Saturday 20 July 2013

Detroit files for Bankruptcy

కుప్పకూలిన మహానగరం

July 21, 2013
Andhrajyothy Daily 
అమెరికా ఆటోమొబైల్ పరిశ్రమకు పుట్టిల్లు డెట్రాయిట్ దివా లా తీసింది. ఒకప్పుడు జనాభారీత్యా అమెరికాలోని నాలుగు అగ్రగామి నగరాల్లో ఒకటిగా వెలుగువెలిగిన డెట్రాయిట్ నగరం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేయడం సంచలనాత్మకమే అయినా అనూహ్యం కాదు. అయితే ఒక మహానగర మున్సిపాలిటీ దివాలా పిటిషన్ దాఖలు చేయడం అత్యంత అరుదైన విషయం. డెట్రాయిట్ ఆర్థిక పతనం ఒక్కరోజులో వచ్చి పడింది కాదు. కొన్నేళ్లుగా కొనసాగుతున్న సంక్షోభ పర్యవసానం. మరీ ముఖ్యంగా 2008 ఆర్థిక సంక్షోభ తదనాంతర పరిస్థితులు డెట్రాయిట్‌ను చావుదెబ్బతీశాయి. డెట్రాయిట్ నగర పాలక వ్యవస్థపై పేరుకుపోయిన రుణ భారం 1,800-2,000 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. ఈ స్థాయి రుణ భారంతో దివాలా పిటిషన్ దాఖలు చేసిన మున్సిపాలిటీ డెట్రాయిట్ ఒక్కటే. 1950 సంవత్సరం తర్వాత అమెరికాలో దివాలా పిటిషన్ దాఖలు చేసిన నగరాలు, పట్టణాలు, కౌంటీలు 60కి పైగా ఉంటాయని అంచనా.


2011లో జెఫర్సన్ కౌంటీ (అలబమా) 400 కోట్ల డాలర్ల రుణ భారంతో దివాలా పిటిషన్ దాఖలు చేసినప్పుడు అదే అతిపెద్ద దివాలా పిటిషన్‌గా భావించారు. 70వ దశకంలో న్యూయా ర్క్, క్లెవ్‌లాండ్, 90వ దశకంలో ఫిలడెల్ఫియా కూడా దివాలా అంచుల్లోకి వెళ్లినప్పటికీ వ్యవహారం కోర్టు వరకు వెళ్లకుండానే పరిష్కారం దొరకబుచ్చుకుని బయటపడ్డాయి. అమెరికా ఆర్థిక రంగానికి సంబంధించి 20వ శతాబ్దం తొలి అర్దభాగంలో డెట్రాయిట్ ఒక ఊపు ఊపింది. ప్రధానంగా అటోమొబైల్ పరిశ్రమ విస్తరణ, వృది«్ధ, నగరం ఎదుగుదలకు దోహ దం చేశాయి. ఇందులో ఫోర్డ్‌ది ప్రధాన పాత్ర. 1950 నాటికి డెట్రాయిట్ జనాభా 18 లక్షలు. ముమ్మరంగా కొనసాగుతున్న పారిశ్రామిక కార్యకలాపాలతో, వర్తక వాణిజ్యాల కీలకకేంద్రంగా భాసిల్లింది. గత కొన్ని దశాబ్దాల్లో దృశ్యం మారిం ది. ఇప్పుడు జనాభా మొత్తం 7 లక్షల లోపే. ఎక్కడ చూసినా ఖాళీగా పడున్న బహుళ అంతస్తుల భవనాలు, ఫ్యాక్టరీలు, కళతప్పిన వీధులు పాతవైభవ చిహ్నాలుగా కనిపిస్తాయి. నగరంలో 40 శాతం వీధి దీపాలు వెలగడం లేదు. సగానికిపైగా పార్కులు గత ఐదేళ్లలో మూతపడ్డాయి. అనేక స్కూళ్లదీ అదే పరిస్థితి.

ఈ నగరం ఎంతవేగంగా అభివృద్ధి చెందిందో అంతే వేగంగా దిగజారుతూ వచ్చింది.
ఇందుకు ప్రధాన కారణం కూడా ఆటోమొబైల్ పరిశ్రమనే. 60-70 దశకాల్లో వచ్చిన మార్పులతో కొత్త కొత్త కార్లు అమెరికా మార్కెట్‌ను ముంచెత్తాయి. ముఖ్యంగా జపాన్, జర్మనీ కార్లు మార్కెట్‌ను కుదిపేశాయి. వినియోగదారుల వైఖరిలో మార్పులు వచ్చాయి. దీని ప్రభావం డెట్రాయిట్ ఆటో పరిశ్రమపై పడింది. మరోవైపు 90వ దశకంలో జోరందుకున్న గ్లోబలైజేషన్ ప్రక్రియతో వ్యయభారాన్ని తగ్గించుకునేందుకు ఆటో కంపెనీలు భారత్, చైనా వంటి చోట్ల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం ప్రారంభించాయి. వెరసి డెట్రాయిట్ ఆటో పరిశ్రమను తాకిన సంక్షోభమే నగరాన్ని కూడా కమ్ముకున్నది. ఈ ప్రభావం 2001 తర్వాత డెట్రాయిట్‌పై స్పష్టంగా కనిపిస్తుందని చెబుతారు. ఒకవైపు పన్నుల రాబడి తగ్గినా, నిర్వహణ వ్యయంలో తేడా రాలేదు. పాత అప్పులు తీర్చడం కోసం కొత్త అప్పులు చేస్తూ రావడం సమస్యను మరింత జఠిలంగా మార్చింది. గత కొన్నేళ్లుగా నగర బడ్జెట్ భారీ లోటుతోనే నడుస్తోంది.

పాతపడిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వ్యవస్థ, నాసిరకం రికార్డ్ కీపింగ్, కుంటుపడిన పాలనా వ్యవస్థ.. పరిస్థితిని మరింత దిగజార్చాయి. గత అరవై ఏళ్ల నుంచి డెట్రాయిట్‌ను సమస్యలు వెన్నాడుతున్నాయని మిచిగన్ గవర్నర్ రిక్ స్నైడర్ అంటున్నారు. డెట్రాయిట్ నగరాన్ని చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు స్నైడర్ ఒక ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ మేనేజర్‌ను నియమించారు. సమస్య తీవ్రతను గుర్తించిన సదరు మేనేజర్ సలహా మేరకే దివాలా పిటిషన్ దాఖలుకు నిర్ణయించారు. డెట్రాయిట్ నగరపాలక వ్యవస్థ దివాలా పిటిషన్ దాఖలు చేయడంపై అనేక రకాల అభిప్రాయాలు వినవస్తున్నాయి. నగరంపై ఇది ఒక మచ్చలా మిగిలిపోతుందని, భవిష్యత్తులో అప్పుపుట్టడం కష్టమవుతుందని కొందరి అభిప్రాయం. మరికొందరు మాత్రం సమస్యను నిర్లక్ష్యం చేస్తూ పోవడం కంటే ఏదో ఒకదశలో పరిష్కారానికి ప్రయత్నించడమే మంచిదని అంటున్నారు. ప్రస్తుత దివాలా ప్రభావం పౌరసేవలపైనా, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లపైనా, ప్రస్తుత ఉద్యోగులపైనా ఉంటుందన్న భయాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. డెట్రాయిట్ మున్సిపాలిటీ సమీకరించిన అప్పుల్లో సగంపైగా పెన్షన్ ఫండ్స్ నుంచి విశ్రాంత ఉద్యోగుల హెల్త్‌కేర్ నిధుల నుంచి పెట్టుబడిగా వచ్చిందే. ఈ దివాలా ప్రభావం అమెరికా మున్సిపల్ బాండ్ల మార్కెట్ పై కూడా ఉంటుందని అంటున్నారు. వాస్తవానికి దివాలా పిటిషన్ దాఖలు చేసేముందు రుణాలిచ్చిన సంస్థలు, వ్యక్తులతో సెటిల్‌మెంట్ కోసం చర్చలు జరిగాయి. వేల డాలర్లలో ఉన్న అప్పును వందల డాలర్లతో సెటిల్ చేసేందుకు ప్రతిపాదనలు చేశారు. అదేవిధంగా ఉద్యోగుల సంఘాలతోనూ జీతభత్యాల్లో కోతలపై చర్చలు జరిపారు. ఇవేవీ కొలిక్కి రాలేదు. డెట్రాయిట్ జనాభాలో 80 శాతం మంది నల్లజాతీయులున్నారు.

వీరంతా డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారులు. మిచిగన్ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతజాతీయులు మెజార్టీగా ఉన్న రిపబ్లికన్ల చేతుల్లో ఉంది. డెట్రాయిట్‌ను తమ చెప్పుచేతుల్లోకి తీసుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దివాలా పిటిషన్‌తో సమస్యలు పరిష్కారం కావని, రుణ భారాన్ని తగ్గించుకోవడం మాత్రమే జరుగుతుందని కొందరు విశ్లేషకుల అభిప్రాయం.

డెట్రాయిట్ నష్టం.. చెన్నై లాభం
అమెరికాలో ఆటోమొబైల్ నగరం దివాలా తీయడానికి చెన్నై ఏం చేసింది? అనే సందేహం వచ్చి ఉంటుంది. అవడానికి ఆటోమొబైల్ రాజధానే కావచ్చు. కానీ నేడు డెట్రాయిట్‌లో ఒకే ఒక ప్లాంట్ మిగిలిపోయింది. అది కూడా తరలితే ఆ నగరం ఖాళీయే. ప్రస్తుతం చెన్నైలోనే కార్లు ఎక్కువగా తయారవుతున్నాయి. ప్రపంచీకరణతో పోటీ పెరిగింది. ఖర్చు తగ్గించుకుని, తక్కువ ధరల్లో ఉత్పత్తులను మార్కెట్‌కు అందివ్వాలి. అందుకే బడా బడా కంపెనీలన్నీ చైనా, భారత్ లాంటి దేశాలలో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం మొదలెట్టాయి. ఫలితంగా చెన్నై నగరం ఆటోమొబైల్ హబ్‌గా మారింది. దాదాపుగా అన్ని ప్రముఖ కంపెనీలకు చెన్నైలో ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. బిఎండబ్ల్యు, హ్యుందాయ్, ఫోర్డ్, దైమ్లర్ అండ్ మిత్సుబిషి ఇలా లిస్ట్ చాలా పెద్దదే. పోర్టు నగరం, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలు, ఆంగ్ల నైపుణ్యంగల నిపుణుల లభ్యత వెరసి చెన్నై ఆటోమొబైల్ నగరంగా అవతరించింది. దేశంలో చెన్నై తర్వాత పుణె, గుర్గాన్-మనేసర్ ఆటోమొబైల్ ఉత్పత్తి కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. వీటికి దీటుగా గుజరాత్ సైతం కంపెనీలను ఆకర్షిస్తోంది.

No comments:

Post a Comment