Wednesday, 26 April 2017

ఒక్క ప్రమాదం 20 మందిని కబళించింది

ఒక్క ప్రమాదం 20 మందిని కబళించింది
21-04-2017 17:26:01

చిత్తూరు జిల్లా: ఒక్క ప్రమాదం 20 మందిని కబళించింది... చిత్తూరుజిల్లా ఏర్పేడు వద్ద జరిగిన ఘోరమైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపైకి లారీ దూసుకువచ్చి 20 మందిని బలితీసుకుంది. సాధారణ రోడ్డు ప్రమాదాలు జరిగితే ఇంతపెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరగడం అరుదు. ఏర్పేడు పోలీస్ స్టేషన్ ఎదుట జరిగింది...ఓ బీభత్స కాండ.. ఆందోళన చేస్తున్నవారిపైకి అదుపు తప్పిన లారీ దూసుకువచ్చి పక్కనే ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి...ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ కలగలిసి ఇంతమందిని బలితీసుకున్న విషాదమిది. ఇలాంటి ప్రమాదం జరిగిన తీరు ఇంతవరకు చూడలేదని అక్కడ చూసినవారు అన్నారు.

తాగుబోతు... చంపేశాడు!

తాగుబోతు... చంపేశాడు! 
22-04-2017 02:52:42

మందుకొట్టి.. స్టీరింగ్‌ పట్టిన డ్రైవర్‌.. 17 గంటలుగా డ్రైవింగ్‌
రాత్రి ఒకసారి, తెల్లారాక మరోసారి మద్యపానం..
కారు లైసెన్స్‌తో లారీ నడుపుతూ అరాచకం
(అమరావతి,తిరుపతి - ఆంధ్రజ్యోతి) పరిమితికి మించిన లోడు! డ్రైవర్‌ బాగా మందు తాగాడు! 17 గంటలుగా లారీ నడుపుతూనే ఉన్నాడు! తాగింది దిగకముందే మళ్లీ తాగాడు. స్టీరింగ్‌ మాత్రం వదల్లేదు! ఉన్నోడు ఉండకుండా... పక్కనున్న వ్యక్తితో వాదులాడుతున్నాడు!... చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఘోర ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ గురువయ్య పరిస్థితి ఇది! అంతేకాదు... అతగాడికి లారీ నడిపే అర్హత కూడా లేదు. కారు డ్రైవింగ్‌ లైసెన్సుతో 14 చక్రాల లారీని నడిపేస్తున్నాడు. నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన తాతమశెట్టి రమేశ్‌ రెండు నెలల కిత్రమే ఈ లారీ (ఏపీ 26 టీడీ 8679) కొన్నాడు. దొరవారిసత్రం మండలం పోలిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన గురవయ్య(33)ని డ్రైవర్‌గా పెట్టుకొన్నాడు. అతను ఏడాదిన్నర క్రితం సుళ్లూరుపేట ఆర్టీఏ నుంచి కారు డ్రైవింగ్‌ లైసెన్సు తీసుకున్నాడు. అదే లైసెన్సుతో పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు వెళ్లాడు. మహబూబ్‌నగర్‌లో 25 టన్నుల లోడు ఎత్తుకొని...గురువారం రాత్రి 8గంటలకు బయలు దేరాడు. ఫుల్లుగా మద్యం సేవించి రాత్రంతా లారీ నడుపుతూ వచ్చాడు. శుక్రవారం ఉదయం కడప సమీపంలో మళ్లీ మందుకొట్టాడు. స్టీరింగ్‌పై అదుపు కోల్పోయాడు.

జనాన్ని చూసి బ్రేక్‌ వేయాల్సినవాడు, యాక్సిలేటర్‌ నొక్కి విధ్వంసానికి కారణమయ్యాడు. సాధారణంగా రెండు పెగ్గుల మద్యం సేవిస్తే రక్తంలో 30 ఎంజీ లిక్కర్‌ శాతం చూపిస్తుంది. కానీ, గురువయ్య శరీరంలో ఏకంగా 287ఎంజీ శాతం కనిపించింది. రవాణా కమిషనర్‌ బాలసుబ్రమణ్యం చిత్తూరు డీటీసీ, తిరుపతి ఆర్టీవోలను ఘటనా స్థలికి పంపారు. లారీ యజమానిపైనా కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన తర్వాత తీసుకున్న చర్యలు సరే! కారు డ్రైవింగ్‌ లైసెన్సు ఉన్న గురువయ్య ఇన్నాళ్లుగా... లారీని రాష్ట్రాలు దాటిస్తుంటే అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నట్లు? మద్యం మత్తులో వందల కిలోమీటర్లు నడుపుతుంటే... మన ‘తనిఖీ వ్యవస్థలు’ ఏం పని చేస్తున్నట్లు?


