పెద్ద మనసుతోనే.. సామరస్య పరిష్కారం!
August 01, 2013
హైదరాబాద్, జూలై 31: రాష్ట్రాన్ని విభజించాలంటూ సీడబ్ల్యూసీ, యూపీఏ సమన్వయ కమిటీలు చెప్పేశాయి. ఇక రాష్ట్రం విడిపోవడం ఖాయమైపోయిం ది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల ప్రయోజనాలను పరిరక్షించే ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ క్రమంలో..ముందుగా హైదరాబాద్, నీరు, విద్యుత్తు వంటి ప్రధాన సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనాల్సి ఉంది. తెలుగువాళ్లు అన్నదమ్ముల్లా విడిపోవడానికి సామరస్య పూర్వక వాతావరణాన్ని కల్పించాల్సి ఉంది. ఆందోళనలు, అలజడులు రేకెత్తకుండా జాగ్రత్త పడాల్సిఉంటుంది. 'విభజన' వేళ అందరి మదిలో గిలిపెడుతున్న సమస్యలివి. ఇదే అంశం పై 'పెద్ద మనుషులు కావలెను' అన్న శీర్షికన ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ బుధవారం 'బిగ్ డిబేట్'ను నిర్వహించింది.
మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ సమన్వయకర్తగా వ్యవహరించగా.. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌తో పాటు వివిధ ప్రధాన పార్టీల నేతలు, వేదికల ప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నా రు. విభజనకు అడ్డుగా ఉన్న ఒక్కో జఠిల సమస్యపై ఎండీ రాధాకృష్ణ.. అతిథులను ప్రశ్నిస్తూ చర్చను ముందుకు నడిపించారు.
విభజనలో పెద్దమనుషులు పాత్రపై..
అభిప్రాయ భేదాలు, ద్వేషాలను పక్కకు పెట్టి సామరస్య పూర్వకంగా సమస్యలను పరిష్కరించుకోవాలని సీనియర్ రాజకీయ నేత చెన్నమనేని రాజేశ్వరరావు సూచించారు. ఉమ్మడి సమస్యలపై రాజకీయ పార్టీలు..పెద్ద మనుషుల పాత్ర పోషించాలని కోరారు.
రాజకీయ పార్టీల పాత్రపై..
వ్యవస్థలోనే లోపాలున్నాయని, వాటిని సామరస్యంగా వికేంద్రీకరించుకుంటేనే తెలుగు ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంటుందని రాజేశ్వరరావు అభిప్రాయపడ్డారు. విభజన అంశం అసెంబ్లీలో చర్చకు వస్తుంది కాబట్టి..సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయడం సరికాదని నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ పేర్కొన్నారు. రాజీనామా చేయడం వల్ల తమ ప్రజల వాదనలు, మనోభావాలను తెలిపే అవకాశాన్ని కోల్పోతారని వివరించారు. రాజకీయ పార్టీలు వాస్తవాలు చెప్పాలని సీపీఐ రాష్ట్ర నేత కె. రామకృష్ణ సూచించారు.
తాము విభజనను కోరుతుండగా, సీపీఎం సమైక్యాంధ్రకు కట్టుబడిందని.. ఈ పరిస్థితుల్లో వామపక్షాలు పెద్దన్న పాత్ర పోషించడం సాధ్యం కాదని ఆయన వివరించారు. సీడబ్ల్యూసీ తీర్పు ఇచ్చేసినందున..చేసేదేం లేకపోయినా, సీమాంధ్ర ప్రాంత మనోభావాలను రాజకీయ పార్టీలుగా తాము వ్యక్తం చేస్తున్నామని మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ వివరించారు. దిగ్విజయ్.. టీఆర్ఎస్‌తో విలీనం గురించి, మంత్రి టీజీ వెంకటేశ్ 'రాజధాని' గురించి.. ఇలా ఒకేపార్టీలో ఇన్ని వాదనలు వినిపిస్తున్నప్పుడు కాంగ్రెస్ వాళ్లు రాజకీయం చేస్తున్నట్టు కాదా అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు.
హైదరాబాద్ సమస్యపై..
