Friday 11 November 2016

పెద్ద నోట్ల రద్దుతో ఎవరికి మేలు?

పెద్ద నోట్ల రద్దుతో ఎవరికి మేలు?
11-11-2016 00:46:18


ప్రభుత్వం తొలుత పన్నురేట్లను తగ్గించి, ప్రభుత్వ యంత్రాంగంలో కిందిస్థాయిలోని అవినీతిని నియంత్రించి పెద్ద విలువ గల కరెన్సీ నోట్లను రద్దు చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎంతైనా వున్నది. అదే సమయంలో ప్రభుత్వ వ్యయాలు ఉత్పాదక కార్యకలాపాలకు అయ్యేలా చూడవల్సివున్నది. సానుకూల చర్యలు లేని పక్షంలో పెద్దనోట్ల రద్దు వరం కాకపోగా శాపంగా పరిణమిస్తుంది.

ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయడంలో మోదీ ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నది. పాకిస్థాన్‌లోని ఫ్యాక్టరీలు నకీలీ భారతీయ కరెన్సీ నోట్లను ముద్రించి, మన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న మిలిటెంట్‌ గ్రూపులకు సరఫరా చేస్తున్నాయి. రాజకీయపార్టీలు భారీమొత్తంలో ఈ కరెన్సీ నోట్లను రహస్యంగా నిల్వచేసుకున్నాయి. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు తమ లావాదేవీలను నల్ల ధనంతోనే కదా నిర్వహించేది!

                  మోదీ ప్రభుత్వ నిర్ణయం సామాన్య మానవునికి గొప్ప ఊరటనిచ్చిందనడంలో సందేహం లేదు. రియల్‌ఎస్టేట్‌, బంగారు ఆభరణాల రంగాల వారు ఆదాయపు పన్ను చెల్లింపును ఎగవేస్తుండగా సామాన్య ఉద్యోగి నెలసరి వేతనం నుంచి ఆదాయపు పన్నును విధిగా మినహాయిస్తున్నారు. పెద్ద కరెన్సీ నోట్ల ఉపసంహరణ వల్ల సామాన్యులు తమ రోజువారీ అవసరాలకు జరపాల్సిన చెల్లింపుల విషయంలో తప్పక కొన్ని ఇబ్బందులకు గురవుతారు. అయితే ఇవి తాత్కాలికమే.
పెద్ద నోట్ల రద్దు వల్ల, నల్లధనం ఉత్పత్తికి దారితీస్తున్న వ్యవస్థ మాత్రం చెక్కు చెదరబోదు. ఆదాయపు పన్నురేట్లు అధిక స్థాయిలో ఉండడమూ, పన్నుల వసూలు యంత్రాంగంలో అవినీతి మూలంగానే నల్లధనం సృష్టి అవుతోంది. ఒక పారిశ్రామికవేత్త నెలకు కోటిరూపాయల విలువైన ఎయిర్‌ కూలర్లను ఉత్పత్తి చేస్తాడు. వీటిపై అతను ఎక్సైజ్‌ సుంకం, అమ్మకపుపన్ను, ఆదాయపు పన్ను చెల్లించవలసి ఉంటుంది. నెలా నెలా వాటి విక్రయాలపై రూ.35లక్షల మేరకు పన్నులు చెల్లించవలసివుంటుంది.

                  అయితే అవినీతిపరులైన ఆదాయపు పన్ను శాఖ అధికారులకు రెండులక్షల రూపాయలు లంచంగా ఇవ్వడం ద్వారా పన్ను చెల్లింపును ఎగవేస్తాడు. దీని వల్ల అతనికి రూ.33లక్షలు ఆదా అవుతాయి. ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌, పారిశ్రామికవేత్త తమ అక్రమార్జనను కాపాడుకోవడానికి వేరే చోట మదుపు చేయవలసివుంటుంది. ఇందుకు వారు పెద్దఎత్తున బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆ ఆభరణాల తయారీకి అవసరమైన బంగారాన్ని దిగుమతి చేసుకోవలసివున్నందున ఆ సొమ్ము విదేశాలకు తరలిపోతుంది. అదనపు ఆర్జనకు అవకాశమున్న పోస్టులలో నియమితులు కావడానికి సహాయపడడం ద్వారా రాజకీయవేత్తలు కూడా అధికారుల నుంచి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేసుకుంటారు. ఇలా అవినీతికి పాల్పడిన అధికారులు ఫ్యాక్టరీ యజమానుల నుంచి లంచాలు తీసుకుని, వారు పన్ను చెల్లింపును ఎగవేయడానికి తోడ్పడుతారు.

