Wednesday 18 March 2015

ఇవి జగన్‌ ప్రేరేపిత అగ్లీ సీన్స్‌!

ఇవి జగన్‌ ప్రేరేపిత అగ్లీ సీన్స్‌!

వైసీపీ ఎమ్మెల్యేల ప్రవర్తన జుగుప్సాకరం
మా వద్దకు వచ్చి బూతులు తిడుతున్నారు
రోజా తిట్టే బూతులు మగవాళ్లే మాట్లాడలేరు
తిట్లు భరించలేక బొండా స్పందించారు
అదీ తప్పే... విచారం వ్యక్తం చేస్తున్నాం
సీఎం బెదిరిస్తే వారు రోడ్డుపై తిరగ్గలరా?
వైసీపీపై టీడీఎల్పీ ధ్వజం
హైదరాబాద్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి):ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలు బుధవారం వ్యవహరించిన తీరు పట్ల తెలుగుదేశం శాసనసభాపక్షం మండిపడింది. శాసనసభలో అగ్లీ సీన్స్‌ చూడాల్సి వస్తుందని సభా వ్యవహారాల సంఘ సమావేశంలో హెచ్చరించిన ప్రతిపక్ష నేత జగన్‌ దానిని ఆచరణలో పెట్టి చూపిస్తున్నారని దుయ్యబట్టింది. ఆయన ప్రేరేపణతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పరమ జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నారని టీడీఎల్పీ వ్యాఖ్యానించింది. బుధవారం ఇక్కడ టీడీఎల్పీ కార్యాలయంలో చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు, విప్‌ యామినీ బాల, టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమా మహేశ్వరరావు, ప్రభాకర్‌ చౌదరి విలేకరులతో మాట్లాడారు. ‘‘అసెంబ్లీలో ఎవరి సీట్లు వారికి ఉంటాయి. అధికారపక్ష బెంచీల వద్దకు వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి మంత్రులు, ఎమ్మెల్యేలను పేర్లు పెట్టి పచ్చి బూతులు తిడుతున్నారు. వాళ్ల తిట్లు, ప్రవర్తన చూసి ఈ సభకు ఎందుకు వచ్చామా? అని బాధ కలుగుతోంది’’ అని కాల్వ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు మాట్లాడుతుంటే వెనుక రన్నింగ్‌ కామెంట్రీ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యే రోజా అంటున్న మాటలు వినలేకపోతున్నామని చెప్పారు ‘‘ దళిత మంత్రి పీతల సుజాత తన అభిప్రాయం చెబుతున్నారు. దానిపై భిన్నాభిప్రాయం ఉంటే వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా స్పీకర్‌ అనుమతి తీసుకొని మాట్లాడవచ్చు. దానికి బదులు మంత్రికి సమీపంగా వచ్చి సభ్య సమాజం తల దించుకొనేలా మాట్లాడటం దారుణం. రోజా మాట్లాడినన్ని బూతులు మగవాళ్లు కూడా మాట్లాడలేరు. బీసీ వర్గాలకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతుంటే కోసేస్తా... అంటూ హావభావాలు ప్రదర్శిస్తూ తిట్టారు. మా పార్టీ ఎమ్మెల్యే రామకృష్ణను కాలూ చెయ్యి విరగ్గొడతానంటూ బెదిరించారు. ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతుంటే చంపుతాం.. పాతరేస్తాం అని అరుస్తున్నారు. వీధి కొళాయిల వద్ద కూడా ఇలా మాట్లాడుకోరు. వీధి రౌడీల మాదిరిగా ప్రవరిస్తున్నారు.’’ అని ధ్వజమెత్తారు. ఏదోలా టీడీపీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి అసెంబ్లీలో భౌతిక దాడులకు దిగాలన్నది వారి లక్ష్యంగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వారిపై కచ్చితంగా తగిన చర్య తీసుకోవాలని స్పీకర్‌ను కోరుతున్నామని చెప్పారు. గత సమావేశాల్లో సీనియర్‌ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పట్ల రోజా వాడిన భాష, వ్యవహరించిన తీరుకే ఆమె శిక్షార్హురాలవుతారని, ఇప్పటికే ఆమెపై రెండుసార్లు ఫిర్యాదులు వచ్చాయని ఆయన చెప్పారు. అధికార పక్షం బెంచీల వద్దకు వచ్చి కొడాలి నాని తదితర ఎమ్మెల్యేలు తిడుతున్న తిట్లు భరించలేక బొండా కూడా నోరు