Saturday, 3 December 2016

I am a Fakir- MODI

నేను ఫకీర్‌ను
04-12-2016 00:57:55

మూటాముల్లె సర్దుకుని పోగలను
నన్ను ఎవరూ ఏమీ చేయలేరు
నల్ల దొంగలు హాని తలపెట్టలేరు
అవినీతిపై పోరాడడమే నేరమా?
ప్రజలే నాకు హైకమాండ్‌: మోదీ
డబ్బు జపం చేసిన వాళ్ల భరతం పడతా
నిజాయతీపరులు బ్యాంకుల ముందు
అవినీతిపరులు ‘జన్‌ధను’ల ఇళ్ల ముందు
భారతదేశంలో ఇక ఇవే చివరి క్యూలు!
60 ఏళ్లుగా ఉన్న క్యూలకు స్వస్తి పలుకుతా
క్యూల్లో నుంచుంటే నాకు మద్దతు ఇచ్చినట్లే
వారి కష్టాన్ని ఏ మాత్రం వృథా పోనివ్వను
నా చర్యలను ప్రజలు చివరికి గుర్తిస్తారు
దోచుకున్నోళ్లను జవాబుదారీ చేస్తే తప్పా?
నల్ల డబ్బు బయటకు తేవడమే లక్ష్యం కాదు
మళ్లీ అవినీతి జరగనివ్వకపోవడమే ధ్యేయం
దానికి తలుపులు మూయడమే సంకల్పం
బిచ్చగాళ్లూ స్వైపింగ్‌ మిషిన్‌ వాడుతున్నారు
భారతీయులు ఏదైనా నేర్చుకోగలరు: మోదీ
మీ ఖాతాల్లో డబ్బులు వేస్తే వెనక్కి ఇవ్వకండి
మిమ్మల్ని బెదిరిస్తే మోదీకి చెబుతానని చెప్పండి
జనధన్‌ ఖాతాదారులకు ప్రధానమంత్రి పిలుపు

మొరాదాబాద్‌, డిసెంబరు 3: ‘‘పంచదార కొనుక్కోవడానికి మనం క్యూలో నిలబడాలి. కిరోసిన్‌ కొనుక్కోవడానికి మనం లైన్లో నిలబడాలి. గోధుమలు కొనుక్కోవడానికి మనం క్యూలో నిలబడాలి. 60 ఏళ్లుగా మనల్ని పరిపాలించిన వాళ్ల నిర్వాకమిది. ఈ దేశంలో సమయమంతా క్యూల్లోనే వృథా అయిపోతోంది. ఇప్పుడు నేను మొదలు పెట్టిన క్యూ ఎందుకో తెలుసా!? మొత్తం అన్ని క్యూలకూ స్వస్తి పలకడానికే’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బ్యాంకుల ముందు మీరు క్యూలో నిలబడి ఉంటే.. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తే.. మీ కష్టాన్ని నేను వృథా పోనివ్వనని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నిజాయతీగా తీసుకుంటున్న చర్యలను చివరకు సామాన్య ప్రజలు గుర్తిస్తారని వ్యాఖ్యానించారు. ‘‘నా దేశంలో నాపైనే కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ఒకప్పుడు దేశాన్ని దోచుకున్న వారిని ఇప్పుడు నేను జవాబుదారీగా చేయడం తప్పా!?’’ అని మోదీ ప్రశ్నించారు. కుప్పలు కుప్పలుగా దాచిన నల్లడబ్బును బయటకు తీసుకు రావడానికి మాత్రమే ప్రస్తుత కార్యక్రమాన్ని చేపట్టలేదని, అటువంటి వ్యవహారాలు మళ్లీమళ్లీ జరగకుండా నిరోధించడమే కాకుండా వాటికి తలుపులను పూర్తిగా మూసివేయాలనే భారీ వ్యూహం ఇందులో ఉందని వెల్లడించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో బీజేపీ శనివారం నిర్వహించిన పరివర్తన ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలు డబ్బుల కోసం ఏటీఎంలు, బ్యాంకుల ఎదుట పెద్ద పెద్ద క్యూల్లో నిలబడుతున్న సంగతి తెలిసిందే. క్యూల్లో ఉంటున్నా డబ్బులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే, పరివర్తన ర్యాలీలో మాట్లాడిన మోదీ, పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించుకున్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతర ఇబ్బందులపైనే తన ప్రసంగాన్ని కేంద్రీకరించారు. ‘‘అవినీతి కారణంగా ఈ దేశం ముందుకు వెళ్లకుండా ఆగిపోవాలా!? ఈ అవినీతిని నిర్మూలించడం సాధ్యం కాదా!? అవినీతి దానంతట అదే పోవాలా!? చురుగ్గా పాల్పంచుకుని మనం దానిని నిర్మూలించలేమా!?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందుకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. నిజాయతీపరులు బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూల్లో నిలబడుతుంటే... అవినీతిపరులు నిరుపేదల ఇళ్ల ముందు నిలుచున్నారని చెప్పారు.

