Monday, 21 March 2016

చంద్రబాబు ఈ విషయంలో కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకున్నారా?

చంద్రబాబు ఈ విషయంలో కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకున్నారా?
21-03-2016 13:11:36

భవిష్యత్తు కోసం కేవలం కలలు కనేవారు స్వాప్నికులు. అవే వ్యూహాలను వర్తమానంలో అమలుచేస్తూ ముందుకెళ్లేవారిని విజనరీ అంటారు. కానీ ఈ వ్యూహాలలో తలమున్కలై తనచుట్టూ జరిగే అంశాలను పట్టించుకోకపోయినా ప్రమాదమే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి పరిస్థితే నెలకొన్నది. అక్కడి నేతలు ఇప్పుడిప్పుడే వాస్తవాన్ని ఆకళింపు చేసుకుంటున్నారు. కులాల పేరుతో జరుగుతున్న కుమ్ములాటలను మొగ్గలోనే తుంచేసేందుకు నడుంకట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదర్శమో.. లేక భవిష్యత్తులో కులాల కుమ్ములాటలు తన కుర్చీకే ఎసరు పెడతాయనుకున్నారో తెలీదు కానీ, చంద్రబాబు వాస్తవంలోకి వచ్చారు. పోలీసుల్ని రంగంలోకి దించారు. కామ్‌గా జరిగిపోయిన ఈ కథ వెనుక పెద్ద తతంగమే నడిచింది. అదేమిటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!
 
విభజన తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబునాయుడు రాజధాని నిర్మాణంపై ప్రధానంగా దృష్టిసారించారు. భూముల స్వాధీనం కోసం భూసమీకరణ విధానాన్ని ప్రవేశపెట్టడం, రైతులకు ఫ్లాట్స్ కేటాయించటం, మాస్టర్ ప్లాన్ రూపొందించటం వంటి కార్యక్రమాలతో రాజధాని అంశం దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రెవెన్యూలోటుతో ఆంధ్రప్రదేశ్‌ సతమతమవుతున్న రీత్యా.. రాజధాని నిర్మాణానికి నిధుల కోసం చంద్రబాబు విదేశాలకు వెళ్లటం, అంతర్జాతీయ బ్యాంకులను ఆశ్రయించటం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. కేంద్రం ప్రకటించిన పలు సంస్థలకు రాష్ట్రంలో శంకుస్థాపనలు జరగ్గా, మరికొన్ని విద్యాసంస్థల్లో క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లో క్లాసులు జరుగుతున్నాయి. వీటికి శాశ్వత భవనాల నిర్మాణం కోసం కేంద్రం నుంచి నిధుల మంజూరు అంతంతమాత్రంగానే ఉంది. ఈ సమస్యలు చాలవన్నట్టు రాష్ట్రంలో రాజుకున్న కులాల కుంపటి చంద్రబాబుకు కొత్త చికాకులు తెచ్చిపెట్టింది.
 
కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. కొద్దిగా ఆలస్యంగానైనా కాపుల కోసం ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసింది చంద్రబాబు ప్రభుత్వం. బడ్జెట్‌లో వారికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించింది. ఆర్థికంగా ఆదుకునేందుకు రుణాల మంజూరును కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తునిలో 'చలో కాపునాడు'కు పిలుపునివ్వడం, విధ్వంసకాండ చోటుచేసుకోవడం, ఆమరణ నిరాహారదీక్ష చేపట్టడం, ప్రభుత్వంతో చర్చల తర్వాత దీక్ష విరమించడం వంటి ఘటనల క్రమం అందరికీ తెలసిందే! తిరిగి పదిరోజుల్లోనే మరోసారి ముద్రగడ ఆమరణదీక్షకు పూనుకోవటం చంద్రబాబుకు చికాకు తెప్పించింది. ఇదే సమయంలో ఏబీసీడీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ చంద్రబాబు స్వస్థలమైన నారావారిపల్లె నుంచి రథయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. ఇది కూడా చంద్రబాబుకు పుండుమీద కారం పూసిన చందంగా తయారైంది.
 
