Wednesday, 26 April 2017

మేటలపై ‘బ్రదర్స్‌’ మాఫియా - మృత్యువైన మూడో ధర్నా

మేటలపై ‘బ్రదర్స్‌’ మాఫియా  - మృత్యువైన మూడో ధర్నా 
22-04-2017 02:50:49
వాగు రక్షణ పోరు రక్తసిక్తం
తిరుపతి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): మునగలపాళెం వాసులకు వ్యవసాయమే జీవనాధారం. ఊరుపక్కనుంచే స్వర్ణముఖి ప్రవహిస్తుండటంతో 30 అడుగుల లోతులోనే నీళ్లు లభిస్తున్నాయి. రైతులంతా హ్యాండ్‌ బోర్లు వేసుకొని పంటలు సాగు చేసుకొంటున్నారు. నదిలో స్మగ్లర్లు కొంతకాలంగా పెద్ద ఎత్తున ఇసుక లోడేస్తుండటం ప్రాణసంకటంగా మారింది. వాగులోని ఇసుకమేటలకు, రైతుల బోర్లకు సంబంఽధంఉంది. నదిలో మేటలు హరించుకుపోతున్నకొద్దీ బోర్లలో నీరు ఎండిపోవడం మొదలైంది. దీనిపై గ్రామస్థులంతా సంఘటితమయ్యారు. ఏర్పేడు తహసిల్దార్‌ కార్యాలయంలో ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా, ఫలితం లేకపోయింది. కొన్నినెలల కిందట తహసిల్దార్‌ కార్యాలయానికి తాళం వేసి.. ధర్నా చేశారు.

ఉగాదికి ముందురోజు.. శ్రీకాళహస్తి- తిరుపతి జాతీయ రహదారిపై రెండోసారి బైఠాయించారు. అప్పటికీ కదలిక లేకపోవడంతో.. నేరుగా స్మగ్లర్లను అడ్డుకొన్నారు. రగిలిపోయిన స్మగ్లర్లు, చీకటి మాటున గురువారం రాత్రి ఊరిపై దాడిచేశారు. దీనిపై రైతులంతా సమావేశమయ్యారు. శుక్రవారం ఇంటికొకరు చొప్పున వెళ్లి అధికారులను నిలదీయాలని అనుకున్నారు. అనుకున్నట్లే అంతా తహసిల్దార్‌ కార్యాలయానికి వెళ్లారు. ఏర్పేడు పోలీసు స్టేషనకి అర్బన్‌ ఎస్పీ వచ్చారని తెలుసుకొని, మధ్యాహ్నం 12 గంటల సమయంలో అక్కడకు వెళ్లారు. ఆశించిన ఊరట లభించకపోవడంతో.. పోలీస్‌ స్టేషన్‌ ఎదుట, మూడోసారి ధర్నాకు కూర్చొంటుండగా లారీ రూపంలో మృత్యువు వీరిని కబళించింది.

మేటలపై ‘బ్రదర్స్‌’ మాఫియా
22-04-2017 02:53:16

నదీ వాగు గర్భంలో గునపం
రైతు బతుకుకు పెనుగండం
ఎదురుతిరిగిన మునగలపాళెం
(ఆంధ్రజ్యోతి, తిరుపతి) ఏర్పేడు మండల పరిధిలో స్వర్ణముఖి నదికి అటు ఇటు కొన్ని గ్రామాలు ఉన్నాయి. వాటిలో కొన్ని గ్రామాలకు స్వర్ణముఖి నీరే ప్రాణాధారం. అందులో మునగలపాళెం ఒకటి. ఈ నదిలో భారీగా ఇసుక మేటలున్నాయి. ఇసుకకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడిన క్రమంలో పక్క గ్రామానికి చెందిన ఒక కుటుంబం కన్ను పడింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అన్నదమ్ములు ఇసుక మేటల వద్ద పీఠమేసుకొని కూర్చొన్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుక మేటలను తిరుపతి, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రతి రోజూ పగటి పూట 60 ట్రాక్టర్లు, రాత్రిళ్లు పదుల సంఖ్యలో టిప్పర్లతో అక్రమంగా తరలిస్తున్నారు.

ఇక్కడ ఇసుక వీరే తీయాలి. లేదంటే..వారికి కప్పం కట్టి తవ్వుకోవాలి. అధికార పార్టీకి చెందిన ఒక ముఖ్యనేతకు సన్నిహితులమని చెప్పుకొంటూ తిరుగుతున్నారు. ఎందుకొచ్చిన గొడవ అని అధికారులు, పోలీసులు సైతం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. విచ్చలవిడిగా స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నా, కనీసం కేసు కట్టలేదు. ఈక్రమంలో నదిలో ఇసుక మేటలు కరిగిపోవడం మొదలయింది.

అప్పటిదాకా మునగలపాళెంలో ఎక్కడ తవ్వినా 30 అడుగుల్లోనే బోరు పడేది. అలాంటిది వ్యవసాయ బోర్లు వరుసగా ఎండిపోవడం మొదలయింది. మునగలపాళెం రైతుల్లో కలవరం బయలుదేరింది. వాగులో ఇసుక మేటలతోనే తమ బతుకు ముడిపడిపోయిందని గ్రహించారు. ఏడాది కాలంగా చావోరేవో అన్నట్టు అన్నదమ్ముల దందాపై దండెత్తుతున్నారు. ఇక తమ పోరాటాన్ని ఉధృతం చేయడానికి సిద్ధమవుతున్న క్రమంలోనే, ఏర్పేడు పోలీస్‌ స్టేషన్‌ వద్ద లారీ చక్రాల కింద ఛిద్రమయిపోయారు.

No comments:

Post a Comment