ఘర్ వాపసీ ప్రేలాపనలు: రచయితల్లో ఎందుకింత మౌనం?!
http://magazine.saarangabooks.com/2015/02/11/%E0%B0%98%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AA%E0%B0%B8%E0%B1%80-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87%E0%B0%B2%E0%B0%BE%E0%B0%AA%E0%B0%A8%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B0%E0%B0%9A%E0%B0%AF/
గతం సంధించిన ప్రశ్నలనే వర్తమానం మళ్లీ సంధించి ఏదో కొత్త జ్ఞానం కనుగొన్నట్టు నటిస్తుంటే ఎలా ఉంటుంది? ఎప్పుడో దహనం చేయవలసిన, కుళ్లిపోయిన శవానికి చందనకర్పూర వాదనలు అద్దుతుంటే ఎలా ఉంటుంది? పారేయవలసిన పాచి అన్నానికి మళ్లీ ఒకసారి మసాలా దట్టించి తిరగమోత పెట్టి వడ్డించజూస్తుంటే ఎలా ఉంటుంది? ఇంతకన్న అర్థరహితమైన, ప్రమాదకరమైన, హాస్యాస్పదమైన కార్యక్రమాన్ని రాజకీయ సామాజిక నిర్వాహకులు నిస్సిగ్గుగా సాగిస్తుంటే సమాజమంతా మౌనంగా నిర్లిప్తంగా చూస్తున్నది. కాలం మారుతున్నదా లేదా, మనం మారుతున్నామా లేదా అని సందేహం కలుగుతున్నది. సంఘపరివార్ నాయకులు దేశవ్యాప్తంగా ప్రారంభించిన ఘర్ వాపసీ కార్యక్రమం చూసి, దాని పట్ల సమాజం స్పందించవలసినంతగా స్పందించకపోవడం చూసి నిస్సహాయ ఆగ్రహం నన్ను రెండు మూడు నెలలుగా కలవరపెడుతున్నది.
ఘర్ వాపసీ గురించి వినగానే నాకు ‘ప్రజలమనిషి’లో వట్టికోట ఆళ్వారుస్వామి మతాంతరీకరణ గురించి సృష్టించిన అద్భుతమైన సన్నివేశాలు గుర్తొచ్చాయి. ‘దేశభక్తి’ తొలిపాఠంలో ‘నిన్న వచ్చారింగిలీషులు/ మొన్న వచ్చిరి ముసలమనులటు/ మొన్న వచ్చిన వాడ వీవని/ మరచి వేరులు పెట్టకోయ్’ అని రాసిన, ఆ తర్వాత ‘పెద్ద మసీదు’ కథ రాసిన గురజాడ అప్పారావు గుర్తొచ్చారు. ‘మనకా మతాభిమానం’ అంటూ ‘హిందూ’ మతస్థులమనుకునేవాళ్ల కుహనా ఆభిజాత్యాన్ని తుత్తునియలు చేసిన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గుర్తుకు వచ్చారు. గత శతాబ్ది తొలి పాదంలో, మధ్య భాగంలో కనబడిన ఆ స్పందన, చైతన్యం, ప్రశ్నించే స్ఫూర్తి ఇప్పుడు కరవైపోతున్నదా అని తీవ్ర విచారం కలిగింది. మతోన్మాదుల ఘర్ వాపసీ ప్రేలాపనలకు గతానికీ వర్తమానానికీ ఎడతెగకుండా జరుగుతున్న సంభాషణ నుంచి ఎన్ని జవాబులు చెప్పవచ్చు గదా అనిపించింది.
ఘర్ వాపసీ నినాదం నిజానికి మతవిద్వేషానికి ముసుగు. ‘ఇంటికి తిరిగిరండి’ అని పిలుస్తున్నవారు చూపుతున్నది ఇల్లూ కాదు, తిరిగివస్తే ఏ ఇంట్లో ఉంచుతారో, అసలు ప్రాణాలతో ఉంచుతారో లేదో తెలియదు. ఇంతకూ అది పిలుపు కూడ కాదు. అది ఒక బెదిరింపు. నేరారోపణ. వేధింపు. భీతావహ వాతావరణం సృష్టించడానికి హంతకశక్తులను ప్రేరేపించే ఉచ్ఛాటన. అది సరిగ్గా అడాల్ఫ్ హిట్లర్ ఇతర మతస్తుల పట్ల, ముఖ్యంగా యూదుల పట్ల ప్రదర్శించిన వ్యతిరేకత లాంటిది. కాకపోతే ఈసారి అది తోసేసే, చిత్రహింసలు పెట్టే. చంపేసే రూపాన్ని కాసేపటికోసం దాచుకుని పిలిచే ముఖాన్ని ప్రదర్శిస్తున్నది. ‘ఈ పిలుపుకు రాకపోయావో, చూసుకో ఏం చేస్తానో’ అనే బెదిరింపు అది. పిడికెడు మందిని ఆకర్షించగలిగినా లేకపోయినా, కోట్లాది మందిని బెదురుకు, అభద్రతకు గురిచేసి, తమ నేల మీద తాము బెరుకుబెరుకుగా జీవించేలా చేసే యుద్ధారావం అది. అనేక సంస్కృతుల, భాషల, మతాల, కులాల బహుళత్వపు భారతీయతను ఏకత్వంలోకి, అది కూడ సంఘపరివార్ నిర్వచించే బ్రాహ్మణీయ సంకుచిత హిందుత్వలోకి కుదించదలచిన మతరాజకీయాల ఎత్తుగడ అది. ఘర్ వాపసీ అనే మాటకు ఇంటికి తిరిగిరావడం అనే తటస్థమైన అర్థమే కనబడుతుంది. అది ఆత్మీయ పునరాగమనం లాగే, పునర్మిలనం లాగే అనిపిస్తుంది. కాని అసలు లక్ష్యం ఇతర మతాల పట్ల ద్వేషం. ఇతర మతస్తుల పట్ల ద్వేషం. మతాల మధ్య, మనుషుల మధ్య భేదాన్ని, అసహనాన్ని, అనుమానాన్ని, విద్వేషాన్ని, రక్తపిపాసను, హంతక దాడులను ప్రోత్సహించి, మతం పెట్టుబడిపై రాజకీయ లాభాలను సంపాదించదలచిన క్షుద్రక్రీడ అది.
‘భారతదేశంలో ఉండాలంటే హిందువులు కావలసిందే’ అనే సంఘ పరివార్ శక్తుల బెదిరింపులకు కొనసాగింపే ఘర్ వాపసీ. ప్రస్తుతం ఇతర మతాలను అవలంబిస్తున్న భారతీయుల పూర్వీకులందరూ హిందువులేననీ, వారు పాలకుల బలప్రయోగం వల్లనో, మతబోధకుల ప్రలోభాల వల్లనో మతాంతరీకరణ చెందారనీ, అందువల్ల ప్రస్తుత హైందవేతరులందరూ తిరిగి ఇంటికి రావాలనీ ఒక అచారిత్రక కుతర్కాన్ని సంఘపరివార్ శక్తులు తయారు చేశాయి. ఈ తర్కానికి పరాకాష్టగా ఒక కేంద్ర మంత్రి ఢిల్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రజలను రామ్ జాదే (రాముడి సంతానం) అవుతారా, హరామ్ జాదే (అక్రమ సంతానం) అవుతారా తేల్చుకొమ్మని సవాల్ విసిరింది. ముస్లిం యువకులు హిందూ యువతులను ఆకర్షించి పెళ్లి చేసుకుని, హిందూ మతస్తుల సంఖ్య తగ్గించడానికీ, ముస్లింల సంఖ్య పెంచడానికీ కుట్ర పన్నుతున్నారనీ, ఈ లవ్ జిహాద్ ను అడ్డుకోవాలనీ సంఘ పరివార్ పిలుపునిస్తోంది. దీనికి ప్రతిగా ‘బహు లావో – బేటీ బచావో’ అని నినాదం ఇస్తోంది.
