల వారీగా నీటిని పంచుకోవాలనే తీర్పు రెండు రాష్ర్టాలకు, ముఖ్యంగా తెలంగాణకు నష్టం జరిగేదిగా ఉందని కమిటీ అభిప్రాయపడింది. తీర్పు ప్రకారం ట్రైబ్యునల్‌ రెండు రాష్ర్టాలకే పరిమితమైతే మనకు ఇబ్బందేనని టీఏసీ సభ్యులు అభిప్రాయపడ్డారు. తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లడమే మంచిదని, దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని కమిటీ అభిప్రాయపడింది. ట్రైబ్యునల్‌ తీర్పుపై వైఖరి ఖరారు కోసం ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఇరిగేషన శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆధ్వర్యంలోని ఈ కమిటీ ఇప్పటికే ఒకసారి సమావేశమై చర్చించింది. మళ్లీ ఈ నెల 29న సమావేశం కానుంది. ఈ కమిటీ నివేదిక ఇచ్చాక ప్రభుత్వం వైఖరిని ప్రకటించనుంది. ఆ లోపు అవసరమైతే అఖిలపక్ష భేటీ ఏర్పాటుచేసి, అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకోనుంది.

No comments:

Post a Comment