Thursday 18 July 2013

విదేశీ 'ప్రత్యక్షం' (సంపాదకీయం)

విదేశీ 'ప్రత్యక్షం' (సంపాదకీయం)

July 18, 2013
ఇక దేశంలోని పలు ఉత్పాదక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ప్రత్యక్షం కాబోతున్నాయి. అయిదు శాతం కూడా లేని అభివృద్ధి రేటుతో, అడుగంటిన విదేశీ మారక ద్రవ్య నిల్వలతో నిస్తేజంగా మారిన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దేందుకు యూపీఏ-2 ప్రభుత్వం మలి విడత ఆర్థిక సంస్కరణల పరిపూర్తికి నడుం కట్టింది. దేశాన్ని పీడిస్తున్న వివిధ ఆర్థిక సమస్యలకు పరిష్కారంగా విదేశీ మదుపులను పెద్ద ఎత్తున రాబట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఎఫ్‌డీఐలపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో మంగళవారం రక్షణ, ఆర్థిక, పెట్రోలియం, ఆహార, విద్యుత్, హోం, వాణిజ్య మంత్రుల ఉన్నతస్థాయి సమావేశం కొన్ని సాహసోపేత, ఏకగ్రీవ నిర్ణయాలు చేసింది. అందులో భాగంగా పదమూడు రంగాల్లో ఎఫ్‌డీఐ పరిమితులను పెంచింది. ఇక వివిధ రంగాల్లో 49 శాతం వరకు విదేశీ మదుపులు పెట్టేందుకు ఎలాంటి ఆటంకాలూ ఉండవు. ఆ పరిమితి మేరకు విదేశీ మదుపుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) అనుమతి కూడా అవసరం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. దాంతో విదేశీ మదుపుల ప్రవాహానికి మార్గం మరింత సుగమమవుతుంది.

ఆర్థికాభివృద్ధి క్షీణించడం, ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో పారిశ్రామిక వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడి, సార్వత్రక ఎన్నికల నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వం కొన్ని విధానపరమైన కీలక నిర్ణయాలు తీసుకుంది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో మలి విడత సంస్కరణలకు చెందిన కీలకమైన బిల్లుల విషయంలో ప్రధాన పార్టీలు పరస్పరం సర్దుబాటు చేసుకోనున్నట్లు ఇప్పటికే సంకేతాలు వస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 5 నుంచి ప్రారంభం కానున్నాయి. సార్వత్రక ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా ఉపయోగపడడానికి వీలుగా ఆహార భ్రదత, భూ సేకరణ బిల్లులను ఈ సమావేశాల్లో మొదటి రోజే చర్చకు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఆ బిల్లులతో పాటు ఎఫ్‌డీఐ బిల్లును కూడా పార్లమెంటులో ఆమోదింపచేసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

చిల్లర వర్తకులు చితికిపోతారని, ఉపాధి అవకాశాలు ఆవిరవుుతాయని, రైతులు పొలాలను కోల్పోయి బికారులుగా మారే ప్రమాదముందన్న కొందరి సూచనలను కేంద్రం పట్టించుకోవడం లేదు. మలి విడత ఆర్థిక సంస్కరణలకు అవసరమైన బిల్లులు పార్లమెంట్ ఆమోదానికి నోచుకోకుండా పడి ఉన్న కారణంగా లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక సందర్భంలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా వాణిజ్యం క్షీణించడంతో విదేశీ మారక ద్రవ్య నిల్వలు తరగిపోవడం, దేశీయ ఆర్థిక వ్యవస్థ మందగించడంతో దేశంలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష మదుపులు బాగా క్షీణించాయి. పర్యవసానంగా పారిశ్రామిక ప్రగతి కుంటుపడింది. ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల ప్రవేశంతో దేశ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, శీతల గిడ్డంగుల వంటి మౌలిక సదుపాయాలు పెరిగి, వ్యవసాయ మార్కెటింగ్‌లో దళారుల పాత్ర తొలగి, రైతులు ఆర్థికంగా లాభపడతారని, రైతుల ఆత్మహత్యలు లేకుండా పోతాయని, వినియోగదారులకు నాణ్యమైన సరకులు లభిస్తాయని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే తొలి విడత ఆర్థిక సంస్కరణల కారణంగా తలెత్తిన వరుస కుంభకోణాలకు వ్యతిరేకంగాను, లోక్‌పాల్ తదితర అంశాలపైనా పార్లమెంటులో ప్రతిపక్షాలు చేసిన పోరాటాలతో మలి విడత సంస్కరణలు మూలన పడ్డాయి. అవినీతి కుంభకోణాలలో కూరుకుపోయిన యూపీఏ-2 ప్రభుత్వం ఈ సంస్కరణల్ని దూకుడుగా ముందుకు తెస్తోంది.

టెలికాం రంగంలో వంద శాతం ఎఫ్‌డీఐలకు అనుమతించడంతో కనీసం 1,000 కోట్ల డాలర్ల మదుపులు దేశంలోకి ప్రవహించేందుకు అవకాశమున్నట్లు ప్రభుత్వం ఆశిస్తోంది. బీమా రంగంలో 49 శాతానికి, గత ఏడాది సెప్టెంబర్‌లో బహుళ బ్రాండ్ల చిల్లర వర్తకంలో 51 శాతానికి ఎఫ్‌డీఐల ప్రవేశానికి యూపీఏ ప్రభుత్వం అనుమతించింది. దేశంలో ఏటా 25 లక్షల కోట్ల రూపాయల పైగా జరుగుతున్న రిటైల్ వర్తకం రాబోయే ఆరేళ్ళలో అరవై తొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు చేరుకోవచ్చని అసోచామ్ అంచనా. ప్రపంచ ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న పాశ్చాత్య కంపెనీలు ఇంత పెద్ద రిటైల్ మారె ్కట్‌లోకి అడుగు పెట్టేందుకు మలి విడత సంస్కరణల కోసం కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో వాల్‌మార్ట్, టెస్కో, కెర్రిఫోర్, ఐకియా వంటి విదేశీ చిల్లర వర్తక దిగ్గజాల ఎఫ్‌డీఐలు రిటైల్ రంగంలోకి ప్రవేశిస్తాయన్న ఊహాగానాలు ఉన్నాయి. అమెరికా, జపాన్, ఫ్రాన్స్, డెన్మార్క్ తదితర పాశ్చాత్య దేశాలతో సహా మెక్సికో, థాయ్‌లాండ్, బ్రెజిల్, అర్జెంటీనా తదిత ర దేశాలలో ఈ రిటైల్ కంపెనీల చేదు అనుభవాలెన్నో వెలుగులోకి వచ్చినా ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు.

అమెరికా తదితర పాశ్చాత్య దేశాల్లో ఈ రిటైల్ దిగ్గజాలకు, దానికి వత్తాసు పలుకుతున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. భారత్‌లోనూ ఇలాంటి ప్రజా ఉద్యమాలు ముందుకొస్తున్న నేపథ్యంలో బహుళ జాతి రిటైల్ సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు కొంత జంకుతున్నాయి. సంపన్నుల బొక్కసాల నింపే వృద్ధిరేటు కోసం కోట్లాది ప్రజల జీవితాల్లో చీకట్లు నింపే నిర్ణయాలు తీసుకోవడం రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు ప్రతిబంధంగా మారే అవకాశం లేకపోలేదు.
Andhrajyothy Telugu Daily  19 July 2013

No comments:

Post a Comment