Friday 11 November 2016

విశాఖ సదస్సుకు తేదీల ఖరారు

విశాఖ సదస్సుకు తేదీల ఖరారు
11-11-2016 01:32:12

న్యూఢిల్లీ, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర వరుసగా రెండో ఏడాది సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది. ప్రపంచ ఆర్థికాభివృద్ధికి భారతదేశాన్ని ఇంజన్‌గా ముందు పెట్టేందుకు, ప్రపంచ వ్యూహంతో భారతను అనుసంధానించేందుకు అవసరమైన కార్యాచరణను రచించేందుకు, ప్రపంచ శక్తిగా అవతరిస్తున్న దేశ గొప్పదనాన్ని చాటేందుకు ఈ సదస్సు వేదిక అవుతుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జనవరి 27, 28 తేదీల్లో విశాఖపట్నంలో ఈ సదస్సు జరుగనుంది. అంతర్జాతీయ, భారత పారిశ్రామిక కంపెనీలు అన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొంటాయని, చరిత్రాత్మక వ్యూహాలను రచిస్తాయని ఆమె వివరించారు. ఏపీ సీఎం చంద్రబాబు, సీఐఐ ఉపాధ్యక్షుడు రాకేశ్ భారతి మిట్టల్‌ల సమక్షంలో ఉద్యోగ్‌ భవన్‌లోని తన కార్యాలయంలో గురువారం ఆమె ఈ ప్రకటన చేశారు. గతేడాది కూడా ఈ సదస్సుకు విశాఖపట్నమే ఆతిథ్యం ఇచ్చిందని, తర్వాతి సంవత్సర సదస్సును కూడా ఇక్కడే నిర్వహిస్తామని అప్పుడు చంద్రబాబు చెప్పారని, దీనికి తాను అంగీకరించానని తెలిపారు. చంద్రబాబు మాట్లాడుతూ.. గతేడాది సదస్సులో రూ.4,67,577 కోట్ల పెట్టుబడులు, 9,58,896 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా 328 అవగాహన ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. ఇందులో 93 పరిశ్రమల్ని స్థాపించామని, మరో 41 పరిశ్రమలకు భూములు కేటాయించామని, వాటి ఏర్పాటు జరుగుతోందని తెలిపారు. 1.60 లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. మొత్తంగా ఎంవోయూల్లో ఇప్పటికి 41 శాతం అమలు చేశామని, మరో రెండు నెలల సమయం ఉన్నందున 55-60 శాతం అమలు చేసి రికార్డు నెలకొల్పుతామన్నారు. రాష్ట్రంలో ఏయే ప్రాంతంలో ఏయే పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయో, క్షేత్రస్థాయిలో నిర్మాణం పురోగతి ఎలా ఉందో విశాఖపట్నం నుంచే అంతా వీక్షించేలా ఆనలైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పెట్టుబడులు పెట్టిన వారంతా భాగస్వామ్య సదస్సులో కూర్చుని.. తమ తమ ప్రాజెక్టుల పురోగతిని ప్రత్యక్షంగా చూడొచ్చన్నారు. విశాఖ సదస్సుకు దేశాధినేతల్ని, మంత్రుల్ని తీసుకురావాలని నిర్మలా సీతారామన్‌ను బాబు కోరారు. గణతంత్ర దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యే విదేశీ ముఖ్యుడిని ఏపీలో జరిగే సదస్సుకు రప్పించాలన్నారు. 2 నెలల సమయం ఉన్నందున ఈ దిశగా చర్యలు చేపడతామని నిర్మల హామీ ఇచ్చారు. కాగా, సీఐఐ ఇప్పటికి 22సార్లు భాగస్వామ్య సదస్సును నిర్వహించింది. జనవరిలో జరిగేది 23వ సదస్సు. ఇందులో ఐదు చంద్రబాబు హయాంలో జరగడం విశేషం. 2001, 2003, 2004ల్లో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో భాగస్వామ్య సదస్సు జరిగింది. గతేడాది విశాఖలో జరిగింది. వచ్చే ఏడాది వరుసగా అక్కడే జరుగనుంది

No comments:

Post a Comment