Tuesday, 26 January 2016

అమరావతి విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం

రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం
26-01-2016 16:32:31

అధికారం ఒక తిరుగులేని ఆయుధం...అధికారంలో ఉన్న రాజకీయ పక్షానికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది....ప్రజా సమస్యల పై నిలదీస్తారని, ప్రజలకు, ప్రతిపక్షాలకు అధికార పార్టీ భయపడటం సహజం. కానీ అధికార పార్టీ ప్రస్తుతం గుంటూరు, కృష్ణాజిల్లాల్లో పచ్చటి పొలాలను చూసి భయపడుతోంది. అగ్రికల్చర్ ప్రొటెక్షన్ జోన్ పేరిట సిఆర్ డిఏ 2050వ సంవత్సరం వరకు రూపొందించిన పరస్పెక్టివ్ మాస్టర్ ప్లాన్ అధికార పార్టీ గుండెల పై కుంపటిగా మారింది. రాజధాని పరిధిలోని గుంటూరు, కృష్ణాజిల్లాల్లోని 17 నియోజకవర్గాల్లోని అధికార పార్టీ నేతలకు ఈ పరస్పెక్టివ్ ప్లాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. సిఆర్ డిఏ అధికారుల పై సి.ఎం వద్దనే అమీతుమీ తేల్చుకునేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. ఆనందంగా ఉండాల్సిన అధికార పార్టీ నేతలు ఆందోళనకు గురవుతున్న ఈ అంశం వెనుక పెద్ద కథే ఉంది.
 
నవ్యాంధ్రప్రదేశ్‌లో రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం సీఆర్‌డీఏను ఏర్పాటు చేసింది. గుంటూరు...కృష్ణా జిల్లాల్లోని సింహభాగాన్ని కలుపుకుని మొత్తం 57 మండలాలతో సీఆర్‌డీఏను ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరును రాజధానిగా ప్రకటించిన ప్రభుత్వం ఆ ప్రాంతంలో భూముల ధరలు పెరగడం పట్ల అటు రైతులు.. ఇటు సర్కారు ఆనందంగా ఉంది. రాజధానికి భూసమీకరణ కింద 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు తమ భూములకు ధరలు పెరగడం పట్ల సహజంగానే ఆనందంగా ఉంటారు. కేపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ పరిధిలో నగరాలు...గ్రామీణ..పట్ణణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఒక మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని అప్పుడే ప్రణాళికబద్ధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సీఆర్‌డీఏ భావించింది. ఇందుకోసం సీఆర్‌డీఏ ప్రాంతానికి 2050వ సంవత్సరం వరకు అమలులో ఉండే పరస్పెక్టివ్‌ మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించింది. ఈ రెండు జిల్లాల్లోని 17 నియోజకవర్గాలలో 63 శాతం భూమిని అగ్రికల్చర్‌ ప్రొటెక్షన్‌ జోన్‌ పేరిట చూపించారు. ఇందులో జోన్‌ వన్‌, జోన్‌ టూ, జోన్‌ త్రీ పేరిట చూపించినప్పటికీ ఈ ప్లాన్‌ ఆమోదం పొందితే 2050వ సంవత్సరం వరకు ఎలాంటి నిర్మాణాలు వ్యవసాయ భూముల్లో చేపట్టకూడదని...భూ వినియోగమార్పిడి జరిగేందుకు వీలులేదని రైతాంగంలో ఆందోళన బయలుదేరింది.
 
రెండు జిల్లాల్లోని 17 నియోజకవర్గాలలో ప్రొటెక్షన్‌ జోన్‌ను తీసుకొచ్చారు. ప్లాన్‌ విడుదలైన వెంటనే రైతుల్లో తిరుగుబాటు ప్రారంభం అయ్యింది. వ్యవసాయానికి మినహా మరే ఇతర అవసరాలకు భూములు వినియోగించకూడదని ప్లాన్‌లో పేర్కొనడంతో ఎకరం నాలుగు కోట్ల రూపాయల వరకు ఉన్న భూమి ఒక్కసారిగా కోటి రూపాయలకు పడిపోయింది. 2050 వరకు భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని.. వ్యవసాయం మాత్రమే చేసుకోవాలని రైతులకు సమాచారం అందింది. ఈలోగా తెలుగుదేశం పార్టీ మినహా మిగతా పక్షాల నేతలంతా విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించారు. ప్లాన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు.
 
రైతులు స్వచ్ఛంధంగా సీఆర్‌డీఏ కార్యాలయానికి వాహనాల్లో గ్రామాల వారీగా తరలివచ్చి నిరసనలు చేపడుతున్నారు. పంచాయతీలు ప్లాన్ ఉపసంహరించుకోవాలంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో కూడా అంతర్గతంగా ఆందోళన ప్రారంభమైంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా మండిపడుతున్నారు. ఎవరినీ సంప్రదించకుండా సీఆర్‌డీఏ ఇలాంటి ప్లాన్‌లు విడుదల చేయటం పట్ల ఏకంగా అధికారుల వద్దే నిరసన వ్యక్తం చేశారు. మంత్రి దేవినేని ఉమా.... ఎమ్మెల్యే బొడే ప్రసాద్... ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్... వల్లభనేని వంశీమోహన్ వంటి పలువురు నేతలు సీఆర్‌డీఏ పరస్పెక్టివ్ ప్లాన్ అమలులోకి వస్తే రాజకీయంగా దెబ్బతింటామని ఆందోళన చెందుతున్నారు.
 
గ్రామాల్లో రైతుల్లో వస్తున్న వ్యతిరేకతను నిశితంగా గమనించిన మంత్రి దేవినేని ఉమా ఏకంగా సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ ను పిలిపించి వివరాలు అడిగారు. తాము ఉడా అమలులో ఉన్న సమయంలో ఇచ్చిన ప్లాన్ లకే కట్టుబడి ఉంటామని, అగ్రికల్చర్ ప్రొటెక్షన్ జోన్ అంటే గ్రీన్ జోన్, గ్రీన్ బెల్ట్ కాదని, ఆ భూమిని ఏ అవసరాలకైనా ఉపయోగించుకోవచ్చునని సీఆర్‌డీఏ అధికారులు మంత్రికి చెప్పినప్పటికీ, ఆ అంశాన్ని ఎవరూ విశ్వసించటం లేదు.
 
ఈలోగా మునిసిపల్ మంత్రి నారాయణ సీఆర్‌డీఏ పరస్పెక్టివ్ ప్లాన్ పై నిబంధనల ప్రకారమే ముందుకు వెళతామని ఒక బాంబు పేల్చటంతో రైతుల్లో ఆందోళన మరింత పెరిగింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 17 నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా అనే అంశం పై సతమతమవుతున్నారు. పార్టీ నేతలపై రైతులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీంతో పాటు ప్రతిపక్షాలు కూడా ఉద్యమానికి సిద్ధమవుతుండటంతో అధికార పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరే అమీతుమీ తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు.
 
రాజధాని వచ్చిందనే సంతోషం ఒకవైపు, అధికారుల ఏకపక్ష ధొరణి ఆవేదన మరోవైపు...మొత్తంగా నేతలు ఇప్పుడు సంకటంలో పడ్డారు.
రాజధాని పరిధిలోని తుళ్లూరులోనూ.... ఇటు సీఆర్‌డీఏ పరస్పెక్టివ్ ప్లాన్‌తో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 17 నియోజకవర్గాల్లో వ్యతిరేకత కొనితెచ్చుకున్నట్టవుతుందని అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ప్రజాప్రతినిధులను.... రైతులను సంప్రదించకుండా ఈ ప్లాన్ విడుదల చేయటమేమిటని నిలదీస్తున్నారు. సాఫీగా జరిగిపోతున్న సమయంలో గిల్లి కజ్జాలు తెచ్చుకోవటమంటే ఇదేనని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు.
 
నాణెనికి రెండో వైపు నుంచి పరిశీలిస్తే మూడు పంటలు పండే భూమిని రాజధాని నిర్మాణాల కోసం ప్రభుత్వం తీసుకుంటోందని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు, పర్యావరణ వేత్తలు, వ్యవసాయం చేసుకునేందుకు సీఆర్‌డీఏ పరిధిలోని 63 శాతం భూమిని వ్యవసాయ పరిరక్షణ కింద పేర్కొంటే ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారులు, రైతుల వాదనలు ఎలా ఉన్నా మధ్యలో అధికార పార్టీ నేతల పరిస్ధితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల పరిస్ధితి కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకి కోపం అన్న చందంగా మారింది. చంద్రబాబు ఈ పంచాయతీ ఎలా తీర్చుతారో వేచి చూడాల్సిందే...

Sunday, 24 January 2016

రాజధాని మాస్టర్ ప్లాన్ లో మార్పులు!

రాజధాని మాస్టర్ ప్లాన్ లో మార్పులు!

Sakshi | Updated: January 25, 2016 12:10 (IST)
రాజధాని మాస్టర్ ప్లాన్ లో మార్పులు!
హైదరాబాద్: సీఆర్ డీఏ మాస్టర్ ప్లాన్ పట్ల రాజధాని ప్రాంత రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ హుటాహుటిన రెండు రోజులు సింగపూర్ పర్యటనకు వెళ్లొచ్చారు. సీఆర్ డీఏ కమిషనర్ శ్రీకాంత్ కూడా మంత్రితో పాటు సింగపూర్ వెళ్లారు. సింగపూర్ ప్రతినిథులతో మాస్టర్ ప్లాన్ లో మార్పులపై చర్చించినట్లు సమాచారం.

