Wednesday 31 July 2013

Grant 5 lk. Cr. for new capital city - Chandrababu

హైదరాబాద్‌కు దీటుగా రాజధాని

August 01, 2013
హైదరాబాద్, జూలై 31 : "విభజన చేసేశాం...ఇక వెళ్లండి అనే వ్యవహారం సరికాదు. రాష్ట్ర విభజన పరిణామాల్లో ఎవరికీ హృదయవేదన మిగల్చవద్దు. ఇరుప్రాంతాల వారినీ సంతోష పెట్టండి'' అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకొన్న తర్వాత.. ఆ అంశంపై బుధవారం మధ్యాహ్నం తొలిసారి ఆయన ఇక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కొత్తగా రూపుదిద్దుకోబోయే రాష్ట్రంలో హైదరాబాద్‌కు అన్ని విధాలుగా సరితూగే రాజధాని ఏర్పడితే తప్ప ఆ ప్రాంతంలో ప్రజలకు నచ్చజెప్పడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.

"హైదరాబాద్‌కు దీటైన రాజధానిని కేంద్ర నిధులతో సీమాంధ్ర ప్రాంతంలో నిర్మించాలి. కొత్త రాజధానిని పూర్తి హంగులతో నిర్మించడానికి రూ.ఐదు లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించాలి. ఊరికే మాటలు కాకుండా రాష్ట్ర విభజనకు పెట్టే బిల్లులో దీనికి గ్యారంటీ ఇవ్వాలి. విభజన చేసిన పార్టీలతోపాటు దానికి మద్దతు ఇచ్చిన పార్టీలూ దీనికి బాధ్యత తీసుకోవాలి'' 'కొన్ని చారిత్రక కారణాల వల్ల రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు వెనకబడితే హైదరాబాద్ బాగా అభివృద్ది అయింది. ఈ స్థాయిలో మరో రాజధానిని రూపుదిద్దాలంటే మేం వేసిన లెక్కల ప్రకారం కనీసం రూ.4-5 లక్షల కోట్లు కావాలి. పదేళ్ల కాలపరిమితితో కేంద్ర ప్రభుత్వం రూ.ఐదు లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించాలి. ఏడాదికి రూ.ఏభై వేల కోట్లు ఇవ్వాలి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆదాయం ఏడాదికి రూ. 15 లక్షల కోట్లు ఉంది. త్వరలో అది రూ.20 లక్షల కోట్లకు పెరగబోతోంది. ఇంత ఆదాయం ఉన్నప్పుడు మేం అడుగుతున్నంత ఇవ్వడం సమస్య కాదు. ఏ ప్రాంతానికీఅన్యాయం జరగనీయబోమని కేంద్రం చెబుతోంది. అది మాటల్లో చూపించాలి. కొత్తగా ఏర్పడే రాష్ట్రం నిలదొక్కుకోవాలంటే ఆదాయం ఉండాలి. ఆదాయం రావాలంటే మంచి రాజధాని ఉంటేనే సాధ్యపడుతుంది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కంపెనీలు, పెద్ద విద్యా సంస్ధలు, పరిశోధన సంస్థలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, పరిశ్రమలు రావాలి. ఇవన్నీ రాబట్టే హైదరాబాద్ ఈ స్థాయికి చేరగలిగింది. కేంద్రం పూనుకొని ఇవన్నీ ఏర్పాటు చేయగలిగితే కొత్త రాజధాని కూడా ఆ స్థాయికి చేరడం సాధ్యపడుతుంది. తెలంగాణ ప్రాంతానికి కూడా అవసరమైనవి ఇవ్వాలి.

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి. నేను ఈ సమయంలో రాజకీయ వివాదాల జోలికి పోదల్చుకోలేదు. ఒక రాజనీతిజ్ఞునిగా చెబుతున్నాను. రెండు ప్రాంతాల ప్రజలకూ ఒక భరోసా ఇచ్చేలా వ్యవహరించగలిగితే ఆందోళనలు ఉపశమింపజేయవచ్చు. రాజధాని ప్యాకేజీ కోసం మా పార్టీ పోరాడుతుంది. ఢిల్లీలో అందరినీ కలిసి లాబీయింగ్ చేస్తుంది. ఇక్కడ అన్ని పార్టీలతో మాట్లాడుతుంది. ఏదో ఒక మాట చెప్పి పోతాం అంటే కుదరదు. ఆరు నెలల్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే తర్వాత బాధ్యత తీసుకొనేది ఎవరు? అందుకే పార్లమెంటు ముందు పెట్టే బిల్లులోనే ఈ ప్యాకేజిని చేర్చాలి. ఇది మా డిమాండ్' అని ఆయన చెప్పారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల్లో ఉద్యోగాలు, నదీ జలాలు, ఉపాధి అవకాశాలపై ఆందోళన నెలకొందని, వారిలో విశ్వాసం నింపేలా వాటిని పరిష్కరించడానికి ముందుకు రావాలని.. సమస్యలను వదిలేయడం కాకుండా వాటిని ముందు పెట్టుకొని పరిష్కరించే ప్రయత్నం జరగాలని ఆయన సూచించారు.

తమ పార్టీ తెలుగువారి కోసం పెట్టిన పార్టీ అని, తెలుగువారంతా ఆనందంగా ఉండాలని కోరుకొనే పార్టీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిణామానికి దారితీసిన చారిత్రక కారణాలు అనేకం ఉన్నాయని, ఎవరెవరు ఏమేం చేశారో దిగ్విజయ్ సింగేచెప్పారని ఆయన గుర్తుచేశారు. "కాంగ్రెస్ వాళ్లు రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను రేపో ఎల్లుండో అన్నీ మాట్లాడతాను. ఒక పక్క సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటిస్తూనే టీఆర్ఎస్ పార్టీ విలీనం గురించి మాట్లాడతారు. విజయశాంతి తమ పార్టీలో చేరుతోందంటూ లీకులు వదులుతారు. నేను ఈ రోజు రాజకీయాల గురించి మాట్లాడదల్చుకోలేదు. రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించదల్చుకోలేదు. సమయం వచ్చినప్పుడు అన్నీ మాట్లాడతాను'' అని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రకటన నేపథ్యంలో గుంటూరులో ఒక యువకుడు, విశాఖలో ఒక హోం గార్డు ఆత్మహత్య చేసుకొన్నారని.. ఆ సంఘటనలు దురదృష్టకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.మనోభావాలు గాయపడినప్పటికీ తొందరపాటుతో వ్యవహరించవద్దని, ఆత్మహత్యల జోలికి పోకుండా సంయమనంతో వ్యవహరించాలని ఆయన సీమాంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment