Tuesday, 8 March 2016

అవధులు దాటిన అసహనం

అవధులు దాటిన అసహనం

Sakshi | Updated: March 08, 2016 10:25 (IST)
అవధులు దాటిన అసహనంవీడియోకి క్లిక్ చేయండి
వార్త - వ్యాఖ్య
 
‘నా తెలివితేటలతో రైతులకు నచ్చజెప్పాను. వాళ్ళకున్న కామన్‌సెన్స్ వీళ్ళకు (ప్రతిపక్షం వారికి) లేదు... హైదరాబాద్ సిటీని ఏ విధంగా కట్టాం?... పట్టిసీమను వ్యతిరేకించారు. పోలవరాన్నీ వ్యతిరేకిస్తున్నారు.... అభివృద్ధిని అడ్డుకుంటే మాత్రం ఉపేక్షించేదిలేదు...  కాపు ఉద్యమం ఎవరు చేయిస్తున్నారండీ?  ఇంకోపక్క కృష్ణమాదిగ...ఒక వయొలెన్స్ క్రియేట్ చేస్తున్నారు. వెస్ట్ గోదావరిలో ఒక చదువుకున్న అమ్మాయిని కిరోసిన్ పోసి కాల్చి చంపారు... ఊరూరా ప్రార్థనలు చేయించి, ప్రధానిని పిలిచి శంకుస్థాపన చేయించి,  పవిత్రమైన భావనతో రాజధాని నిర్మిస్తుంటే అడుగడుగునా అడ్డుపడుతున్నారు.’  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం మీడియా గోష్ఠిలో చేసిన ఈ వ్యాఖ్యలు అసందర్భంగా, అర్థంపర్థం లేని మాటలుగా, సంధిప్రేలాపనలాగా కనిపించవచ్చు.

కానీ ఈ అసంబద్ధమైన  వాక్యాలలో దాగున్న అంతస్సూత్రం ఏమిటంటే ఆరోపణలు చేసినవారిపైన ఎదురుదాడి చేయడం. స్వీయ తప్పిదాలను ఎత్తి చూపినప్పుడు తప్పు ఒప్పుకోకపోగా, సవరించుకోకపోగా ప్రతిసారీ ప్రతిపక్షాన్ని ఆడిపోసుకునే అలవాటు. ఇందుకోసం  అసత్యాలూ, అర్ధసత్యాలూ షరామామూలే. ఆత్మస్తుతి, పరనింద సరేసరి.  పోలవరాన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారు? పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో కేవలం వంద కోట్లు కేటాయిస్తే ముఖ్యమంత్రి నోరుమెదప లేదు. ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతికీ, దేశీయాంగ మంత్రికీ పోలవరంతో సహా విభజన చట్టంలో చేసిన హామీలన్నీ అమలు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు, అయినా సరే, ప్రతిపక్షమే పోలవరానికి అడ్డు తగులుతోందంటూ జంకూగొంకూ లేకుండా బొంకటంలోని ఆంతర్యం ఏమిటి? తన హయాంలో జరుగుతున్న అన్ని అనర్థాలకూ ప్రతిపక్షాన్ని నిందించడం, నిరాధారమైన ఆరోపణలు చేయడం ముఖ్యమంత్రికి బాగా అలవాటైన  పలాయనవాద, బుకాయింపు  రాజకీయంలో భాగం.

కాపు ఉద్యమాన్ని, పశ్చిమగోదావరిలో యువతిపై జరిగిన అమానుషాన్ని కలిపి వెంట వెంటనే ప్రస్తావించడంలో ఉద్దేశం ఏమిటి? ఆ రెండింటికీ ఏమైనా సంబంధం ఉన్నదా? సం బంధం ఏమైనా ఉంటే అది ప్రభుత్వ వైఫల్యమే. ముఖ్యమంత్రి మాటలలోనే ప్రశ్నించాలంటే ‘ఎక్కడికి పోతున్నారు?’. చివరికి మంత్రి కిశోర్‌బాబు సుపుత్రుడు హైదరాబాద్‌లో ఒక యువతిని వేధిస్తే దాని తాలూకు టేపులను మార్ఫ్ చేయించింది ప్రతిపక్ష నాయకుడేనంటూ మంత్రి చేత చెప్పిం చిన ముఖ్యమంత్రి ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఈ దృశ్యాలను అన్ని చానళ్ళూ అనేక సార్లు చూపించాయి. ప్రతి పక్షం ఒక అనవసరమైన అవరోధంగా ముఖ్యమంత్రికి కనిపిస్తోంది. ప్రతిపక్షం లేకుండా పోతే బాగనే భావన ఆయన వైఖరిలో స్పష్టంగా కనిపిస్తోంది.