ఎక్స్ ప్రెస్ హైవేలు, అగ్రికల్చరల్ జోన్లను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపడుతుండటం, సొంత గ్రామాల్లో భూములు దక్కని సీడ్ క్యాపిటల్ గ్రామాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భంగా చేపట్టిన సింగపూర్ పర్యటనలో.. మాస్టర్ ప్లాన్ లో మార్పులపై నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
 

వర్మకు వంగవీటి రాధా వార్నింగ్

వర్మకు వంగవీటి రాధా వార్నింగ్
24-01-2016 20:14:06

వంగవీటి రంగా కథతో సినిమా తీస్తానన్న రామ్‌గోపాల్ వర్మ ప్రకటనపై రంగా కుమారుడు రాధా స్పందించారు. ఓ ప్రైవేట్ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సినిమాలో వాస్తవాన్ని చూపిస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని, అంతేతప్ప రంగా జీవితంపై బురదజల్లే ప్రయత్నం చేస్తే మాత్రం ఆయన కొడుకుగా తానెంత స్పందిస్తానో, రంగా అభిమానులు అంతకంటే ఎక్కువగా స్పందిస్తారని ఆయన చెప్పారు. వర్మ ఎటువంటి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తారో అందరికీ తెలుసని అన్నారు.
 
ఏదో ఒక వర్గం వైపు వర్మ మొగ్గుచూపుతాడన్న సందేహాన్ని రాధా వ్యక్తం చేశారు. తమ ఇంటి పేరుతో ఇష్టమొచ్చినట్లు సినిమాలు తీసి, అవాకులుచవాకులు పేలితే అభిమానులే తగిన బుద్ధి చెబుతారని రాధా తెలిపారు. అభిమానులు ఎలా స్పందించినా తనకెలాంటి బాధ్యత లేదని ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ తనను కానీ, తన కుటుంబ సభ్యులను కానీ వర్మ సంప్రదించలేదని ఆయన చెప్పారు.

Friday, 22 January 2016

పట్టిసీమ - గోదావరి బోర్డు ముందు ఏపీ, తెలంగాణ భిన్నవాదనలు

ఎవరి ‘పట్టు’ వారిదే

Sakshi | Updated: January 22, 2016 09:54 (IST)
ఎవరి ‘పట్టు’ వారిదేవీడియోకి క్లిక్ చేయండి
 పట్టిసీమపై గోదావరి బోర్డు ముందు ఏపీ, తెలంగాణ భిన్నవాదనలు
 పోలవరంలో అంతర్భాగం కాదు ఆ ప్రాజెక్టు పూర్తిగా అక్రమం
 గోదావరి నీటిని ఏకపక్షంగా మళ్లించే హక్కు ఏపీకి లేదు: తెలంగాణ
 ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగమేనన్న ఏపీ
 ఎటూ తేల్చని బోర్డు.. కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయం


సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 80 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించ తలపెట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు గోదావరి నదీ యాజమాన్య బోర్డు ముందు భిన్నవాదనలు వినిపించాయి. ప్రాజెక్టు పూర్తిగా అక్రమమని తెలంగాణ స్పష్టం చేయగా, పోలవరంలో అంతర్భాగంగానే ప్రాజెక్టును చేపట్టామని ఏపీ పేర్కొంది. తమ హక్కులకు భంగం కలిగేలా చేపడుతున్న ఈ ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన బాధ్యత బోర్డుపై ఉందని తెలంగాణ గట్టిగా వాదించింది. దాన్ని చేపట్టే పూర్తి హక్కు తమకు ఉందని ఏపీ కూడా అంతే గట్టిగా చెప్పడంతో బోర్డు ఎటూ తేల్చలేకపోయింది. గురువారమిక్కడి జలసౌధలో చైర్మన్ రాం శరాణ్ అధ్యక్షతన గోదావరి బోర్డు సమావేశం జరిగింది.

 ఈ సమావేశానికి బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ, సభ్యుడు(విద్యుత్ ) ఎస్కే పట్నాయక్, కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) సీఈ ఎన్.కె.మాథుర్, ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్, ఏపీ చీఫ్ ఇంజనీర్(అంతర్‌రాష్ట్ర వ్యవహారాలు) రామకృష్ణ హాజరయ్యారు. ఏడాది తర్వాత జరిగిన ఈ సమావేశంలో బోర్డు నిర్వహణ, బడ్జెట్ అంశాలను వదిలిస్తే ప్రధాన వాదన పట్టిసీమ చుట్టే తిరిగింది.

తెలంగాణ వాదన ఇదీ..
పట్టిసీమపై ఏపీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని తెలంగాణ వాదించింది. ‘‘పోలవరం ప్రాజెక్టులో భాగం కాని పట్టిసీమతో కొత్తగా 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ఏపీ చూస్తోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 84(3), 85(8)కు వ్యతిరేకంగా ఏకపక్షంగా దీనిపై నిర్ణయం చేసింది. బోర్డు కానీ అపెక్స్ కౌన్సిల్ నుంచి కానీ అనుమతి తీసుకోలేదు.  1978నాటి ఒప్పందం గోదావరి నీటి వినియోగంలో ఏపీకి కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించింది. వివిధ బేసిన్‌ల నుంచి వచ్చే నీటిపై ఏపీకి హక్కులు ఉండేలా ఆ ఒప్పందంలో ఉంది. ఆ హక్కులు ఇప్పుడు విభజన తర్వాత తెలంగాణకు వర్తిస్తాయి. పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమే అయితే తెలంగాణకు ఆ నీటిలో వాటా ఉంటుంది. తెలంగాణను కాదని ఏకపక్షంగా గోదావరి నీటిని మళ్లించడానికి ఏపీకి హక్కు లేదు’’ అని తెలిపింది.

 ఏపీ ఏమందంటే..?
 తెలంగాణ వాదనపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగంగానే పట్టిసీమ చేపట్టామని తెలిపింది. పోలవరం నుంచి 80 టీఎంసీల నీటిని కుడి కాల్వ ద్వారా కృష్ణాకు మళ్లించడానికి అనుమతి ఉందని, అదే నీటిని పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా మళ్లిస్తున్నందున.. ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేద ని పేర్కొంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పోలవరంలో అంతర్భాగం అని పార్లమెంట్‌లో కేంద్రమంత్రి చెప్పిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ సందర్భంగా తెలంగాణ చేపడుతున్న పలు కొత్త ప్రాజెక్టులు, రీ ఇంజనీరింగ్ చేస్తున్న ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం తెలిపింది. అయితే అవన్నీ ప్రాథమిక దశలో ఉన్నాయని, ఇంకా డీపీఆర్‌లు కూడా తయారు కాలేదని తెలంగాణ పేర్కొంది.

 బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులపైనా సందిగ్ధత
 బోర్డు పరిధిలోకి తేవాల్సిన ప్రాజెక్టుల అంశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రాణహిత-చేవెళ్ల, దేవాదుల, కంతనపల్లి, దుమ్ముగూడెం వంటి ప్రాజెక్టులతోపాటు, ఎస్సారెస్పీ, నిజాంసాగర్, కడెం, అలీసాగర్, సింగూర్, సదర్‌మఠ్ బ్యారేజీలను బోర్డు పరిధిలోకి తేవాలని ఏపీ వాదించింది. దీన్ని తెలంగాణ వ్యతిరేకించింది. ప్రధాన ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ కొనసాగుతోందని, ఏ ప్రాజెక్టుకు ఎంత నీటి వాటా అన్న అంశం తేలనప్పుడు, ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవడం సరికాదని పేర్కొంది. అందుకు ఏపీ.. నీటి వినియోగానికి కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతి ఉన్న అన్ని ప్రాజెక్టులు బోర్డు పరిధిలో ఉండాలని కోరింది.

 తెలంగాణలో ఒక్క ప్రాజెక్టును కూడా బోర్డు పరిధిలో చేర్చడానికి అంగీకరించకుండా.. తమ రాష్ట్రంలోని ప్రాజెక్టులను బోర్డు పరిధిలో చేర్చాలని అడగడం, సీలేరు విద్యుత్‌ను షెడ్యూలింగ్‌లో పేర్కొనాలని డిమాండ్ చేయడంలో అర్థం లేదని ఏపీ వాదించింది. బోర్డు పరిధిపై స్పష్టత రాకుండా సీలేరు విద్యుత్‌పై చర్చించాల్సిన అవసరం లేదంటూ ఏపీ చేసిన వాదనతో బోర్డు ఏకీభవించింది. సీలేరు విద్యుత్‌పై కేంద్ర విద్యుత్ శాఖ నిర్ణయం తీసుకుంటుందని, బోర్డులో చర్చించాల్సిన అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

 బోర్డు వ్యయం రూ.8 కోట్లు: చైర్మన్ శరాణ్
 వచ్చే ఆర్థిక సంవత్సరంలో బోర్డు నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలకు రూ.8 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశామని, ఈ మొత్తాన్ని రెండు రాష్ట్రాలు చెరిసగం భరించడానికి అంగీకరించాయని సమావేశం అనంతరం బోర్డు చైర్మన్ రాం శరాణ్ ‘సాక్షి’కి చెప్పారు. బోర్డు ముసాయిదా నియమావళికి ఇరు రాష్ట్రాలు ఆమోదం తెలిపాయని, దీన్ని కేంద్ర జల వనరుల శాఖకు పంపిస్తామని తెలిపారు. ప్రాజెక్టుల డేటా ఇవ్వడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయని వెల్లడించారు.

మార్కెట్‌లో పాలు కొనుక్కుని తాగుతున్నారా ?

మార్కెట్‌లో పాలు కొనుక్కుని తాగుతున్నారా ?
22-01-2016 15:37:28

  • అధిక ఉత్పత్తి కోసం విచ్చలవిడిగా పశువులకు ‘ఆక్సిటోసిన్‌’ వాడకం
  • పాలధర పెరుగుతున్న నేపథ్యంలో కొందరి అడ్డదారులు
  • వ్యాధుల బారిన ప్రజలు
  • బలహీన పడుతున్న పశువులు
  • ఇంజక్షన్ అమ్మకం, వాడకంపై అమలు కాని నిషేధం..?
స్వచ్ఛమైన.. ఎన్నో పోషకవిలువలు ఉండే పాలను విషతుల్యం చేస్తున్నారు కొందరు. సంపాదనే ధ్యేయంగా వారు చేస్తున్న ‘కల్తీ’తో పిల్లల నుంచి వృద్ధుల వరకు జబ్బుల బారిన పడుతున్నారు. అధిక ఉత్పత్తికోసం పశువులకు ఇంజక్షన్లు ఇస్తూ... అటు పశుసంపదను బలహీనం చేస్తూ... ఆ పాలను తాగే ప్రజలను రోగాల ఊబిలోకి నెట్టేస్తున్నారు. ఇటీవల పాల ధరలు రెట్టింపవుతుండటంతో ‘డబ్బు’కు ఆశపడుతున్న కొందరు వ్యాపారులు, రైతులు పశువులకు ఔషధాలను ఇస్తూ... పాలను పిండుతున్నారు. ఈ క్రమంలో పాలు పోషకవిలువలను కోల్పోయి విషతుల్యమవుతున్నాయి. మరికొందరైతే ఏకంగా ప్రమాదకర రసాయనాలతో కృత్రిమ పాలు సృష్టిస్తూ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. 


(ఆంధ్రజ్యోతి- ఖమ్మం) 
పల్లెల నుంచి మొదలుకుని పట్టణాల వరకు ఎందరో పాడి పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారు. మరోవైపు పాలకు డిమాండ్‌ కూడా ఉండటంతో వ్యాపారం జోరుగా సాగుతోంది. కొందరు తమ వ్యాపారాభివృద్ధికి పశువుల సంఖ్యను పెంచుకుంటూ పోతుంటే.. కొందరేమో అడ్డదారులు తొక్కుతున్నారు. పాలను సాంతం పిండేసేందుకు ఔషధాలను ఇంజక్షన్ల రూపంలో ఇస్తూ... స్వచ్ఛమైన పాలను కలుషితం చేస్తున్నారు. పాడి గేదెలకు, ఆవులకు ‘ఆక్సిటోసిన్‌’ ఇంజక్షన్లు ఇచ్చి పాలను పిండుతున్నారు. మార్కెట్లో విక్రయించి ప్రజలను రోగాల‘పాలు’ చేస్తున్నారు.
 
అమలుకాని నిషేధం!
ఈ ఆక్సిటోసిన ఇంజక్షన్లపై నిషేధం ఉన్నా అది అమలు కావడం లేదు. మార్కెట్లో యథేచ్ఛగా విక్రయాలు సాగుతున్నాయి. పాలను త్వరితగతిన విషపూరితం చేస్తున్న ఆక్సిటోసిన్‌ వాడకంపై ప్రభుత్వం గతంలో నిషేధం విధించింది. అయినా కొన్ని ఔషధ కంపెనీలు వాటిని తయారు చేస్తూ మార్కెట్లో విక్రయాలు జరుపుతున్నాయి. కొన్ని గ్రామాల్లో రైతుల ఇళ్లలో ఈ ఇంజక్షన్లు కోకొల్లలుగా ఉన్నాయంటే వీటి వినియోగం ఎంతటిస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఇంజక్షను అమ్మకాలు జరిపితే యానిమల్‌ యాక్ట్‌-1960 సెక్షన్‌12 ప్రకారం సంబంధిత వ్యక్తులను నేరస్థులుగా శిక్షించాలి. ఈ యాక్టు ప్రకారం ఎక్కడైనా ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్లు అమ్మకాలు జరిపినా... వాడినా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్న అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించకపోవడం గమనార్హం. అసలు వాటికి సంబంధించిన హెచ్చరిక బోర్డులు జిల్లాలో ఎక్కడా కూడా కనిపించడంలేదు.
 
ధర తక్కువ ‘ఉత్పత్తి’ ఎక్కువ
పశువుల నుంచి అధికశాతం పాలు రాబట్టుకోవడానికి ఇస్తున్న ఇంజక్షన్ల ధర తక్కువగా ఉండటం.... వాటిని ఉపయోగించడం ద్వారా ఉత్ప్తత ఎక్కువగా వస్తుండటంతో పాడి రైతులు కూడా పశువులకు ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కో ఇంజక్షన్‌ ధర మార్కెట్లో రూ.18నుంచి రూ.25వరకు అమ్ముతున్నారు. అయినా ఇంజక్షన్‌ ఇవ్వడం ద్వారా వచ్చే దిగుబడి ఎక్కువగానే ఉండటంతో రైతులు వాటిని కొనేందుకు వెనుకాడటం లేదు. ఒక్కో ఇంజక్షన్‌ ఇస్తే... ఒక్కో పశువుకు కనీసం లీటరు పాలు పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లో పాల ధరరూ.50 వరకు ఉండటంతో రైతులుకూడా వీటిని ఎక్కువగానే వినియోగిస్తున్నారు.
 