2 గంటల్లోనే పంచనామా..పోస్టుమార్టం
22-04-2017 02:48:30
15 మృతదేహాలకు పంచనామా నిర్వహించి రెండు గంటల వ్యవధిలోనే పోస్టుమార్టం పూర్తిచేసి స్వగ్రామాలకు తరలించేందుకు అధికారులు వేగంగా ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న, జేసీ శ్రీగిరీషా, సబ్‌కలెక్టర్‌ నిషాంతకుమార్‌, ఎస్పీ జయలక్ష్మి, తిరుమల ఏఎస్పీ మురళీకృష్ణ, శ్రీనివాసులు, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రమణయ్య అర్బన్‌ తహసీల్దార్‌ చంద్రమోహన్‌, వైద్యులు తదితరులంతా ఆస్పత్రికి చేరుకున్నారు. ఒక్కో మృతదేహానికి ఒక్కొక్కరు బాధ్యత వహించి యుద్ధ ప్రాతిపదికన పంచనామా నిర్వహించారు. వెనువెంటనే శవ పరీక్షలు పూర్తి చేశారు. ఇలా రెండు గంటల్లోనే ఈ ప్రక్రియ ముగించేలా అధికారులు చర్యలు చేపట్టారు.

మేటలపై ‘బ్రదర్స్‌’ మాఫియా - మృత్యువైన మూడో ధర్నా

మేటలపై ‘బ్రదర్స్‌’ మాఫియా  - మృత్యువైన మూడో ధర్నా 
22-04-2017 02:50:49
వాగు రక్షణ పోరు రక్తసిక్తం
తిరుపతి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): మునగలపాళెం వాసులకు వ్యవసాయమే జీవనాధారం. ఊరుపక్కనుంచే స్వర్ణముఖి ప్రవహిస్తుండటంతో 30 అడుగుల లోతులోనే నీళ్లు లభిస్తున్నాయి. రైతులంతా హ్యాండ్‌ బోర్లు వేసుకొని పంటలు సాగు చేసుకొంటున్నారు. నదిలో స్మగ్లర్లు కొంతకాలంగా పెద్ద ఎత్తున ఇసుక లోడేస్తుండటం ప్రాణసంకటంగా మారింది. వాగులోని ఇసుకమేటలకు, రైతుల బోర్లకు సంబంఽధంఉంది. నదిలో మేటలు హరించుకుపోతున్నకొద్దీ బోర్లలో నీరు ఎండిపోవడం మొదలైంది. దీనిపై గ్రామస్థులంతా సంఘటితమయ్యారు. ఏర్పేడు తహసిల్దార్‌ కార్యాలయంలో ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా, ఫలితం లేకపోయింది. కొన్నినెలల కిందట తహసిల్దార్‌ కార్యాలయానికి తాళం వేసి.. ధర్నా చేశారు.

ఉగాదికి ముందురోజు.. శ్రీకాళహస్తి- తిరుపతి జాతీయ రహదారిపై రెండోసారి బైఠాయించారు. అప్పటికీ కదలిక లేకపోవడంతో.. నేరుగా స్మగ్లర్లను అడ్డుకొన్నారు. రగిలిపోయిన స్మగ్లర్లు, చీకటి మాటున గురువారం రాత్రి ఊరిపై దాడిచేశారు. దీనిపై రైతులంతా సమావేశమయ్యారు. శుక్రవారం ఇంటికొకరు చొప్పున వెళ్లి అధికారులను నిలదీయాలని అనుకున్నారు. అనుకున్నట్లే అంతా తహసిల్దార్‌ కార్యాలయానికి వెళ్లారు. ఏర్పేడు పోలీసు స్టేషనకి అర్బన్‌ ఎస్పీ వచ్చారని తెలుసుకొని, మధ్యాహ్నం 12 గంటల సమయంలో అక్కడకు వెళ్లారు. ఆశించిన ఊరట లభించకపోవడంతో.. పోలీస్‌ స్టేషన్‌ ఎదుట, మూడోసారి ధర్నాకు కూర్చొంటుండగా లారీ రూపంలో మృత్యువు వీరిని కబళించింది.

మేటలపై ‘బ్రదర్స్‌’ మాఫియా
22-04-2017 02:53:16

నదీ వాగు గర్భంలో గునపం
రైతు బతుకుకు పెనుగండం
ఎదురుతిరిగిన మునగలపాళెం
(ఆంధ్రజ్యోతి, తిరుపతి) ఏర్పేడు మండల పరిధిలో స్వర్ణముఖి నదికి అటు ఇటు కొన్ని గ్రామాలు ఉన్నాయి. వాటిలో కొన్ని గ్రామాలకు స్వర్ణముఖి నీరే ప్రాణాధారం. అందులో మునగలపాళెం ఒకటి. ఈ నదిలో భారీగా ఇసుక మేటలున్నాయి. ఇసుకకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడిన క్రమంలో పక్క గ్రామానికి చెందిన ఒక కుటుంబం కన్ను పడింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అన్నదమ్ములు ఇసుక మేటల వద్ద పీఠమేసుకొని కూర్చొన్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుక మేటలను తిరుపతి, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రతి రోజూ పగటి పూట 60 ట్రాక్టర్లు, రాత్రిళ్లు పదుల సంఖ్యలో టిప్పర్లతో అక్రమంగా తరలిస్తున్నారు.

ఇక్కడ ఇసుక వీరే తీయాలి. లేదంటే..వారికి కప్పం కట్టి తవ్వుకోవాలి. అధికార పార్టీకి చెందిన ఒక ముఖ్యనేతకు సన్నిహితులమని చెప్పుకొంటూ తిరుగుతున్నారు. ఎందుకొచ్చిన గొడవ అని అధికారులు, పోలీసులు సైతం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. విచ్చలవిడిగా స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నా, కనీసం కేసు కట్టలేదు. ఈక్రమంలో నదిలో ఇసుక మేటలు కరిగిపోవడం మొదలయింది.

అప్పటిదాకా మునగలపాళెంలో ఎక్కడ తవ్వినా 30 అడుగుల్లోనే బోరు పడేది. అలాంటిది వ్యవసాయ బోర్లు వరుసగా ఎండిపోవడం మొదలయింది. మునగలపాళెం రైతుల్లో కలవరం బయలుదేరింది. వాగులో ఇసుక మేటలతోనే తమ బతుకు ముడిపడిపోయిందని గ్రహించారు. ఏడాది కాలంగా చావోరేవో అన్నట్టు అన్నదమ్ముల దందాపై దండెత్తుతున్నారు. ఇక తమ పోరాటాన్ని ఉధృతం చేయడానికి సిద్ధమవుతున్న క్రమంలోనే, ఏర్పేడు పోలీస్‌ స్టేషన్‌ వద్ద లారీ చక్రాల కింద ఛిద్రమయిపోయారు.

లోకేష్, బొజ్జలకు చేదు అనుభవం

లోకేష్, బొజ్జలకు చేదు అనుభవం 
13:48 - April 22, 2017

చిత్తూరు : ఏర్పేడు మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన మంత్రి నారా లోకేష్‌ , బొజ్జలకు చేదు అనుభవం ఎదురైంది. ఇందంతా అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని బాధితులను వారిని నిలదీశారు. మానవ తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగింది. దీని వెనుక ఇసుక మాఫియా ఉందన్న వాదానను లోకేష్ ఖండించారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం కింద రూ.10 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. శుక్రవారం లారీ ప్రమాద ఘటనలో 16 మంది మృతి చెందారు. వీరు ఇసుక మాఫియాపై ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్ వెళ్లారు. ఫిర్యాదుపై సీఐ స్పందించలేదు. అయితే అక్కడే ఉన్న వారి పైకి లారీ దూసుకొచ్చింది. దీంతో 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 21 మందికి గాయాలైన విషయం తెలిసిందే.

ఆ ఇద్దరినీ సస్పెండ్‌ చేస్తున్నా: సీఎం చంద్రబాబు

ఆ ఇద్దరినీ సస్పెండ్‌ చేస్తున్నా: సీఎం చంద్రబాబు
Posted On: Sunday,April 23,2017

                     న్యూఢిల్లీ: బరితెగించిన టీడీపీ ఇసుక మాఫియా 17 మందిని పొట్టనపెట్టుకున్న ఏర్పేడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు స్పందించారు. నీతిఆయోగ్‌ సర్వసభ్య సమావేశంలో పాల్గొనే నిమిత్తం ఆదివారం ఢిల్లీ వెళ్లిన ఆయన.. అక్కడి నుంచే తూతూమంత్రపు చర్యలకు ఆదేశాలు జారీచేశారు.
            ఇసుక మాఫియా కారణంగా 17 మంది దారుణంగా చనిపోయిన సంఘటనపై సీనియర్‌ అధికారితో విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నివేదిక వచ్చిన తర్వాతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. మునగలపాలెం ఇసుక మాఫియా డాన్‌లు, తెలుగుదేశం పార్టీకి చెందిన ధనుంజయనాయుడు, చిరంజీవి నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమైన కారణంగా ఎమ్మార్వోను సైతం సస్పెండ్‌ చేస్తున్నట్లు చెప్పారు. తాగి వాహనాలు నడిపేవారి లైసెన్సులు రద్దు చేస్తామని సీఎం హెచ్చరించారు.

3 ఏళ్ల తర్వాత ఇసుక మాఫియాపై బాబు స్పందన
Share|
April 26 2017, 7:06 pm

మూడేళ్ల తర్వాత ఇసుక మాఫియాపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిగా స్పందించారు. ఇసుక దందా వల్లే చిత్తూరు జిల్లా ఏర్పేడులో ప్రమాదం జరిగి పదిహేడు మంది మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో పార్టీకి చెందిన ఇద్దరు ధనుంజయ నాయుడు,చిరంజీవి నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మండల తహశీల్దార్ ను సస్పెండ్ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. డిల్లీలో ఈ విషయం ఆయన తెలిపారు. విపక్ష నేత జగన్ అక్కడకు వెళ్లి పరామర్శించి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. ఇసుక మాఫియా కారణంగా 17 మంది దారుణంగా చనిపోయిన సంఘటనపై సీనియర్‌ అధికారితో విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

https://news.google.pk/news/more?ncl=dXOXUvkSzeiq2QMf8bEOclAuM_K8M&authuser=0&ned=en_pk&hl=te