ఈ ప్రమాదకర మత రాజకీయాల నేపథ్యంలోనే ఘర్ వాపసీ నినాద స్థాయి నుంచి ఆచరణ స్థాయికి మారింది. సంఘపరివార్ లో బలప్రయోగశక్తిగా పేరుపొందిన బజరంగ్ దళ్ తో పాటు, కొత్తగా ఇందుకోసమే పుట్టిన ధర్మ్ జాగరణ్ సమితి ఆగ్రాలో దాదాపు 350 మంది వీథి బాలలను, ఫుట్ పాత్ నివాసులను, అనాథలను పోగుచేసి, వారిని “శుద్ధి” చేసి, హిందూ మతంలోకి తిరిగి చేర్చుకున్నాయి. ఈ ఘర్ వాపసీలను విస్తృతంగా సాగించి 2021 కల్లా క్రైస్తవులు, ముస్లింలు లేని, హిందువులు మాత్రమే ఉండే భారతదేశాన్ని తయారుచేస్తామని ధర్మ్ జాగరణ్ సమితి నాయకుడు రాజేశ్వర్ సింగ్ అన్నాడు. ఇటువంటి ప్రకటనలనే దేశవ్యాప్తంగా సంఘ పరివార్ నాయకులు పునరుక్తం చేస్తున్నారు.
ఈ వ్యాఖ్యలు, బెదిరింపులు మరింత ప్రమాదకర పరిణామాలకు దారితీస్తాయని ఎందరో హెచ్చరించిన తర్వాత స్వయంగా ప్రభుత్వాధినేతలు కాస్త స్వరం తగ్గించి, మార్చి ఈ పామును ఇప్పటికి బుట్టలో పెట్టారు గాని, మళ్లీ ఎప్పుడు ఆ బుట్ట మూత తీసి ప్రజలను పాముకాటుకు ఎరచేస్తారో తెలియదు.
ఈ ప్రకటనలకు, వ్యాఖ్యలకు, బెదిరింపులకు ఉపయోగిస్తున్న తర్కం అప్రజాస్వామికమైనది, రాజ్యాంగ వ్యతిరేకమైనది. భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన మతస్వేచ్ఛ మీద, ఆదేశిక సూత్రాలలో ప్రకటించుకున్న శాస్త్రీయ దృక్పథ ప్రాధాన్యత మీద దాడి ఇది. ఈ తర్కం అచారిత్రకమైనదీ, అసంబద్ధమైనదీ, అర్థరహితమైనదీ కూడ. ఎందుకంటే, హిందూ మతం అనే మతం ఒకటి ఉందా అనే ప్రశ్నను అలా ఉంచినప్పటికీ, హిందూ మతానికి ప్రాతిపదిక వర్ణాశ్రమ ధర్మం. కుల అంతరాలు. మరి ఇతర మతస్తులు గతంలో హిందూ మతంలో ఉన్నవాళ్లే అని వాదనకోసం ఒప్పుకున్నా, వారు తిరిగివస్తే ఏ కులంలో చేర్చుకుంటారనే ప్రశ్నకు సంఘపరివార్ దగ్గర జవాబు లేదు. పూర్వీకుల కులంలోకే వెళతారని కొందరు, కోరుకున్న కులంలోకి వెళ్లవచ్చునని కొందరు అంటున్నారు. పూర్వీకుల కులంలోకే వెళ్లవలసి ఉంటే ఘర్ వాపసీ కి అర్థం లేదు. కోరుకున్న కులంలోకి వెళ్లే అవకాశం ఉంటే హిందూ మతమే మిగలదు. అసలు ‘హిందూ మతం’ అనేదేదైనా ఉంటే, ఒకప్పుడు మతాంతరీకరణకు గురయ్యారనుకునేవాళ్లందరూ ఎప్పుడైనా ఆ మతం పరిధిలోనే ఉన్నారా, ఆ మతం వారిని తనలోపలికి తీసుకుందా అనేవి అనుమానాస్పదమైన, ఆధారాలు లేని అంశాలని చరిత్ర చెపుతున్నది.
అలాగే గతంలో పాలకులు బలప్రయోగంతో, మతబోధకులు ప్రలోభాలతో మతాంతరీకరణ జరిపారనే వాదన కూడ పూర్తి సత్యం కాదు. సాధారణంగా హిందుత్వవాదులు బలప్రయోగం అన్నప్పుడు ముస్లిం పాలకుల కాలాన్ని, ప్రలోభాలు అన్నప్పుడు క్రైస్తవ మతబోధకుల కాలాన్ని సూచిస్తారు. కాని నిజంగా ముస్లిం పాలకులు బలప్రయోగం ద్వారా, బ్రిటిష్ పాలకులు ప్రలోభాల ద్వారా మతాంతరీకరణ జరపదలచుకుని ఉంటే భారత సమాజంలో ముస్లింల, క్రైస్తవుల నిష్పత్తి ఇంత తక్కువగా ఉండేది కాదు. అసలు మతాంతరీకరణకు ఇలా ఆకర్షించడమే (పుల్ ఫాక్టర్) ఏకైక కారణం అనడం సరికాదు. భారత సమాజంలో మతాంతరీకరణకు అనేక సంక్లిష్ట కారణాలు ఉండే అవకాశం ఉంది. కాని ప్రధాన కారణం మాత్రం హిందూ వర్ణాశ్రమధర్మ, కుల అసమానతల సమాజం బైటికి తోయడం, వికర్షించడం (పుష్ ఫాక్టర్) కావచ్చు. ఈ సమాజంలో వివక్షకు, అసమానతకు, పీడనకు, అంటరానితనానికి గురైన వర్గాలలో అత్యధికులు అవకాశం వచ్చినప్పుడు మరొక మతం వైపు చూశారు. అందులోనూ అసమానత సహజమైనదని, భగవంతుడే సృష్టించాడని “హిందూ” మతం అంతరాలకు దైవిక సమర్థన ఇస్తుండగా, ఆ అంతరాల పీడనకు గురవుతున్నవారిని చేరవచ్చిన మతాలు కనీసం సైద్ధాంతికంగానైనా ప్రేమను, కరుణను, సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించాయి.
సరే, ఈ చర్చంతా ఎలా ఉన్నా ఇంత ప్రధానమైన అంశం మీద బుద్ధిజీవులు స్పందించవలసి ఉంది. కాని తెలుగు బుద్ధిజీవులలో అతి తక్కువ మంది మాత్రమే ఘర్ వాపసీ గురించి ఆలోచించడం, స్పందించడం, మరింత తక్కువ మంది ఆ స్పందనను రచనల్లో చూపడం చూస్తే విచారం కలుగుతున్నది. కనీసం వంద సంవత్సరాల కింద గురజాడ అప్పారావు, డెబ్బై సంవత్సరాల కింద శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, అరవై సంవత్సరాల కింద వట్టికోట ఆళ్వారుస్వామి ఈ విషయంలో చూపినంత స్పందననైనా మనం ఇవాళ చూపలేకపోవడం ఎందుకో ఆలోచించాలనిపిస్తున్నది.
ఈ దేశం మాదే అని ప్రకటించే అధికారం “హిందువుల”మని చెప్పుకునేవారికి లేదని గురజాడ, శ్రీపాద ఇద్దరూ చాల స్పష్టంగా చెప్పారు. ఇంగ్లిష్ వారు నిన్న వచ్చారని, ముస్లిములు మొన్న వచ్చారని అనుకుంటే అటు మొన్న నువ్వు వచ్చావని మరచిపోయి, విభేదాలు పెట్టగూడదని గురజాడ ప్రబోధించారు. ఆ మాటలో కూడ ఇప్పుడు నిశితంగా పరిశీలిస్తే, బ్రిటిష్ వారిని భాషతోనూ, ముస్లింలను మతంతోనూ గుర్తించడం వంటి బ్రిటిష్ చరిత్రకారులు మనకు అంటించిన లోపం ఉన్నప్పటికీ, ఈ మతవైవిధ్యం విభేదాలకు, విద్వేషాలకు కారణం కాగూడదని సూచించడం ఇవాళ్టికీ అవసరమైన ప్రజాస్వామిక అవగాహన.
అలాగే ‘పెద్దమసీదు’ కథలో “కాకుళేశ్వరుడి గుడి పగలగొట్టి మ్లేచ్ఛుడు మసీదు కట్టాడు” అని ఒక పాత్రతో అనిపిస్తూనే “దేవుడెందుకూరకున్నాడు స్వామీ” అని ప్రశ్నవేయించి, “ఆ మాటే యే శాస్త్రంలోనూ కనబడదురా…” అని వ్యంగ్యంగా మనిషి చేసిన దేవుడి నిస్సహాయతను చూపించారు. అట్లాగే ‘మీ పేరేమిటి?’ కథలో హిందూ మతంలో భాగమనుకునే శైవ వైష్ణవ శాఖల మధ్య ఘర్షణలను చిత్రించారు. ‘మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అని ఒక అమాయకమైన, కాని అవసరమైన ఆశను ప్రకటించారు.