డబ్బు జపం చేసిన వాళ్ల భరతం పడతా
జన్‌ధన్‌ ఖాతాలను ప్రారంభించినప్పుడు ప్రజలకు వాటిని ఉపయోగించుకోవడం ఎలాగో కూడా తెలియదని, కానీ, ఇప్పుడు వాళ్లంతా ఖాతాలను ఉపయోగించుకుంటున్నారా లేదా అని మోదీ ప్రశ్నించారు. ‘‘గతంలో ఎప్పుడూ ముఖం కూడా చూడని నల్ల దొంగలంతా ఇప్పుడు నిరుపేదల వెంట పరుగులు పెడుతున్నారు. మీ ఖాతాల్లో రెండు లక్షలు డిపాజిట్‌ చేసుకోవాలని బతిమలాడతారు. జనవరి తర్వాత తీసుకుంటామని కోరతారు. నా మాట వినండి. ఒకవేళ, మీరు ఇలా మీ ఖాతాల్లో డబ్బులు డిపాజిట్‌ చేశారనుకోండి. వాటిని మళ్లీ తిరిగి ఇవ్వకండి. దానిని మీ ఖాతాలోనే ఉంచేయండి. ఒకవేళ వాళ్లు వచ్చి మా డబ్బు మాకు ఇవ్వాలని మిమ్మల్ని బెదిరించారనుకోండి.. మోదీకి ఉత్తరం రాస్తానని స్పష్టం చేయండి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో కొంతమంది ముఖంలో కళ తప్పింది. ఇప్పటి వరకూ ‘డబ్బు డబ్బు’ అని పాకులాడిన వాళ్లు ఇప్పుడు ‘మోదీ, మోదీ’ అంటున్నారు. గతంలో డబ్బు జపం చేసిన వాళ్ల భరతం నేను పడతాను’’ అని ప్రధాని స్పష్టం చేశారు. జన్‌ధన్‌ ఖాతాలను దుర్వినియోగం చేసి డబ్బులు వేసిన వారిని జైలుఊచలు లెక్కబెట్టించే మార్గాలు అన్వేషిస్తున్నానన్నారు. నిరుపేదల ఖాతాల్లో వేసిన సొమ్ములను వారికే ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు.

ముష్టివాళ్లు కూడా స్వైపింగ్‌ చేస్తున్నారు
ప్రస్తుతం వాట్స్‌పలో ఒక వీడియో హల్‌చల్‌ చేస్తోంది. ఇద్దరు అమ్మాయిలు, పక్కనే ఓ అబ్బాయి బస్టాండ్లో నుంచుంటారు. అక్కడికి ఓ ముష్టివాడు వస్తాడు. ఆ అబ్బాయిని డబ్బులు అడుగుతాడు. ఆ కుర్రాడు తన దగ్గర డబ్బులు లేవని, కార్డులే ఉన్నాయని చూపుతాడు. దాంతో, ఒక్క నిమిషం ఆగమన్న ముష్టివాడు.. స్వైపింగ్‌ మిషన్‌ తీస్తాడు. ఈ వీడియోను ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఆ వీడియో నిజమో అబద్ధమో తనకు తెలియదని, నిజమైతే, ముష్టివాళ్లు కూడా స్వైపింగ్‌ మిషన్లు ఉపయోగిస్తున్నారని, అంతా డిజిటల్‌ లావాదేవీలకు మళ్లాలని పిలుపునిచ్చారు. సరైన చర్య అని భావిస్తే భారతీయులు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎంతో సమయం తీసుకోరని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన డబ్బులను అభివృద్ధి, మౌలిక సదుపాయాలకే ఖర్చు చేస్తామన్నారు. ‘‘దేశంలో 40కోట్ల స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి. క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా మొబైల్‌, నెట్‌ బ్యాంకింగ్‌లో ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి. మీరు చేయాల్సింది మీ ఫోన్లోకి ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడమే. దాంతో, 40 కోట్ల మంది బ్యాంకులకు వెళ్లకుండానే, క్యూల్లో నుంచోకుండానే తమ పనులన్నీ సాధించుకోవచ్చునని తెలిపారు.

అవినీతిపై పోరాడడమే నేరమా?
‘‘నల్ల దొంగలు నాకు హాని తలపెట్టలేరు. నేను పకీర్‌ను (సర్వసంగ పరిత్యాగిని). నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. మూటా ముల్లె సర్దుకుని ప్రధాని కార్యాలయం నుంచి వెళ్లిపోగలను. దేశం కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా దీనిని ఆపేది లేదు. ఏం నేను అవినీతికి వ్యతిరేకంగా పోరాడకూడదా!? అవినీతిపై పోరాటం నేరమా!? అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతుంటే నేను తప్పు చేస్తున్నానని కొంతమంది ఎందుకు అంటున్నారు? నా దేశంలోనే కొంతమంది నాపై ఆరోపణలు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేవలం నల్ల డబ్బు ఉన్న వాళ్లు మాత్రమే ఇప్పుడు నన్ను తప్పుబడుతున్నారు. ఒకప్పుడు దేశాన్ని దోచుకున్న వాళ్లను ఇప్పుడు నేను జవాబుదారీ చేయడం తప్పా?’’ అని ప్రధాని మోదీ నిలదీశారు. ప్రజలే తనకు అధిష్ఠానమని, వారే తన నాయకత్వమని అన్నారు. భారతదేశం మార్పునకు సిద్ధంగా ఉందని, దేశం, ప్రజలు కూడా మార్పులకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారని, తనకు 50 రోజుల సమయం ఇవ్వాలని మోదీ వ్యాఖ్యానించారు. డిజిటల్‌ లావాదేవీలపై ప్రజలకు కొంతమంది అవగాహన కల్పిస్తున్నారని, ఇప్పుడు మీ ఫోనే మీ బ్యాంకు అని తెలిపారు. అవినీతి దానంతట అదే వెళ్లిపోదని, దానిని మనం తుడిచిపెట్టేయాలని చెప్పారు. దేశంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే పెద్ద రాష్ట్రాలను అభివృద్ధి చేయడం తప్పనిసరి అని తెలిపారు. ఇందుకు ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాలపై దృష్టి సారించాలని, అవి విస్తీర్ణంలో పెద్దవనే కాదు.. అక్కడ పెద్దఎత్తున ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారని తెలిపారు.

No comments:

Post a Comment