Wednesday 31 July 2013

Brain Wash to Kiran

ఎస్ మేడమ్.. ఎస్ మేడమ్

August 01, 2013

న్యూఢిల్లీ, జూలై 31: "మిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డీ.. మేం అన్నీ ఆలోచించే తెలంగాణపై ఒక నిర్ణయానికి వచ్చాం.. దీనివల్ల పార్టీకి, ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఈ నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రం ఇంకా సంక్షోభంలో ఉండడమే కాక, పార్టీ రెండు ప్రాంతాల్లో పూర్తిగా దెబ్బతింటుంది. మేం తెప్పించుకున్న ఏ నివేదికలోనూ పరిస్థితులు అనుకూలంగా కనిపించట్లేదు. ఇప్పటికైనా మీరు ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకోండి. దీన్ని వ్యతిరేకించడం వల్ల మీకు వచ్చే ప్రయోజనం లేదు. మేం వెనక్కు తీసుకునే అవకాశాలూ లేవు. అనుకూలంగా స్పందిస్తే మాత్రం మీ ప్రాంత ప్రయోజనాలను కాపాడతాం'' అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మంగళవారం సాయంత్రం సీఎం కిరణ్‌తో అన్నట్లు తెలిసింది.

"మేడమ్ మాటలను మీరు అంగీకరించక తప్పదు.. యూపీఏ సమన్వయ కమిటీ ఇప్పటికే తెలంగాణకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసింది. మరో గంటలో సీడబ్ల్యూసీ కూడా తీర్మానం చేస్తుంది.. ఆ తర్వాత మీరు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే పార్టీ ప్రయోజనాలు దెబ్బతింటాయి'' అని ప్రధాని మన్మోహన్ సింగ్ దాదాపు హెచ్చరిస్తున్న ధోరణిలో చెప్పారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. దీంతో సీఎం సానుకూలంగానే స్పందించారు. "లేదు మేడమ్.. మీరు చెప్పినట్లే జరుగుతుంది మేడమ్. నేను రాజీనామా చేస్తానని వచ్చిన వార్తలు నిజం కావు. వాటిని నిన్ననే ఖండించాను'' అని ఆయన చెప్పినట్లు సమాచారం.

మరి పార్టీ నిర్ణయాన్ని ఆమోదించినట్లేనా? అని సోనియా అడిగినప్పుడు.. 'ఎస్ మేడమ్' అని కిరణ్ ఒకే పదంతో తన సమాధానం చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో కూడా సోనియా, ప్రధాని మాట్లాడారు. పార్టీ పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకుంటానని బొత్స హామీ ఇచ్చిన తర్వాతే వారు సంతృప్తిపడినట్లు సమాచారం. మేడమ్‌తో సమావేశం తర్వాత వర్కింగ్ కమిటీ సమావేశం పూర్తి కాకుండానే ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి నిష్క్రమించారు.

సీమాంధ్ర మంత్రులు, ఎంపీలతోనూ...
దాదాపు 45 నిమిషాలపాటు జరిగిన సమావేశంలో సీఎం కిరణ్ నుంచి ఎలాంటి ధిక్కారస్వరం లేకుండా జాగ్రత్త పడిన సోనియాగాంధీ.. అంతకుముందు తనను కలిసిన సీమాంధ్ర మంత్రులను, ఎంపీలను కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు సమాచారం. తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండానే, దానిని పరిగణనలోకి తీసుకోకుండానే, పార్లమెంటులో ప్రవేశపెట్టి చర్చించకుండానే తెలంగాణ విభజన నిర్ణయం ఎలా తీసుకుంటారని సోనియాను కలిసిన సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు సమావేశంలో పాల్గొన్న ఒక నేత ఇచ్చిన సమాచారంతో అవాక్కవడం రాష్ట్ర నేతల వంతైంది. 'ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితుల్ని అర్థం చేసుకునేందుకు మాత్రమే హోం శాఖ ఆ కమిటీని నియమించింది. కాబట్టి, దానికి కేంద్రం కట్టుబడాల్సిన అవసరం లేదు. దానిపై ఆధారపడి నిర్ణయం తీసుకోవాల్సిన పని కూడా లేదు' అని ఆ ముఖ్యనేత నుంచి సమాధానం వచ్చింది. దీంతో సీమాంధ్ర నాయకులు దిగ్భ్రమ చెందారు. అంటే, కేవలం కాలయాపన కోసమే శ్రీకృష్ణ కమిటీని వేసినట్లు కాంగ్రెస్ అధిష్ఠానం పరోక్షంగా చెప్పినట్లయింది.

విభజనపై ముందే సమాచారం
తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులకు ముందే సమాచారం అందినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసేందుకు, విభజనకు సిద్ధం చేసేందుకు వీలుగానే అధిష్ఠానం ఇలా చేసినట్లు సమాచారం. అయితే, ఒకవైపు తెలంగాణ మంత్రులు.. ముఖ్యంగా జైపాల్ రెడ్డి, బలరాం నాయక్ తెలంగాణ వచ్చేసిందన్నట్లుగా వారం రోజుల ముందు నుంచే సమావేశాలు, ప్రైవేటు చర్చల్లో ధీమా వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. కానీ, సీమాంధ్ర మంత్రులు మాత్రం విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు. పైగా, రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందన్నట్లుగా వ్యవహరించారు.

అయితే, తమను ముందే ఎందుకు అప్రమత్తం చేయలేదని మంగళవారం సీమాంధ్ర ఎంపీలు కొందరు అధిష్ఠానాన్ని అడగ్గా.. 'అదేంటి? మేం ముందుగానే సమాచారం చేరవేశాం కదా!' అని సోనియా వారిని ఆరాతీశారు. 'లేదు మేడమ్.. మాకు సమాచారం అందలేదు' అని ఒక ఎంపీ అనగా.. సోనియా ఒక మంత్రిని ఉద్దేశించి.. "మిమ్మల్ని ఫలానా నేత సంప్రదించిన మాట నిజం కాదా? తెలంగాణ ఇస్తున్నట్లు ఆయన సమాచారం ఇచ్చారు కదా!''.. అని అడగడంతో ఆ మంత్రితోపాటు మిగతా మంత్రులూ అవునవునని తలలూపారు. దీంతో 'నేను తప్పు చేయలేదు.. బహుశా మీకే సమాచారం అందలేదు' అన్నట్లుగా సోనియా సదరు ఎంపీ వంక చూసినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.

No comments:

Post a Comment