ఆ తర్వాత రెండు మూడు దశాబ్దాలకు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మత మౌఢ్యాన్ని విమర్శిస్తూ, వెటకరిస్తూ రాసిన అనేక రచనల్లో ‘మనకా మతాభిమానం’ అనే అద్భుతమైన వ్యాసం ఇక్కడ గుర్తు తెచ్చుకోదగినది.
“…మన మతం యేది?
దీనికి సమాధానం రావాలంటే, ముందు, మనం యెవరమో తేల్చుకోవాలి.
మనం అంటే హిందువులం అనుకుందామా, మన సనాతనత్వం పోతుంది.
ఏమంటే?
ఈ పేరు మనకి దరిమిలా వచ్చింది.
పైగా, యిది జాతివాచకం గాని మతవాచకం కాదు.
నిజం గుర్తిస్తే, అసలు, మనం హిందువులమే కాము.
హిందూ శబ్దం మనం సృష్టించుకున్నది కాదు.
ఆ శబ్దానికి సాఫీ అయిన అర్థమూ లేదు…”
అంటూ ప్రారంభించి పాండిత్యమూ తర్కమూ వ్యంగ్యమూ కలగలిసిన, ఆయనకు సహజమైన వాదనాశక్తితో అపురూపమైన చర్చ చేసి చివరికి,
”ఈ మతాల ఉల్బణం పాతవాటితో నిలిచిపోయినా వొక దారే; కాని, యిప్పటికీ కొత్త మతాలు పుడుతూనే వున్నాయి.
బ్రహ్మ సమాజం,
ఆర్యసమాజం,
రాధాస్వామి మతం,
హరనాథ మతం,
సాయిబాబా మతం,
దివ్యజ్ఞాన మతం,
పులిమీద పుట్ర అన్నట్టు, అన్నిటికీ పైన రాజకీయమతాలు.
ఇలాగ ఆర్యుల దగ్గరినుంచీ – అంటే, ఆర్యులలోనూ ఉత్తమోత్తములైన బ్రాహ్మల దగ్గిరనుంచీ – ఆ బ్రాహ్మలలోనూ, భిన్నమతాల – భిన్న శాఖల – భిన్ననాడుల దగ్గిరనుంచీ, వేద బాహ్యుల దాకా, వేదబాహ్యులలోనూ, అస్పృశ్యులదాకా, అస్పృశ్యులలోనూ మళ్లీ అస్పృశ్యులదాకా వున్న నానావర్ణ, నానాకుల, నానావర్గ, నానాదృక్పథాల వారూ, నానా ప్రాప్యాలవారూ హిందువులు.
ఆ హిందువులం మనం.
ఈ ‘మన’కా మతాభిమానం?
థిక్!” అని ఛీత్కరించారు.
అలా గురజాడ, శ్రీపాదలలో మతం గురించి కొంత హేతువాద దృష్టితో, కొంత ప్రజాస్వామిక దృష్టితో, కొంత పాశ్చాత్య ప్రభావపు ఉదారవాద దృష్టితో కనబడిన వైఖరిని, వట్టికోట ఆళ్వారుస్వామి తన అపారమైన ప్రజాజీవితానుభవం నుంచి, మార్క్సిస్టు అవగాహన నుంచి మరింత విస్తరించారు.
హైదరాబాదు రాజ్యంలో 1938కి ముందు పరిస్థితులు ఇతివృత్తంగా రాసిన ‘ప్రజలమనిషి’ నవల సహజంగానే మతం గురించి రాయడానికి ఆయనకు అవకాశం ఇచ్చింది. నవలా కాలపు హైదరాబాద్ రాజ్యం మతరాజ్యం కాదు గాని, పాలకుల వ్యక్తిగత మతం ఇస్లాం. పాలితులలో అత్యధికులు హిందువులు అనడం కూడ నిశితంగా చూస్తే సరికాదు గాని, అటూ ఇటూ కూడ మతం పునాది మీద ప్రజాసమీకరణలు మొదలయినది ఆ కాలంలోనే. ప్రత్యక్షంగా రాజకీయ సంస్థలు ఏర్పడడానికి అవకాశం లేని స్థితిలో హిందువుల లోనూ, ముస్లింల లోనూ ఆర్యసమాజ్, హిందూ మహాసభ, ఆర్యరక్షణ సమితి, శుద్ధి ప్రచార్, హిందూ సబ్జెక్ట్స్ కమిటీ, సేవాదళ్, మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్, అంజుమన్-ఇ-తబ్లీగ్-ఇ-ఇస్లాం, అంజుమన్-ఇ-ఖాక్సరన్ వంటి మతసంస్థలెన్నో పుట్టుకువచ్చాయి. వీటిలో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్, అంజుమన్-ఇ-తబ్లీగ్ హిందువులను మతాంతరీకరించడానికి, అనల్ మాలిక్ (ముస్లిం అయిన ప్రతి ఒక్కరూ రాజే) అనే కుహనా ఆభిజాత్యం ప్రచారం చేయడానికి ప్రయత్నించగా, అలా మారిన వారిని “శుద్ధి” చేసి తిరిగి హిందువులుగా మార్చడానికి ఆర్యసమాజ్, ఆర్య రక్షణ సమితి, శుద్ధి ప్రచార్ వంటి సంస్థలు ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాలు భౌతిక ఘర్షణలుగా పరిణమించిన తర్వాత నిజాం ప్రభుత్వం 1938 సెప్టెంబర్ లో నాలుగు హిందూ సంస్థలను, మూడు ముస్లిం సంస్థలను నిషేధించింది.
ఆ చరిత్ర వివరాలు ఇక్కడ అవసరం లేదు గాని, తబ్లీగ్ (మత పరివర్తన), శుద్ధి అనే పేర్లతో అప్పుడు సాగిన వ్యవహారమే ఇప్పుడు మతాంతరీకరణ, ఘర్ వాపసీ పేర్లతో పునరావృతమవుతున్నది. ఈ తబ్లీగ్, శుద్ధి కార్యక్రమాల మత రాజకీయాలను ఆళ్వారుస్వామి ‘ప్రజలమనిషి’ లో రెండు అధ్యాయాలలో వివరంగా చిత్రించారు.
అప్పటిదాకా దొర రామభూపాల్ రావు అనుయాయిగా ఉండిన హైదరలీ “…దిమ్మెగూడెంలో హరిజనులను మహమ్మదీయులుగా చేసే సన్నాహాలు” ప్రారంభిస్తాడు. “హైదరలీ ప్రతిరోజు చావడి ముందర కూర్చొని హరిజనులతో సానుభూతిగా మాట్లాడేవాడు. వాండ్ల కష్టాలు పోయే రోజులు వచ్చాయని, ఇన్నాళ్లకు భగవంతుడు హరిజనులకు మేలు చేయబోతున్నాడని, హరిజనుల కష్టాలకు ఆలా హజ్రత్ హృదయం నీరైపోతున్నదని హరిజనులతో అంటుండేవాడు. భూములు, చదివించిన తర్వాత ఉద్యోగాలు ప్రభుత్వం ఇస్తుందని, మొత్తంపై హరిజనుల గూడెంలో సుముఖ వాతావరణం కల్పించాడు.”
ఇంతకాలమూ తమను దూరం చేసి ఉంచిన మొత్తం గ్రామంపై ఇది ఒక ప్రతీకారంగా దళితులు భావించారు. చివరికి అంజుమన్ నాయకుడు వచ్చి మతపరివర్తన జరిపే రోజున “వచ్చినప్పుడల్లా హరిజనులతో వెట్టి పనులు చేయించుకునే పోలీసు వాండ్లు ఆ రోజు చాకలి, మంగలి, కుమ్మరి వాండ్లతో చేయించుకున్నారు. హరిజనుల స్థాయి పెరిగినట్టు తోచి పోలీసువాండ్లకు ఈర్ష్య కలిగింది.” అంజుమన్ నాయకుడు తన ఉపన్యాసంలో “ఈ గ్రామంలో అందరివలె పుట్టిపెరిగినా మీరు ఊరికి దూరంగా మురికికొంపల్లో ఉంటున్నారు. మీరు పందుల్లాగ బ్రతుకుతున్నారు. వేరేవాండ్లవద్ద మీకు కుక్కలకున్న గౌరవం లేదు. మీతో పొద్దస్తమానం పని చేయించుకొని కడుపుకు నిండని కూలి, జీతాలు ఇస్తున్నారు…” అని వాస్తవ స్థితి చెపుతాడు. ప్రచారకుడు “మీరు మహమ్మదీయుల్లో కలిస్తే మీ కష్టాలు పోతాయి. మీరంతా మహమ్మదీయులతో సరిసమానముగా విద్య, ఉద్యోగాలు పొందవచ్చును. హిందువుల దేవాలయాల్లోనికి వెళ్లలేనివారు, ఊరి చేదబావులవద్దకి పోజాలనివారు స్వేచ్ఛగా మస్జిద్ లోకి వెళ్లవచ్చును. చేదబావుల్లోకి వెళ్లవచ్చును…” అంటాడు.