ఏర్పేడు లో లారీ బీభత్సం, 15మంది మృతి

ఏర్పేడు లో లారీ బీభత్సం, 15మంది మృతి
Sakshi | Updated: April 21, 2017 18:40 (IST)
చిత్తూరు జిల్లాలో లారీ బీభత్సం, 15మంది మృతి
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఏర్పేడు పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఈ రోజు మధ్యాహ్నం ఓ లారీ అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని, అనంతరం పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 15 మంది దుర్మరణం చెందగా, మరో 15 మందికి పైగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత‍్తం రుయా ఆస్పత్రికి తరలించారు.
ఇసుక దందాపై నిరసన వ్యక్తం చేస్తూ పోలీసు స్టేషన్ వద్ద ధర్నా చేస్తున్న గ్రామస్తుల మీదకు వేగంగా వెళ్తున్న లారీ దూసుకెళ్లింది. ఆ తర్వాత ఒక విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. వాహనాలను కూడా ఢీకొనడంతో వాటిలో పెట్రోలు లీకై మంటలు చెలరేగాయి. ఈ మూడు కారణాల వల్ల మొత్తం 15 మంది మరణించారు. మరో 15 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. గాయపడినవారిలో ఇద్దరు పత్రికా ప్రతినిధులు కూడా ఉన్నారు.
మరోవైపు ఏర్పేడు రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... చిత్తూరు జిల్లా కలెక్టర్‌ తో ఫోన్‌లో మాట్లాడారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అలాగే ఈ ఘటనపై హోంమంత్రి చినరాజప్ప ... తిరుపతి అర్బన్‌ ఎస్పీతో మాట్లాడి పరిస్థితిని స్వయంగా సమీక్షించాలని సూచించారు.

Saturday, 22 April 2017

ఆక్రమిస్తున్న అనకొండ

ఆక్రమిస్తున్న అనకొండ
23-04-2017 01:25:43
http://www.andhrajyothy.com/artical?SID=402405

‘సమయం లేదు మిత్రమా! శరణు కోరతారా? లేక శాస్తి చేయమంటారా?’– ఇది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తన రాజకీయ దండయాత్రలో భాగంగా దేశవ్యాపితంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు చేస్తున్న హెచ్చరిక! కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ అఖండ భారతాన్ని తన ఏలుబడిలోకి తెచ్చుకోవాలన్న లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అమలు చేస్తున్న వ్యూహాలతో జాతీయ పార్టీలే కాదు- ప్రాంతీయ పార్టీలు కూడా విలవిలలాడిపోతున్నాయి. స్వర్గీయ ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ విధానాలతో దేశంలోని పలు రాష్ర్టాలలో పురుడు పోసుకున్న ప్రాంతీయ పార్టీలను.. అయితే తమ దారిలోకి తెచ్చుకోవాలి లేదా కబళించాలన్న సంకల్పంతో ఈ నాయక ద్వయం వేస్తున్న అడుగులతో పలు రాష్ర్టాలలో ప్రాంతీయ పార్టీల అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారబోతోంది. ఉత్తరప్రదేశ్‌లో బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌వాదీ పార్టీలను తాజా ఎన్నికలలో మట్టి కరిపించిన బీజేపీ, ఇప్పుడు తన దృష్టిని దక్షిణాది రాష్ర్టాలలో తిష్ట వేసుకుని కూర్చున్న ప్రాంతీయపార్టీలపై కేంద్రీకరించింది. ఇందుకు తమిళనాడులో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలే నిదర్శనం.
టార్గెట్‌ ప్రాంతీయ పార్టీలు
ద్రవిడ పార్టీల ఆవిర్భావంతో తమిళనాడులో జాతీయపార్టీలకు చోటు లేకుండాపోయింది. డీఎంకే– అన్నాడీఎంకే పార్టీలే ఆ రాష్ర్టాన్ని ఏలుతూ అప్పుడప్పుడు కేంద్ర రాజకీయాలను కూడా శాసిస్తూ వచ్చాయి. అలాంటి తమిళనాడులో కాలు మోపడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలేవీ జయలలిత జీవించి ఉన్నంత వరకు ఫలించ లేదు. జయలలిత మరణంతో అన్నాడీఎంకే పార్టీని తన అధీనంలోకి తెచ్చుకోవడానికై బీజేపీ పావులు కదపడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో జయ నెచ్చెలి శశికళకు తొలుత రాయబారం పంపారు. తమ శరణు కోరితే శశికళకు ముఖ్యమంత్రి పీఠం దక్కనిస్తామన్నది ఈ రాయబారం సారాంశం. అయితే, సుప్రీం కోర్టులో తమపై ఉన్న అవినీతికి సంబంధించిన కేసులలో తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న నమ్మకంతో ఉన్న శశికళ బీజేపీ నుంచి వచ్చిన ప్రతిపాదనను ఖాతరు చేయలేదు. శశికళ స్పందన కోసం పది రోజులకు పైగా వేచి ఉన్న నరేంద్ర మోదీ, అమిత్‌ షా ద్వయం ప్రతి వ్యూహానికి పదును పెట్టారు.