జారి ఒక మాట అన్నారని, అది కూడా తప్పేనని, దానికి విచారం వ్యక్తం చేస్తున్నామని కాల్వ శ్రీనివాసులు చెప్పారు. ముఖ్యమంత్రి బెదిరించారంటూ వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదును ప్రస్తావించినప్పుడు నిజంగా సీఎం బెదిరించాలనుకొంటే వైసీపీ నేతలు రోడ్లపై తిరగగలరా? అని కాల్వ ప్రశ్నించారు. ‘‘మేం మంచివాళ్లమే కాని అసమర్థులం కాదు. మా ఆత్మాభిమానాన్ని చంపుకోవడానికి మేం సిద్ధంగా లేం. పక్క రాష్ట్రం అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు గొంతు తెరిస్తే సస్పెండ్‌ చేస్తున్నారు. ప్రతిపక్షాన్ని సస్పెండ్‌ చేసి సభను నడపాలని అనుకోవడం లేదు. ఇంతవరకూ ఒక్క గంట కూడా మేం ఎవరినీ సస్పెండ్‌ చేయలేదు’’ అని తెలిపారు.
రెచ్చగొడుతున్నారు
అసెంబ్లీలో తాను మాట్లాడిన మాటలు టీవీల్లో వచ్చాయి కాని తనను రెచ్చగొడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు ఎన్ని తిట్లు తిట్టారో రాలేదని బొండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. ‘‘బయటకు రా... చూసుకొందాం అని వైసీపీ ఎమ్మెల్యేలు నాని, రోజా నాకు సవాళ్లు విసిరారు. నన్ను చంపుతానని, చెప్పుతో కొడతానని అంటుంటే భరించలేక ఒక మాట అనాల్సి వచ్చింది. అది దురదృష్ణకరం. మా సహనాన్ని పరీక్షించవద్దు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. సభపై గౌరవంతో ఓర్పుతో ఉంటున్నాం. నాని, రోజా టీడీపీ నుంచే వెళ్లారు. మంత్రి పదవులపై ఆశ పెట్టుకొని పార్టీ మారారు. అది రాలేదని నిస్పృహలో ఉన్నారు. వారి కోపాన్ని మాపై చూపిస్తే ఉపయోగం లేదు’’ అని బోండా అన్నారు. జగన్‌ తన టీవీ, పత్రికకు అవినీతి సొమ్ము పోగు చేిన పెట్టుబడులు పెట్టినట్లుగా కాకుండా కష్టపడి ఏబీఎన్‌ చానల్‌ను పెట్టుకొన్నారని ప్రభాకర్‌ చౌదరి అన్నారు. సీడీ విడుదల చేసిన టీడీఎల్పీ
అసెంబ్లీలో చోటు చేసుకొన్న దృశ్యాలకు సంబంధించిన సీడీని టీడీఎల్పీ ఇక్కడ విడుదల చేసింది. సభలో వైసీపీ సభ్యుల ప్రవర్తనకు సంబంధించిన దృశ్యాలు తమకు కావాలని టీడీఎల్పీ తరఫున స్పీకర్‌ డాక్టర్‌ కోడెలకు లేఖ రాశారు. ఆయన అనుమతితో సభలోని దృశ్యాలను రికార్డు చేసే కెమెరాల నుంచి వాటిని తీసుకొన్నారు. ఆ తర్వాత ఆ దృశ్యాల సీడీని సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో విడుదల చేశారు. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమాసభలో వైసీపీ ఎమ్మెల్యేలను తిట్టిన దృశ్యం టీవీల్లో ప్రసారం అయింది. బోండా ఆ స్థాయిలో ఎందుకు ప్రతిస్పందించాల్సి వచ్చిందో ప్రజలకు తెలియాల్సి ఉందని టీడీపీ ఎమ్మెల్యేల అంతర్గత సమావేశంలో నిర్ణయించారు. ఈ క్రమంలో స్పీకర్‌ అ నుమతితో ఆ దృశ్యాలను మీడియాకు విడుదల చేశారు.
ఎమ్మెల్సీలు ఏకగ్రీవం!
హైదరాబాద్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని 5 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. టీడీపీ తరఫున జి.తిప్పేస్వామి, గుమ్మిడి సంధ్యారాణి, వట్టికూటి వీర వెంకన్న చౌదరి, వైసీపీ తరఫున కె.వీరభద్రస్వామి, పిల్లి సుభాష్‌ చంద్రబో్‌సలు ఎన్నికయ్యారు. వీరి నామినేషన్లు సక్రమంగానేఉన్నాయని ఎన్నికల కమిషన్‌ బుధవారం ప్రకటించింది. ఐదు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులే బరిలో నిలవడంతో వీరి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అయ్యింది. వీరి ఎన్నికను 27వ తేదీ శుక్రవారం ఈసీ అధికారికంగా ప్రకటించనుంది.

No comments:

Post a Comment