ఒక మతంలోని అసమానత, వివక్ష, అన్యాయం ఎట్లా మరొక మతంవైపు చూడడానికి పునాది కల్పిస్తున్నాయో వాస్తవికమైన చిత్రణ ఇది. ఆళ్వారుస్వామి అక్కడితో కూడ ఆగిపోలేదు. ఆ వికర్షణ కావలసిన ఫలితం సాధించబోదనే విమర్శ కూడ అందులోనే భాగం చేశారు. ఆ ఉపన్యాసాలు సాగుతుండగానే “యిగ హైదరలీ ఎంత జీతం యిస్తడో చూస్తం గద” అనీ, “దొర గుంజుకున్న భూములు, తీసుకున్న లంచాలు ఇప్పిస్తరా” అనీ మౌలిక సమస్యల వైపు కూడ దృష్టి మళ్లించారు.
“మహమ్మదీయులుగా మారిన హరిజనులు జీతగాండ్లుగా పనిచేయడానికి వెనుక ముందాడారు. అయితే ఏమీ పని చేయకుండా ఎన్నాళ్లు ఏ విధంగా బ్రతకడం? వెంటనే చదువులు, ఉద్యోగాలు, భూములు పొందడం సంభవమా? భూములు ఏవిధంగా లభిస్తాయి? ఎవరివల్ల, ఎవరివి, ఎప్పుడు, ఏ విధంగా భూములు హరించబడ్డాయి?…” అని మతాన్ని, మత పరివర్తనను మించిన ప్రాథమిక మానవావసరాల గురించి, రాజకీయార్థిక కారణాల గురించి మాట్లాడించారు.
ఈ మతాంతరీకరణ వెనుక రాజ్యం ఉన్నదనే అవగాహనతో కంఠీరవం దాన్ని వ్యతిరేకించినప్పుడు, “చెప్పుదెబ్బలు తింటూ, గులాములై పడివున్న మాదిగోండ్లు ఆత్మగౌరవం, సంఘమర్యాద పొంది ఉండటం ఈ బాపనోడికి సహింపరాకుండా ఉంది” అని అంజుమన్ నాయకుడితో అనిపించి, బహుశా ఆరు దశాబ్దాల తర్వాతి అస్తిత్వవాదం చేపట్టబోయే అతివాద వ్యాఖ్యలను కూడ ఆళ్వారుస్వామి ఊహించారు. “…ఇతరులు హరిజనులను అణగదొక్కుటే మీ కార్యక్రమానికి మూలకారణమైతే, ఆ హరిజనులకు మీరు ఒరగపెట్టేది కూడా ఏమీ లేదు. వాండ్లగతి ఇట్లాచేస్తే అసలే మారదు” అని కంఠీరవంతో జవాబు కూడ చెప్పించారు.
హైదరలీ గురించి “హరిజనులను మహమ్మదీయులను చేసి ఉద్ధరించ బయలుదేరిన ఈ పెద్దమనిషి అన్యాయంగా తోటి మతం వాండ్లయిన దూదేకులవారి భూమిని హిందువైన ఒక దొర ఆసరాతో హరించాడని మీరు తెలిసికోవాలె” అని న్యాయస్థానంలో కంఠీరవం చేత మళ్లీ ఒకసారి మౌలికమైన భూమి సమస్య లేవనెత్తించారు. గ్రామంలో కొమరయ్య భూమి తగాదాతో దొరకు వ్యతిరేకంగా ఏర్పడిన వాతావరణం ఈ మత పరివర్తనతో మారిపోయి, మహమ్మదీయులైన వాండ్లను శత్రువులుగా చూసే స్థితికి ఎలా దారితీసిందో చిత్రించి ఈ వ్యవహారాలు అసలు సమస్యలను ఎలా పక్కదారి పట్టిస్తాయో చెప్పారు.
తబ్లీగ్ గురించి ఎంత తీవ్రంగా రాశారో, శుద్ధి గురించి కూడ అంత తీవ్రంగానే రాశారు. మరీ ముఖ్యంగా శుద్ధి కార్యక్రమాన్ని ఊళ్లోకి దొర తెచ్చాడు గనుక దాని వెనుక ఉన్న స్వార్థప్రయోజనాలను ఎత్తి చూపారు.
శుద్ధి కార్యక్రమాన్ని విమర్శిస్తూ “తురకలైతే ఒరిగింది లేదు. హరిజనులైతే అనుభవిస్తున్నది లేదు. అన్ని ఎప్పటోల్నే ఉన్నయి” అనీ, “ప్రధానిగారు తురక, హిందువు అని అంటున్నరు. మరి ఇప్పుడు కష్టాలు చెప్పుకున్నోళ్లంతా హిందువులేనయిరి. దొర హిందువేనాయె. మానుకుంటె ఎవడన్న కొట్టొచ్చిండా” అనీ పరంధామయ్యతో అనిపించారు.
“సర్కారు మన్సులు తురకలైనా మనోడైనా చేసే గోల, ఆరాటం, తిట్లు, కొట్లు, అది కావలె, ఇది కావలె అని అల్లుండ్లోలె అన్ని సాగించుకొని పొట్టపగుల మెక్కి, మిగిలింది మూటలు కట్టుకొని పోటం లేదే” అని చాకలి సర్వయ్య, “ఆ యిందువేందో, తుర్కేందో, హైదరలీ బీట్లకు పోయినా, దొరగారి ఏనెకు పోయినా, రైతుల గెట్ల పొంటి పోయినా జీవాలను అడుగు పెట్టనియ్యరు….” అని గొల్ల వీరయ్య తమ నిత్య జీవిత అనుభవం నుంచి అసలు విషయాలు చెపుతారు.
ప్రధానంగా ఆ రెండు అధ్యాయాలు, మొత్తంగా నవల మౌలికమైన దోపిడీ, పీడనలకు మతం లేదని, అందువల్ల తబ్లీగ్, శుద్ధి అసలు సమస్యల నుంచి పక్కదారి పట్టించే అర్థరహితమైన వివాదాలని పాఠకులకు అవగాహన కలిగిస్తాయి.
ఇవాళ మళ్లీ ఒకసారి ప్రపంచీకరణ, కార్పొరేట్ దౌర్జన్యం, పెరిగిపోతున్న సామాజిక అసమానతల నేపథ్యంలో పాలకవర్గాలకు అందివస్తున్న నినాదం ఘర్ వాపసీ. హిందుత్వవాదుల గతకాలపు శుద్ధి ఇవాళ ఘర్ వాపసీ ముసుగు తగిలించుకుని బుసలు కొడుతున్న ఈ సందర్భంలో, హిందుత్వ మతోన్మాద, మతవిద్వేష రాజకీయాల గురించీ, మొత్తంగా మతవాదం గురించీ బుద్ధిజీవులు ఇంకా ఎక్కువగా మాట్లాడవలసి ఉన్నది. ఈ అనవసర వివాదాలు అసలు సమస్యల మీద ప్రజల ఆరాట పోరాటాలను పక్కదారి పట్టించడానికేనని చెప్పవలసి ఉన్నది. కనీసం గురజాడ అప్పారావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, వట్టికోట ఆళ్వారుస్వామి సాధించిన కృషిని విస్తరించి బలోపేతం చేయవలసి ఉన్నది.
గతకాలానికి చెందిన ఆ అవగాహనలో సగమో పావో అయినా ఈ అత్యాధునిక వర్తమానంలో ఉంటే ఎంత బాగుండును!
-ఎన్ వేణుగోపాల్
ఇవీ చదవండి
FILED UNDER: గతవర్తమానంTAGGED WITH: ఎన్ వేణుగోపాల్
మంచి వ్యాసం.
కానీ తక్షణం స్పందించ వలసిన అవసరం రచయితలకు వుమ్దక్కర లేదు. జర్నలిస్టులు,రాజకీయ నాయకులూ,పోలీసులు తక్షణమే స్పందించాలి అని నేను అనుకుంటాను.