ఫలితమే, ఇప్పట్లో రాదనుకున్న సుప్రీం కోర్టు తీర్పు వెలువడటం, శశికళ జైలు పాలవ్వడం జరిగింది. ఈ దశలో కూడా బీజేపీ శరణు కోరడానికి ఇష్టపడని శశికళ తన నామినీగా పళని స్వామిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి జైలుకు వెళ్లారు. తాము నమ్మకం పెట్టుకున్న పన్నీర్‌ సెల్వం అక్కరకు రాకపోవడంతో తగిన సమయం కోసం మోదీ, షా ఎదురు చూస్తూ వచ్చారు. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నికలో గెలుపు కోసం శశికళ వర్గానికి చెందిన దినకరన్‌ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడాన్ని గమనించిన బీజేపీ పెద్దలు ఆదాయపు పన్ను శాఖ అధికారులను రంగంలోకి దించారు. ఐటీ అధికారుల దాడుల్లో ఓటర్లకు డబ్బు పంపిణీ జరిగినట్టు ఆధారాలు లభించడంతోపాటు డబ్బు పంపిణీలో పలువురు మంత్రులకు సంబంధాలు ఉన్నట్టు నిర్ధారణ కావడంతో మోదీ– షాలు మలి దశ వ్యూహానికి పదును పెట్టారు. ఐటీ అధికారుల దాడులను ఉపయోగించుకుని అన్నాడీఎంకే పార్టీని తమ దారిలోకి తెచ్చుకోవడానికి ఎత్తుగడ వేశారు. ఫలితమే, తమిళనాడులో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు.

తమ మనిషి అయిన పన్నీర్‌ సెల్వంకు పార్టీని, ప్రభుత్వాన్ని అప్పగించడంతోపాటు రానున్న ఎన్నికలలో సగం లోక్‌సభ స్థానాలను బీజేపీకి వదిలి వేయాలన్న షరతు కూడా విధించారు. దీంతో, ముఖ్యమంత్రి పళనిస్వామిది కక్కలేని మింగలేని పరిస్థితిగా మారింది. తెర వెనుక నుంచి బీజేపీ అగ్ర నాయకత్వం ఇస్తున్న ఆదేశాలను శిరసావహించకపోతే తమ మనుగడే ప్రమాదంలో పడుతుందని పళని స్వామికి తెలుసు! ముగ్గురు మంత్రులపై ఐటీ అధికారులు పెట్టిన కేసు పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతానికి పళనిస్వామితో రాయబారాలు నడుస్తున్నాయి కనుక, ఐటీ అధికారులు మౌనంగా ఉన్నారు. దాడులు కూడా ఆగిపోయాయి. నిఘా మాత్రం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పళని స్వామి ఏ కారణంగానైనా విభేదిస్తే, ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నారు.

తమ రాయబారాన్ని లెక్క చేయకుండా వ్యవహరించిన శశికళకు అన్నాడీఎంకేలో చోటు లేకుండా చేశారు. ముఖ్యమంత్రిగా పళనిస్వామి లేదా పన్నీర్‌ సెల్వం ఉన్నా అన్నాడీఎంకే తమ పర్యవేక్షణలోనే పని చేయాలన్నది బీజేపీ అగ్ర నాయకత్వం అభిమతం. కాంగ్రెస్‌ అధికారం వెలగబెట్టినప్పుడు సీబీఐ, ఈడీ వంటి సంస్థలను తమ రాజకీయ ప్రత్యర్థులపైకి ఉసిగొల్పేది. ఇప్పుడు మోదీ– షా ద్వయం ఇంకో అడుగు ముందుకు వేసి ఆదాయపు పన్ను శాఖ అధికారులను కూడా రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగిస్తోంది. ఈ క్రమంలో తమ చర్యలను ప్రజలు తప్పుబట్టకుండా ఈ నాయక ద్వయం జాగ్రత్తలు తీసుకుంటోంది. డొల్ల కంపెనీలపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్న సమయం చూసుకుని తమిళనాడులో ఐటీ దాడులను నిర్వహింపచేశారు.

ఈ చర్యల వల్ల నల్లధనంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉక్కుపాదం మోపుతున్నారని భావించే పరిస్థితి వస్తోంది. తెర వెనుక లక్ష్యాలు మాత్రం వేరుగా ఉంటాయి. శశికళకు కొంత గడువు ఇచ్చినట్టుగానే ఇప్పుడు పళనిస్వామికి కూడా తగిన సమయం ఇస్తున్నారు. ఆయన వారి దారిలోకి రాకపోతే త్వరలోనే మాజీ ముఖ్యమంత్రిగా మారిపోతారు. తమిళనాడు తరహాలోనే వివిధ రాష్ర్టాలలో బలంగా ఉన్న ప్రాంతీయపార్టీలపై మోదీ– షా ద్వయం కన్నేసింది. ఆయా రాష్ర్టాలలో బీజేపీ బలం పెంచుకోవడానికి ముందుగా ప్రయత్నిస్తారు. అది సాధ్యం కాదని తేలిపోతే, ప్రాంతీయ పార్టీలను కబళించే ఎత్తుగడకు తెర తీస్తారు. బెంగాల్‌ విషయమే తీసుకుందాం! అక్కడ బీజేపీ బలపడే అవకాశం ఉండటంతో చతురంగ బలాలను ఆ రాష్ట్రంలో మోహరింపజేశారు.

