Friday 10 June 2016

ఏపీ ఉద్యోగుల స్థానికతపై రాష్ట్రపతి ఆమోదముద్ర

ఏపీ ఉద్యోగుల స్థానికతపై రాష్ట్రపతి ఆమోదముద్ర
10-06-2016 10:57:37

న్యూఢిల్లీ : ఏపీ ఉద్యోగుల స్థానికతకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించి నాలుగు పేజీల గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. స్థానికతపై మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వమే విడుదల చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణలో స్థిరపడి విభజన నేపథ్యంలో తిరిగి ఏపీకి వెళ్లే వారి స్థానికతపై స్పష్టత లేకుండా పోయింది. తాజా నోటిఫికేషన్‌తో స్పష్టత ఏర్పడింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే వారికి అక్కడ స్థానికత వర్తించే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి గెజిట్ నోటీఫికేషన్‌ను విడుదల చేశారు.
 
స్థానికతకు సంబంధించి అడ్డంకులను తొలగించాలని కోరుతూ సీఎం చంద్రబాబు గత అక్టోబర్‌లో ఏడు పేజీల లేఖ రాసిన విషయం తెలిసిందే. సుమారు ఎనిమిది నెలల కసరత్తు అనంతరం స్థానికతపై తుది నిర్ణయం తీసుకున్నారు. గత సోమవారమే ఈ ఫైల్‌ను రాష్ట్రపతి భవన్‌కు పంపగా ఈరోజు నోటిఫికేషన్‌ను జారీ అయింది. 2017 జూన్ 2నాటికి ఏపీకి తరలివెళ్లే ఉద్యోగులు, వారి పిల్లలు, సామాన్య ప్రజలకు స్థానికత కల్పించేలా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్‌తో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ఉద్యోగుల స్థానికత అంశానికి ముగింపు పలికినట్లైంది.

No comments:

Post a Comment