అమరావతి ఇమేజ్‌కు ఆ రాతలతో డామేజ్
04-03-2016 02:31:13
- అక్రమాలు నిరూపించకపోతే జగన్ మీడియాపై చర్య
- ఆ పత్రిక ఆస్తులు అటాచ్ అయ్యాయి.. అది ప్రజల ఆస్తి
- ఎవరి డబ్బుతో వారు భూములు
- కొనుగోలు చేస్తే తప్పేంటి!
- కోర్టు అటాచ్ చేసిన భూములకు లోకేశ్ పేరు పెడతారా?
- పిచ్చా? రాసేవాడికి బుద్ధుందా?
- ఇది అభివృద్ధిని అడ్డుకునే అజెండా
- రెచ్చగొట్టే చర్యలపై కఠినంగా ఉంటాం
- ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం
విజయవాడ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంతంలో ఎవరైనా డబ్బులు పెట్టి భూములు కొంటే తప్పేమిటని ముఖ్యమంత్రి చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం వ్యవహరించారా, లేదా అన్నదే ముఖ్యమని తెలిపారు. గురువారం రాత్రి ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. భూకుంభకోణం జరిగిందని కథనాలు ప్రచురిస్తున్న జగన్ పత్రికపైనా, సీబీఐ విచారణ జరపాలన్న వైసీపీ డిమాండ్లపైనా విరుచుకుపడ్డారు. ‘‘ఎందుకయ్యా విచారణ? ఏం జరిగిందని విచారణ? ఎవరి డబ్బులు పెట్టి వారు భూములు కొనుక్కుంటే నాకేం సంబంధం? అగ్రిగోల్డ్ భూములు కోర్టు కేసులో అటాచ్ అయ్యాయి. వాటికి లోకేశ్ పేరుతో ముడిపెడితే ఏమిటి దాని అర్థం? ఎక్కడికి పోతున్నారు. మీకు పిచ్చా? రాసేవాడికి బుద్ధుందా?’’ అంటూ మండిపడ్డారు. పక్కవాళ్లపై బురదజల్లి తుడుచుకోమన్నట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎక్కడైనా అవినీతి ఉంటే చర్యలు తీసుకోవచ్చని, అంతేగానీ భూములు కొనుక్కుంటే కాదని స్పష్టం చేశారు. తన ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా తాట తీస్తానని తెలిపారు. ‘‘ఎవరో భూములు కొనుక్కుంటే అది మాకు అనవసరం. నాకు కావలసింది నిబంధనలు పాటించారా లేదా అన్నదే’’ అని చంద్రబాబు తెలిపారు. రాజధానికి సంబంధించిన 55 వేల ఎకరాలు ఎక్కడికీ పోలేదని, అక్కడే ఉన్నాయని తెలిపారు. రైతుల వాటా భూమిని అభివృద్ధి చేసి ఇవ్వాల్సి ఉందన్నారు. ‘‘రైతులకు భూమి ఎక్కడ ఇస్తామో ఇంకా తెలియదు కదా! నిబంధనలను మార్చారని, అవినీతి జరిగిందని, సీబీఐ విచారణ వేయాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరికీ హద్దులుంటాయి. బురద జల్లి తుడుచుకోమంటారా? ఎందుకంత హజం మీకు?’’ అని వైసీపీని ఉద్దేశించి అన్నారు.