రాజధాని భూముల క్రయవిక్రయాలకు సంబంధించి ఈ పత్రికలో వచ్చిన కథనాలపైన వివరణ ఇవ్వడానికి ఉద్దేశించిన విలేకరుల గోష్ఠిలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వచ్చిన ఆరోపణలను తవ్వితీసుకొని వచ్చి చదివి వినిపించారు చంద్రబాబు. ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టులో మార్పులకు సంబంధించి తన ప్రభుత్వంపైనా, కడప జిల్లాలో భూముల క్రయవిక్రయాలకు సంబంధించి తన బంధువులపైనా,  ఫోక్స్‌వ్యాగన్ వ్యవహారంపైన తన మంత్రివర్గ సహచరుడిపైనా వచ్చిన ఆరోపణలను సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని నిర్ణయించినట్టు  వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి హోదాలో 2006 సెప్టెంబర్ 28వ తేదీన ప్రకటించారు. సీబీఐ దర్యాప్తుతో పాటు న్యాయవిచారణ కూడా జరిపించాలని నిర్ణయించారు. అదే స్ఫూర్తితో తన ప్రభుత్వంపైన రాజధాని భూముల విషయంలో వచ్చిన ఆరోపణలలోని నిజానిజాలు నిగ్గుతేల్చడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించవలసిందిగా ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేయవలసిన ముఖ్యమంత్రి పత్రికనూ, విలేఖరులనూ, ప్రతిపక్షాన్నీ తిట్టిపోయడం అన్యాయం.

భూమి లావాదేవీల వివరాలను ప్రచురిం చిన ‘సాక్షి’ పత్రికపైన ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు. అటాచ్‌మెంట్ అంటే ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా తప్పుడు నిర్వచనం ఇచ్చారు. ఏ మాత్రం పొంతన లేని సత్యం రామలింగరాజు కేసుతో పోల్చి తన ‘తెలివితేటలను’ నిరూపించుకున్నారు. ‘సాక్షి’ ప్రజల ఆస్తి. అంటే ప్రభుత్వం ఆస్తి అంటూ చిత్రమైన భాష్యం చెప్పారు.  ఏ ఆరోపణపైన అయినా విచారణ ప్రారంభించే ముందే అభియోగాలు ఎదుర్కొంటున్నవారి  పేరుపైన ఉన్న ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ ‘అటాచ్’ చేయడం ఆనవాయితీ. అభియోగాలు ఎదుర్కొంటున్నవారు దోషులని అర్థం కాదు. విచారణ తర్వాత వారు  దోషులుగానో, నిర్దోషులుగానో నిర్ధారణ అవుతుంది. అంతిమ తీర్పుపైన శిక్ష విధించడమా, నిర్దోషిగా ప్రకటించడమా అనే నిర్ణయం  న్యాయస్థానానిది. విచారణ కాలంలో  అభియోగాలు ఎదుర్కొంటున్నవారు  ఆస్తులను విక్రయించకుండా, వాటిలో మార్పులూచేర్పులూ చేయకుండా నిరోధించే ఉద్దేశంతోనే ఆస్తులను ‘అటాచ్’ చేస్తారు. ఆస్తులపైన హక్కును ఈ అటాచ్‌మెంట్ హరించదు.

