పోలవరమే!
August 01, 2013
హైదరాబాద్, జూలై 31 : గోదావరి నది దిగువన పశ్చిమగోదావరి జిల్లాలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర విభజన నిర్ణయంలో భాగంగా ఈ పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కాంగ్రెస్ అధిష్ఠానం కేంద్రానికి సూచించింది. ఇదే జరిగితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచే అందనున్నాయి. గత సంవత్సరం అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం 16,010 కోట్ల రూపాయలు. ఇందులో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 4000 కోట్లు ఖర్చు చేసింది. మిగిలిన నిధుల్లో 90 శాతం అంటే.. దాదాపు రూ.10,800 కోట్లు కేంద్రం నుంచి అందనున్నాయి.
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను ఇవ్వడం వల్ల... ప్రస్తుతం పొరుగు రాష్ట్రాలతో ఉన్న వివాదాలు కూడా కేంద్రం చొరవతో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అలాగే కేంద్రం తరఫున కేంద్ర జల సంఘం (సిడబ్ల్యుసీ) నిపుణులు నేరుగా పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తారు. ఫలితంగా పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి కావడానికి ఆస్కారం ఉంటుందని ఆ ప్రాజెక్టు ఇంజనీర్-ఇన్-చీఫ్ ఎం. వెంకటేశ్వరరావు 'ఆంధ్రజ్యోతి'కి తెలిపారు. పోలవరం పూర్తయితే గోదావరి, కృష్ణా డెల్టాల ఆయకట్టు స్థిరీకరణ జరగడంతో పాటు పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల్లో దాదాపు 7.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది.
80 టీఎంసీల గోదావరి నికర జలాలు కృష్ణా డెల్టాకు తరలిస్తారు. ఆలమట్టి నుంచి నీటి విడుదల త్వరగా జరగకున్నా పోలవరం ద్వారా గోదావరి జలాలు, పులిచింతల ప్రాజెక్టు వల్ల కృష్ణా డెల్టా సాగునీటి సమస్యలు తీరిపోతాయి. అలాగే విశాఖ తాగు, పారిశ్రామిక అవసరాలకు 24 టీఎంసీలను తరలిస్తారు. ఒడిసాకు 5 టీఎంసీలు, ఛత్తీస్‌గఢ్‌కు 1.5 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఏర్పడుతుంది. 960 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి కూడా జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో తలపెట్టిన దుమ్ముగూడెం రాజీవ్, ఇందిరా సాగర్ లిఫ్ట్‌లకు, చింతలపూడి ఎత్తిపోతలకు నీటి సమస్య తీరుతుంది.
No comments:
Post a Comment