నేను కూల్చేసి కట్టించుకుంటా
నీదో మతం నాదో మతం మనకెందుకు మానవత్వం ఫకీరా……….
నేను పిలక పెట్టి విభూది పెట్టి వూరేగిస్తా
వాడి ఆకలి పూచీ నీది కాదు నాది కాదు అల్లానో ఈశ్వరో చూసుకుంటాడులే ఫకీరా…. “అని వ్రాసాను,”ఘర్ వాపసీ”అంశం మీద. మీ వ్యాసం చదివిన తరువాత ఈ విషయము మీద నా అప్పటి ప్రతి స్పందన పేలవంగా తోస్తున్నది.
ఫకీరా,అనే సంబోధనాత్మక మకుటాన్ని వాడుతూ కొన్ని కవితలని ఫేస్ బుక్ లో కవిసంగమం అనే గ్రూపులో పోస్ట్ చేసాను.అమ్దులోవే ఈ రెండు చిట్టి కవితలు. మీ స్పందనకు ధన్యవాదాలు. రిప్లై ఇవ్వటంలో ఆలస్యమునకు మన్నించండి.
శ్రీనివాస్.
చాల బావుంది. కొన్ని విషయాల్లో మన తెలుగు రచయితలూ క్రీస్తు పూర్వంలో ఉన్నారు. కొందరు చచ్చిన రాజులను కీర్తిస్తూ.. కొందరు బతికిన రాజులకు వంత పాడుతూ..
అంటే- ఒక గురజాడ అప్పారావు, శ్రీ పాద సుభ్రమణ్య శాస్త్రి, ఒక వట్టి కోట ఆల్వార్ స్వామీ ఈ నాడు లేనట్టే గా ! ఇలా పరిమితులు విధించు కొనెమ్త గా దిగ జారి పోయినట్టా ( వారికంటే ఇంకా ముందు వుండాల్సిన రాసియితులు ఎక్కడా? ) మీ వ్యాసం రచయితులుకు చెర్ణాకోలా. బాగా ఉంది.
excellent..article..sir….
చాలా చక్కగా చెప్పారు — మోహన్ గారు — సుబ్రహ్మణ్యం గారి కామెంట్స్ తో
ఎకబవిస్తాను
అమెరికా అయినా — అమలాపురం అయినా — మారింది అంటూ ఏమి లేదు —— తాము
శ్రీశ్రీ — బుచ్చిబాబు —తిలక్ — వర వ ర —శివా రెడ్డి గారల కన్నా — గొప్పగా feel… అవుతూ ——–మోడీ రాకతో బాబాలు — సంఘ పరివార్ లు — లేనిపోని కూతలు కూస్తూ ???
మనిషి బతకడానికి మతం — కులం అవరమా ??
అమెరికా లో కూడా — చదువుకున్న దద్దమ్మ ల కు — అగ్ర కులాల వాళ్ళ కు — నేటికి
కుల మత పట్టింపులు లేక పోలేదు — ముస్లిమ్స్ అంటే Desha ద్రోహులు — పరాయి వాళ్ళు — అంటూ మాట్లాడే వాళ్ళు అక్కడనే కాదు — యిక్కడ అమెరికా లో కూడా దొర లు — ఉన్నారు ???
మతం కారణం గా —Nehru గారి పదవి కా 0క్ష కారణం గా దేశం 2 ముక్కలు అయినా —-
యింకా దేశం లో మతాన్ని రాజకీయం చేస్తూ — దేనికి ?? ఎందుకు ??
మార్పు అవసరం
————————————–బుచ్చి రెడ్డి గంగుల
ఎటు చూస్తే అటు పట్టనితనం, దాటవేత, నిర్లిప్తత. రాష్ట్ర విభజన లాంటి
అత్యంత సున్నితమైన అంశాన్ని కూడా ఓ ఆటలా దేశం మొత్తం అదేదో
మనకు సంబంధించిన విషయం కానట్లుగా, పరాయి దేశపు సమస్యలా
పరిగణించి, ప్రవర్తించిందే తప్ప అది అందరి సమస్యగా గుర్తెరగలేదు.
ఆ ఒక్క విషయమనే కాదు, మొత్తంగా, ఏ విషయం చూసినా ఇదే ధోరణి.
సమాజంలో మీరాశించే పావు శాతం కాదు కదా పదో శాతం కూడా
కనుచూపు మేరలో అడ్రెస్ లేదు …
తిరుపాలు
,
ఎన్ ఎం రావు బండి గార్లకు,
కనీసం 4-5 కోట్ల మంది convert అయ్యారు. అది మీకు అత్యంత పవిత్ర కార్యం ల కనిపిస్తోందా ?
మరి దాని గురించి మీరు ఒక్క మాట మాట్లడలేదు
2) అంత హిందూ ద్వేషం ఎందుకు ?. క్రిస్టినా మిషనరీస్ ఎన్ని దారుణాలు చేస్తున్నారో మీకు తెలుసా
తిరుపతి కొండ మీద ప్రచారం చేసే దుస్సాహసం వారికుంది. ఈ మధ్య ఒక దుర్మార్గుడు ఏకంగా తిరుపతి కి వెళ్ళే బక్తులు అంతా పాపులు అని వీడియో youtube పెట్టాడు. కానీ ఈ మిస్సినరీస్ ఈ చిన్న మసీద్ దగ్గర కూడా ప్రచారం చెయ్యరు
ఎందుకంటే ప్రాణాలు మిగలవని తెలుసు
3) సౌదీ అరేబియా పెట్రో డాలర్స్ తో Wahabism అనే tribal మెంటాలిటీ ని మన దేశ ముసిలం లో పెంచుతోంది
దాని గురించి మీరు మౌనంగా వుంటారు
4) ఒక్కసారి సువార్త సభల్లో ఎం చెప్తారో చుడండి.Dasaradhu ఎయిడ్స్ తో చచ్చింటాడు అని చెప్పే నీచులు vuntarakkada
కానీ అది మీకు కనపడదు వినపడదు.
అయ్యా ఈ మేధో దివాలకోరుతనం నుండి బయటపడండి.
నేను ఎక్కడ నేరాలని సమర్ధించ లేదు. 1940 కలం నాటి రచనలు చుపుంచి ఎందుకు విషం చిమ్మడం. Christian కన్వర్షన్ లో లేని సమస్య హిందూ కన్వర్షన్ కి ఎందుకు ? అవి చట్ట విరుద్దం అయితే కోర్ట్ కి వెళ్ళొచ్చు కదా?
మతప్రచారం, ఇష్టపడేవారి కన్వర్షన్ చేసుకునే ప్రజాస్వామ్య హక్కు హిందువులకు కూడా ఉంది. హిందూ కన్వర్షన్లు కూడా చాలా కాలంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఘర్ వాపసిని వ్యతిరేకించడానికి కారణం, దానికి అధికారంలో ఉన్న బిజెపి మద్దతు ఇవ్వడం, బిజెపి ప్రభుత్వం మాట్లాడకపోవడం. మతాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం మీదే వ్యతిరేకత.
హిందూ సంస్థలకు అందే విదేశీ నిధులు 200 కోట్లే అన్నారు. ఆ డబ్బు మీరు చెప్పిన 20 వేల కోట్లకు చేరితే సమస్యే లేదు. సంఘపరివార్ కూడా మిషనరీలతో పోటీ పడచ్చు.
సంఘ్ పరివార్ లో హిందువులు కాక పోతే క్రైస్తవులు ఉన్నారా? సంఘ్ పరివార్ హిందువులకు ప్రతినిధే. కాదని మీరన్నంత మాత్రన ఒరిగేదేమి ఉండదు. బిజెపి కి 31% ఓట్లు కమ్మీ ఇంగ్లిష్ మీడీయా ప్రచారం చేసిన అబద్దాల ప్రాపగండ. అయినా ఓట్ల లెక్కల ప్రస్తావన అనవసరం. కాలనికి అనుగుణంగా సంఘ్ పరివార్ వాళ్లన్నా మారుతున్నారేమో గాని, వామపక్షవాదులలో ఏ మార్పు లేదని ఈ వ్యాసం చదివితే అర్థమౌతుంది.