ఆస్తుల నిర్వహణకు సంబంధించి ఇబ్బందులు ఉండవు. ఆర్థిక అక్రమాలు చేసినట్టు స్వయంగా ఒప్పుకున్న రామలింగరాజు కేసుకూ, రాజకీయ కక్షతో కాం గ్రెస్, టీడీపీలు కలసి పెట్టించిన కేసులకూ పోలిక లేదు. చట్టం తెలిసినవారందరికీ ఈ విషయం స్పష్టమే. ముఖ్యమంత్రిగా పదేళ్ళకు పైగా పని చేసిన వ్యక్తికి ఈ అంశం తెలియదని ఊహించలేము. తెలిసే, బుద్ధిపూర్వకంగానే, ప్రజలను తప్పుదారి పట్టించే ఉద్దేశంతోనే, రాజకీయంగా ప్రతిపక్షాన్ని దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే ‘అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తులన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి మొన్ననే లెటర్ రాశాం’ అంటూ చెప్పారు. ఒక వేళ ముఖ్యమంత్రి అటువంటి ఉత్తరం కేంద్ర ప్రభుత్వానికి నిజంగానే రాసినా దానికి విలువ ఉండదు. తన మంత్రులూ, మిత్రులూ నేరం చేశారంటూ ఆరోపణలు వచ్చినప్పుడు ‘మీడియా ముసుగులో నేరాలు చేస్తామంటే, రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తామంటే ప్రభుత్వం కఠినంగా ఉంటుంది’ అంటూ బెదిరించడం ఫక్తు బుకాయింపు రాజకీయం.

మంత్రులు ఆస్తులు కొనుక్కుంటే తప్పా? వారికి డబ్బులుంటే భూములు కొనుక్కుంటారు. ఇందులో విచారించడానికి ఏముంది? ఇందుకోసం ఢిల్లీ నుంచి సీబీఐ అధికారులు రావాలా? అంటూ ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నలోనే మంత్రులు భూములు కొనుగోలు చేశారన్న ఒప్పుకోలు ఉన్నది. అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన సహచరులను మందలించకపోగా సమర్థించడం ముఖ్యమంత్రి  స్వభావానికి నిదర్శనం. రాజధాని గురించి ప్రకటన వెలువడటానికి ముందు ఎవరైతే భూములు కొనుగోలు చేశారో వారిపైన విచారణ విధిగా జరిపించాలి. వారికి రాజధానికి సంబంధించి ముందస్తు సమాచారం రహస్యంగా అందించినవారిని ఇన్‌సైడర్ ట్రేడింగ్ రహస్యాలను మిత్రుడు రాజ రత్నంకు అందజేసి పట్టుబడి న్యూయర్క్‌లో రెండేళ్ళ జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రవాస భారతీయ వణిక్ ప్రముఖుడు, గోల్డ్‌మన్ సాచ్ మాజీ డెరైక్టర్ రజత్ గుప్తాతో పోల్చాలి. మన చట్టాలు అమెరికాలో వలె తమ పని తాము చేసుకుంటే పోతే అక్రమాలు చేసేవారికి బరితెగించే వీలు ఉండదు. నిర్దోషులు నిందలు భరించే అవసరం ఉండదు. ప్రశ్నించేవారిపట్ల అసహసనం ప్రదర్శించే అవకాశం ఉండదు. మంత్రులుగా ప్రమాణం చేసే సమయంలో ప్రభుత్వ రహస్యాలను ఎవ్వరికీ వెల్లడించననీ, భయం, పక్షపాతం లేకుండా వ్యవహరిస్తాననీ చేసిన వాగ్దానాలను ఉల్లంఘించే సాహసం ఎవ్వరూ చేయరు. రాజ్యాంగ నైతికతకు భంగం కలిగించే పనికి ఒడిగట్టరు.

