మాటేదైనా.. యూటీయే!
August 01, 2013
హైదరాబాద్, జూలై 31: 'పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం! పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా భాగ్యనగరం!'... ఇది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తేల్చిచెప్పిన విషయం! మున్ముందు జరగబోయేది కూడా ఇదే! 'ఉమ్మడి రాజధాని' అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది? అక్కడ అధికారం ఎవరిది?... అటు తెలంగాణవాదులను, ఇటు సీమాం«ద్రులనూ వేధిస్తున్న ప్రశ్నలు ఇవి! దీనిపై సీనియర్ ఐఏఎస్ అధికారులను 'ఆంధ్రజ్యోతి' సంప్రదించింది. 'ఉమ్మడి రాజధాని'కి సంబంధించిన వివరాలు రాబట్టింది. వారు చెబుతున్న విషయమేమిటంటే... రాజ్యాంగంలో ఉమ్మడి రాజధాని అనే ప్రస్తావనే లేదు. ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని చెప్పారు కానీ... ఒకే నగరం రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉండకూడదని మాత్రం చెప్పలేదు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్ర హోదా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల గురించి స్పష్టమైన ప్రస్తావన ఉన్నా... 'ఉమ్మడి రాజధాని' అనే ప్రస్తావన మాత్రం రాజ్యాంగంలో లేదు. అందువల్ల... పైకి ఎలాంటి పేరుతో పిలిచినా, పరిపాలనాపరంగా హైదరాబాద్ పదేళ్లపాటు కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
పిట్ట పోరు... పిట్టపోరు...
'హైదరాబాద్ మాది' అని తెలంగాణవాదులు చెబుతుండగా... 'మాది కూడా' అని సీమాం«ద్రులు వాదిస్తున్నారు. ఇప్పుడు... కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి 'మీ ఇద్దరిదీ కాదు! హైదరాబాద్ మాది' అని తేల్చేయనుంది. ఎందుకంటే... ఉమ్మడి రాజధాని అనే కేంద్ర పాలిత ప్రాంతంపై ఉభయ రాష్ట్రాల్లో దేనికీ అధికారం ఉండదు. కేంద్రమే మొత్తం వ్యవహారాలు పరిశీలిస్తుంది. దీనికోసం ఒక 'అడ్మినిస్ట్రేటర్'ను నియమిస్తుంది. ఆయన హోదా... లెఫ్టినెంట్ గవర్నర్. తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో ఇరురాష్ట్రాల గవర్నర్‌లతోపాటు ఒక లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఉంటారు. అయితే, ఏదో ఒక గవర్నర్‌కే లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించవచ్చు.
లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఇక సహాయకుడు ఉంటారు. గతంలో 'చీఫ్ కమిషనర్' అని పిలిచేవారు. ఇప్పుడు 'లెఫ్టినెంట్ గవర్నర్‌కు సలహాదారు'గా ఆ హోదాను మార్చారు. ఈ సలహాదారుకు యూటీ కేడర్‌కు చెందిన ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌లు సహకరిస్తారు. వీరిలో ఒకరు శాంతి భద్రతలు, మరొకరు రెవెన్యూ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. మిగిలిన విభాగాలన్నీ వీరిద్దరి అజమాయిషీలోనే ఉంటాయి. మొత్తం మీద రాబోయే ఉమ్మడి రాజధాని పరిపాలన లెఫ్ట్‌నెంట్ గవర్నర్, ఆయన సలహాదారుడు, ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌ల చేతుల మీదుగా నడుస్తుంది. మొత్తం పరిపాలనను కేంద్రం పర్యవేక్షిస్తుంది. ఉమ్మడి రాజధాని పాలనా వ్యవహారాల్లో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకుగానీ, ఆయా రాష్ట్రాల రాజకీయ పార్టీలుగానీ వేలు పెట్టలేవు.
'పది'లమేనా?
'పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్' అని తీర్మానించారు. ఈలోపు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మించుకోవాలని కూడా తెలిపారు. అయితే... 'పదేళ్ల'పై చాలామందిలో చాలా సందేహాలున్నాయి. కారణం... చండీగఢ్ అనుభవమే! పంజాబ్ నుంచి హర్యానా రాష్ట్రాన్ని విభజించినప్పుడు చండీగఢ్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని 1966లో తీర్మానించారు. పదేళ్ల తర్వాత చండీగఢ్ పంజాబ్‌కు దక్కాలని, హర్యానా కొత్త రాజధాని నిర్మించుకోవాలని ఒప్పందం కుదిరింది. దాదాపు ఐదు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ చండీగఢ్ ఉమ్మడి రాజధానిగా, కేంద్ర పాలిత ప్రాంతంగానే కొనసాగుతోంది.
కొత్తరాజధాని నిర్మాణం బాగా ఖర్చుతో కూడుకున్నది కావడం, హర్యానా పరిధి చిన్నది కావడం, రెండు రాష్ట్రాలకు చండీగఢ్‌తో భౌగోళిక అనుసంధానం ఉండటంతో... అలా సాగిపోతోంది! కానీ... హైదరాబాద్‌తో రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు భౌగోళిక అనుసంధానంలేదని, పదేళ్లకు మించి ఉమ్మడి రాజధానిగా కొనసాగించలేరని పలువర్గాలు చెబుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే... తొలుత చండీగఢ్‌కు కూడా హర్యానాతో భౌగోళిక అనుసంధానం లేదు. ఇలా కనెక్టివిటీ కల్పించేందుకు వీలుగా రెండు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను చండీగఢ్ పరిధిలోకి తెచ్చినట్లు సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు తెలిపారు.
జన రంజకమే...
ఉమ్మడి రాజధానిగా ఉండే కేంద్ర పాలిత ప్రాంతం నుంచి వచ్చే ఆదాయంలో ఇరు రాష్ట్రాలకు వాటా ఉంటుంది. యూటీ అభివృద్ధి కోసం కేంద్రం కూడా విరివిగా నిధులు మంజూరు చేస్తుంది. దీంతో అభివృద్ధిపరంగా యూటీలు ముందంజలో ఉంటాయి. రాజకీయ అస్థిరతకు, ఆందోళనలకు తావు ఉండదు కాబట్టి... పారిశ్రామిక వర్గాలు కూడా యూటీలో పెట్టుబడులు గుమ్మరిస్తాయి. యూటీల్లో ప్రజల తలసరి ఆదాయం రాష్ట్రాలకంటే చాలా ఎక్కువ! ఇన్ని రకాల అభివృద్ధి సాధించిన ప్రాంతంలో నివసించడం మొదలుపెట్టిన ప్రజలు... యూటీ నుంచి వెళ్లిపోవాలని కోరుకోరు!
No comments:
Post a Comment