ఆహ . ఈ లెక్కన మీరు షరియా లా ని , స్త్రీ లని అణిచివేసే wahabism ని సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే అవి ప్రపంచీకరణ కాదు కాబట్ట్టి. మల్లి సాంఘి లే అవి తెచ్చారు కనక వారు మాట్లాడ కూడదు. రేపు ఇసిస్ వచ్చిన వాళ్ళు ఒకే. ఎందుకంటే వాళ్ళు సంగి లు కాదు ప్రపంచీకరణ కాదు. పాపం ISIS వాళ్ళకి మీరు ఇక్కడ మంగళ హరతులతో రెడీ వున్నటు తెలిసినట్టు లేదు. Wahabism రానిస్తే ISIS దాదాపు వచ్చినట్టే )
(రెండింటిని నిర్ద్వందంగా నేను ఖండిస్తున్నాను .బహుశ మీరు సాంఘి ల తో ఆగిపోతారు)
( అంతా కలిపితే 200 కోట్లు. నేను చెప్పిన 20,000 కోట్లు గవర్నమెంట్ ఫిగర్. కాకి లెక్క కాదు ( మీకు అర్థం అయ్యే భాషలే చెప్పాలంటే సాంఘి లెక్క కాదు). మీకు ఎలాగు అంకగణితం బాగా తెలుసు ( మీరు సాంఘి లు కాదు కదా))
( దివాలుకోరుతనం తక్కువ మాటే అనుకుంట )
అందరు అభినందిస్తారు నేను capitalism ని ఇష్టపదను . Socialism ని గౌరవిస్తాను. ఆ ముసుగులో ఒక మతాన్ని టార్గెట్ చేస్తుపోతే మీ లక్ష్యమే మీకు దూరం అవుతుంది తప్ప ప్రయోజనం లేదు. లెఫ్టిస్ట్ జనాలు అనుకున్తున్నాటుగా జనాలు ప్రాపగాండా వాళ్ళ BJP ki వోటు వెయ్యలేదు. ఈ ఒంటి కన్ను secularism వల్లనే జనాలు rightist వైపు మల్లుతున్నారు. నేను సాంఘి ని కాదు కానీ కమ్యూనిస్ట్ ని కూడా కాదు.
ఎవరో ఏదో ప్రచారం చేస్తే మారిపోవటానికి హిందువులు అంత బలహీనంగా వున్నారా? వారు పిల్లలతో సమానమా? వారి దైవనమ్మకం స్తిరమైనది కాదా? అంత బలహీనులుగా, అమాయకులుగా ఉంటే ప్రచారం లేక పోయినా మారి పోతారు. దైవ నమ్మకానికి సామాజిక పరిస్తితులకు ఏమిటి సంబందం? ఏదో సంబందం లేక పోతే ఎవరైనా ఎందుకు మారాలి? ఇక్కడ రాజాకీయాలు మతంతో పెన వేసుకున్నాయి కనుక.
దైవ నమ్మకం కాల మాన పరిస్తితులను బట్టి మారుతూ ఉంటాయా ? అప్పుడు ఉన్న హిందు మతానికి ఇప్పుడున్న హిందు మతాని ఏమిటి భేదం? అది మతం లో ఉన్న మార్పు కాదు. రాజకీయాల్లో వచ్చిన మార్పు. ఇక్కడ రచయిత చెప్పదలుచుకున్నది మతంతో రాజకీయాలను మిళితం చేయ టాన్ని గురించే.
మతనమ్మకం అంటే దైవ నమ్మకం అయితే అది వ్యక్తు అవగాహనను బట్టి వారి విశ్వాసాన్ని బట్టి ఏర్పడేది. అది పూర్తిగా వ్యక్తీ గతం. అది ఒకరికోసం మారమంటే మారేది కాదు. అలా మర్చటమ్ అంటే ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని స్వేచ్ఛను దెబ్బదీయటమ్ కాదా?
ఎవరో ఏదో ప్రచారం చేస్తే మారిపోవటానికి హిందువులు అంత బలహీనంగా వున్నారా? వారు పిల్లలతో సమానమా? వారి దైవనమ్మకం స్తిరమైనది కాదా? అంత బలహీనులుగా, అమాయకులుగా ఉంటే ప్రచారం లేక పోయినా మారి పోతారు. దైవ నమ్మకానికి సామాజిక పరిస్తితులకు ఏమిటి సంబందం? ఏదో సంబందం లేక పోతే ఎవరైనా ఎందుకు మారాలి? ఇక్కడ రాజాకీయాలు మతంతో పెన వేసుకున్నాయి కనుక.
అన్ని గుడుల దగ్గర ప్రచారం చేయడం రెచ్చ గొట్ట్టడం కదా ? దాన్ని తప్పు అనడానికి మీకు నోరు రావట్లేదు.
2) హిందువుల అంత బలహీనుల ? మరి ఇదే ఇప్పుడు GharWapsi మతం మారుతున్నా వారికీ వర్తిస్తుంది కదా
అలాంటప్పుడు గొడవే లేదు కదా
దైవ నమ్మకం కాల మాన పరిస్తితులను బట్టి మారుతూ ఉంటాయా ? అప్పుడు ఉన్న హిందు మతానికి ఇప్పుడున్న హిందు మతాని ఏమిటి భేదం? అది మతం లో ఉన్న మార్పు కాదు. రాజకీయాల్లో వచ్చిన మార్పు. ఇక్కడ రచయిత చెప్పదలుచుకున్నది మతంతో రాజకీయాలను మిళితం చేయ టాన్ని గురించే.
మతనమ్మకం అంటే దైవ నమ్మకం అయితే అది వ్యక్తు అవగాహనను బట్టి వారి విశ్వాసాన్ని బట్టి ఏర్పడేది. అది పూర్తిగా వ్యక్తీ గతం. అది ఒకరికోసం మారమంటే మారేది కాదు. అలా మర్చటమ్ అంటే ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని స్వేచ్ఛను దెబ్బదీయటమ్ కాదా?
Everybody has రైట్ to change their రిలీజియన్. నా సమస్యల్ల ఒక అంతర్జాతీయ మాఫియా పని కట్టుకుని
వేల కోట్లు కుమ్మరించి, ప్రలోభాలతో ఈ పని చెయ్యడం. దళితులూ బౌద్ధం లో కి మారినప్పుడు ఎవరు ఇలాంటి ఆక్షేపణలు చెయ్యలేదు.
సోనియా వల్లే మిషనరీ మాఫియా చెలరేగింది అన్నది అందరికి తెలిసిన విషయం. ప్రభుత్వానికి తెలేకుండా ఇన్ని వేల కోట్లు వచ్చేవ ఇండియా లో కి ? UPA గవర్నమెంట్ సహాయం చాల వుంది ఈ conversions లో.
BJP కచ్చింతగా మతతత్వ పార్టీ ఈ ? మరి MIM మాటేమిటి ? IUML , Kerala కాంగ్రెస్, పీస్ పార్టీ అఫ్ ఇండియా కూడా మతతత్వ పార్టీ లే ? మరి అవి వున్నా UPA Secular ఎలా అవుతుంది ? ద్వంద్వ ప్రమాణాలు మంచివి కాదు .
ఈ ఆర్టికల్ చదవండి.
http://archive.tehelka.com/story_main.asp?filename=ts013004shashi.asp#
ఇలాంటివి వెలుగులోకి వస్తే వాళ్ళు మౌనంగా వుంటారు కానీ ఒక హిందూ సంస్థ అందులో వందో వంతు చేస్తే
మటుకు వీళ్ళు నానా హంగామా చేస్తారు. ఈ సెలెక్టివ్ secularism వల్లే జనాలు BJP వైపు వెళ్తున్నారు.
You can never majority communalism without fighting minority communalism
http://www.andhrajyothy.com/Artical.aspx?SID=74370&SupID=21
స్వచ్ఛంద సంస్థలకు విరాళాలపై సుప్రీంలో పిటిషన్
తెలంగాణకు ‘సుప్రీం’ నోటీసులు
సీబీఐకి ‘ఎన్‌జీవో’ల లెక్కలు చెప్పాలని ఆదేశం
న్యూఢిల్లీ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఏటా విదేశాల నుంచి విరాళాల రూపంలో భారత్‌కు భారీగా నిధులు వస్తుంటాయి. వీటిలో 90 శాతానికి పైగా క్రైస్తవ మిషనరీలకే వెళ్తుండటం గమనార్హం. విదేశాల నుంచి అధిక మొత్తంలో నిధులు పొందుతున్న రాషా్ట్రల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉండేది. క్రైస్తవ మిషనరీలు, స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి వస్తున్న విరాళాలు, ఆయా సంస్థలు పాటించాల్సిన నిబంధనలపై శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటులో పలువురు సభ్యులు ప్రశ్నించగా, కేంద్ర హోం శాఖ ఈ మేరకు సమాచారాన్ని అందించింది.