 ప్రభుత్వానికీ, తనకూ, ప్రభుత్వ ఆస్తులకూ, తన ఆస్తులకూ, తన ప్రతిష్ఠకూ, ప్రభుత్వ ప్రతిష్ఠకూ మధ్య అభేదం పాటిస్తున్న రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనపైన వచ్చిన ఆరోపణలను ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్రలుగా, అభివృద్ధిని అడ్డుకునే ప్రతీప చర్యలుగా అభివర్ణించడంలో ఆశ్చర్యం లేదు. ప్రభుత్వం అవకతవకల గురించీ, ప్రభుత్వంలో ఉన్నవారి అవినీతి పనుల గురించీ రాయకుండా పాత్రికేయులనూ, పత్రికలనూ, టీవీ చానళ్ళనూ బెదిరించడం వల్ల ప్రయోజనం లేదు. ఆరోపణలు చేసినవారందరినీ అభివృద్ధి నిరోధకులంటూ నిందించడం  బెడిసికొడుతుంది. ఇది పాలక పక్షానికీ, ప్రతిపక్షానికీ సంబంధించిన వివాదం కాదు. మీడియాకూ ముఖ్యమంత్రికీ మధ్య తగవు కాదు. ఇది ప్రజలకూ, పాలకులకూ సంబంధించిన వ్యవహారం. ముఖ్యమంత్రి సంజాయిషీ చెప్పుకోవలసింది  ప్రజలకు. తాను కానీ, తన సహచరులు కానీ ఏ తప్పూ చేయలేదని నిరూపించుకొని ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. లోగడ ఇటువంటి సందర్భాలలో ముఖ్యమంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ  తమపైన వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించ వలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరేవారు. జైన్ డైరీలో లాల్ కృష్ణ అడ్వానీ పేరు సంకేత మాత్రంగా ఉన్నట్టు ఆరోపణ వచ్చిన వెంటనే ఆయన పార్లమెంటు సభ్యత్వానికి  రాజీనామా చేశారు. కోర్టు నిరోషి అని ప్రకటించిన అనంతరమే లోక్‌సభకు తిరిగి పోటీ చేసి ఎన్నికైనారు.
 
చంద్రబాబు నాయుడి నుంచి అంతటి ఉన్నతమైన నైతిక ప్రమాణాలను ఆశించవచ్చునా? రాజీనామా చేయకపోయినా సరే, తనపైనా, తన మంత్రివర్గ సహచరులపైనా వచ్చిన ఆరోపణలపైన సీబీఐతోనో, న్యాయమూర్తితోనో విచారణ జరిపించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతారని భావించవచ్చునా?  అదీ జరగకపోతే కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని విచారణ జరిపిస్తుందా? రాజధాని భూముల వ్యవహారంలో స్పష్టత రావాలంటే, ప్రజల మనస్సులలో బలంగా నాటుకున్న అనుమానాలు తొలగిపోవాలంటే ఆరోపణలపైన తన అధీనంలో లేని కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న సీబీఐ చేత విచారణ జరపడం ఒక్కటే మార్గం.

మీడియాను నిందించడం అంటే తన ప్రతిబింబాన్ని ఉన్నది ఉన్నట్టు చూపించే అద్దాన్ని బద్దలు కొట్టడానికి ప్రయత్నించడమే. ప్రజాస్వామ్య వ్యవస్థలో విశ్వాసం ఉన్నవారు ఎవ్వరూ ఈ ధోరణిని హర్షించరు. ప్రభుత్వాధినేత అవధులు మీరిన అసహనం ప్రదర్శిస్తే ప్రజలే మీడియాను కాచుకుంటారు. ప్రజల తరఫున నిలబడి ప్రభుత్వం పనితీరును నిశితంగా గమనిస్తూ  వాస్తవాలు ప్రజలకు నిర్భయంగా నివేదించే విధి  నిర్వహిస్తున్న మీడియా సంస్థలు పాఠకులకూ, వీక్షకులకు మాత్రమే విధేయంగా ఉంటాయి. రాజ్యాంగాన్ని శిరసావహిస్తాయి. దోచినవారే రాసినవారిని శిక్షిస్తామంటూ బెదిరిస్తే భయపడవు. ఇటువంటి సందర్భాలు స్వతంత్ర భారత చరిత్రలో అనేకం వచ్చాయి. ప్రతిసారీ ప్రజలు మీడియాకే అండగా ఉన్నారు. చరిత్ర తెలుసుకొని అసహనం, అహంకారం తగ్గించుకుంటే పాలకులకే మేలు.
 http://img.sakshi.net/images/cms/2015-03/51427572512_295x200.jpghttp://img.sakshi.net/images/cms/2015-03/51427572512_295x200.jpg









-  కె. రామచంద్రమూర్తి
 

No comments:

Post a Comment