పార్లమెంటులో సినిమా చూపిస్తాం
అసెంబ్లీ నిర్ణయాన్ని కాదని విభజన ఎలా చేస్తారో చూస్తాం
ఎన్నికల ముందు విభజన జరగదు
అసెంబ్లీలో మద్దతు ఇవ్వాలని కోరుతూ సంకల్ప దీక్ష : లగడపాటి
ఎన్నికల ముందు విభజన జరగదు
అసెంబ్లీలో మద్దతు ఇవ్వాలని కోరుతూ సంకల్ప దీక్ష : లగడపాటి
హైదరాబాద్, జనవరి 2: అసెంబ్లీ నిర్ణయాన్ని కాదని పార్లమెంట్‌లో బిల్లు ముందుకు తీసుకెళ్లడం ఎవరి తరం కాదని.. అలా చేస్తే పార్లమెంట్‌లో సినిమా చూపిస్తామని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. తన నివాసంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు జాతిని, తెలుగు రాష్ట్రాన్ని ముక్క చెక్కలు కాకుండా కాపాడాలని ఎమ్మెల్యేలను కోరుతూ అసెంబ్లీ జరిగే సమయంలో హైదరాబాద్‌లో సంకల్ప దీక్ష చేపట్టనున్నామన్నారు. అసెంబ్లీ అభిప్రాయం చెప్పాల్సి వచ్చినప్పుడు, ఓటింగ్ సమయంలో సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని.. అసెంబ్లీ బలమైన సమైక్యవాదాన్ని వినిపిస్తే రాష్ట్రపతికి పరిస్థితి అవగతమవుతుందని చెప్పారు. అసెంబ్లీ నిర్ణయాన్ని ఆయన పరిగణనలోకి తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ప్రభావం పడుతుందని, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ఏమి జరిగిందో ఎన్టీఆర్ విషయంలో నిరూపణ అయిందని తెలిపారు.
ఎట్టి పరిస్థితుల్లోను ఎన్నికల ముందు విభజన జరగదన్నారు. తాము పార్లమెంట్‌లో అవిశ్వాసం పెడితే 70 మంది మద్దతు లభించిందని, చివరకు కేంద్రం చర్చ జరగనీయకుండా వాయిదా వేసిందని, అలాగే, క్షేత్రస్థాయిలో చైతన్యం తెచ్చేందుకు సంకల్పించామని తెలిపారు. అసెంబ్లీలో చర్చ జరిగితే విభజన కావాలనుకున్న వారిలో, ప్రజల్లో మార్పు వచ్చే అవకాశముందన్నారు. సమష్టిగా ఏ విధంగా అభివృద్ధి చెందామో తేటతెల్లం చేయడం ద్వారా సామరస్య వాతావరణం కల్పించాలని కోరుతూ ఈ దీక్ష చేస్తున్నామన్నారు. ఎవరినీ రెచ్చగొట్టడానికి కాదన్నారు. తన కేబినెట్‌లో మంత్రులను మార్చే అధికారం పూర్తిగా ముఖ్యమంత్రికే ఉంటుందని, పార్టీ గానీ, అధిష్ఠానం గానీ సూచనలు మాత్రమే చేయవచ్చని చెప్పారు. రాష్ట్ర ఆదాయం పెంచేందుకే శ్రీధర్‌బాబుకు ఇంకా మంచి శాఖ ఇచ్చారని, ఆయన సీఎంకు సన్నిహితుడని, వారిద్దరి మధ్య జోక్యం చేసుకోవడం తగదని చెప్పారు. సీఎంపై ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు సరికాదన్నారు.
No comments:
Post a Comment