ఏబీసీడీ వర్గీకరణ కోసం మందకృష్ణ చేస్తున్న ఉద్యమానికి గతంలో ప్రభుత్వం స్పందించింది. ఎస్సీల్లో ఏబీసీడీ వర్గీకరణ కోసం ఉద్యమం చేపట్టి ఆ సమస్యను అటు ప్రజల దృష్టికీ, ఇటు ప్రభుత్వ దృష్టికీ తెచ్చిన ఘనత మాత్రం మందకృష్ణకే దక్కుతుంది. ఈ సమస్యను గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు పరిష్కరించినప్పటికీ, మళ్లీ తమపైనే అస్త్రం సంధించడం ప్రభుత్వ పెద్దలకు ఎంతమాత్రం నచ్చలేదు. నిజానికి కేంద్ర స్థాయిలో ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంది. ఇందుకోసం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడాలనీ, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలనీ డిమాండ్‌ చేస్తూ మందకృష్ణ మళ్లీ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎమ్మార్పీఎస్ పేరిట మరికొన్ని సంఘాలు ఈలోగా ముఖ్యమంత్రిని కలుసుకున్నాయి. ఏబీసీడీ వర్గీకరణ కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతాననీ, కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని ఆ నేతలు ప్రకటించారు. ఈలోగా మందకృష్ణ తన ఉద్యమాన్ని నారావారిపల్లె నుంచి ప్రారంభించేందుకు రంగం సిద్ధంచేసుకొని హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లా సరిహద్దులకు చేరుకున్న వెంటనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయన చేపట్టిన రథయాత్రకు అనుమతిలేదని స్పష్టంచేశారు. సీఎం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్ళినందునే పోలీసులు ఓ అడుగు ముందుకేశారన్నది ఈ మొత్తం వ్యవహారంలో కీలక అంశం. మందకృష్ణని పోలీసులు హైదరాబాద్ తీసుకెళ్లి దించి వచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు మద్ధతు పలికిన మందకృష్ణకు ఆంధ్రాలో పనేమిటని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు కూడా.
 
ఇక... కాపు రిజర్వేషన్ల కోసం ఈ నెల 11వ తేదీన తలపెట్టిన ఆమరణ నిరాహారదీక్షని కూడా వాయిదా వేసినట్టు స్వయంగా ముద్రగడ ప్రకటించారు. విద్యార్థుల పరీక్షల కోసం నిరాహారదీక్షను వాయిదావేసినట్టు ముద్రగడ ప్రకటించినప్పటికీ.. దీనివెనుక బలమైన కారణమే ఉందని తెలుగుదేశం నేతలు అంటున్నారు. ముద్రగడ చేస్తున్న డిమాండ్లలో ప్రభుత్వం తక్షణం రిజర్వేషన్ కల్పించటం మినహా, మిగిలినవన్నీ నెరవేర్చిందనీ.. అటువంటప్పుడు దీక్ష ఎలా చేస్తారంటూ క్యాబినెట్‌లోని కాపు మంత్రులు విరుచుకుపడ్డారు. దీక్షపై స్పందించని మంత్రి గంటా శ్రీనివాసరావుపై కూడా సీఎం సీరియస్ అయ్యారంటే ఆయన ఎంత పట్టుదలగా ఉన్నారో విశదమవుతోంది.
 
సీఎం చంద్రబాబునుద్దేశించి ముద్రగడ రాసిన లేఖ కూడా చర్చనీయాంశంగా మారింది. ఇది జగన్ స్ర్కిప్ట్ అంటూ ఒకవైపు మంత్రివర్గ సహచరులతో విమర్శలు ఎక్కుపెట్టిస్తూనే.. మరోవైపు పోలీస్ వ్యూహానికి కూడా ప్రభుత్వం పదునుపెట్టించింది. గతంలో జరిగిన విధ్వంసకాండ వెనుక ఎవరున్నారో కూడా లీకులు ఇచ్చారు. చర్యలు కఠినంగా ఉంటాయని పరోక్షంగా సంకేతాలిచ్చారు. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దగ్ధం, పోలీస్టేషన్లపై దాడి, దహనం, పలు వాహనాలను తగులబెట్టడం వంటి ఘటనల్లో పాల్గొన్నవారి విజువల్స్, ఫొటోలు, ఫోన్ కాల్ డేటాను కూడా పోలీసులు సేకరించి సిద్ధంచేశారు. ముద్రగడ దీక్షనెదుర్కొనేందుకు కూడా పోలీసులు పకడ్బందీ వ్యూహం రూపొందించారు. ఈ వ్యూహాలేమిటో కూడా ఆయనకు తెలిసేటట్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల నుంచి వచ్చిన కాపునేతలు దీక్షను వాయిదా వేసుకోవాల్సిందిగా ముద్రగడకి సూచించారు. పదో తరగతి పరీక్షల కారణం చెప్పినప్పటికీ వెనుక జరిగిన తతంగమే దీక్ష వాయిదాకు కారణమనేది ప్రభుత్వ వర్గాల విశ్లేషణ.
 
తెలంగాణలో వివిధ సమస్యలను, పలు సంఘటనలను పోలీసుల ద్వారా డీల్‌చేయించడంలో సీఎం కేసీఆర్‌ విజయవంతమయ్యారు. తన చేతులకు ఎక్కడా మట్టి అంటకుండా జాగ్రత్తపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా అదే పంథాలో పయనించేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఈ రెండు ఉద్యమాలను కూడా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండానే పోలీసుల ద్వారా డీల్‌చేసి.. కామ్‌గా హైదరాబాద్‌లో అసెంబ్లీ సమావేశాల్లో మునిగిపోయారు. మొత్తానికి ఏపీలో కూడా తెలంగాణలో అనుసరిస్తున్న వ్యూహానికి ప్రభుత్వం పదునుపెట్టి.. ప్రయోగించింది.

No comments:

Post a Comment