ఇటీవలి కాలం వరకు బీజేపీ ఉనికే ఆ రాష్ట్రంలో ఉండేది కాదు. సుదీర్ఘ కాలం వామపక్షాల ఏలుబడిలో ఉన్న బెంగాల్‌లో మరో పార్టీకి అధికారం దక్కలేదు. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేసిన మమతా బెనర్జీ ఎట్టకేలకు విజయం సాధించారు. దాదాపు మూడున్నర దశాబ్దాలపాటు అధికారం చెలాయించిన వామపక్షాలు ఓటమి పాలైన నాటి నుంచి బలహీనపడుతూ వస్తున్నాయి. ఈ పరిణామాన్ని గమనించిన బీజేపీ తన దృష్టిని బెంగాల్‌వైపు కేంద్రీకరించింది. ఫలితం కూడా కనబడుతోంది. తాజాగా అక్కడ ఒక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కమ్యూనిస్టులు తృతీయ స్థానానికి దిగజారారు. బీజేపీ అభ్యర్థి ద్వితీయ స్థానంలో నిలబడ్డారు. బెంగాల్‌లో ప్రస్తుతం తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉండవచ్చు. కానీ, బీజేపీ నుంచి ముప్పు మాత్రం తరుముకొస్తూనే ఉంది. కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉన్న బెంగాల్‌లో బలం పెంచుకోగా లేనిది, దక్షిణాదిన మాత్రం ఎందుకు బలపడలేమన్న ఆలోచనకు మోదీ– షా ద్వయం వచ్చింది. వామపక్షాల ఏలుబడిలో ఉన్న కేరళలో కూడా బలం పుంజుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
దక్షిణాదిపైనా కన్ను
తమిళనాడు రాజకీయాలు పూర్తిగా తమ అదుపులోకి వచ్చాయన్న నమ్మకం కుదరడంతో బీజేపీ పెద్దల కన్ను ఇప్పుడు ఒడిసాపై పడింది. బిజూ జనతాదళ్‌ అధినేత నవీన్‌ పట్నాయక్‌ ప్రస్తుతం నాలుగవ పర్యాయం ముఖ్యమంత్రిగా ఉన్నారు. అత్యంత నిజాయితీపరుడైన నవీన్‌ పట్నాయక్‌ తన నిజాయితీతోనే ఎన్నికలలో వరుసగా గెలుపొందుతున్నారు. అయితే, ఆయన ఏలుబడిలో ఒడిసా అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. ఈ విషయమై అసంతృప్తితో ఉన్న ఒడిసా ప్రజలు ఇటీవలి కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి నినాదం పట్ల ఆకర్షితులవుతున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. బ్రహ్మచారి అయిన నవీన్‌ పట్నాయక్‌కు వయోభారం కూడా తోడైంది. దీంతో, బిజూ జనతాదళ్‌ను నవీన్‌ తర్వాత నడపగల వారసుడు కరువయ్యారు. ఈ పరిణామాలన్నింటినీ గమనించిన బీజేపీ నాయకత్వం ఇప్పుడు ఒడిసాలో విజయ కేతనం ఎగుర వేయడానికి పావులు కదుపుతోంది. ఈ పాచికలు పారడంతో ఒడిసాలో ఇటీవలి కాలంలో బీజేపీ అనూహ్యంగా బలం పెంచుకుంది. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మరింత బలహీనపడింది. ఇదే దూకుడు కొనసాగితే, వచ్చే ఎన్నికలలో నవీన్‌ పట్నాయక్‌ ఓటమి పాలై బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

దీంతో, కలత చెందిన నవీన్‌ పట్నాయక్‌ బీజేపీకి వ్యతిరేకంగా మహా కూటమి ఏర్పాటు ప్రతిపాదనను తెరమీదకు తెచ్చారు. అంటే, బీజేపీ ధాటికి ఎదురు నిలవలేకపోతున్న కాంగ్రెస్‌ పార్టీ సహా దేశంలోని వివిధ ప్రాంతీయ, కమ్యూనిస్టు పార్టీలన్నీ ఒకే వేదికపైకి చేరడమన్నమాట! దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన జయప్రకాశ్‌ నారాయణ.. ఇప్పుడు బీజేపీగా ఉన్న అప్పటి జనసంఘ్‌ను కూడా కలుపుకొని జనతా పార్టీని ఏర్పాటు చేసి, ఎన్నికలలో ఇందిరా గాంధీని ఓడించి మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలో జనతా పార్టీ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయించారు. అయితే, వ్యక్తుల మధ్య వైరుధ్యాలు, సిద్ధాంత- రాద్ధాంతాల వల్ల జనతా ప్రయోగం మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. ఆ తర్వాత ఎన్టీ రామారావు చొరవతో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నేషనల్‌ ఫ్రంట్‌ పురుడు పోసుకుంది. ఎన్టీఆర్‌ చైర్మన్‌గా, వీపీ సింగ్‌ కన్వీనర్‌గా ఏర్పడిన నేషనల్‌ ఫ్రంట్‌తో రాజకీయంగా బద్ధవిరోధులైన కమ్యూనిస్టులు- బీజేపీ కూడా చేతులు కలిపాయి. ఫలితంగా, ఎన్నికలలో విజయం సాధించిన నేషనల్‌ ఫ్రంట్‌ విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. షరా మామూలే అన్నట్టుగా ఈ ప్రయోగం కూడా కొంత కాలానికి విఫలమై ప్రభుత్వం కూలిపోయింది.

