Tuesday 4 March 2014

ఖాళీ చేయడానికి టీడీపీ బ్రాందీ సీసానా?

ఖాళీ చేయడానికి టీడీపీ బ్రాందీ సీసానా?

Published at: 05-03-2014 06:12 AM
 New  0  0 
 
 

హైదరాబాద్, మార్చి 4: "తెలుగుదేశం..అభివృద్ధి పార్టీ. తెలంగాణను, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి చూపించింది. లక్షల ఉద్యోగాలు తెచ్చింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ది వసూళ్ల పార్టీ. కేసీఆర్ కుటుంబ సభ్యులు రాష్ట్రంపై పడి ఇష్టానుసారం వసూళ్లు చేసి తమ కుటుంబాల ఆస్తులు పెంచుకొన్నారు' అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. నల్లగొండ పట్టణానికి చెందిన సీపీఎం నేత కొండూరి సత్యనారాయణతోపాటు కాంగ్రెస్, వైసీపీల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మంగళవారమిక్కడ ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ వ్యవహార శైలిపై చంద్రబాబు విమర్శల వర్షం కురిపించారు. "ఢిల్లీలో ఏం జరిగినా అంతా తనకు తెలిసే జరుగుతోందని, అన్నీ తనను అడిగే చేస్తున్నారని ఇంతకాలం కేసీఆర్ డంబాలు చెబుతూ వచ్చారు. ఇప్పుడు తనకు ఏదీ చెప్పలేదని, సీడబ్ల్యూసీ తీర్మానం చేస్తున్న విషయం కూడా తనకు చెప్పలేదని అంటున్నారు. మరి ఇంతకాలం ఈ బూటకపు మాటలు ఎందుకు చెప్పినట్లు? రాష్ట్రంలో నదులపై కేంద్రం అన్ని అధికారాలూ తీసుకొందని, గవర్నర్‌కు హైదరాబాద్‌పై విస్తృత అధికారాలు ఇచ్చారని, ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వలేదని ఇప్పడు చెబుతున్నారు. ఇవన్నీ నేను ఎంతకాలం క్రితం చెప్పాను? అప్పుడు ఎందుకు నోరు మెదపలేదు? కేసీఆర్ ఒక దొంగ. ప్రజల కోసం పోరాడిన చరిత్ర ఏనాడూ లేదు. ఇంటికో ఉద్యోగం, కుటుంబానికి మూడు ఎకరాల పొలం ఇప్పిస్తానని అనేక వాగ్దానాలు చేశారని, వాస్తవంలో కేసీఆర్ ఆయన కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు.
'జాబ్ రావాలంటే బాబు రావాలి': 'జాబ్ రావాలంటే బాబు రావా'లని యువత అంటున్నారు తప్ప కేసీఆర్ రావాలని ఎవరూ అనడం లేదన్నారు. "కేసీఆర్ ఇదే ఆఫీసులో(ఎన్టీఆర్ భవన్) నా వద్దే రాజకీయంగా పెరిగాడు. నేను గురువును. మంచిదారిలో తీసుకువెళ్దామనుకొంటే మరెటో పోయి ఇప్పుడు టీడీపీనే ఖాళీ చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఖాళీ చేయడానికి టీడీపీ ఏమైనా బ్రాందీ బాటిలా?'' అని సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రా పార్టీలు తెలంగాణలో ఎందుకన్న కేసీఆర్ వ్యాఖ్యపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. కేసీఆర్‌పై కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. 'కేసీఆర్ ఎక్కడ నుంచి వచ్చా'రని ఆయన అడిగినప్పుడు 'విజయనగరం' అని కొందరు కేకలు వేశారు. 'ఆయనకు రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీ ఏది' అని చంద్రబాబు అడిగినప్పుడు, 'టీడీపీ' అని ప్రతిస్పందన వచ్చింది. "రాజకీయంగా ఎదిగి పదవులు తీసుకొన్నప్పుడు ఇది ఆంధ్రా పార్టీ కాదు. ఇప్పుడైందా? పెంచి పెద్దచేసిన తల్లిని ఎవరూ అవమానించరు. కాని కేసీఆర్ ఆ పని కూడా చేస్తున్నాడు. తల్లిని గౌరవించలేనివాడు ప్రజలను గౌరవిస్తాడా?'' అని నిలదీశారు.
మేమొస్తే గొడవలన్నీ పోతాయి: "అటూ ఇటూ రెండు రాష్ట్రాల్లో టీడీపీనే గెలుస్తుంది. అలా గెలిస్తేనే కరెంటు కోతలు ఉండవు. నీళ్ల తగాదాలు ఉండవు. రెండు చోట్లా మనం గెలిస్తే కేంద్రంలో కూడా చక్రం తిప్పుతాం. సీమాంధ్ర నిర్మాణం, తెలంగాణ పునర్నిర్మాణం మన చేతుల మీదుగా చేస్తాం. తెలంగాణలో సామాజిక న్యాయం చేసి సామాజిక తెలంగాణ నిర్మిస్తాం. బీసీ వర్గాల వారిని ముఖ్యమంత్రిని చేస్తాం. తెలంగాణ గద్దెపై పేదల రాజ్యం స్థాపిస్తాం'' అని బాబు వెల్లడించారు. పార్టీ నుంచి ఒక వ్యక్తి పోతే వంద మందిని తయారు చేస్తామని, తన లాంటివారిని వందల మందిని తయారు చేసి పార్టీకి అందిస్తానని చెప్పారు. "కేసీఆర్, జానారెడ్డి, జైపాల్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వంటివారికి పదేళ్ల కిందట ఉన్న ఆస్తులు...ఇప్పుడు ఉన్న ఆస్తులేమిటో ప్రజలకు తెలుసు. పేదల కోసం చేసిన అభివృద్ధిని పెద్దలు మింగేశారు'' అని విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన మాజీ ఎమ్మెల్సీ కుమార్తె భూపతి సుమతి కూడా టీడీపీలో చేరారు.
- See more at: http://www.andhrajyothy.com/node/72100#sthash.uMcJa6fE.dpuf

No comments:

Post a Comment