2011-12 ఆర్థిక సంవత్సరంలో రూ.100,82,09,53,640 (100 బిలియన్లు పైగా), 2012-13 ఆర్థిక సంవత్సరంలో రూ.95,49,32,53,954 (95 బిలియన్లు పైగా), 2013-14 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 15వ తేదీ వరకు రూ.31,66,59,76,705 (31 బిలియన్లు పైగా) భారత్‌కు వచ్చాయి. ప్రతి ఏటా దాదాపు 160కి పైగా దేశాలకు చెందిన సంస్థలు, వ్యక్తులు ఈ నిధులను వివిధ రాషా్ట్రల్లోని స్వచ్ఛంద సంస్థలకు పంపిస్తున్నారు.
’’నిజంగా ముస్లిం పాలకులు బలప్రయోగం ద్వారా, బ్రిటిష్ పాలకులు ప్రలోభాల ద్వారా మతాంతరీకరణ జరపదలచుకుని ఉంటే భారత సమాజంలో ముస్లింల, క్రైస్తవుల నిష్పత్తి ఇంత తక్కువగా ఉండేది కాదు.‘‘… ఈ వాక్యాలు చదివినప్పుడు శ్రీపాద రాసిన ’’ఇలాంటి తవ్వాయి వస్తే…‘‘ కధ గుర్తుకు వచ్చింది.
ఘర్ వాపసీ గురించి గురించి మీరు రాసిన పంక్తులు ’’ఇతర మతస్తులు గతంలో హిందూ మతంలో ఉన్నవాళ్లే అని వాదనకోసం ఒప్పుకున్నా, వారు తిరిగివస్తే ఏ కులంలో చేర్చుకుంటారనే ప్రశ్నకు సంఘపరివార్ దగ్గర జవాబు లేదు. పూర్వీకుల కులంలోకే వెళతారని కొందరు, కోరుకున్న కులంలోకి వెళ్లవచ్చునని కొందరు అంటున్నారు. …‘‘ అని రాశారు. ఇక్కడ ఒక విషయం గుర్తించవలసిందేమిటంటే, ఇస్లామ్ అనే మతం కేవలం 1400 సంవత్సరాల ముందు మాత్రమే చారిత్రకంగా ఉనికిలోకి వచ్చింది. అంతకు ముందు ముస్లిమ్ అనేవాడు (ఇస్లామీయ సైద్ధాంతిక విశ్వాసాల ప్రకారం మాట్లాడడం లేదు… చారిత్రకంగా మాట్లాడుతున్నాను) ఎవడూ లేడు. కాబట్టి అప్పుడు ముస్లిములుగా మారినవాళ్ళందరూ మతం మార్చుకున్నవాళ్ళే. ఇక్కడ కూడా ముస్లిముల పూర్వికులు మతం మార్చుకున్నవాళ్ళని చెప్పడంలో నాకు పెద్ద అభ్యంతరాలు కనబడడం లేదు. ఎవరికి ఇష్టమైన మతంలోకి వాళ్ళు వెళ్ళారు. అంతే. ఇప్పుడు ముస్లిములుగా ఉన్నవాళ్ళు వాళ్ళకు నచ్చిన మతం కాబట్టి ఉంటున్నారు.
ఇప్పుడు ఈ పునరాగమనాలు, పునస్సమాగమాల సెంటిమెంటల్ కథ వెనుక ఉన్న కొన్ని వాస్తవాలను కూడా గమనించాలి. ఈ వాస్తవాలను గమనిస్తే ఘర్ వాపసీ ద్వారా తిరిగి వచ్చినవాళ్ళు ఏ కులంలోకి వస్తారన్న ప్రశ్నే ఉదయించదు. ఎందుకంటే అసలు ఘర్ వాపసీ అనేదే ఒక కౌంటర్ ఎత్తుగడ. మత మార్పిళ్ళను పూర్తిగా నిషేధిస్తే ఇలాంటి ఘర్ వాపసీలు ఉండవంటూ బిజేపి నేతలు చేసిన వ్యాఖ్యలు గమనించండి. ఒక మౌలికమైన హక్కును హరించడానికి, మతస్వేచ్ఛను పూర్తిగా నిరాకరించడానికి వేసిన ఎత్తుగడ మాత్రమే ఇది. ఘర్ వాపసీపై ముస్లిం, క్రయిస్తవ సంఘాలు ఆందోొళన చేస్తాయని, సెక్యులర్ సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తాయని వారికి తెలుసు. ఈ ఆందోళనలను సాకుగా చూపించి మతస్వేచ్ఛను కబళించేలా మతమార్పిళ్ళ నిషేధాన్ని అమలు చేయాలన్నదే అసలు పథకం. ఇప్పుడు శ్రీపాద రాసిన ’’ఇలాంటి తవ్వాయి వస్తే…‘‘ కధ గురించి కూడా ఆలోచించండి. చెరువు నీళ్ళ కోసం నాల్కలు ఎండిన నిమ్నకులాలు ఏ చెరువులోకి దూకాలి? అలాంటి అవకాశాలు లేకుండా చేయాలంటే, నిమ్నకులాలను అణిచి ఉంచాలంటే, ఘర్ వాపసీ వంటి కార్యక్రమాల ద్వారా ఆందోళనాకరమైన పరిస్థితి సృష్టించి మతస్వేచ్ఛను కట్టడి చేయడానికి వేసిన పథకం తప్ప ఇందులో ఘర్ వాపసీ ఏదీ లేదు.
ఈ వ్యాసంపై వచ్చిన కామెంట్లలో సీతారామయ్య గారి కామెంటుకు ప్రతిస్పందించడం అవసరమనిపిస్తోంది.. సీతారామయ్య గారు రాసిన పంక్తులు ’’డిల్లీ సుల్తానేట్ ఏర్పాటు చేసిన ముస్లింలు ఆఫ్ఘన్లు. ముందు దోచుకోవటానికీ తర్వాత పరిపాలించటానికీ వచ్చారు. రెండు మూడు శతాబ్దాల తర్వాత వచ్చిన ముఘల్ పాలకులు మంగోలులు. ఈ రెండు జాతుల ముస్లిం పాలకుల్లో కనీసం కొందరు భారత దేశాన్ని షరియా సూత్రాల ప్రకారం పరిపాలించారు. ముస్లిమేతరుల మీద జిజ్యా పన్ను విధించారు. ఇంకొక దేశాన్ని ఆక్రమించి ఆ దేశ ప్రజల మీద మత సంబంధమైన పన్ను కట్టించడానికి వీరికి ఎంత మత దురహంకారం ఉండాలో ఆలోచించండి. వీళ్ళ ముందు సంఘ్ పరివార్ వారు ఛోటా గుండాల్లాగా కనబడతారు ‘‘…ఇందులో జిజియా పన్ను గురించి రాశారు. సీతారామయ్య గారు ఆ కాలంలో ప్రభుత్వాలు విధించిన మొత్తం పన్నుల గురించి వివరంగా రాస్తే బాగుండేది కదా.. షరియా ప్రకారం ముస్లిములు పన్నులు కట్టకుండా బతికేశారా? షరియా ప్రకారం జకాత్ ప్రభుత్వానికి పన్నులాగా చెల్లించకుండా ముస్లిములను ఆ ప్రభుత్వాలు వదిలేశాయా? ఈ సుల్తానుల కాలంలో ముస్లిం పౌరులు జకాత్ ఎంత చెల్లించేవారు? ముస్లిమేతరులు జిజియా ఎంత చెల్లించేవారు? ముస్లిమేతరుల నుంచి జకాత్ వసూలు చేసినట్లు ఎక్కడా లేదు. వాస్తవమేమంటే, ముస్లిమ్ పౌరుల నుంచి జకాత్ వసూలు చేసేవారు, ముస్లిమేతర పౌరులనుంచి జిజియా పేరుతో పన్ను వసూలు చేసేవారు. ముస్లిమేతరులపై జకాత్ విధించే అవకాశం షరియా ప్రకారం లేదు. కాని ఈ వివరాలేవీ చెప్పకుండా, జిజియా అంటే జుట్టుపన్ను, గెడ్డం పన్నంటూ అపార్ధాలు ప్రచారం చేస్తూ, ఈ జుట్టు పన్ను కేవలం హిందువులపైనే వేసేవారని చెప్పడంలో వాస్తవమెంత?