ఈ రెండు సందర్భాలలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దేశవ్యాపితంగా సిద్ధాంత విభేదాలను పక్కనపెట్టి వివిధ పార్టీలు కూటమిగా ఏర్పడినట్టుగానే ఇప్పుడు మోదీ– షా ద్వయం జరుపుతోన్న రాజకీయ జైత్రయాత్రను నిలువరించడానికి ముచ్చటగా మూడోసారి మహా కూటమి ప్రయోగానికి వివిధ పార్టీల నాయకుల నుంచి ప్రతిపాదనలు తెరమీదకు వస్తున్నాయి. బీజేపీ చేతిలో చావుదెబ్బ తినడంతో తమ మధ్య ఉన్న వైరాన్ని సైతం పక్కనపెట్టి ఒక్కటవుదామని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ బహుజన సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతికి రాయబారం పంపుతున్నారు. మహా కూటమి ప్రతిపాదనకు బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్వరం కలుపుతున్నారు. మోదీ-– షా విజయ పరంపర ఇలాగే కొనసాగితే తమ రాజకీయ అస్తిత్వానికే ప్రమాదం ముంచుకు వస్తుందన్న కలవరంతో బీజేపీ బాధితులందరూ ఒక్కటవ్వడానికి ఉత్సాహపడుతున్నారు. అయితే, ఈ ప్రయోగం ఎంతవరకు సఫలీకృతం అవుతుందో తెలియదు. ఎందుకంటే, కూటమిలో చేరే అవకాశం ఉందని భావిస్తున్న కొన్ని పార్టీల నాయకులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, ఆదాయపు పన్ను శాఖ అధికారులతోపాటు సీబీఐ అధికారులు కూడా దాడులు జరిపి కేసులు సిద్ధంచేసుకుని ఉన్నారు.

కేంద్ర పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించిన వెంటనే ఆయా కేసులలో ఇరుక్కున్న వాళ్లను ముప్పతిప్పలు పెట్టడానికి ఈ శాఖలు సిద్ధంగా ఉన్నాయి. తన నాయకత్వంపై సన్నాయి నొక్కులు నొక్కుతున్న లాల్‌కృష్ణ ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి వంటి వృద్ధతరం నేతలను అయోధ్య కేసును తెరపైకి తేవడం ద్వారా కిక్కురుమనకుండా చేసిన ఘనుడు ప్రధాని నరేంద్ర మోదీ! రాజకీయ వ్యూహ రచనలో మోదీకి తన- మన అన్న తేడా ఉండదు. ‘ధిక్కారమున్‌ సైతునా’ అన్నదే ఆయన ధోరణి. తనతో జట్టు కట్టిన ప్రాంతీయ పార్టీలు కూడా అణగిమణిగి ఉండాలనే మోదీ కోరుకుంటారు. ఎవరికి వారు సామంతరాజులుగా వ్యవహరించాలనుకుంటే వారిని ఇబ్బందుల పాలు చేయడానికి వివిధ మార్గాలు ఉండనే ఉన్నాయి. ప్రస్తుతం ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న శివసేనను ముప్పుతిప్పలు పెడుతున్న విషయం తెలిసిందే! ఎన్డీయేలో ప్రధాన భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా పరిస్థితులను బట్టి ఒదిగే ఉంటున్నారు. రాష్ట్ర అవసరాలు, రాజకీయ అవసరాల కోసం మోదీ– షాల ముందు ఆయన తగ్గి ఉంటున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఎన్‌డీఏలో భాగస్వామి కాకపోయినా మోదీ– షాల మనసు నొప్పించకుండా జాగ్రత్త పడుతున్నారు. సందర్భాన్ని బట్టి మోదీ పాలనను పొగుడుతున్నారు. అయినా, బీజేపీ విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న మోదీ– షా ద్వయం ఇప్పుడు తెలుగు రాష్ర్టాలపై కూడా కన్నేసింది. ముందుగా తెలంగాణలో పాగా వేయాలని వారు కోరుకుంటున్నారు. బీజేపీకి దక్షిణాదిన చోటు లేదన్న అపప్రథ నుంచి బయటపడటానికై పావులు కదుపుతున్నారు. ఒడిసాలో పరిస్థితులను అనుకూలంగా మలచుకున్న కమలనాథులు, తాజాగా తెలంగాణపై కన్నేశారు. ఈ క్రమంలోనే తెలంగాణలో నాలుగు రోజులపాటు పర్యటించాలని అమిత్‌ షా నిర్ణయించుకున్నారు. అయితే, రాష్ట్ర బీజేపీలో ఇప్పుడున్న నాయకత్వంతో బలపడటం సాధ్యం కాదన్న ఉద్దేశంతో కొత్త రక్తం ఎక్కించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్‌ పార్టీకి అండగా ఉంటూ వస్తున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకులను బీజేపీలో చేర్చుకోవడానికై బేరసారాలు జరుగుతున్నాయి. దేశవ్యాపితంగా కాంగ్రెస్‌ పరిస్థితి బాగా లేనందున ఆ పార్టీకి చెందిన నాయకులను కూడా ఆకర్షించే పనిలో ఉన్నారు.

