న్యాయమైన ప్రాతినిథ్యం కోసం బ్రాహ్మణ ఉద్యమం
రంగవజ్జుల భరద్వాజ
విజయవాడ కాంగ్రెస్ లో కొత్త సమీకరణలు
మొదలయ్యాయి. సమైక్యవాద ఉద్యమానికి ప్రధాన నేతల్లో ఒకడిగా కొనసాగిన విజయవాడ యంపి
లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజకీయాల నుండి తప్పుకోవడంతో ఈ పరిణామాలు
ఊపందుకుంటున్నాయి. ఒకవైపు నిన్నటిదాక
కాంగ్రెస్ లో పదవులన్నీ అనుభవించినవాళ్ళు
ఇతర పార్టీలలోనికి వలసలు పోతుంటే, మరో వైపు ఆ ఖాళీని పూరించడానికి కాంగ్రెస్ కు సాంప్రదాయ మద్దతుదారులైన దళిత,
బహుజన, బ్రాహ్మణ వర్గాలు స్వగృహానికి తిరిగి రావడానికి ఉత్సాహం చూపుతుండడం కొత్త
పరిణామం. నిన్నటివరకు లగడపాటి
రాజగోపాల్ లేనిదే విజయవాడ కాంగ్రెస్ లేదని చాలా మంది భ్రమించేవారు.
ఇప్పుడు రాజగోపాల్ కాంగ్రెస్ లో లేకున్నా కేంద్ర
మంత్రి జైరామ్ రమేష్, ఏఐసిసి యస్సీ విభాగం కన్వీనర్ కొప్పుల రాజు ఇటీవల జరిపిన విజయవాడ పర్యటన విజయవంతం అయింది.
కాంగ్రెస్ లోనికి సాంప్రదాయ అభిమానుల
తిరుగువలస మొదలయిందనడానికి ఇది నిదర్శనం.
ఆంధ్రప్రదేశ్ లో బ్రాహ్మణ సామాజికవర్గానికి
చెందిన అభ్యర్ధులు గెలవడానికి అవకాశంవున్న రెండు, మూడు నిమోజకవర్గాల్లో విజయవాడ ఒకటి. 1952లో జరిగిన తొలి లోక్ సభ ఎన్నికల్లో సరోజిని
నాయుడు సోదరుడు, బహుముఖ
ప్రజ్ఞాశాలి హరీద్రంనాధ్ ఛట్టోపాధ్యాయ విజయవాడ
నుండి గెలిచారు. రెండవ లోక్ సభ ఎన్నికల్లో డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ విజయం
సాధించగా, విఖ్యాత నీటిపారుదల ఇంజినీర్ డాక్టర్ కెయల్ రావు
వరుసగా మూడు, నాలుగు, ఐదవ లొక్ సభ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్
సాధించారు. 1967 ఎన్నికల్లో
విజయవాడ నియోజకవర్గ ప్రజలు కేఎల్ రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నాస్తికోద్యమ
నాయకుడు గోపరాజు రామచంద్రరావు (గోరా)
కుమార్తె చెన్నుపాటి విద్య విజయవాడ లోక్ సభ
నుండి రెండుసార్లు ఎన్నికయ్యారు. 1952 నుండి 1991 వరకు విజయవాడకు
ప్రాతినిధ్యం వహించిన తొమ్మిది మంది ఎంపీల్లో ఏడుగురు బ్రాహ్మణులే కావడం విశేషం. వీరిలో
హరీన్ ఛట్టో స్వతంత్ర అభ్యర్ధిగా పోటిచేయగా మిగిలిన వాళ్లందరూ కాంగ్రెస్
టిక్కెట్టుపై పోటీచేసి గెలిచారు. ఈ నేపథ్యంలోనే, విజయవాడలో “కాంగ్రెస్ టిక్కెట్టు, బ్రాహ్మణ అభ్యర్ధి అనేది విన్నింగ్ కాంబినేషన్” అనే మాట ప్రాచూర్యాన్ని పొందింది.