కృత్రిమ పాలు...
పాల ధరలు పెరుగుతుండటంతో కొందరు పాల వ్యాపారులు కృత్రిమ పాల తయారీవైపు మొగ్గుచూపుతున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి అనేక మార్గాల ద్వారా పాలను కలుషితం చేస్తున్నారు. గట్టిపాలలో నీటిని కలపడం ఒక విధానం అయితే అనేక రకాల రసాయనాలను కలిపి ఎక్కువ పాలు రాబట్టుకోవడం అధిక లాభాలు సాధించడం మరో విధానంగా మారింది. పలువురు వ్యాపారులు పాలల్లో విషపూరిత రసాయనాలను వాడుతూ మరింత కలుషితం చేస్తున్నారు. ఇటీవల కాలంలో పాలు చిక్కగా ఉండేందుకు కొందరు యూరియా కూడా కలుపుతున్నట్టు సమాచారం.
 
చివరికి నష్టపోయేది రైతులే...
పశువుల నుంచి పాలు పితకాలంటే ఆ పశువు దగ్గరకు ముందుగా దూడను వదిలేవారు. అలా దూడ పొదుగును చీకడం ద్వారా పాల ఉత్పత్తి జరిగేది. దూడ కొద్దిగా తాగిన తరువాత రైతులు పాలను పితికి.. చివరకు కొన్ని దూడకు వదిలేవారు. కానీ ఇప్పుడలా కాకుండా పూర్తిగా ఇంజక్షన్‌లపైనే ఆధారపడుతున్నారు. దూడను వదలకుండానే పొదుకు సేపునకు వచ్చేందుకు ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్‌ను ఇస్తున్నారు. ఆ ఇంజక్షన ఇచ్చిన సెకన్ల కాలంలోనే పశువు పొదుగు సేపునకు వస్తుంది. దీంతో కొద్దిసమయంలోనే అధికపాలు సేకరించవచ్చు. కొందరు పాల వ్యాపారులే రైతులకు ఇంజక్షన్‌లు, సిరంజ్‌లు సరఫరా చేస్తున్నారు. అలా చేయడం ద్వారా చివరికి నష్టపోయేది రైతే అన్న విషయాన్ని రైతులు గమనించలేకపోతున్నారు. ఈ ఇంజక్షన్‌ పశువుల పునరుత్పత్తిపై ప్రభావం చూపుతోంది. అలా పదే పదే పశువులకు ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్‌ ఇవ్వడం వల్ల రాను రాను పాల ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటు రక్తపీడనంలో మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
 
అనర్థాలెన్నో...
ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్‌ వేసిన పశువుల పాలు తాగడం వల్ల ప్రజలు అనేక అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంజక్షన్‌ ఇవ్వడం ద్వారా వచ్చిన పాలను తాగడం వల్ల ఊపిరితిత్తులు, నరాల సంబంధిత వ్యాధులు వస్తాయి. ఆడపిల్లలు సహజంగా రజస్వల అయ్యే వయసు కంటే ముందుగా అవుతారని వైద్యులు చెబుతున్నారు. అలాగే చిన్నపిల్లలు ఈ పాలను తాగడం వల్ల వారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయే అవకాశం ఉంది. ఇంజక్షన్‌ వేసిన తర్వాత ఉత్పత్తి జరిగిన పాలను పదేపదే తాగడం వల్ల ఎన్నో అనర్థాలు ఎదురవుతాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ఇంజక్షన్‌ వాడకంపై చర్యలు తీసుకోవాలని.. నిషేధాన్ని సక్రమంగా అమలు చేయాలని ప్రజలు, పశుప్రేమికులు కోరుతున్నారు.

లావైపోతున్నారని చక్కెర పన్ను వేస్తారట..

లావైపోతున్నారని చక్కెర పన్ను వేస్తారట..
22-01-2016 15:17:12

లండన్ : లావెక్కినవారు సన్నబడాలంటే అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. డైట్ కంట్రోల్, ఎక్సర్‌సైజులు, సైకిలింగ్, వాకింగ్... అంటూ నానా హంగామా చేస్తారు. ఈ విషయంలో ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకుంటే ఏం జరుగుతుందో బ్రిటన్‌‌వాసులకు త్వరలోనే తెలియబోతోంది. నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సైమన్ స్టీవెన్స్ తెలిపిన వివరాల ప్రకారం...
 
ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో విక్రయించే తియ్యని పానీయాలు, ఆహార పదార్థాలపై సుగర్ ట్యాక్స్ విధించాలని బ్రిటన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఒబెసిటీ సమస్య పెరిగిపోతోందని, దీనిని ఎదుర్కోవాలంటే పంచదార వాడకాన్ని తగ్గించాలని అంటోంది. 2020 నాటికి ఎన్‌హెచ్‌ఎస్ కేఫ్‌లలో విక్రయించే అన్ని రకాల సుగరీ డ్రింక్స్, ఫుడ్స్‌పై 20 శాతం పన్ను విధించాలని నిర్ణయించింది. దీనివల్ల ఏటా 40 మిలియన్ పౌండ్ల వరకు ఆదాయం రావచ్చునని, ఆ సొమ్మును ఎన్‌హెచ్‌ఎస్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు వినియోగించాలని భావిస్తోంది. ఈ నిర్ణయం అమలైతే సుగర్ ట్యాక్స్‌ను విధించిన తొలి బ్రిటన్ వ్యవస్థగా ఎన్‌హెచ్‌ఎస్ నిలుస్తుంది. దేశవ్యాప్తంగా ఈ పన్ను విధించడంపై తన వ్యతిరేకతను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని డేవిడ్ కామెరూన్ సంకేతాలు ఇచ్చిన కొద్ది రోజుల్లోనే ఎన్‌హెచ్‌ఎస్ ఈ ప్రతిపాదన చేసింది.

కోనసీమలో రాజుకున్న కుల రాజకీయం... సీన్‌లోకి ప్రముఖ సినీ దర్శకుడు !

కోనసీమలో రాజుకున్న కుల రాజకీయం... సీన్‌లోకి ప్రముఖ సినీ దర్శకుడు !
22-01-2016 15:13:20

ముల్లును ముల్లుతోనే తీయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు కొంత మంది నేతలు వెనకుండి చేస్తున్న ప్రయత్నాలను అదే స్ధాయిలో తిప్పి కొట్టాలనే నిర్ణయానికి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా తునిలో ఈనెల 31వ తేదీన నిర్వహించనున్న కాపునాడు నేతల ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు తెలుగుదేశం అదే కులానికి చెందిన నేతలను రంగంలోకి దించింది. ప్రభుత్వం కాపులకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించటంతో పాటు గత ప్రభుత్వాలు కాపులను అణగదొక్కిన వైనాన్ని కూడా వివరించేందుకు సమాయాత్తమవుతోంది. ఉన్నతస్ధాయిలో జరిగిన ఓ సమావేశంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నిర్ణయం అమలు కూడా ప్రారంభమైంది.
 
రాష్ర్ట విభజన జరిగిన తర్వాత రాజధాని లేకుండా ఆర్ధికలోటుతో ఉన్న ఏపీని గాడినపెట్టటం ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. జీతాలకు కూడా డబ్బులు దొరకని పరిస్ధితి నెలకొనటంతో బాండ్లను వేలం వేసుకుని, ఖజనా నింపుకునే విచిత్ర పరిస్ధితి నెలకొని ఉంది. ఆదాయవనరులను సమీకరించుకోవటం, కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవటం వంటి వాటిపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది.. ఆ దిశగా కొన్ని అడుగులు కూడా వేసింది.. ఉపాధి అవకాశాలు.. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడేందుకు పరిశ్రమలను ఏర్పాటు చేయడం ఆవశ్యకరమని తెలుసుకుంది.. అందుకే పరిశ్రమలను ఏర్పాటు చేయవలసిందిగా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యింది ప్రభుత్వం.
 
రాజధాని నిర్మాణం కూడా ప్రభుత్వం ముందు ఉన్న అతి పెద్ద సవాల్‌... నీరు లేకుండా ఎన్ని మాటలు చెప్పినా అవి నీటిమీద రాతలుగానే మిగిలిపోతాయి.. అందువల్లే ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా మారిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా ప్రభుత్వం రెండో ప్రాధాన్యతగా ఉంది. ఈ నేపథ్యంలోనే పులి మీద పుట్రలా ప్రభుత్వానికి కాపునాడు రూపంలో మరో సవాల్ ఎదురైంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో కాపులను బీసీ జాబితాలో చేర్చుతామని, ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇస్తామని చెప్పటంతో పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తామని ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.
 
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నిమ్మకాయల చినరాజప్పకు హోమ్ మంత్రి పదవితో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. కేబినెట్ లోను, ఎమ్మెల్సీలు, ఇతర నియామకపదవుల్లో కూడా కాపులకు ప్రాధాన్యత ఇచ్చామని తెలుగుదేశం ప్రభుత్వం చెప్పుకుంటుంది. కాపులను బీసీల్లో చేర్చే అంశం పై మంత్రి వర్గంలో కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మేరకు కర్నాటక హైకోర్టు రిటైర్డ్ జడ్జి మంజునాథన్‌ను కాపు కమిషన్ చైర్మన్ గా నియమించారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చామని ఒక వైపు ప్రభుత్వం చెబుతుండగా, తెలుగుదేశం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నప్పటికీ కాపులకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని, తమను నిర్లక్ష్యం చేస్తుందని, ఈ నెల 31వ తేదీన తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపు నాడును ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ కాపునాడు ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నారు.
 