దేశమంతటా మోదీ ప్రభంజనం ఉన్నందున తెలంగాణలో కూడా అదే ప్రభంజనం సృష్టించాలని చాపకింద నీరులా చొచ్చుకుపోతున్నారు. కాంగ్రెస్‌ నుంచి కంటే బీజేపీ నుంచే తమకు ప్రమాదం ముంచుకు వచ్చే అవకాశం ఉందని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. విరుగుడు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఆయా వర్గాలకు రిజర్వేషన్లు పెంచడంతోపాటు రైతులకు ఏటా ఎకరాకు ఎనిమిది వేల రూపాయలను ఎరువుల కొనుగోలుకు ఉచితంగా ఇస్తామని ప్రకటించడం ఇందులో భాగమే! కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నప్పటికీ బీజేపీ అగ్ర నాయకత్వం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నమ్మడం లేదు. తమ మిత్రులు కూడా మరీ బలంగా ఉండకూడదని, తమపై ఆధారపడాలని కోరుకునే మనస్తత్వం మోదీ– షాలది! ఈ కారణంగానే ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బలహీనపర్చడంపై దృష్టి కేంద్రీకరించారు. తెలంగాణలో కేసీఆర్‌ అధికారానికి ఎసరుపెట్టే ప్రయత్నాలను ముమ్మరంచేయగా, ఏపీలో బీజేపీని బలోపేతం చేయడానికి వ్యూహ రచన చేస్తున్నారు.

ఈ క్రమంలో, తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా ఎన్నికలలో పోటీ చేయాలన్న నిర్ణయానికి బీజేపీ అధిష్ఠానం వచ్చింది. టీఆర్‌ఎస్‌తో కూడా పొత్తు లేకుండా సొంత కాళ్లపై నిలబడాలని నిర్ణయించుకున్నారు. ఈ వ్యూహ రచనలో భాగంగా ముందుగా తెలంగాణలో కాంగ్రెస్‌ను బలహీనపరచి ప్రధాన ప్రతిపక్ష పాత్రను తామే పోషించాలని కమలనాథులు పాచికలు విసురుతున్నారు. బీజేపీని ముందుగా ప్రధాన ప్రతిపక్షంగా తీర్చిదిద్ది, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పని బట్టాలన్నది మోదీ– షాల ఆలోచనగా ఉంది. ఈ కారణంగానే బీజేపీ తెలంగాణ నాయకులు ఇటీవల జోరు పెంచారు. ప్రభుత్వంపై దాడికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండే అవకాశం ఉందని భావిస్తూ వచ్చిన బీజేపీ రాష్ట్ర నాయకులు, కేంద్ర పెద్దల నుంచి స్పష్టమైన సంకేతాలు రావడంతో కేసీఆర్‌ ప్రభుత్వంపై సమరభేరి మోగించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

తెలంగాణ తరహాలో ఏపీలో చంద్రబాబుపై దూకుడుగా వెళ్లడానికి బీజేపీ అధిష్ఠానం నుంచి ఆ రాష్ట్ర బీజేపీ నాయకులకు ఇంకా గ్రీన్‌సిగ్నల్‌ లభించలేదు. అలా అని మైదానాన్ని పూర్తిగా చంద్రబాబుకు వదిలివేయడానికి కూడా మోదీ– షాలు సిద్ధంగా లేరు. చాపకింద నీరులా బలం పెంచుకోవడానికి ప్రయత్నించడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి 50 అసెంబ్లీ స్థానాలు, పది లోక్‌సభ స్థానాలు తమకు కేటాయించాలని తెలుగుదేశం పార్టీతో బేరసారాలు చేసుకోవడానికై రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వాజపేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల పరిస్థితి వేరు- ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయ్యాక పరిస్థితి వేరు! భాగస్వామ్య పక్షాలు బలంగా ఉన్న రాష్ర్టాలలో కూడా సొంతంగా బలపడటానికి మోదీ– షాలు ఇష్టపడుతున్నారు. ఈ కారణంగా, మిత్రపక్షాలను కూడా తలపై పెట్టుకుని మోయడానికి వారు సిద్ధంగా లేరు. ఎదురు తిరిగిన వారికి తగిన శాస్తి చేయడానికి కూడా వెనుకాడటం లేదు. మహారాష్ట్రలో శివసేన పార్టీని నానాటికీ బలహీనపర్చడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. మోదీ-– షాల రాజకీయం అంటే పుచ్చుకోవడమే గానీ, ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవు. మిత్రపక్షాలు కూడా తాము చెప్పినట్టు నడుచుకోవాలని కోరుకుంటున్నారు. తాము స్నేహ హస్తం చాచినా కాదనుకున్న శశికళకు ఎదురైన పరిస్థితిని చూసిన తర్వాత ఏ మిత్రపక్షమైనా మోదీ– షాలను ఎదిరించి నిలవగలదని భావించలేం! ఇప్పుడు దేశ రాజకీయాలలో మోదీ– షాల హవా నడుస్తోంది. ఇది ఎంత కాలం అన్నది కాలమే నిర్ణయిస్తుంది.