జగన్ పత్రిక ఆస్తులు పలు కేసుల్లో అటాచ్ అయ్యాయని... ఆ పత్రిక ప్రజల ఆస్తి అని చంద్రబాబు అన్నారు. అలాంటి పత్రిక అమరావతి నగరంపై 24 గంటలూ విషం చిమ్ముతోందని ఆక్రోశించారు. ‘‘గుడ్డ కాల్చి మొఖం వేసినట్లుగా ఉన్నాయా రాతలు. ఇష్టానుసారం రాసి ఇమేజీని డామేజీ చేయడమే వారి ధ్యేయం. వాటిని నిరూపించే పరిస్థితి ఉందా?’’ అని ప్రశ్నించారు. జగన్ పత్రిక రాసిన రాతలు నిరూపించలేకపోతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేసు వేయాలా లేక మరేం చేయాలన్న అంశంపై ఆలోచిస్తున్నామన్నారు. ‘‘రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలా, లేదా? కావాలనుకుంటే మా ఇంటిముందే పెట్టుకోవచ్చు కదా? ఎందుకు మీకింత అక్కసు? ఎంత విషం కక్కారు? నేను కాబట్టి తట్టుకోగలిగాను. ఇంకెవరైనా అయితే పారిపోయేవారు. ఒక్క పిలుపు ఇస్తే రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారు. రాష్ట్ర పరిస్థితి వివరిస్తే సింగపూర్ వాళ్లు నా మీద నమ్మకంతో ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ అందించారు. ఓవైపు నేను ఇలా ప్రయత్నిస్తుంటే... రాజధానిని అడ్డుకోవడానికి రైతుల్ని రెచ్చగొట్టారు. కోర్టులలో కేసులు వేయించారు’’ అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షానికి రహస్య ఎజెండా ఉందని, దాంతోనే ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు. అభివృద్ధి ఆగాలనేదే ప్రతిపక్షం లక్ష్యమన్నారు. ఇబ్బందులున్నా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, వాటి విషయంలో ఏమీ చేయలేక కుల, మత, ప్రాంతీయ రాజకీయాలు నడిపి ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తూ 24 వేల కోట్లతో రైతు రుణ మాఫీ, 10 వేల కోట్లతో డ్వాక్రా రుణ సదుపాయం కల్పించడం తమకు మాత్రమే సాధ్యమైందన్నారు. ‘‘43 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. కూలీ రేట్లు పెంచుతున్నాం. ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ల ద్వారా నిధులిస్తున్నాం. సబ్ ప్లాన్లు అమలు చేస్తున్నాం. కరెంటు, రోడ్లు బాగున్నాయి. అందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నాం. ఇంటింటికీ టాయిలెట్లు కట్టిస్తున్నాం. అన్ని పనులు చేసేటప్పుడు ప్రభుత్వాన్ని ఏమీ చేయలేక కులాలు, ప్రాంతాల వారీగా రెచ్చగొడుతున్నారు. ఈ విషయంలో చాలా గట్టిగా ఉంటాం. రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకుంటాం’’ అని చంద్రబాబు హెచ్చరించారు. ‘‘స్వాతంత్రం వచ్చాక ఎవరికీ ఇవ్వని అవకాశాన్ని ప్రజలు నాకు ఇచ్చారు. తొమ్మిదేళ్లు సీఎంగా... ఆ తర్వాత పదేళ్లు ప్రతిపక్ష నేతగా... మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ రాజకీయం నడిపినవారు ఎవరూ లేరు. నిన్న మొన్న వచ్చినవారు కూడా తనను అసెంబ్లీలో అమర్యాదగా మాట్లాడుతుంటే... ప్రజలకోసం భరిస్తున్నాను. నేను మరికొద్ది రోజుల్లో లండన్ వెళ్తున్నాను. దేశాలు తిరిగి నేను ఎందుకు పెట్టుబడులు అడుక్కోవాలి?’’ అని ప్రశ్నించారు. ప్రతిపక్షాల తీరుపై ప్రజలే ఆలోచించుకోవాలన్నారు.
కాపు కార్పొరేషన్ సాయం పసుపు చొక్కాలకే పరిమితమైందన్న ఆరోపణలకు సీఎం ఘాటుగా సమాధానమిచ్చారు. పసుపు చొక్కాలవారికి ఇవ్వకూడదా? వారు సమాజంలో భాగం కాదా? అని ప్రశ్నించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 30 మంది టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలకు ఏమీ ఇవ్వకూడదా అని ప్రశ్నించారు. ‘‘పశ్చిమ గోదావరి జిల్లాలో సర్పంచ్ నుంచి ఎంపీవరకు మావారినే గెలిపించారు. అలాంటి ప్రజలకు ఏమీ ఇవ్వకూడదా?’’ అని నిలదీశారు.
అసైన్డ్ భూముల విషయంలో సీఎం ఓ విషయాన్ని స్పష్టం చేశారు. రాజధాని ప్రకటన వచ్చేనాటికి ఎవరు ఓనర్లుగా ఉంటే వారికే ప్యాకేజీ వర్తిస్తుందని తేల్చి చెప్పారు. ఆ తర్వాత కొనుగోలు చేసిన వారికి కాకుండా ఒరిజినల్ యజమానులకే ప్యాకేజీ చెందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై శుక్రవారం సమీక్ష చేస్తానని, తర్వాత ప్రకటన చేస్తామని చెప్పారు.
No comments:
Post a Comment