అయితే, రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం ప్రవేశించాక
సన్నివేశం మారింది. 1984
ఎన్నికల్లో టిడిపి కి చెందిన వడ్డే శోభనాద్రీశ్వర రావు విజయవాడ యంపీగా గెలిచారు. 1991 తరువాత విజయవాడ నియోజకవర్గం పూర్తిగా కమ్మ సామాజికవర్గం హస్తగతమై పోయింది. ఆ సామాజిక
వర్గానికి చెందిన పర్వతనేని ఉపేంద్ర రెండుసార్లు, గద్దే రామ్మోహన్ ఒకసారి, లగడపాటి రాజగోపాల్ రెండుసార్లు విజయవాడ పార్లమెంటరీ
నియోజకవర్గం నుండి గెలిచారు.
గడిచిన మూడు దశాబ్దాల కాలంలో రాజకీయాల్లో
మరీ ముఖ్యంగా కాంగ్రెస్ రాజకీయాల్లో వ్యాపార పోకడలు, కార్పొరేట్ ధోరణులు పెరిగిపోవడంతో సాంప్రదాయ కాంగ్రెస్ నాయకులు వాటితో పోటీపడలేక క్రమంగా ఆ పార్టీకి
దూరం అయ్యారు. యస్సీలు, ముస్లింలు,
బ్రాహ్మణ సామాజికవర్గం అవకాశం
దొరికినప్పుడెల్లా కాంగ్రెస్ మీద తమ నిరసనని వ్యక్తం చేస్తూనే వున్నారు.
1994 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి చెన్నుపాటి
(వంగవీటి) రత్నకుమారికి పోటీగా బ్రాహ్మణ
సంఘం తమ అభ్యర్ధిగా శిష్ట్లా నరసింహ మూర్తిని రంగలోనికి దించి నిరసనని వ్యక్తం
చేసింది. కాంగ్రెస్ మీద బ్రాహ్మణ
సామాజికవర్గంలో పెరుగుతున్న అసంతృప్తిని 1999 ఎన్నికల్లో బీజేపి తనకు అనుకూలంగా
మార్చుకుంది. విజయవాడ తూర్పు నియోజక
వర్గంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన సినీనటుడు కోట
శ్రీనివాసరావును పోటీకి దించి విజయం సాధించింది. కాంగ్రెస్ మీద బ్రాహ్మణవర్గాల
నిరసన ఏ స్థాయికి పోయిందంటే గత లోక్ సభ ఎన్నికల్లో, బహుజన సమాజ్ పార్టి పక్షాన తమ
సామాజికవర్గానికి చెందిన శిష్ట్లా నరసింహ మూర్తిని అభ్యర్ధిగా మళ్ళీ రంగంలోనికి
దించింది.
కాంగ్రెస్ దాదాపు మూడున్నర దశాబ్దాల తరువాత 2009 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్
టిక్కెట్టును కాంగ్రెస్ బ్రాహ్మణ
సామాజికవర్గానికి చెందిన మల్లాది విష్ణుకు ఇచ్చి విజయం సాధించింది. విష్ణు విజయం
కాంగ్రెస్ - బ్రాహ్మణ విన్నింగ్ కాంబినేషన్ ను మరోసారి గుర్తు చేసింది.
రాజమండ్రి నుండి గెలిచిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక్కరే 2009 లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తమ్మీద యంపీగా గెలిచిన బ్రాహ్మణ
అభ్యర్ధి. రాష్ట్ర విభజన నేపథ్యంలో
ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుతం కాంగ్రెస్ బహిష్కృత యంపీగా వున్నారు. ప్రస్తుతం
రాష్ట్రం మొత్తమ్మీద బ్రాహ్మణులకు పార్లమెంటులో ప్రాతినిధ్యంలేదని ఆ
సామాజికవర్గాలు గుర్తుచేస్తున్నాయి.