ఇక మరో విషయం బలవంతంగా మతమార్పిళ్ళు జరపగలరా? సీతారామయ్య గారు చెప్పిన మంగోలులు మొదట ముస్లిములు కాదు, వారు ముస్లిములుగా ఎలా మారారు? వారిపై ముస్లిం సైన్యాలు దండెత్తి వారిపై ప్రభుత్వం చేశాయా? నిజానికి మంగోలులే ముస్లిం రాజ్యాలపై దండెత్తి సర్వనాశనం సృష్టించారు. మంగోలు దండయాత్రల్లో ముస్లిం రాజ్యాలు ఎలా నాశనమయ్యాయో చరిత్ర చదవండి. ఆ మంగోలులే.. విజేతలుగా ముస్లిముల భూభాగాలను ఆక్రమించుకున్న మంగోలులే తర్వాత ముస్లిములాగా మారారన్నది చరిత్రలోని వాస్తవం. మరో విషయం చెప్పమంటారా? ప్రపంచంలో ముస్లిమ్ జనాభా అత్యధికంగా ఉన్న ఇండోనేషియాపై ముస్లిం సైన్యాలు, సుల్తానులు చరిత్రలో ఎప్పుడైనా దండయాత్రలు చేశాయా? అక్కడ ముస్లిం సైన్యాలు కాలుమోపాయా? మరి ఇండోనేషియా, అలాగే మలేషియా వంటి దేశాల్లో ప్రజలు ముస్లిములుగా ఎలా మారారు?
బలవంతం, ప్రలోభాలతో ఎవరి మతాన్నయినా మార్చడం సాధ్యం కాదు. అసలిలాంటి మతమార్పిళ్ళను ఎవరు సమర్ధించరు కూడా. నిజానికిప్పుడు ఇరాక్ గా ఉన్నది ఒకప్పటి మెసపొటేమియా. చరిత్రలో అత్యంత బలమైన పర్షియన్ సామ్రాజ్యం అది. పర్షియన్ చక్రవర్తి ఖుస్రో కాని, అతని ప్రజలు కాని ముస్లిములు కాదే. వాళ్ళు కూడా తర్వాతనే ముస్లిములుగా మారారన్నది చరిత్ర. మరో విషయం చెప్పమంటారా, ఇస్లామ్ ప్రవక్త ముహమ్మద్ (స) స్వంత తాత, ప్రవక్తకు కొండంత అండగా ఎల్లప్పుడు నిలబడిన అబ్దుల్ ముత్తలిబ్ చివరి శ్వాస వరకు ముస్లిమ్ కాలేదు. ఆయనకు నచ్చిన మతంపైనే ఆయన ఉన్నాడు. కాని ప్రవక్త ముహమ్మద్ (స)కు తన తరఫున పూర్తి సహకారం అందించాడు. ప్రవక్త (స)పై సైన్యాలు నడిపించిన సుఫ్యాన్ నిజానికి వ్యాపారంలో ప్రవక్త (స)కు భాగస్వామి. చరిత్ర మనకు చాలా పాఠాలు చెబుతుంది. మనం ఎలాంటి సంకుచితభావాలను ఇప్పుడు పెంచి పోషిస్తున్నామో అలాంటి భావాలు చరిత్రలో చాలా తక్కువగా కనబడతాయి. కనీసం మన సమీప చరిత్రలో కూడా ఇలాంటి సంకుచిత భావాలు లేవు.
సీతారామయ్య గారు రాసిన మరో మాట ’’దేశ విభజనకు ముందు భారత దేశంలో ముస్లింలు 25% అని చదివాను ఎక్కడో. దేశాన్ని విభజించి రెండు ముస్లిం దేశాలు ఏర్పాటు చేసిన తర్వాత కూడా భారత దేశంలో ముస్లింల జనాభా ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. ఇది తక్కువా ఎక్కువా?‘‘ ఈ ప్రశ్న అడిగే ముందు సీతారామయ్య గారు, దేశవిభజన తర్వాత దేశంలో ముస్లిము జనాభా శాతం ఎంత? ఇప్పుడు ఎంత శాతం ఉంది? ముస్లిముల జనాభా పెరుగుదల రేటు ఎంత? హిందువుల జనాభా పెరుగుదల రేటు ఎంత? రెంటికీ మధ్య ఎంత తేడా ఉంది? ఆ తేడా రావడానికి కారణాలు ఏమిటి? వగైరా ప్రశ్నలపై కూడా కాస్త ఆలోచించండి. ఈ ప్రశ్నలకు జవాబులు పెద్ద కష్టం కాదు. కాస్త ఓపిగ్గా గూగుల్లో వెదికితే జవాబులు దొరకవచ్చు.
కాని వేల సంవత్సరాలుగా హిందూ మతం లోని బ్రాహ్మణీయ భావజాలం సాటి మనుషులను అత్యంత దారుణంగా , నీచంగా , పశువులకంటే హీనంగా , బానిసలుగా చూడటం , అన్ని రకాల అవకాశాలకు దూరంగా వుంచడం — ఇవన్నీ కూడా దేశంలో హిందువుల పట్ల , హిందూ సమాజం పట్ల వ్యతిరేకతకు కారణమైనాయి.
ఈ సందర్భంలోనే ఇతర మతస్థులు , పరిపాలకులు అలాటివారిని చేరదీసి , వారికి కొన్ని సదుపాయాలు కల్పించడం , వారిని అక్కున చేర్చుకోవడం జరిగింది. అదే వారిని ఇతర మతాలలోకి ప్రవేశించడానికి కారణమయిన విషయం మనం మరువకూడదు.
కాలం గడిచేకొద్దీ కొంతమేర మార్పులు జరిగినా , హిందువులుగా చెప్పుకొనేవారిపట్ల మెజారిటీ ప్రజలు వ్యతిరేకంగానే వున్నారు.అందుచేతనే హిందూమతానికి వ్యతిరేకంగా ఎలాటి కార్యక్రమాలు జరిగినా , హిందువులు ఎక్కువగా స్పందిచడం లేదు. కొద్దిమంది మాత్రం , సంఘపరివార్ లాటి సంస్థలు , హిందువులను సంఘటిత పరచడానికి ప్రయత్నాలు చేస్తూనే వున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇతర మతస్తులు ప్రజలపట్ల దారుణంగా ప్రవర్తించడాన్ని , దేశంలో జరుగుతున్న బాంబు దాడులకు సెక్యులరిస్టులుగా చెప్పుకుంటున్నవారి స్పందన ఆశించినంతగా లేదని కొందరి వాదన.
దేశంలో మైనారిటీలపట్ల జరుగుతున్న దాడులకు స్పందించినవారు , మైనారిటీల చర్యల పట్ల ఏవిధమైన నిజనిర్ధారణ కమిటీలు వేయడానికిగాని , రిపోర్టులు వ్రాయడానికిగాని ఆశించినంతగా ముందుకు రాలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది.
అందుకే అన్యమత ప్రచారాలపట్ల , మతమార్పిడులపట్ల హిందువులు ఆచి తూచి స్పందించడం జరుగుతోంది.
ఈ పరిణామాలు పాలకులకు వుపయోగపడేవేగాని , సామాన్య ప్రజల అభివ్రుధ్ధికి దోహదపడేవి కావు.
అసమానతలు లేని సమాజం , ప్రజలందరకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించడం జరగనంతవరకు ఇలాటి ఘర్షణలు , వాదనలు తప్పవు.
ప్రజలను ఈ దిశలో నడిపించవలసిన మేధావులు కూడా ఈ వాదనలవరకు వచ్చి ఆగిపోతున్నారు తప్ప , ప్రజలందరిని [ అన్ని మతాల వారినీ ] చైతన్యపరిచే కార్యక్రమం సమర్ధవంతంగా చేపట్టడం లేదు. అంతవరకూ ఈ వాదప్రతివాదనలు జరుగుతూనే వుంటాయి.
మీ పై కామెంట్ బాగుందండీ. చాలా బాలన్సు గా చెప్పారు.
“మనం ఎలాంటి సంకుచితభావాలను ఇప్పుడు పెంచి పోషిస్తున్నామో అలాంటి భావాలు చరిత్రలో చాలా తక్కువగా కనబడతాయి. కనీసం మన సమీప చరిత్రలో కూడా ఇలాంటి సంకుచిత భావాలు లేవు.”