Thursday 16 January 2014

నిర్ణయాత్మక నాయకత్వం అవసరం - మోదీ

ఆర్థిక దుస్థితి నుంచి దేశం బయటపడాలంటే నిర్ణయాత్మక నాయకత్వం అవసరం

Published at: 16-01-2014 04:39 AM
 New  0  0 
 
 

ఫిక్కి సమావేశంలో మోదీ వ్యాఖ్య
గాంధీనగర్/అహ్మదాబాద్, జనవరి 15: "యూపీఏ సర్కారులో బాధ్యతను స్వీకరించగల వారెవరూ లేకపోవడమే దేశం ఆర్థిక దుస్థితిలో కూరుకుపోవడానికి కారణం. ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే నిర్ణయాత్మక శక్తిగల నాయకత్వం ఎంతో అవసరం'' అని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఫిక్కి) బుధవారం గాంధీనగర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. "అభివృద్ధిలో మౌలిక సదుపాయాలు కీలకం. ఇందులో ఇంధన రంగ ప్రాధాన్యం అపారం. ఇంధన కొరతవల్లే పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఎవరో ఒకరు ఇందుకు బాధ్యత స్వీకరించాలి. కానీ, ఈ దేశంలో ఎవరూ అందుకు సిద్ధంగా లేరు. అయినా, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలంటే నిపుణులు అవసరమా?'' అన్నారు. ప్రశంసలు అందుకోవడమే కాదు... ప్రతికూలతకు ఎదురొడ్డి నిలవగల స్థితప్రజ్ఞత కూడా అవశ్యమన్నారు. ప్రజలు మనపై ఉంచిన గురుతర బాధ్యతను సవాలుగా స్వీకరించాలి తప్ప పారిపోతే దేశం ఎలా ముందడుగు వేస్తుందని ప్రశ్నించారు.
"పాట్నాలో పేలుళ్లు జరిగితే మీరెందుకు పారిపోయారని కొందరు నన్ను ప్రశ్నించారు. కానీ, పారిపోయేవాడైతే మోదీ అసలు జన్మించి ఉండేవాడు కాదన్నదే దీనికి నా సమాధానం'' అన్నారు. పథక రచన, అమలు వ్యూహం, పని విభజన, వనరుల సద్వినియోగంపై నిర్ణయాత్మకంగా వ్యవహరించి ఉంటే దేశ పురోగమనం మరో రకంగా ఉండేదన్నారు. కానీ, అలాంటి అవకాశాన్ని కోల్పోయామని, 21వ శతాబ్దంలో తొలి దశాబ్దం ముగిసేసరికి మిగిలినవన్నీ ప్రశ్నార్థకాలేనని ఎద్దేవా చేశారు. "కాబట్టే ఇప్పుడు సమర్థ నాయకత్వం, కచ్చితమైన నిర్ణయాత్మక శక్తి అవశ్యం'' అని స్పష్టం చేశారు.
ప్రధాని మన్మోహన్ 'సమ్మిళిత అభివృద్ధి' గురించి మాట్లాడతారుగానీ, పేదలను విద్యావంతుల్ని చేసి, సామర్థ్యం పెంపునకు ప్రయత్నించకుండా అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇక మైనారిటీ యువత అరెస్టు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర హోం మంత్రి షిండే రాష్ట్రాలకు సూచించడం మైనారిటీలను ఆకట్టుకోవడానికి 'నిస్సిగ్గు'గా ప్రయత్నించడమేనని దుయ్యబట్టారు. దీనిపై ఆయనకు హితవు చెప్పాలంటూ ప్రధానికి మోదీ లేఖ రాశారు. షిండే వైఖరి ఉగ్రవాద కేసులపై చట్టాలు అమలు చేసే యంత్రాంగాలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని హెచ్చరించారు. నేరాలకు మతాలతో సంబంధం లేదన్న వాస్తవాన్ని షిండే గుర్తించాలన్నారు.
- See more at: http://www.andhrajyothy.com/node/54447#sthash.KzOSv2PQ.dpuf

No comments:

Post a Comment