Wednesday 18 March 2015

సభలో వినలేని భాష

సభలో వినలేని భాష
మహిళా ఎమ్మెల్యేల భాషపై పురుష ఎమ్మెల్యేల విస్మయం
భరించలేకపోతున్నామంటున్న సాటి మహిళా ఎమ్మెల్యేలు
హైదరాబాద్‌, మార్చి 18(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో మాటల యుద్ధం శృతిమించింది. పొరుగు రాష్ట్రంలోని శాసనసభా ప్రాంగణంలో జరుగుతున్న సమావేశాలను హుందాగా.. ఇతరులకు మార్గదర్శకంగా నిర్వహించుకోవాల్సి ఉండగా, అసభ్యకరమైన మాటలు.. జుగుప్సాకరమైన హావభావాలు చోటుచేసుకోవడంపై సీనియర్‌ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాటి మహిళా ఎమ్మెల్యేలు చేస్తున్న అసభ్యకరమైన మాటలను భరించలేకపోతున్నామని కొందరు మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం వాపోతున్నారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన రోజే స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన శాసనసభావ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో ప్రతిపక్ష నేత చెప్పినట్లుగానే.. సభలో ‘అగ్లీ సీన్స్‌’ కనిపిస్తున్నాయి. ప్రతిపక్షానికి చెందిన కొందరు మహిళా ఎమ్మెల్యేలు ప్రయోగిస్తున్న భాష పట్ల ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం శాసనసభలో చోటు చేసుకున్న సన్నివేశాలు సభామర్యాదను మంట కలిపాయని కొందరు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి అధికారపక్ష ఎమ్మెల్యే బొండా ఉమ వ్యక్తిగత విమర్శలు చేయడంతోపాటు, వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఉద్దేశించి.. ‘రోజా ఆంటీ’ అని సంబోధించారు. కొడాలి నాని, రోజా ఇద్దరిదీ ఐరన్‌లెగ్‌ అని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలతో ఎమ్మెల్యే రోజా ఆగ్రహంతో ఊగిపోయారు. ఉమను ఉద్దేశించి .. ‘ నా చీర కట్టుకోరా..’ అంటూ పత్రికల్లో రాయలేని భాషను ప్రయోగించడమే కాకుండా, ఆ సమయంలో ప్రదర్శించిన హావభావాలు తమను నివ్వెర పరిచాయని కొందరు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. మరోవైపు కొడాలి నాని సైతం.. ‘నన్నేమంటున్నావురా అంటూ ..’ పత్రికల్లో రాయలేని భాషను ప్రయోగించారు. అదే సమయంలో బొండా ఉమ.. ‘ఎంట్రారేయ్‌.. పాతేస్తా..నా’ అంటూ పరుషంగా మాట్లాడారని కొందరు ఎమ్మెల్యేలు తెలిపారు. అంతకు ముందు సభానాయకుడు చంద్రబాబు మాట్లాడుతున్నప్పుడు ఎమ్మెల్యే రోజా రన్నింగ్‌ కామెంటరీ చేస్తున్నారని, ఆమెను సస్పెండ్‌ చేయాలని మంత్రి పీతల సుజాత స్పీకర్‌ను కోరారు. దీనిపైనా రోజా రెచ్చిపోయారు.
‘నువ్వు మంత్రయ్యాక వడ్డాణం పెట్టారుగా అది పెట్టుకో.. నువ్వు అవినీతి మంత్రివి.. ఒళ్లు పెంచడం కాదు.. బుర్ర పెంచుకో’ అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన తర్వాత ఎదురవుతున్న సమస్యలపై దృష్టి పెట్టకుండా సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు బాధాకరమని, అసభ్యకరమైన మాటలతో ఇతరుల వద్ద ఎంత చులకనైపోతామో అర్థం చేసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మహిళా ఎమ్మెల్యేలు తమ వద్ద ప్రయోగిస్తున్న పదజాలానికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్‌ వ్యక్తిగత ప్రస్తావన తెస్తూ రోజా చేసిన వ్యాఖ్యలకు ఏమని సమాధానం చెప్పాలో తెలియలేదని ఆ ఎమ్మెల్యే పేర్కొన్నారు. సభ వాయిదా అనంతరం పట్టిసీమపై చర్చ సందర్భంగా సభానాయకుడు చంద్రబాబు మాట్లాడేందుకు సిద్ధమవ్వగా జగన్‌ తాను మాట్లాడతానని పట్టుబట్టారు. స్పీకర్‌ చెప్పినా జగన్‌ అంగీకరించకుండా జగన్‌ తన సభ్యులను స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లాల్సిందిగా చేతులు ఊపారు. వెనువెంటనే వారు స్పీకర్‌ పోడియం వద్దకు దూసుకెళ్లారు. అయితే, ప్రత్యక్ష ప్రసారాల్లో కన్పిస్తుండటంతో పోడియం వద్ద వైసీపీ సభ్యులు సంయమనంతో వ్యవహరించారు.

No comments:

Post a Comment