                  పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల రద్దు ఈ అవినీతికర వ్యవస్థను నిర్మూలించదు. కనుక ప్రస్తుతం రాజకీయవేత్తలు, రియల్‌ఎస్టేట్‌ యజమానులు, బంగారు ఆభరణాల వర్తకులు మొదలైన వారి వద్ద భారీ మొత్తాల్లో నిల్వవున్న సొమ్ముకు కొంత నష్టం జరిగినప్పటికీ, ఆ వ్యవస్థ యథావిధిగా నల్ల ధనాన్ని కొంచెం తక్కువ స్థాయిలో ఉత్పత్తి చేస్తుంది. పాకిస్థాన్‌లో నకీలీనోట్లను ఉత్పత్తిచేస్తున్న ఫ్యాక్టరీలు కొత్తనోట్ల ఉత్పత్తికి తమ సాంకేతికతలను నవీకరించుకుంటాయి.
పెద్దవిలువ కలిగిన కరెన్సీనోట్ల రద్దు వల్ల ప్రయోజనాలు మరో కారణం వల్ల తకూడా పరిమితంగా వుంటాయి. ఆ చర్య నల్లధనాన్ని తగ్గిస్తుంది. ఇందులో సందేహం లేదు. ఫ్యాక్టరీలు మరిన్ని పన్నులు చెల్లిస్తాయి. అయితే సరుకులను విక్రయానికి పెట్టవు. ప్రభుత్వం వసూలు చేసుకునే పన్నులు తక్కువేమీ కావు. దీంతో ఎయిర్‌ కూలర్ల తయారీదారు తన ఉత్పత్తులను మరింత అధిక ధరకు విక్రయించుకోవలసి ఉంటుంది. ఎందుకంటే అతను పన్నులను పూర్తిగా చెల్లించవలసి వుంటుంది. వినియోగదారులు మరింత అధిక పన్నును చెల్లించవలసివుంటుంది. తత్కారణంగా ఎయిర్‌కూలర్‌కు బదులు టేబుల్‌ ఫ్యాన్‌ను కొనుగోలు చేసుకోవడానికి అతను ఇష్టపడతాడు. దీనివల్ల ఎయిర్‌కూలర్లకు డిమాండ్‌ తగ్గిపోతుంది ఇది ప్రత్యక్ష ప్రభావం మాత్రమే. పెద్ద నోట్ల రద్దు అంతిమ ప్రభావమనేది ప్రభుత్వ వ్యయాల స్వభావం, తీరుతెన్నులపై ఆధారపడివుంటుంది. పెరిగిన ఆదాయంతో ప్రభుత్వం హైవేలను నిర్మించవచ్చు లేదా ఉపాధి హామీ పథకం కింద చెల్లించే వేతనాలను పెంచవచ్చు లేదా దేశంలోనే అత్యాధునిక ఆయుధాల తయారీకి పూనుకోవచ్చు. హైవేల వల్ల రవాణా ఖర్చులు తగ్గుతాయి. వస్తూత్పత్తిదారుల వ్యాపారం అభివృద్ధిచెందుతుంది. ఉపాధి హామీ పథకం కింద వేతనాలు పెరగడం వల్ల సామాన్యుల కొనుగోలు శక్తి మరింతగా పెరుగుతుంది. దీనివల్ల అతను టేబిల్‌ ఫ్యాన్‌కు బదులు ఎయిర్‌కూలర్‌ను కొనుగోలు చేసుకోగలుగుతాడు.

                  దేశంలో అత్యాధునిక ఆయుధాలను ఉత్పత్తి చేయడం వల్ల నిపుణ కార్మికులకు, ఆధునిక పరికరాలకు డిమాండ్‌ పెరుగుతుంది దీని వల్ల సగటు పౌరుల ఆదాయం మరింతగా పెరుగుతుంది. అలా కాకుండా ప్రభుత్వం పెరిగిన ఆదాయాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులలో మదుపు చేయవచ్చు లేదా ప్రభుత్వ సిబ్బందికి అధిక వేతనాలు చెల్లించడానికి ఉపయోగించవచ్చు. ఈ పెరిగిన ఆదాయంతో ప్రభుత్వోద్యోగులు బంగా రాన్ని మరింతగా కొనుగోలు చేసుకుంటారు. ప్రభుత్వమే అత్యాధునిక ఆయుధాలను దిగుమతి చేసుకోవడానికి ఆ ఆదాయాన్ని ఉపయోగించుకోవచ్చు. వీటిలో ఏది చేసినా నష్టపోయేది దేశ ఆర్థిక వ్యవస్థననడంలో సందేహం లేదు.
                  సంకేతాలు అనుకూలంగా లేవు. అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలు- స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌, ఫిట్చ్‌- భారతకు మంచి రేటింగ్‌ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులు స్థిరంగా లేకపోవడమే ఇందుకు కారణం. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల బలహీన పరిస్థితిని అవి ఎత్తిచూపుతున్నాయి. దీన్ని బట్టి ప్రభుత్వ వ్యయాల నాణ్యత బాగా లేదని స్పష్టమవుతోంది. దీని పర్యవసానమేమిటంటే నల్లధనం తగ్గుదల సామాన్య పౌరుల కొనుగోలు శక్తిని కూడా తగ్గిస్తుంది. ఆయుధాల దిగుమతికి మరింత ధనం విదేశాలకు తరలిపోవడానికి ఇది దారితీస్తుంది. ఆర్థిక వ్యవస్థ బాగా నష్టపోతుంది.
                  ప్రభుత్వం తొలుత పన్నురేట్లను తగ్గించి, ప్రభుత్వ యంత్రాంగంలో కింది స్థాయిలోని అవినీతిని నియంత్రించి పెద్ద విలువగల కరెన్సీనోట్లను రద్దు చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎంతైనా వున్నది. వినియోగదారులపై పన్ను భారం తగ్గడానికి ఇది దోహదం చేస్తుంది. అదే సమ యంలో ప్రభుత్వ వ్యయాలు ఉత్పాదక కార్యకలాపాలకు అయ్యేలా చూడవల్సివున్నది. అంటే హైవేల నిర్మాణం, ఆయుధాల తయారీకి మున్నగు వాటికి ఖర్చు పెట్టాలి. ఇటువంటి సానుకూల చర్యలు లేని పక్షంలో పెద్దనోట్ల రద్దు వరం కాకపోగా శాపంగా పరిణమిస్తుంది.
  భరత్ ఝన్‌ఝన్‌వాలా
(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగళూరు ఐఐఎం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌)

No comments:

Post a Comment