ముంపు ప్రాంతాలు ఆంధ్రాకే
కేంద్ర మంత్రి జైరాం రమేశ్
పోలవరం, మార్చి 11: సీమాంధ్ర ప్రాంతానికి కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని కేంద్ర మంత్రి జైరాంరమేశ్ స్పష్టంచేశారు. మంగళవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని, దేవరగొంది నిర్వాసిత గ్రామాన్ని, పునరావాస గ్రామాలను ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్ నుంచి నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి మ్యాప్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినందున 90 శాతం నిధులు కేంద్రమే భరిస్తుందని చెప్పారు.
ఖమ్మం జిల్లాలోని భద్రాచలం డివిజన్‌లో భద్రాచలం పట్టణం తప్ప ముంపునకు గురయ్యే మండలాలను ఆంధ్రాలో కలిపినట్టు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో మొత్తం 45 వేల కుటుంబాలు నిర్వాసితులవుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల నుంచి ఒక్క మీటర్ తగ్గిస్తే ఎంత ముంపు తగ్గుతుందనే విషయంపై పరిశీలన చేయాల్సిందిగా ఇంజనీర్లకు చెప్పినట్లు వివరించారు. 2013 సెప్టెంబర్‌లో పార్లమెంట్ సమావేశంలో ప్రత్యేక భూసేకరణ చట్టం చేశామని, ఆ మేరకు నిర్వాసితులకు కూడా న్యాయం చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. రూ.16 వేల కోట్ల ఖర్చుతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును ఐదు సంవత్సరాలలో పూర్తిచేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో విశాఖకు తాగునీరు, కృష్ణా డెల్టా స్థిరీకరణ జరుగుతుందన్నారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జైరాం వెంట జాతీయ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు, పోలవరం ప్రాజెక్టు ఎస్ఈ పోలేశ్వరరావు తదితరులున్నారు.
No comments:
Post a Comment