Monday, 14 December 2015

సెక్స్ రాకెట్ కేసు సిట్‌కు!

సెక్స్ రాకెట్ కేసు సిట్‌కు!

Sakshi | Updated: December 15, 2015 01:44 (IST)
సెక్స్ రాకెట్ కేసు సిట్‌కు!
ప్రభుత్వాన్ని కోరనున్న సీపీ
అరెస్టయిన నిందితులకు  28 వరకు రిమాండ్
ప్రజల్లో అపోహలు  కలిగించొద్దన్న సీపీ


విజయవాడ సిటీ : కాల్‌మనీ మాటున మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసిన కేసు దర్యాప్తును సిట్ (ప్రత్యేక విచారణ బృందం)కు అప్పగించాలనే ఆలోచనలో పోలీసు పెద్దలు ఉన్నట్టు తెలిసింది. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, యువతులు ఉన్నందున లోకల్ పోలీసుల కంటే సిట్ అధికారులైతే సమర్థవంతమైన పాత్ర పోషిస్తారనేది ఉన్నతాధికారుల అభిప్రాయం. సిట్ ఏర్పాటుపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీ జె.వి.రాముడును కమిషనర్ గౌతమ్ సవాంగ్ కలవనున్నట్టు తెలిసింది. ఈ నెల 11న కాల్‌మనీ పేరిట లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కేసు వెలుగులోకి వచ్చింది. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసిన మాచవరం పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల్లో కొందరు రాష్ట్రం విడిచి పరారైనందున పట్టివేతపై ప్రత్యేక దృష్టిసారించారు. కేసు దర్యాప్తులో మరికొందరు నిందితులను కూడా చేర్చే అవకాశాలు ఉన్నాయి. కేసు పూర్వాపరాలు విచారించడంతోపాటు నింది తులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలనే ఆలోచనలో పోలీసు అధికారులు ఉన్నారు. ఈ క్రమంలోనే సిట్ ఆలోచన చేస్తున్నారు.

దర్యాప్తులో వేగం
సిట్ ఏర్పాటు ద్వారా కాల్‌మనీ కేసు దర్యాప్తు వేగం పెంచనున్నారు. ఇప్పటికే ఈ కేసులో నిందితుల పట్టివేతతో పాటు ఆధారాల సేకరణకు టాస్క్‌ఫోర్స్‌లోని రెండు బృందాలతో పాటు మాచవరం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సోమవారం కమిషనరేట్ కార్యాలయానికి 30 మందికి పైగా బాధితులు వచ్చి కాల్‌మనీ వ్యాపారుల ఆగడాలపై ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా కృష్ణలంక, మాచవరం, పటమట, సత్యనారాయణపురం, సూర్యారావుపేట పోలీసు స్టేషన్లకు చెందిన బాధితులు కమిషనరేట్ పెద్దలను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. యలమంచిలి రాము ముఠా కేసుకు సంబంధం లేనివారు కూడా అనేక మంది బాధితులు వస్తున్న నేపథ్యంలో సిట్ ఏర్పాటు అవసరమని పోలీసు కమిషనర్ సవాంగ్ నిర్ణయించారు. సిట్ ఏర్పాటు ద్వారా మాచవరం కేసును వెంటనే ముగించడంతో పాటు ఇతర కాల్‌మనీ కేసుల్లో బాధితులకు తగిన న్యాయం చేసేందుకు అవకాశం ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. కాల్‌మనీ మాటున సెక్స్ రాకెట్ కేసులో మాచవరం పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేసిన యలమంచిలి శ్రీరామ మూర్తి అలియాస్ రాము, దూడల రాజేష్‌కు ఈ నెల 28 వరకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అరెస్టు చేసిన నిందితులను సోమవారం మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా ఇన్‌చార్జి న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించారు. దీంతో వీరిని గన్నవరం సబ్ జైలుకు తరలించారు.

రాజకీయం చేయొద్దు
 కాల్‌మనీ కేసులో మహిళను బెదిరించి వంచించిన కేసుపై రాజకీయం చేయొద్దని నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ అన్నారు. సీనియర్ నేతలు రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం వల్ల ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తుతాయన్నారు. చట్ట పరిధిలో పోలీసులు చేయాల్సినవన్నీ చేస్తున్నామని చెప్పారు. సీఎం, డీజీపీ సైతం సెక్స్ రాకెట్‌పై ఆగ్రహంగా ఉన్నారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని సమగ్ర దర్యాప్తు ద్వారా నిందితుల గుర్తింపు, అరెస్టులు చేయనున్నామని పోలీసు కమిషనర్ తెలిపారు. కాల్‌మనీ వంటి సామాజిక సమస్యను ప్రతి ఒక్కరూ కలిసి చర్చించుకోవడం ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. ఇందుకు అందరూ కలిసి రావాలని పోలీసు కమిషనర్ అన్నారు.

No comments:

Post a Comment