కాపునాడు సభ ఏర్పాటుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి పరోక్ష మద్దతు ఉందని ప్రభుత్వానికి కొంత మంది సమాచారం ఇచ్చారు. దీంతో కాపునేతలను ప్రభుత్వం రంగంలోకి దించింది. గత చరిత్రతో పాటు తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక, గతంలోను, ఇప్పుడు కాపులకు ఇచ్చిన ప్రాధాన్యత ఏమిటో వివరించాలని నిర్ణయించారు. ఇందుకోసం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమశెట్టి రామానుజయలను రంగంలోకి దించారు. వీరు కాకుండా మరికొంత మంది నేతలను కూడా తెలుగుదేశం పార్టీ రంగంలోకి దించబోతున్నది. నెలాఖరు వరకు కూడా అన్ని జిల్లాలకు వెళ్ళి కాపు పెద్దలను, యువకులను కలసి ఏమి చేశామనేది వివరించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ఓ కులం కాపులను అణగదొక్కిందని, కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ ఓ అడుగు ముందుకు వేసి చేసిన ఆరోపణలు సంచలనం రేకెత్తించాయి. బొండా ఉమా కూడా విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, కాపులకు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రాధాన్యత కల్పించిందనేది వివరించారు. రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం కులాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదే అంశం పై హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా గళం విప్పారు. ఇలా ముల్లును ముల్లుతోనే తీయాలనే సిద్ధాంతాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఆచరిస్తోంది. కాపునాడు సభకు అనుమతి ఇవ్వటమా లేదా అనేది తర్వాత ఆలోచించాలని, తూర్పు గోదావరి, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో, రాష్ర్ట వ్యాప్తంగా కాపులకు తెలుగుదేశం పార్టీలోను, ప్రభుత్వంలోను ఇచ్చిన ప్రాధాన్యతను వివరించాలనే నిర్ణయానికి వచ్చారు.
 
తూర్పుగోదావరి జిల్లాలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపునాడుకు బీజం వేస్తుండటంతో అదే జిల్లాకు చెందిన హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, సినీ దర్శకుడు వి.వి.వినాయక్‌తో వేదిక పంచుకుని ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. ఇదే జిల్లాకు చెందిన అసెంబ్లీలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉపనేత జ్యోతుల నెహ్రూ, ముద్రగడ పద్మనాభంలు రాజకీయంగా ఆగర్భశత్రువులు. పార్టీ కాపునాడుకు మద్దతు ఇస్తుండటంతో తాను కూడా మద్దతు ఇస్తానని జ్యోతుల నెహ్రూ ఇటీవల కిర్లంపూడి నుంచి తన వద్దకు వచ్చిన కాపునేతలతో చెప్పారు. తునిలో ఓ కొబ్బరి తోటలో ఏర్పాటు చేస్తున్న కాపునాడు సమావేశానికి భారీగా జన సమీకరణ చేసేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. అనుమతి ఇచ్చే అంశం పై కూడా తాము ప్రభుత్వానికి లేఖ రాశామని కాపునాడు నేతలు చెబుతుండగా, తమను ఎవరూ అనుమతి కోరలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ వాదోపవాదాలు ఎలా ఉన్నా, కోస్తాలో మరోసారి కులాల కుంపటి ప్రారంభమవబోతోంది. ఇందుకు విరుగుడుగానే తెలుగుదేశం ప్రభుత్వం కాపులను బీసీల్లో చేర్చే అంశం పై అధ్యయనం చేసేందుకు నియమించిన కమిషన్ నివేదికను కూడా సాధ్యమైనంత త్వరగా తెప్పించాలని నిర్ణయించింది.
 
బీసీలకు రిజర్వేషన్ కూడా తగ్గకుండా, కాపులకు రిజర్వేషన్ ఇచ్చి తమ ప్రభుత్వం నిబద్దత ఏమిటో చూపించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి రాజకీయంగా వెన్ను, దన్నుగా ఉన్న బీసీల మనస్సులను కూడా నొప్పించకుండా కాపులకు రిజర్వేషన్ ఎలా ఇవ్వాలనే అంశం పైనే పార్టీలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఇతర రాష్ర్టాల్లో అవలంభిస్తున్న రిజర్వేషన్ విధానాల పై కూడా అధ్యయనం చేయాలని కమిషన్ కు సూచించాలని నిర్ణయించారు. కాపులను బిసీల్లో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నా, గతంలో మాదిరిగా కాకుండా ఆ నిర్ణయం న్యాయ పరీక్షకు నిలబడేలా పటిష్టంగా తీసుకోవాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో తునిలో జరుగుతున్న కాపునాడు అనంతర పరిణామాలు, కాపునాడు నేపథ్యం పట్ల ప్రభుత్వం అప్రమత్తమైంది.