సీమాంధ్రలో ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితి 1978 ఎన్నికలను తలపిస్తున్నాయి. 1977లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు రాష్ట్రంలోని 42 నియోజకవర్గాలలోనూ కాంగ్రెస్ అభ్యర్ధుల్ని
గెలిపించుకున్నారు. దానితో ఆత్మవిశ్వాసం అతిశయించిన వెంగళరావు, కాసు బ్రహ్మానందరెడ్డితో కలిసి ఇందిరా
గాంధీతో విభేదించి రెడ్డి కాంగ్రెస్
స్థాపించారు. అప్పట్లో, రాష్ట్ర
కాంగ్రెస్ అతిరథమహారథులంతా వెంగళరావు పక్షం వహించగా, ఇందిరా కాంగ్రెస్ కు చెప్పుకోదగ్గ అభ్యర్ధులే కరువయ్యారు.
కష్టకాలంలో దళిత, మైనారిటీ,
బ్రాహ్మణవర్గాలు ఇందిరా కాంగ్రెస్
పక్షం వహించాయి. ''అప్రతిష్టపాలైన
సిట్టింగ్ అభ్యర్ధులకన్నా, ఎవరికీ తెలీని కొత్త అభ్యర్ధే మేలు''
అనే విజయమంత్రానికి అనుగుణంగా ఇందిరా కాంగ్రెస్ పెద్ద ఎత్తున బడుగు
బలహీనవర్గాలని రంగంలోనికి దించింది. 1978 ఎన్నికల్లో వెంగళరావు నాయకత్వంలోని రెడ్డి కాంగ్రెస్ ఘోరపరాజయం పాలవ్వగా, బడుగు బలహీనవర్గాలను నమ్ముకున్నఇందిరా కాంగ్రెస్
ఘనవిజయాన్ని సాధించింది. కాంగ్రెస్ కు మళ్ళీ
అలాంటి మహర్దశ పట్టబోతుందంటున్నారు ఆనాటి పరిణామాలకు ప్రత్యక్షసాక్షులైన వాళ్ళు.
బ్రాహ్మణ ప్రతినిధులు స్వచ్చమైన
రాజకీయాలను కొనసాహించారనీ అందరికీ తెలుసు. గత కాలపు విజయవాడ రాజకీయాలను
పరిశీలించిన ఎవరికైనా ఈ విషయం సులువుగా అర్ధం అవుతుంది. కార్పొరేట్ రేట్
రాజకీయాలకు బలి అయిపోతున్నది కేవలం బ్రాహ్మణవర్గం మాత్రమేకాదు, దళిత బహుజన మత
అల్పసంఖ్యాకవర్గాలు సహితం బాధితులుగా మారుతున్నారు. వాళ్ళంతా ఇప్పుడు ఏకం
అవుతున్నారు.
టిడిపీలో చేరలేక, బీజేపి వర్తమాన రాజకీయాలు నచ్చక కాంగ్రెస్ కు
దూరంగా వుంటున్న సాంప్రదాయ కాంగ్రెస్ ఓటర్లు
తిరిగి మాతృసంస్థకు చేరుకునే ప్రక్రియ అప్పుడే మొదలయింది. ప్రస్తుతం,
వెలవెలా పొతున్న విజయవాడ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ తన సాంప్రదాయ ఓటు బ్యాంకైన బడుగుబలహీన బ్రహ్మణ
వైశ్యవర్గాలు తిరిగిరావడంతో త్వరలోనే కళకళలాడుతుందని ఆశించడం అతిశయోక్తికాదు!
(రచయిత సీమాంధ్ర బ్రాహ్మణ రాజకీయ చైతన్య వేదిక కన్వీనర్)
మొబైల్ : 90528 64555
హైదరాబాద్
5 మార్చి 2014
No comments:
Post a Comment