ఇప్పటివరకు దేశంలో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయని, వాటి విషయంలో రాజ్యాంగ పరంగా తీసుకున్న జాగ్రత్తలన్నింటినీ తెలంగాణ విషయంలోనూ తీసుకుంటారని టీఆర్ఎస్ పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. "ప్రపంచమే గ్లోబల్ విలేజ్‌గా మారిపోయింది. ఎక్కడివారో హైదరాబాద్‌కు వచ్చి నివసిస్తున్నారు. మిమ్మల్ని(సీమాం«ద్రులు) వెళ్లిపోవాలని ఎవరు చెప్పారు? వ్యాపారాలు చేసుకోవద్దని ఇక్కడ ఎవరైనా చెప్పారా? విశాల దృక్పథంతో ఈ విషయాన్ని పరిష్కరించుకోవాలి'' అని సూచించారు. ఏదో ఒక ప్రాం తాన్నే అభివృద్ది చేయడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమయిందని మంత్రి వర ప్రసాద్ అన్నారు. కేరళలో త్రివేండ్రంతో పాటు కొచ్చిన్ వంటి నగరాలు అభివృద్ధి చెందిన విషయాన్ని ప్రస్తావించారు.
హైదరాబాద్‌లోని వారందరికీ ఎలాంటి సమస్య లేకుండా చూసేందుకు రాజకీయ పార్టీలన్నీ శ్రమించాలని రాజేశ్వరరావు కోరారు. చాలా మంది సీమాంధ్ర యువకులు హైదరాబాద్‌తో అనుబంధం పెంచుకొని.. ప్లాట్లు కొనుక్కుని నివసిస్తున్నారని, ఇప్పటి పరిస్థితుల్లో తమకు భరోసా లేదని సోమిరెడ్డి పేర్కొన్నారు. మజ్లిస్ నేత ఒవైసీ సూచించినట్టు.. హైదరాబాద్‌లో ఉన్నవాళ్లకీ భరోసా ఇస్తూ చట్టం తీసుకురావాలని కోరారు. హైదరాబాద్ పాతబస్తీలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, వాటిని పట్టించుకోకపోవడం వల్లనే విభజన వాదాలు ముందుకు వస్తున్నాయని మాడభూషి శ్రీధర్ అన్నారు.
జల సమస్యలపై..
నీరే ప్రధాన సమస్య అని, దీనిని కేంద్ర జాబితాలో ఉంచితే మంచిదని.. ఎవరి వాటా వారికి వేసి చట్టం చేయాలని మంత్రి వర ప్రసాద్ సూచించారు. జలాలపై ప్రజలు ఆందోళన చెందటంలో అర్థం ఉన్నదని, బోర్డు ఉన్నా తుంగభద్ర జలాల విషయంలో ప్రతిసారీ వివాదాలు రేకెత్తుతుండటమే దీనికి కారణమని రామకృష్ణ వివరించారు. పొరుగున ఉన్న కర్ణాటకలోని ఆలమట్టి నుంచి మన రాష్ట్రానికి తాగు నీరే సరిగ్గా వదలడం లేదని సోమిరెడ్డి తెలిపారు. వట్టి బోర్డుల ప్రయోజనం లేదని గత అనుభవాలు చెబుతున్నాయని వాదించారు. జల నిబంధనలకు విరుద్ధంగా పోవడం వల్లనే లొల్లి తలెత్తుతున్నదని ఈటెల అభిప్రాయపడ్డారు. తటస్థ వ్యక్తులతో కమిటీ ఏర్పాటుచేసి పరిష్కారం కనుగొనాలని మాడభూషి శ్రీధర్ సూచించారు.
సామరస్య సాధనపై..
అణగారిన వర్గాలకు చెందిన వారిపట్ల తమకు సానుభూతి ఎప్పుడూ ఉంటుందని, తెలంగాణకు మద్దతుగా గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ధర్నాలు జరిగాయని ఈటెల గుర్తు చేశారు. రాజధాని, నీరు అంశాలపై ముందుగా మూడు ప్రాంతాలకు చెందిన మంత్రులకు ఒక అవగాహన కల్పించాలని, అప్పుడు వారు ప్రజలను నడిపించగలుగుతారని సోమిరెడ్డి సూచించారు. పరస్పరం ఘర్షించుకోవడం కాక, రెండు రాష్ట్రాలూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి.. న్యాయంగా రావాల్సిన వాటిని రాబట్టుకోవాలని మాడభూషి శ్రీధర్ కోరారు. సమైక్యాంధ్ర ఎందుకు కోరుకుంటున్నారనేది చర్చింకుండానే విభజన నిర్ణయాన్ని తీసుకున్నారని, ఇక ముందైనా ఆంధ్రా ప్రాంతానికి భరోసా ఇచ్చే చర్యలు ఉండాలని మంత్రి వర ప్రసాద్ అభిలషించారు.
No comments:
Post a Comment